nandiఈ రాష్ట్రంలో ప్రతిదీ రాజకీయమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా దాని వెనుక ఓట్ల మర్మం దాగి వుంటుంది. లేదా పూర్తిగా రాజకీయ కోణం వుంటుంది. ఆ రాజకీయ కోణం ఇప్పుడు సినిమా రంగాన్ని కూడా వదల్లేదు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సినీ పరిశ్రమకు సంబంధించి నంది అవార్డులు ప్రకటించలేదు. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను మొన్న ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించింది. నంది విజేతల ఎంపికలో నందమూరి కుటుంబానికి పెద్దపీట వేసి సినీ పరిశ్రమలో నందమూరికి పోటీగా వున్న మెగా ఫ్యామిలీ ప్రాధాన్యత తగ్గించడం వివాదాలకు ఆజ్యం పోస్తోంది. కేవలం బంధుప్రీతితోనే నంది అవార్డుల ఎంపిక జరిగిందంటూ ఇప్పటికే సినీరంగం నుండి పలువురు విమర్శలు మొదలుపెట్టారు. 2014లో ఉత్తమ నటుడుగా బాలకృష్ణ, 2015లో మహేష్‌, 2016లో జూనియర్‌ ఎన్టీఆర్‌లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. 2014లో లెజండ్‌ను, 2015లో బాహుబలిని, 2016లో జనతాగ్యారేజ్‌ను ఎక్కువ అవార్డులు వరించాయి.

సినీ పరిశ్రమలో మెగా కుటుంబం నుండి చిరంజీవితో పాటు పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, రామ్‌చరణ్‌, సాయి ధర్మతేజ, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, కంచె హీరో వరుణ్‌తేజ వున్నారు. వీరిలో చిరంజీవిని 2016 సంవత్సరానికి రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. అల్లు అర్జున్‌కు రుద్రమదేవి సినిమాకుగాను

ఉత్తమ సహాయనటుడు అవార్డు లభించింది. ఈ మూడేళ్ళలో మెగా ఫ్యామిలీ నటుల నుండి మంచి సినిమాలే వచ్చాయి. అల్లు అర్జున్‌ నటించిన సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలో ఎంతో మంచి సందేశం దాగి వుంది. అలాగే తెలుగువారి పౌరుషాన్ని చాటే 'రుద్రమదేవి' సినిమాకు ఒక్క ఉత్తమ సహాయ నటుడు అవార్డు తప్ప ఇంకేమీ దక్కలేదు. దీనిపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్‌ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. జరిగిందో లేదో తెలియని కల్పిత కథను ఆధారంగా చేసుకుని తీసిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. అదే వాస్తవ కథతో, తెలుగుజాతి పౌరుషాన్ని చాటే సారాంశంతో తీసిన రుద్రమదేవి సినిమాకు మాత్రం వినోదం పన్ను మినహాయించలేదు. ఆ చిత్ర దర్శకుడు దీనినే ప్రశ్నించాడు. గోదావరి పుష్కరాలప్పుడు 23మంది భక్తుల ప్రాణాలు తీసి సెట్టింగ్‌లు వేసి నిర్మించిన పుష్కరాల డాక్యుమెంటరీకి నంది రావడం ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోవచ్చు... కాని నందుల ఎంపికలో మెగా ఫ్యామిలీని తక్కువ చేసి చూసారనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది.

ntr balaతెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు నేలపై ఆయనో చరిత్ర. తెలుగుసినిమాకే కాదు, జాతీయ స్థాయిలో తెలుగు రాజకీయాలకే వెలుగు తెచ్చిన నాయ కుడు. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నానంటూ ఆయన తనయుడు, సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించి రసవత్తర చర్చకు తెరలేపారు. అందులో ఎన్టీఆర్‌ పాత్రను తానే పోషిస్తు న్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

అయితే, ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను సినిమాగా తీయడమంటే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తీసినంత సులభం కాదు. చరిత్రలో వ్రాసిన దాన్ని బట్టి ఈ సినిమా తీసారు. కాబట్టి సినిమాలో వున్నదే చరిత్ర అనుకుంటారు ప్రజలు. ఆ కాలంలో జరిగిందేందన్నది ఈ కాలం వారికి తెలియదు. కాని ఎన్టీఆర్‌ జీవితచరిత్ర ఏంటన్నది ఈ కాలం వారికి తెలుసు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ తెలుసు. వాటిని ధైర్యంగా ప్రజల ముందుకు తేగలరా? ఒకవేళ తెస్తే ఆయన జీవితచరిత్రలో పాజిటివ్‌ క్యారెక్టర్‌లున్నాయి, నెగటివ్‌ క్యారెక్టర్లున్నాయి. ఉన్నవి ఉన్నట్లు బాలకృష్ణ చూపగలడా? ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పరిశీలిస్తే పుట్టుక నుండి సినిమా రంగ ప్రవేశాన్ని మొదలుకొని 'శ్రీమద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' సినిమా వరకు ఒక పార్ట్‌. సినిమా రంగంలో ఆయన వ్యక్తిగత విజయాలు తప్పితే సంచలనాలకు చోటు లేదు. ఇక 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి రెండో పార్ట్‌గా తీసుకోవాలి. 1983లో అద్భుత ప్రజాప్రభంజనంతో అధికారంలోకి రావడం, 1984లో నాదెండ్ల భాస్కర్‌రావు చేతిలో వెన్నుపోటుకు గురై పదవీచ్యుతుడు కావడం, తిరిగి ప్రజామద్దతు కూడగట్టి నాదెండ్లను దించడం, 1985లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించడం, 1989లో అధికారం కోల్పోవడం, 1993లో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం, 1994లో తిరిగి అధికారంలోకి రావడం, 1995లో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురై సీఎం పదవిని కోల్పోవడం, వైస్రాయ్‌ హోటల్‌ వద్ద తాను గెలిపించిన ఎమ్మెల్యేలే తనపై చెప్పులు విసరడం, తనను పదవీచ్యుతుడిని చేసిన చంద్రబాబుపై ఎన్టీఆర్‌ తీవ్ర విమర్శలు చేయడం, ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో కొడుకులు, కూతుర్లు, మరో అల్లుడు ప్రధానపాత్ర పోషించడం, తీవ్ర మానసిక వేదనతో ఎన్టీఆర్‌ 1996 జనవరిలో మరణించడం... ఎన్టీఆర్‌ రాజకీయ చరిత్రలో ప్రధాన ఘట్టాలు. వీటిలో ఆయా క్యారెక్టర్‌లను పర్‌ఫెక్ట్‌గా చూపించకపోతే ఆ సినిమాకు అర్ధమే లేదు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను అర్ధంపర్ధం లేకుండా చేసినట్లవుతుంది. 1984లో ఎన్టీఆర్‌కు నాదెండ్ల పొడిచింది వెన్నుపోటు అయితే 1995లో చంద్రబాబు చేసింది కూడా అదే! నాదెండ్లను విలన్‌గా చూపించొచ్చు. అదే సమయంలో తన బావ చంద్రబాబును బాలయ్య విలన్‌గా చూపించగలడా? ఖచ్చితంగా చేయడు. లక్ష్మీపార్వతి ఉచ్చులో చిక్కుకున్న ఎన్టీఆర్‌ను, తెలుగుదేశం పార్టీని కాపాడడానికే ఆరోజు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసారన్నట్లు చూపిస్తారు. అలాగే ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను కూడా మంచిగానే చూపించుకుంటారు. ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌లుగా చూపబోయేది నాదెండ్ల భాస్కర్‌రావు, లక్ష్మీపార్వతిలనే! ఇందులో సందేహమేలేదు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter