bjpమనమొకటి తలిస్తే.. ఒక్కోసారి వేరొకటి జరిగి తీరుతుంటుందన్నది పెద్దల మాట. అయితే, జరగకూడని ఘోరం జరిగాకే... మనమెంత పొరపాటు చేశామో అర్ధమవుతుంది. అయితే, అప్పటికే పరిస్థితులు చేయిదాటిపోయివుంటాయి. ఇప్పుడు కశ్మీర్‌లో బిజెపి పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ పిడిపితో కలసి పాలనసాగించి.. అనేక విభేదాలను సహిస్తూ వచ్చినా...చివరికి మిగిలిందేమిటి?.. తెగదెంపులే!... ఎట్లయితేనేమి.. మూడేళ్ళ కలహాల కాపురం తర్వాత ఎట్టకేలకు పిడిపితో బిజెపి తెగదెంపులు చేసుకుంది. దీంతో పిడిపి-బిజెపి సంకీర్ణకూటమి పాలనకు తెరపడి సంచలనం కలిగించింది. దీంతో, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయడంతో, కశ్మీర్‌లో గవర్నర్‌ పాలనకు రంగం సిద్ధమైంది. రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని కశ్మీర్‌ ముఖ్యమంత్రి మొహబూబాముఫ్తీ కోరడం, కశ్మీర్‌లో హింసను అదుపుచేసేందుకు రంజాన్‌- అమర్‌నాధ్‌ యాత్రల సందర్భంగా భద్రతాబలగాల చేత కాల్పుల విరమణ పాటింపజేయాలంటూ అఖిల పక్షభేటీ విజ్ఞప్తి చేయడంతో కేంద్రం వారి విజ్ఞప్తులను మన్నించింది.

అయితే, అందువల్ల ఆశించిన ఫలితం లేక పోగా.. అదే అదనుగా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మరింతగా రెచ్చిపోయి కశ్మీర్‌లో హింసాకాండకు తెగబడడం ఎంత దారుణం?.. పాక్‌ వేర్పాటువాద శక్తులు విజృంభించి కశ్మీర్‌లో మరింత హింసకు ఆజ్యం పోయడంతో కశ్మీర్‌ మళ్ళీ నిప్పులగుండమైది. కశ్మీర్‌లోని ప్రముఖ పాత్రికేయుడు సుజాత్‌బుఖారీని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపడం, వీర జవాన్‌గా ఉన్న ఔరంగజేబు అనే సైనికుడిని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీయడం.. ఇలా పెరిగిపోతున్న హింసాత్మకజ్వాలలతో కశ్మీర్‌ భగ్గుమంటూనే ఉంది. ఇదంతా పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న దుశ్చర్యలే. ఒకవైపు కశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తూనే, మరోవైపు అమర్‌నాధ్‌ యాత్రీకుల యాత్రను భగ్నం చేసేందుకు పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదులు విషసర్పాల్లా పొంచివున్నారనే సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో, పిడిపితో తెగదెంపులు చేసుకోవడానికి కూడా బిజెపి సిద్ధపడింది. పాలనపై పూర్తి అధికారం ఉంటే తప్ప జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు, వేర్పాటువాదులను సమర్ధంగా అణచలేమని భావిస్తూ అప్పటికప్పుడు బిజెపి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయమే.. కానీ, ఆ నిర్ణయమేదో ఎప్పుడో తీసుకుని ఉండాల్సింది. అయినా, శాంతిమంత్రాలు వల్లిస్తూ కూర్చుంటే ఉగ్రవాద రాకాసులు ఊరు కుంటారా?.. వారికి కావాల్సింది మారణ కాండలు.. నెత్తుటిముద్దలు.. హింసాజ్వాలలే తప్ప శాంతివచనాలు కాదు కదా!.. అందుకు వత్తాసుగా ముఫ్తీ ప్రభుత్వం ఉండడంతో పాక్‌ ఉగ్రవాదుల దుష్కృత్యాలు జోరుగా సాగుతున్నాయి. వాటికి అంతుపొంతూ ఉండడం లేదు.

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌వనీని రెండేళ్ళ క్రితం భద్రతాదళాలు అంతమొందించిన ప్పుడు భద్రతాదళాల చర్యను బిజెపి అభినందించగా, పిడిపి అందుకు వ్యతిరేకించడం, భద్రతాదళాలపై రాళ్ళు విసిరినవారిపై కేసులు ఉపసంహరించాలని పిడిపి నిర్ణయించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా కశ్మీర్‌లో పెరుగుతున్న దుశ్చర్యలను నిరోధించాలంటే, మెహబూబాముఫ్తీ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా జరగదని, కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవడం కుదరదని బిజెపికి అర్ధమైంది. అంతేకాదు, కశ్మీర్‌లో భద్రతా పరిస్థితుల్ని మెరుగుపరచడంలో పిడిపి విఫలమైందనేది కూడా జగమెరిగిన రహస్యమే.

అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే, జమ్ము-కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం. అయితే, పాక్‌ దుశ్చర్యలతో కశ్మీర్‌లో ఎంతోకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉండడమే దారుణం. వాటిని ప్రభుత్వాలు నివారించలేకపోవడంతో కశ్మీర్‌లో నానాటికీ పరిస్థితులు దిగజారుతున్నాయి. కశ్మీర్‌లో

ఉగ్రవాదం, హింస పెరిగిపోయి చివరకు ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే స్థితి ఏర్పడింది. పిడిపి- బిజెపి సంకీర్ణపాలన వల్ల ఒరిగిందేమీ లేదని, కశ్మీర్‌ పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్లయిందనే విమర్శల్లో వాస్తవం లేకపోలేదు. ఈ హింసాకాండల్లో కశ్మీర్‌లో గత మూడేళ్ళలో 373 మంది సైనికులు, 239 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, కశ్మీర్‌ను పిడిపి-బిజెపి కూటమి నాశనం చేశాయని, ఈ మూడేళ్ళలో కశ్మీర్‌ను ఎంత వీలైతే అంత నాశనం చేసి ఇప్పుడు బిజెపి పక్కకు తప్పుకుందని, పిడిపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా బిజెపి భారీ తప్పిదానికి పాల్పడిందని కాంగ్రెస్‌ నేతల విమర్శలు బిజెపికి కనువిప్పు కలిగించేవే. గత ఎన్నికల్లో 89 మంది సభ్యులున్న కశ్మీర్‌ అసెంబ్లీలో పిడిపికి 28, బిజెపికి 25 స్థానాలు లభించాయి. బిజెపికి మరో నాలుగు స్థానాలు దక్కివుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. మిగిలిన వాటిలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి 15, కాంగ్రెస్‌కు 12, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. 2015లో పిడిపి-బిజెపి కూటమిగా ఏర్పడి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అసలు పిడిపి విధానాలకీ.. బిజెపి సిద్ధాంతాలకీ గిట్టదు. ఇరుపార్టీల మధ్య నాలుగామడల దూరం ఉండనే ఉంది. అయితే, కశ్మీర్‌లో హింసకు ముగింపు పలకాలన్న ధ్యేయంతో పిడిపి-బిజెపి అప్పట్లో కలసి ఒక్కటైనా.. పాలనలోకి వచ్చేసరికి ఆ లక్ష్యం అటకెక్కింది. పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదురైందన్నట్లుగా తయారైంది బిజెపి పరిస్థితి. అందుకే పిడిపితో తెగదెంపులు చేసుకుంది.

ఏదేమైనా, పాకిస్తాన్‌ నుంచి అడ్డదారులు తొక్కుతూవచ్చి భారత్‌ భూభాగంలోని జమ్ము కశ్మీర్‌ను హింసాత్మక చర్యలతో భగ్గు మనిపిస్తున్న ఉగ్రవాదుల పీచమణచుకుంటే తప్ప కశ్మీర్‌ లోయలో శాంతి ఉండదు. ఉగ్రవాదులను పూర్తిస్థాయిలో అరికట్టకుంటే హింసే తప్ప ప్రశాంతత ఎక్కడా ఉండదు. ఇకనైనా కేంద్రం వెంటనే ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించివేయాలి. తద్వారా కశ్మీర్‌లో శాంతిస్థాపనకు కృషిచేయాలి. అదేవిధంగా కశ్మీర్‌ ప్రజల భద్రతకు, అభ్యున్నతికి గట్టిచర్యలు తీసుకుని... కశ్మీర్‌ తిరిగి కళకళలాడేలా.. శాంతిబావుటా ఎగురవేయాలి.

bjpసరిగ్గా నెలరోజుల క్రితం కర్నాటకలో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు అను కూలంగా ఉండింది. ఏ సర్వే చూసినా కాంగ్రెస్‌ తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందనే చెప్పాయి. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారని, ఈ ప్రభావం కర్నాటక ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని కూడా భావించాయి.

కాని, నెలరోజుల్లోనే అక్కడ సీన్‌ను మార్చేసింది అమిత్‌షా బృందం. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారంతో అక్కడ ట్రెండ్‌ మారింది. 21చోట్ల ప్రధాని మోడీ రోడ్‌షోలు జరిగాయి. బయట రాష్ట్రాలకు చెందిన 50వేల మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు కర్నాటకలో దిగిపోయారు. కర్నాటక ఆరెస్సెస్‌ శాఖలు వీరికి సహకరించాయి. నియోజకవర్గానికి 500మంది కార్యకర్తలను బూత్‌లెవల్‌ ప్రచారానికి వినియోగించారు. అమిత్‌షా బెంగుళూరులోనే తిష్టవేసి ఎన్నికలను పర్యవేక్షించాడు. ఆయన బృందంలోని సభ్యులు గెలుపే లక్ష్యంగా శ్రమించారు. కర్నాటకలో 222 స్థానాలుంటే తమ అభ్యర్థి కాంగ్రెస్‌, జేడిఎస్‌ల కంటే వెనుకబడి వున్నాడన్న నియోజకవర్గాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. గెలుపు ఖాయమనుకున్న స్థానాలతో పాటు రెండో స్థానంలో వున్నామని రిపోర్ట్‌ వచ్చిన స్థానాలపై ప్రత్యేకదృష్టి పెట్టారు. కాబట్టే కాంగ్రెస్‌ కంటే మొత్తంగా ఓట్లు తగ్గినా సీట్ల పరంగా మొదటి స్థానంలో నిలవగలిగారు. కేవలం వ్యూహాత్మక రాజకీయాలతోనే బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది.

దేశమంతటా ఉత్కంఠ రేపిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 15వ తేదీ వెలువడ్డాయి. పలు సర్వే సంస్థలు ఊహించినట్లే హంగ్‌ ఫలితాలు వచ్చి కర్నాటకలో అధికార కుర్చీ ఆట మొదలైంది. బీజేపీకి 104 సీట్లు వచ్చి పూర్తి మెజార్టీకి 8సీట్ల దూరంలో ఆగింది. ఇక అధికార కాంగ్రెస్‌ 78సీట్లతో రెండో స్థానానికి పరిమితం కాగా, జేడీఎస్‌ 38సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. ఫలితాల సరళినిబట్టి ఒక దశలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధిస్తుందనుకున్నప్పటికీ చివరిలో కాంగ్రెస్‌ పుంజు కోవడంతో బీజేపీ అధికారానికి 8సీట్ల దూరంలో ఆగింది.

అప్రమత్తమైన కాంగ్రెస్‌...

హంగ్‌ ఫలితాలు వచ్చాయని తెలియగానే కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. గతంలో గోవా, నాగాలాండ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకత్వం అప్రమత్తమైంది. సోనియాగాంధీనే నేరుగా జేడీఎస్‌ అధినేత దేవేగౌడకు ఫోన్‌ చేసి కుమారస్వామిని ముఖ్య మంత్రిని చేస్తామని ప్రతిపాదించింది. దీంతో జేడీఎస్‌ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సై అంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు సులభమే!

రేవణ్ణకు బీజేపీ ఆఫర్‌...

అయితే బీజేపీ కాంగ్రెస్‌కు ఛాన్స్‌ ఇస్తుందా? కాంగ్రెస్‌ కుమార్‌స్వామికి గాలం వేస్తే బీజేపీ దేవేగౌడ్‌ పెద్దకొడుకు రేవణ్ణకు వల విసిరింది. జేడీఎస్‌లో కుమార స్వామి, రేవణ్ణ వర్గాలు వేర్వేరుగా వున్నాయి. తమ్ముడు సీఎం అవుతుంటే అన్న రేవణ్ణ చేతులు ముడుచుకుని వుంటాడా? బీజేపీ వాళ్ళు రేవణ్ణలో పదవీ ఆకాంక్షను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం లేదా కేంద్రమంత్రి పదవి ఆఫర్‌ చేస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్‌లో వున్న లింగాయత్‌ కులానికి చెందిన ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేడీఎస్‌, కాంగ్రెస్‌ల నుండి కొంతమంది ఎమ్మెల్యేలు చీలి వచ్చినా బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమే అవుతుంది.

ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు గవర్నర్‌ చేతిలో వుంది. పెద్దపార్టీని మొదట ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే బీజేపీ పట్ల గవర్నర్‌ తన స్వామిభక్తిని చాటుకున్నట్లే! ఎందుకంటే ఇటీవలే గోవా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పెద్దపార్టీగా అవతరిస్తే అక్కడి గవర్నర్‌ పెద్దపార్టీ కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు. జేడీఎస్‌ - కాంగ్రెస్‌ కూటమికి మొదటి ఛాన్స్‌ ఇచ్చేంత సాహసం గవర్నర్‌ చేయకపోవచ్చు. ఎంతైనా ఆయనా ఒకప్పటి బీజేపీ నాయకుడే కదా!

కాబట్టి మొదటి అవకాశం బీజేపీకే ఇచ్చి బలనిరూపణకు సమయం ఇవ్వొచ్చు. ఈలోపు మిగతా ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు జేడీఎస్‌, కాంగ్రెస్‌లను చీల్చి తెచ్చుకోవచ్చు.

కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధం

కర్నాటకలో ఓటమి కాంగ్రెస్‌ చేజేతులా తెచ్చుకున్నదే! ఇక్కడ సిద్ధ రామయ్య ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. సీఎంగా యడ్యూరప్ప, కుమారస్వామిలకంటే ఆయనవైపే ప్రజలు మొగ్గుచూపారు. కాని కొన్ని సొంత తప్పులే కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసాయి. జేడీఎస్‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్‌ సక్సెస్‌ కాలేకపోయింది. పొత్తు కుదిరివుంటే ఈరోజు ఫలితం ఇంకో విధంగా వుండేది. ఇక మతపరమైన సెంటిమెంట్ల జోలికి పోయి హిందువులలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఎవరూ అడగకపోయినా టిప్పుసుల్తాన్‌ జయంతి అంటూ ఆర్భాటం చేయడం, లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ కేబినెట్‌లో ఆమోదించడం వంటివి ఆయనపై కొన్ని వర్గాల్లో అసంతృప్తిని కలిగించాయి. బీజేపీ ఎన్నికల ప్రచారంలో వీటిని బాగానే వాడుకుంది. రాహుల్‌, సోనియాలొచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు ఉప యోగం లేకుండాపోయింది. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్న పెద్ద రాష్ట్రం ఇదే! ఇప్పుడు ఈ రాష్ట్రం కూడా చేజారిపోయినట్లే!

దీంతో కాంగ్రెస్‌ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయినట్లయ్యింది. పంజాబ్‌, మిజోరాం రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో వుంది. అంటే కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నా లక్ష్యం అన్న మోడీ లక్ష్యం దాదాపు 90శాతం నెరవేరినట్లయ్యింది. బీజేపీ మాత్రం మిత్రపక్షాలతో కలిసి 20 రాష్ట్రాలలో వుండగా కర్నాటకలో కూడా అధికారం చేపడితే అది 21వ రాష్ట్రం అవుతుంది.

conge bjpఆంధ్రప్రదేశ్‌ అనే వ్యక్తిని కాంగ్రెస్‌ అనే హంతకుడు కత్తితో కిరాతకంగా పొడిచి పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌ చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అదే సమయంలో అక్కడకు బీజేపీ అనే వాడొచ్చాడు. అతను సరిగా స్పందించి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆసుపత్రిలో చేర్చివుంటే బ్రతికి వుండేవాడేమో? కాని బీజేపీవాడు ఆ పని చేయలేదు. కొన ఊపిరితో వున్నావు కదా అంటూ... గొంతులో తులసినీళ్ళు పోసాడు. మరి ఈ మొత్తం ఎంపిసోడ్‌లో నిందితుడెవరు? పొడిచి పారిపోయిన కాంగ్రెసోడా? లేక కాపాడకుండా ప్రేక్షకపాత్ర పోషించిన బీజేపీ వాడా?

కర్నాటక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ వాళ్ళు నిర్వహించిన ప్రచారం తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలే రాకమానవు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కొందరు మంత్రులు బీజేపీని ఓడించాలంటూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ కోసం ఆర్ధిక సహకారం కూడా అందించినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే అది చంద్రబాబు సత్తానేనని ప్రచారం చేసుకోవచ్చని వీరి ప్లాన్‌. అందుకే గతంలో సమైక్యాంధ్ర

ఉద్యమాన్ని తాకట్టుపెట్టి చంద్రబాబుకు బిళ్ళబంట్రోతుగా పనిచేస్తున్న ఎన్జీఓల నాయకుడు అశోక్‌బాబును కూడా కర్నా టకా ఎన్నికల ప్రచారానికి పంపించారు.

కర్నాటకలో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం ప్రచారం చేసింది. అక్కడి తెలుగుప్రజల్లో విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేసింది. సరే, అక్కడ బీజేపీని ఓడించాలంటే ఎవరిని గెలిపించమని అర్ధం... ఒకటి కాంగ్రెస్‌, రెండోది జేడిఎస్‌. ముందు జేడిఎస్‌ను చూద్దాం.. ఇది పక్కా ప్రాంతీయ పార్టీ. ఆంధ్రా ప్రయోజనాల కంటే కర్నాటక ప్రయోజనాలకు ప్రాధాన్యత నిచ్చుకుంటారు. ఒకవేళ కేంద్రం ఏపికి ప్రత్యేకహోదా ఇద్దామనుకున్నా దానిని వ్యతిరేకించే పార్టీలలో జేడిఎస్‌ వుంటుంది. అదీగాక ఈ పార్టీ వ్యవస్థాపకులు దేవేగౌడ ప్రధానిగా వున్న సమయంలోనే కర్నాటకలో ఆల్‌మట్టి డ్యాం ఎత్తు పెంచి కృష్ణ నీళ్ళు కిందకు రాకుండా ఆంధ్రా నోట్లో మట్టి కొట్టాడు. మరి అలాంటి పార్టీకేమన్నా టీడీపీ నాయకులు ఓట్లేయమంటారా?

ఇక కాంగ్రెస్‌ను చూద్దాం. 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో యూపిఏను నిలబెట్టిందే ఏపిలో సాధించిన లోక్‌సభ సీట్లు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాలేదు. అలాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏం చేసింది. విభజన పేరుతో కుక్కలు చింపిన విస్తరి చేసింది. అత్యంత కర్క శంగా, పాశవికంగా, దారుణాతిదారు ణంగా రాష్ట్రాన్ని విభజించింది. ఆస్తుల పంపకం చేయలేదు. హైదరాబాద్‌లో మన వాటాను ప్రస్తావించలేదు. విభజన బిల్లులో కనీసం ప్రత్యేకహోదా అంశాన్ని కూడా చేర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విష యంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేసింది కాంగ్రెస్‌పార్టీ. కనీస కనికరం కూడా ఏపి పట్ల చూపకుండా వ్యవహరించింది. ఆనాటి రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు చూసిన వాళ్లెవరు కూడా వారి జన్మలో కాంగ్రెస్‌కు ఓటెయ్యరు. ఏపి ప్రజల మీద పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్నట్లుగా సోనియాగాంధీ విభజనకు పాల్పడింది. ఏపి పట్ల ఇంత రాక్షసత్వంగా వ్యవహరిం చిన కాంగ్రెస్‌కు ఓట్లేయమంటాడా చంద్రబాబు?

ఏపికి బీజేపీ కూడా అన్యాయమే చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మొహం చాటేసింది. అయితే బీజేపీకి ఏపికి న్యాయం చేయడానికి ఇంకా అవకాశం మిగిలేవుంది. ఈరోజు కాకపోతే రేపు ప్రత్యేకహోదా ఇచ్చి, విభజన హామీ లను అమలు చేసినా బీజేపీ తన పాపానికి ప్రాయశ్చితం చేసుకున్నట్లే! కాంగ్రెస్‌కే ఆ అవకాశం లేదు. ఏపి ప్రజల దృష్టిలో ఆ పార్టీ ఎప్పటికీ హంతకుడిగానే మిగిలి పోద్ది. కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ గెలవా లని కోరుకుంటున్న చంద్రబాబు కూడా కాం గ్రెస్‌ సహనిందితుడిగానే మిగిలిపోతాడు.

Page 1 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter