cnrఅలసిసొలసిన ఓ మధురగీతం ఆదమరచి నిదురపోయిన వేళ.. చీకటిమాటున ఏదో సవ్వడి. ఏమిటా అని చూస్తే...తలవాకిట వద్ద తచ్చాడుతున్న మృత్యువు. సాక్షాత్తూ మృత్యువే వచ్చి ఎదురుగా నిలబడడంతో కవిహృదయం స్పందించిది. 'ఓహ్‌ నువ్వా!.. రావమ్మా రా'!.. అంటూ చిరునవ్వుతోనే సాదరంగా లోపలికి ఆహ్వానించింది. అంతేకాదు, మృత్యువుకు పాలుపట్టి ప్రేమగా జోల కూడా పాడింది. చిత్రం!.. మృత్యువు కరకు రాతిగుండె కరిగి కరిగి కన్నీటి కాలువైంది. ఆ కవిహృదయమే...ఏడవకుమని మృత్యువును ఊరడించింది. మృత్యువు తెచ్చిన పూలపల్లకీని సగర్వంగా ఎక్కి గగనవీధుల వెంట గంభీరంగా కదిలి పోయింది. అయినా!.. కాలానికి కనికరం లేదు..కలాన్ని కూడా పట్టుకుపోయింది. తెల్లవారేసరికి ఆ మధురగీతమే..ఆ ఇంటి వాకిట్లో వాలిన పత్రికలో పతాకశీర్షికగా మెరిసింది. తెలుగు పదాలకు పట్టాభిషేకం చేసిన ముద్దుబిడ్డ సినారె.. ఇక లేరనే బాధతో తెలుగుతల్లి తల్లడిల్లింది. ఈ శోకం..ఈ విషాదగీతంతో చెమ్మగిల్లిన తెలుగుజాతి... సినారెని ఆప్యాయంగా తన గుండెల్లో నిలుపుకుంది.

పాటకు పల్లవి ప్రాణమైతే..పల్లవికి గీతమే ప్రాణం. ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ ఎనలేని మాధుర్యాన్ని నింపి..గీతాన్ని మనోహర సంగీతంలా ఇంపుగా.. వినసొంపుగా రచించగలిగే విశిష్ట కవితారీతి ఆయన సొంతం. ఆయన మరెవరో కాదు...డా. సి.నారాయణరెడ్డి. ఆయనకు సాహిత్యమంటే ప్రాణం. కవిత్వమంటే మరెంతో ఇష్టం. అందుకే, 'కవిత నా శ్వాస..కవిత్వం నా మాతృభాష'..అని ఎంతో ధీమాగా ప్రకటించుకున్న ధీరగంభీర కవి ఆయన. తెలుగు కవిత్వానికి ఆయనో కొత్త ఒరవడిని దిద్దారు. తెలుగుపాటకు సరికొత్త నడకలు నేర్పారు. తెలుగు భాషకు పట్టం కట్టి..తెలుగు పాటకు పట్టాభిషేకం చేసిన తెలుగు వెలుగుల కీర్తిమూర్తి, కవితా వైతాళికుడు..సాహితీ తపస్వి..అక్షరయోధుడు డా. సి.నారాయణరెడ్డి. కవిగా, అధ్యాపకునిగా, వక్తగా, సాహితీవేత్తగా, సినీ గీత రచయితగా, సారస్వతలోకంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతగా ఎంతో ప్రజ్ఞాపాటవాలతో ఆయన ఎన్నో సమున్నత శిఖరాలనందుకున్నారు. తెలుగు సాహిత్యలోకానికి రారాజుగా వెలుగొందారు. అంతేకాదు, రాజ్యసభసభ్యునిగానూ బాధ్యతలు స్వీకరించి ప్రజా సేవలోనూ తరించారు. ఆ కవిరాజు ఇక లేరు. ఈ నెల 12వ తేదీ ఉదయం 6గంటలకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కనుమూసారు.

చిన్నతనం నుంచీ సాహిత్యంపైనే ఆసక్తి :

1931 జులైన 29న కరీంనగర్‌జిల్లా సిరిసిల్ల తాలూకాలోని హన్మాజీపేట అనే కుగ్రామంలో డా.సినారె జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ-మల్లారెడ్డిగార్లు. సినారె పూర్తిపేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. వీరిది రైతు కుటుంబం. ఆయితే ఆయనకు వ్యవసాయంపై కాక, సాహితీసేద్యంపైనే మక్కువ ఎక్కువ. ఆ ఆసక్తితోనే సినారె సాహితీరంగంలోకి వచ్చారు. చిన్నతనం నుంచీ పద్యాలు గాయాలు రాస్తూ సాహిత్యాభిలాషని పెంపొందించుకున్నారు. సినీరంగంలోకి వచ్చాక సిరా ఇంకిపోయే దాకా..ప్రజల హృదయాల్లో ఇంకిపోయే పాటలెన్నో రాశారు. చదువుకునే రోజుల్లోనే భాషపై పట్టు సాధించారు. ఉన్నత చదువులు చదువుకుని ఎం.ఏ పూర్తి చేసి అధ్యాపకవృత్తిలో ప్రవేశించారు. 1958-59లో నిజాం కళాశాలలో ఉపన్యాస కులుగా పనిచేశారు. 'ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదాయాలు, ప్రయోగాలు' అనే అంశంపై పరిశోధన చేసి 1962లో పిహెచ్‌డి పట్టా పొందారు. 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ రీడర్‌గా చేరారు. 1976లో ఆచార్యునిగా పదోన్నతి పొందారు. 1981 వరకూ అదే పదవిలో కొనసాగారు. ఆయన రచించిన కర్పూరవసంతరాయలు, నాగార్జునసాగరం, మంటలూ-మానవుడు వంటి రచనలు ఆణిముత్యాలుగా భాసించాయి. ఆయన సుమారు 90కి పైగానే గ్రంథాలు రాశారంటే ఆయన సాహితీప్రజ్ఞ ఎంత ఘనమైనదో ఊహించు కోవచ్చు. దాదాపు డెభ్యై ఏళ్ళకు పైగానే కవితాప్రస్థానం ఆయనది. విశేషించి 'విశ్వంభర' కావ్యం విఖ్యాతమైన 'జ్ఞానపీఠ పురస్కారం' అందుకోవడం ఆయనకే కాదు..తెలుగుజాతికీ, తెలుగుభాషకు ఎనలేని గౌరవం. సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం 1977లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని, 1992లో విశిష్టమైన పద్మభూషణ్‌ పురస్కారాలతో గౌరవించి ఘనంగా సత్కరించింది. అంతటి సాహితీయోధుడు.. మానవతా వాది తెలుగునేలపై పుట్టడం తెలుగుజాతికే గర్వకారణం. విఖ్యాతకవిగా, కవి దిగ్గజంగా..ఆధునిక కవి సార్వభౌముడుగా, సాహితీ రారాజుగా తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన ఆ సాహితీయోధుడు..మన పాటల రేడు..సినారె అస్తమయం తెలుగుజాతికి తీరని లోటు. ఆ లోటు మరెవరూ తీర్చలేనిది. ఒక్కమాటలో చెప్పాలంటే, తెలుగు సాహితీలోకాన ఆయనో మహోన్నతమైన హిమాలయశిఖరం. ఆయన మరణంతో తెలుగు సాహిత్య చరిత్రలో ఒక శకం ముగిసినట్లే. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాటలు, కవితలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేవుంటాయి. తెలుగు సాహితీ క్షేత్రంలో ఆయనో ప్రత్యేక గ్రంధం..ఆయన కవిత్వం ఏనాటికీ ఇగిరిపోని గంధం. ప్రత్యేకించి 'లాయర్‌' కుటుంబంతో డా.సినారెకి ఎంతో కాలం నుంచి మంచి అనుబంధం ఉంది.

ఏదేమైనా సినారె ఇక లేరనుకోవడాన్ని జీర్ణించుకోలేం. సినారె మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ...ఆ మహనీయ సారస్వతమూర్తికి...తెలుగుజాతి సమున్నత కీర్తికి... మహోన్నత మానవతామూర్తికి... కవితాదీప్తికి..అశ్రునయనాలతో.... 'లాయర్‌' నివాళి!..

పాటల రేడుగా... సాహితీ రారాజుగా...

సినీ గీతరచయితగా ఆయన అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలతో రాణించారు. ఆయన పాటలెన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌గా ప్రజల ప్రశంసలందుకున్నాయి. ఆయన రాసే పాటల్లో సహజత్వం, సామాజిక చైతన్యం మిళితమై వుంటాయి. అందుకే ఆయన ఏ రచన చేసినా, గీతం రాసినా అది ప్రజల మనసుల్లో హత్తుకుపోతుంటుంది. నటరత్న డా.ఎన్టీఆర్‌ దర్శకత్వంలోని 'గులేబకావళి కథ' చిత్రంలో 'నన్ను దోచుకుందు వటే వన్నెల దొరసాని'..అనే పాటతో తెలుగు సినీలోకంలో పాటల ప్రస్థానం ప్రారంభించి, వేలాది పాటలతో అశేష తెలుగు ప్రజానీకాన్ని మైమరపించి ప్రఖ్యాత గీత రచయితగా సినారె విఖ్యాతి చెందారు. ఆయన రచించిన ప్రేమగీతాలు, యుగళ గీతాలు..ఎన్నెన్నో పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి.ఆయనెన్నో స్ఫూర్తిదాయకమైన గీతాలను రచించి ప్రజల మనసులను ఇట్టే ఆకట్టుకున్నారు. 'చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన..కరకంకణములు గలగల లాడగ..వినీలకచభర విలాసబంధుర తనూలతిక చంచలించిపోగా..ఆడవే మయూరీ!..నటనమాడవే మయూరీ'..వంటి సంస్కృత పదభూయిష్టమైన పాటలను సైతం ఎంతో హృద్యంగా..రసరమ్యంగా రచించి శ్రోతలను ఆకట్టుకున్నారు. పాటలతోనే పాటలకో లోకం సృష్టించారు. ఆ లోకంలో..ఆ గీతాల్లో పడి మైమరచిపోని వారుండరు. అంతేకాదు, పగలే వెన్నెల సృష్టించి, జగాన్నే ఊయలలూగించిన మధుర కవి డా. సి.నారాయణరెడ్డిగారు. ఆయన ఏ పాట రాసినా ఏపాటకాపాటే మధురం..ఆపాతమధురం. విశిష్టమైన, విలక్షణమైన సాహితీ రచనల సృష్టిలోనూ ఆయన ఉద్దండులనిపించుకున్నారు. ఎందరో కవిపండితుల మధ్య తనే కవి దిగ్గజమనిపించుకున్నాడు. ఎంతో ప్రఖ్యాతమైన 'జ్ణానపీఠ్‌' అవార్డును సైతం సాధించి తెలుగుభాషకు ఎనలేని గుర్తింపును గౌరవాన్నీ తెచ్చిరు. అంతెందుకు, ఆయనలా తెలుగుభాషా వికాసం కోసం జీవితమంతా పరితపించిన కవి తెలుగుగడ్డపై మరొకరు లేరంటే అతిశయోక్తేమీ కాదు.

కుటుంబంతో సినారెకు చిరకాల అనుబంధం

cnr lawyer'లాయర్‌' కుటుంబంతో డా|| సి.నారాయణరెడ్డి గారికి చిరకాల అనుబంధం ఉంది. దాదాపు 60యేళ్ళ నాటి ఆ బంధంతోనే ఆయన పలుసార్లు సూచనలు, సలహాలు ఇచ్చి 'లాయర్‌'ను ఆశీర్వదించేవారు. 'లాయర్‌' పత్రిక వ్యవస్థాపకులు కీ||శే|| తుంగా రాజగోపాలరెడ్డి గారు సినీరంగంలో వున్నప్పటి నుండే డా|| నారాయణరెడ్డి గారితో స్నేహ బాంధవ్యాలు ముడిపడ్డాయి. 'లాయర్‌' పత్రిక స్థాపించిన తరువాత కూడా నారాయణరెడ్డి గారితో తరచూ సంప్రదిస్తూ సలహాలూ సూచనలూ తీసుకునేవారు. 1995లో రాజగోపాలరెడ్డి పరమపదించిన అనంతరం 'లాయర్‌' పత్రిక ప్రస్తుత నిర్వాహకుడు శివప్రభాత్‌రెడ్డితో పాటు అప్పటి అసోసియేట్‌ ఎడిటర్‌ సత్యవేటి శ్రీకాంత్‌ కూడా పలుమార్లు సినారెతో ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరిపి ఆయన మార్గదర్శకంలో పలు వ్యాసాలను 'లాయర్‌'లో ప్రచురింపజేసారు.

1998 నవంబర్‌ 8న జరిగిన 3వ తుంగా పండుగలో సినీరంగం నుండి నటశేఖర కృష్ణ, రాజకీయ రంగం నుండి జె.కె.రెడ్డి, సాహిత్య రంగం నుండి సి.నారాయణరెడ్డి గారలు తుంగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అప్పటికే పరమపదించిన సత్యవేటి శ్రీకాంత్‌ కుటుంబానికి 'లాయర్‌' పత్రిక పక్షాన 75వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని సత్యవేటి శ్రీమతికి అందజేయడంతో పాటు, తుంగా రాజగోపాలరెడ్డి గారి తోనూ, తదనంతరం సత్యవేటి, శివప్రభాత్‌రెడ్డిలతో తనకున్న సాన్ని

హిత్యాన్ని సభకు తెలియజేసారు డా|| సి.నారాయణరెడ్డి గారు. ఆయన లేని లోటు 'లాయర్‌'కి సైతం తీర్చలేనిది. 'లాయర్‌' అభివృద్ధికి ఎన్నో పర్యాయాలు ఆశీస్సులందించిన ఆ మహామనీషికి, సాహితీయోధునికి నివాళులర్పిస్తోంది 'లాయర్‌'.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మళ్ళీ చెడింది
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
    ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter