jagan paruvuతన ప్రభుత్వం అరకొర మెజార్టీతో లేదు... తన ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు... అయినా కూడా చంద్రబాబునాయుడు ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టి 21మంది వైసిపి ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి లాక్కున్నాడు. పలుసార్లు పార్టీ ఫిరాయింపులపై నీతి బోధలు చేసిన చంద్రబాబే చివరకు ఫిరాయింపులను ప్రోత్సహించాడు. సరే అక్కడితో సరిపెట్టుకున్నాడా అంటే అదీ లేదు... అలా గోడదూకి వచ్చిన 21 మందిలో నలుగురికి మంత్రిపదవులిచ్చి ఫిరాయింపు రాజకీయ పైత్యాన్ని పతాక స్థాయికి చేర్చాడు.

పార్టీ ఫిరాయించే నాయకుల గురించి బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు చాలా ఘాటుగా మాట్లాడుతుంటారు. ఎలక్షన్‌కో జెండా పట్టే నాయకుల వ్యక్తిత్వం చాలా నీచంగా ఉంటుందని, వాళ్ళు విలువలు లేని వ్యక్తులని ఆయన అభివర్ణిస్తుంటాడు. వెంకయ్య నాయుడిని చంద్రబాబు చాలా దగ్గరగా చూస్తుంటాడు. బీజేపీ మిత్రపక్షంగా వున్న తాను ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తే వెంకయ్య దృష్టిలో పలుచన అవుతానని కూడా చంద్ర బాబుకు అనిపించినట్లు లేదు. పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించే వెంకయ్యనాయుడు చంద్రబాబు పర్య వేక్షణలో జరిగిన ఫిరాయింపులపై ఎలా స్పందిస్తాడో కూడా చూడాల్సి వుంది.

వైసిపి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చు కోవడం, వారిచేత రాజీనామాలు చేయించ కుండానే మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలో ఓ దుష్ట సంప్ర దాయానికి శ్రీకారం చుట్టారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన గవర్నర్‌ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఇదంతా ఒకెత్తయితే పార్టీ ఫిరాయిం పుల ద్వారా ఏపిలోనే కాదు, ఢిల్లీ వీధు ల్లోనూ చంద్రబాబు పరువు పోయింది. ఇంతకాలం నేను నిప్పును అంటూ చంద్ర బాబు చెప్పుకుని తిరిగాడు. జాతీయ రాజ కీయాలలో చంద్రబాబుకు దండిగానే పరిచయాలున్నాయి. 1996లో కేంద్రంలో 13రోజుల వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల గొట్టి యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్రధారి చంద్రబాబు. ఆరోజు దేవేగౌడ బదులు తనకు ప్రధాని అవకాశం వచ్చినా చంద్ర బాబు తెలివికలవాడు కాబట్టి వద్దనుకు న్నాడు. ప్రధాని పదవి తీసుకుని వుంటే ఆయన ఈరోజు దేవేగౌడలాగే ఉండే వాడు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో చక్రం తిప్పిన చంద్రబాబు, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలోనూ కీలక భాగస్వామి అయ్యాడు. కాబట్టే ఆయనకు దేశంలోని అన్ని పార్టీల నేతలతో సంబంధాలున్నాయి. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో బాబు నైజం ఏంటో, ఆయన రాజకీయ దుర్నీతి ఎలాంటిదో అన్ని పార్టీల అధినేతలకు బుర్రకథలు మాదిరిగా చెప్పొచ్చాడు జగన్‌. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో పాటు బీజేపీ సీనియర్‌ నాయ కులు, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, దళ్‌(యు) అధినేత శరద్‌యాదవ్‌, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డిలను కలిసి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన ఫిరాయింపు రాజకీయాలను పూస గుచ్చినట్లు వివరిం చారు. రాజకీయాలు ఎంతగా చెడిపో యినా చంద్రబాబు చేసిన పనిని ఎవరూ సమర్ధించరు. ఢిల్లీలో ఆయా పార్టీల అగ్ర నేతలు కూడా జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి ఆయన చెప్పింది వినడం చంద్ర బాబుకు చిర్రెత్తుకొచ్చింది. తన పరువు తీసాడని జగన్‌పై కోపం వచ్చింది. తన పార్టీలో, ప్రభుత్వంలో బ్యాంకులకు వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టిన వాళ్లను పెట్టుకుని వున్న ఆయన ఆర్ధిక నేరగాడికి ఇంట ర్వ్యూలు ఎలా ఇస్తారంటూ ఆయా పార్టీల నేతలపై ఆగ్రహం వెళ్లబుచ్చారు. ఇన్నేళ్ల నుండి ఢిల్లీలో చంద్రబాబు తెచ్చుకున్న ఇమేజ్‌, జగన్‌ ఒకే ఒక్కరోజు పర్యటనతో అంతా డామేజీ అయ్యింది.

vibhajana''విభజించు పాలించు'' అన్న బ్రిటీషోడి సిద్ధాంతాన్ని చంద్రబాబు బాగానే వంటబట్టించుకున్నాడు. తన రాజకీయ ప్రయోగాలలో ఇప్పుడు కుల విభజనకు సిద్ధపడ్డాడు. అదే రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులను విభజించడం! 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్‌ హామీ వల్ల కాపులు, బలిజ, తెలగ, ఒంటరి కులాలందరూ ఒక్కటై తెలుగుదేశంకు ఓట్లేసారు. 'కాపు' క్రింద ఏకమైన ఈ కులాలను చంద్రబాబు ఇప్పుడు విడదీయబోతున్నాడు. ఇందుకు మంజునాథ్‌ కమిషన్‌ను వేదికగా చేసుకోబోతున్నాడు.

కాపులను బి.సిలలో చేర్చే విషయమై మంజునాథ్‌ కమిషన్‌ రాష్ట్ర మంతటా పర్యటిస్తోంది. పర్యటించిన ప్రతిచోటా బి.సిల నుండి కాపులను బీసీలలో చేర్చొద్దంటూ వ్యతిరేకత వస్తోంది. కాబట్టి బి.సిలను దూరం చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అలాగని కాపులు మొత్తం దూరమైతే వచ్చే నష్టం గురించి తెలుసు. అందుకే కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బలిజలు ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నా రని, వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, అలాగే కాపులు రాజకీయంగా, ఆర్ధికంగా సామాజికంగా కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో బలంగా ఉన్నారని, వారికి రిజర్వేషన్లు అవసరం లేదని నివేదిక ఇవ్వబోతోంది. వాస్తవానికి ఈ జిల్లాల్లో కాపులే అగ్రవర్గాల నాయకులు. ఈ కమిషన్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా బలిజలను మాత్రమే బి.సిల్లో చేరుస్తారు. ఇందుకోసం చంద్రబాబు బి.సి సంఘాలను కూడా ఒప్పిస్తాడు. దీనికి తగ్గట్లుగానే ముందస్తుగా ఆయన కాపుల నుండి బలిజలను వేరు చేయాలంటూ తన మనుషుల చేత ఆందోళనలు మొదలుపెట్టించాడు. ఇదంతా ఒక ప్లాన్‌ ప్రకారమే జరుగుతోంది.

బలిజలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించడం వల్ల చంద్రబాబు ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనం రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పార్టీ బలం పెంచుకోవడం! 2014 ఎన్నికల్లో తెలుగుదేశంకు సీట్లు తగ్గింది ఈ జిల్లాల్లోనే! ఈ జిల్లాల్లో బలిజ ఓట్లు ఎక్కువ ఉన్నప్పటికీ రాజకీయంగా వారికి అంత ప్రాధాన్యం లేదు. అదీగాక, ఈ జిల్లాల్లో బలిజ కులస్తులు గతంలో కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైకాపాకు మద్దతుగా ఉంటున్నారు. వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తే అందరూ తెలుగుదేశంను బలపరుస్తారని, వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాల్లో సీట్లు పెంచుకోవచ్చని చంద్రబాబు నమ్మకం. ఇక కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల కాపులు రిజర్వేషన్లు ఇచ్చినా కూడా తన వెంట రారనే అపనమ్మకం చంద్రబాబుకు ఏర్పడింది. ఆ జిల్లాల్లో కమ్మ, కాపు వైరం ముదిరింది. కాబట్టి కాపులకు రిజర్వేషన్లు ఇస్తే బి.సిలను దూరం చేసుకోవాల్సి వస్తుంది. దీనికంటే కాపులను వదులుకోవడమే మేలు. అదీగాక ఆ టైంకు పవన్‌కళ్యాణ్‌ లాంటోళ్లు పోటీ చేస్తే కాపుల ఓట్లు వైకాపాకు పోవు. కాపుల ఓట్లు జగన్‌కు పోకుంటే అది తెలుగుదేశంకే ప్రయోజనం. కాపులను బి.సిలలో చేరిస్తే తనకొచ్చే ప్రయోజనం కంటే బిసిలు దూరమై కలిగే నష్టమే అధికంగా ఉంటుండడంతో చంద్రబాబు ఆ దిశగా కాపులు, బలిజలను వేరుచేసి చూపించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది.

desamఇంతకంటే దగా ఉందా? ఇంతకంటే మోసం ఉందా? ఇంతకంటే వంచన ఉందా? ఇంతకు మించిన దారుణం ఉందా? భారతదేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటకు, చేసిన బాసకు విలువలేకుంటే ఇక ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తున్నట్లా? ప్రజాప్రభుత్వం నడుస్తున్నట్లా?

ఆంధ్రప్రదేశ్‌... మూడేళ్లుగా రెండు ప్రభుత్వాల చేతుల్లో మోసపోయిన రాష్ట్రం. రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చిప్ప చేతికిచ్చి పంపించిన ఘనత యూపిఏ ప్రభుత్వానిది. అయితే విభజన సమయంలో ఏపికి ప్రత్యేకహోదా కల్పిస్తామన్న హామీని అటకెక్కించిన కీర్తి నేటి ఎన్డీఏ ప్రభుత్వానిది. 2014 ఎన్నికల ప్రచారసభల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం సి.డిలను మళ్ళీ ఒక్కసారి చూస్తే, నాయకులు ఇంత కర్కోటకంగా ఎలా మారగలుగుతారనిపిస్తోంది. ఆరోజు మోడీ ఆంధ్రప్రదేశ్‌పై ఎంతో ప్రేమ కురిపించాడు. ఎంతో దయ చూపించాడు. అలాంటి మోడీ ప్రధాని అయ్యాక ఏపికి ఇలా దగాటోపీ ఎలా పెట్టగలిగాడన్న అనుమానాలు రాక తప్పవు. ప్రత్యేకహోదా విషయంలో ఏపిని కేంద్రం నిలువునా మోసం చేసింది. 14వ ఆర్ధిక సంఘం ఒప్పుకోవడం లేదని, ఇప్పుడు హోదా వున్న రాష్ట్రాలకే ఎత్తేస్తున్నామని కుంటిసాకులు చెప్పింది. కాని, ఏపికి హోదా ఇవ్వకపోవడానికి, మోడీ మాటతప్పడానికి కారణాలు వేరే వున్నాయి. ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది. పెట్టుబడులన్నీ ఏపి వైపు క్యూ కడతాయి. ఈ రాష్ట్రానికి 900కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతముంది. మంచి జీవనానికి అనువైన రాష్ట్రం. మంచి నాగరికత వున్న ప్రాంతం. తీవ్రవాదం సమస్య లేదు. స్థానిక ప్రజలతో ఇబ్బందులు రావు. కాబట్టి ప్రత్యేకహోదా ఇచ్చుంటే ఇప్పుడు హోదా అమలవుతున్న రాష్ట్రాల్లో పరిశ్రమలను సైతం ఏపికి తరలించి ఉండేవాళ్లు. ఇక తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఒడిస్సా, గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాలలో కంటే ఏపిలోనే పెట్టుబడులు ఎక్కువుగా వచ్చేవి. ఏపికి అన్ని విధాలా అనుకూల వసతులున్నాయి. ప్రత్యేకహోదా వచ్చుంటే పారిశ్రామికవేత్తల పెట్టుబడికి మొదటి ఛాయిస్‌ ఏపినే!

ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలపై ప్రభావం పడుతుందని మోడీ గ్రహించాడు. అందుకే ఏపి సీఎంను ప్రత్యేకప్యాకేజీతో కొట్టాడు. నోరెత్తకుండా చేసాడు. ఒకవేళ నోరెత్తితే 'ఓటు-నోటు' కేసు కత్తిని బాబు మెడపై వేలాడదీసాడు. విభజన సమయంలో ఏపికి ప్రత్యేకహోదా ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని గొంతు చించుకుని అరచిన వెంకయ్యనాయుడు కూడా ఏపికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లప్పగించి చూస్తుండిపోయాడు. ఆయనకు మోడీని ప్రశ్నించే తెగువ, నిలదీసి అడగాల్సిన అవసరం కూడా లేకుండా పోయాయి. అంత సాహసం చేసి మోడీ దృష్టిలో విరోధి కావడం ఇష్టం లేదు. అందుకే ఆయన కూడా ప్రత్యేకహోదా కంటే ప్రత్యేకప్యాకేజీయే మిన్న అని చెప్పడానికి నానా తంటాలు పడ్డాడు. ప్రత్యేకప్యాకేజీని ఏపికి విదిల్చినందుకు సన్మానాలు కూడా చేయించుకున్నాడు.

ప్రత్యేకహోదా అంకం సమసిపోయిందనుకున్న తరుణంలో తమిళనాడులోని జల్లికట్టు రూపంలో ఈ చిచ్చు మళ్ళీ రేగింది. ప్రత్యేకహోదా కోసం ఇటీవల విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం, చంద్రబాబు పోలీసులను పెట్టి వాటిని అణచివేయడం చూసాం. జగన్‌ చేసే ఉద్యమం మూలంగానో, కమ్యూనిష్టులు చేసే ఆందోళన వల్లనో, పవన్‌ కళ్యాణ్‌ పెట్టే ట్వీట్‌ల కారణంగానో ఏపికి ఇప్పుడు ప్రత్యేకహోదా రాకపోవచ్చు. అయితే ప్రత్యేకహోదా విషయంలో అధికారపార్టీ నాయకులు ఆడుతున్న కపట నాటకాలు మాత్రం ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనపడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నామని, ప్యాకేజీకి ఒప్పుకోబట్టే పోలవరం ప్రాజెక్ట్‌ వచ్చిందని, కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఎవరికి వస్తుంది, ఎవరు అభివృద్ధి చెందుతారు? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఇది ప్రజలకే అంతుబట్టడం లేదు. కేంద్రం నుండి నిధులొచ్చినా అవి ఎక్కడకు పోతాయో, ఎక్కడ పనులు జరుగుతాయో ఎవరికీ తెలియదు. అదే ప్రత్యేకహోదా వస్తే దాని మూలంగా వచ్చే పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భూముల విలువలు పెరుగుతాయి. పరిశ్రమల మూలంగా ఇతర వ్యాపారాలు జోరందుకుంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్నింటికిమించి పన్నుల రూపేణా ప్రజలు ప్రత్యక్ష ప్రయోజనాన్ని చవిచూస్తారు. ఇక చంద్రబాబు కేంద్రం దయతలచిందని చెబుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ విభజన చట్టంలో ఉన్నదే! ఏపికి ఇది హక్కేగాని నరేంద్రమోడీ భిక్ష కాదు. దీని కోసం మనం కేంద్రం ముందు దేబిరించాల్సిన పనిలేదు. పోలవరంకు ఎంత ఖర్చయినా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే! కాని, చంద్రబాబు పోలవరం కాంట్రాక్ట్‌ పనిని తన చేతుల్లోకి తీసుకుని హోదాపై కేంద్రంతో రాజీపడిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు అంచనా వేయించినట్లుగా పోలవరంకు కేంద్రం పూర్తి స్థాయి నిధులివ్వడం కూడా సందేహంగానే ఉంది.

ప్రత్యేకహోదాను ఇటీవల కేంద్రమంత్రి సుజనాచౌదరి పందుల పోరాటంతో పోల్చడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక రాష్ట్ర మంత్రులు చూస్తే ప్రత్యేకహోదా పొందిన రాష్ట్రాలేవీ మనకంటే బాగా అభివృద్ధి చెందలేదంటున్నారు. వీళ్లు అమాయకులా? లేక ప్రజలను మరీ అమాయకులనుకుంటున్నారా?

ఉత్తరాఖండ్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, జమ్మూ-కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు పూర్తిగా కొండలు, లోయలతో కూడిన ప్రాంతాలు. అక్కడ జనావాసానికే కష్టం. ప్రత్యేకహోదా అమలవుతుంది కాబట్టే ఆ రాష్ట్రాలు ఆమాత్రమన్నా అభివృద్ధి చెందాయి. ప్రత్యేకహోదా ఉండబట్టే కదా తెలుగుదేశం నాయకులు కొందరు ఆ రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టగలిగింది. కొండలు, లోయలు ఉన్న రాష్ట్రాలలోనే పెట్టుబడులు పెట్టంగా లేనిది, ప్రత్యేకహోదా వస్తే ఏపి వంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరా? ఆ రాష్ట్రాల కంటే కూడా ఏపిలో భారీగా పెట్టుబడులు పెడతారు.

ప్రత్యేకహోదాతో ప్రయోజనాలు లేవనడం తెలుగుదేశం నాయకుల ప్యాకేజీ ఎత్తుగడలో భాగమే! ప్యాకేజీతో నాయకులు బాగుపడతారు. ప్రత్యేకహోదాతో రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. ఈ నాటకం రాష్ట్ర ప్రజలకు తెలుసు! రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం ప్రత్యేకహోదాపై పోరాడాల్సిన ముఖ్యమంత్రే ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు!

Page 1 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter