nara2014లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాకముందు నారా లోకేష్‌ అనే యువకుడి గురించి తెలుగుదేశం పార్టీలోనే ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. ఆ అబ్బాయి బర్త్‌డే కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. అసలు పట్టించుకునేవాళ్లు కూడా కాదు. కాని, ఈ టర్మ్‌లో మాత్రం పార్టీలో చంద్రబాబు కంటే లోకేష్‌ అనే చిన్నబాబుకే నాయకులు, కార్యకర్తలు ఘనంగా జైకొడుతున్నారు. పార్టీలో చంద్రబాబును చినబాబు మించిపోయాడనడానికి ఉదాహరణ మొన్న జరిగిన లోకేష్‌ జన్మదిన వేడుకలే!

నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఓ పండుగ మాదిరిగా నిర్వహించారు. నారా లోకేష్‌ పేరుతో ప్రతి జిల్లాలోనూ సేవాసమితిలను, ట్రస్ట్‌లను, ఫౌండేషన్‌లను ఏర్పాటు చేసి వేడుకలను నిర్వహించడం విశేషం. ఇదంతా కూడా యువనేతను పెద్దనేతగా తీసుకొచ్చే ప్రయత్నమేనని తెలుస్తోంది. 1995 ఆగష్టులో ఎన్టీఆర్‌ వెన్నుపోటు ద్వారా తెలుగు దేశంపార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు వైపే నిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను చంద్రబాబు ఒక్కొక్క రిగా నలుపుకుంటూ వచ్చాడు. బాలకృష్ణ అడ్డం తిరిగితే తనకే డేంజర్‌ అని భావించి తన కొడుకును ఆయనకు అల్లుడిని చేసేసి బాలయ్య కాళ్లకు బంధనాలు బిగించాడు. 2009 ఎన్నికలప్పుడు తెలుగుదేశంకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం నిర్వహించడం తెలిసిందే! ఆ ప్రచారంలో జూనియర్‌ ప్రసంగాలు, దూకుడు చూసిన చంద్రబాబు ఈ పిల్లోడితో ఎప్పుడైనా ఇబ్బందేనని పసిగట్టి అతడిని పార్టీకే కాదు, తమ కుటుంబానికి కూడా దూరంగా పెడుతూ వచ్చాడు. 2014ఎన్నికల్లో ఇంట్లో మనిషి జూనియర్‌ను కాదని, శత్రువు ఇంట్లో వున్న పవన్‌ కల్యాణ్‌ను గడ్డం పట్టుకుని బతిమాలి ప్రచారంకు తెచ్చుకున్నది జూనియర్‌ను అణచడానికే! ఇదంతా కూడా లోకేష్‌కు ఎవరూ అడ్డం రాకుండా చేసిన ప్రయత్నమే! పార్టీ పరంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ప్రచారంలో దింపినా, రాజకీయంగా ఎదగనిచ్చినా భవిష్యత్‌లో ఆ పిల్లగాడు ఇది నా తాత పెట్టిన పార్టీ, నాకే సొంతం అని అడ్డం తిరిగే అవకాశం వుంది. కాబట్టే జూనియర్‌ను చంద్రబాబు చాలా తెలివిగా తప్పించాడు.

తెలుగుదేశం బాధ్యతలను తన కుమారుడికి ఇప్పించాలనుకుని చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి. ఇప్పుడు లోకేష్‌ పార్టీలోనే కాదు, ప్రభుత్వంలోనూ కీలక పాత్రదారుడయ్యాడు. పార్టీ కార్యక్రమాలు చాలావరకు లోకేషే చూస్తున్నాడు. ప్రభుత్వ పరంగా ఆర్ధిక లావాదేవీలతో సంబంధమున్న పనులన్నీ కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీలలో సైతం చినబాబు హస్తముంటుంది. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబు కంటే చినబాబు ఆదేశాలతోనే జరుగుతున్నాయని సమాచారం. లోకేష్‌కు ఉన్నఫళంగా ఇంత ప్రచారం తేవడం వెనుక ఒక కారణం కనిపిస్తోంది. లోకేష్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించి చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్నాడని కొందరి అభిప్రాయం. ములాయంసింగ్‌ యాదవ్‌ తన కొడుకును యూపీ సీఎం పీఠంపై కూర్చోబెట్టి ఇప్పుడు ఢిల్లీ పీఠం కోసం చూస్తున్నాడు. బీహార్‌లో లాలూప్రసాద్‌యాదవ్‌ కూడా తన కొడుకును డిప్యూటీ సీఎంను చేయడం తెలిసిందే! చంద్రబాబుకు కూడా ఢిల్లీ రాజకీయాలపై మనసుపడ్డట్లుంది. 1996లో యూనైటెడ్‌ ఫ్రంట్‌ హయాంలోనే ఆయనకు ప్రధానిగా ఛాన్స్‌ వచ్చింది. అయితే ఆరోజుకు తెలివైన వాడు కాబట్టి ముందుచూపుతో వద్దన్నాడు. కాని ఈరోజు ఆయన వయసు రీత్యా అలాంటి అవకాశం వస్తే వదులుకోవాల్సిన పనిలేదు. కేంద్రంలో ఎప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు. ఈరోజు ఎన్డీఏ వుంది... రేపు హంగ్‌ రావచ్చు. మళ్ళీ ఫ్రంట్‌ అవసరం రావచ్చు... చంద్రబాబుకు చక్రం తిప్పే ఛాన్స్‌ రావచ్చు. అందుకే ఆయన ఏపికి తన కొడుకు లోకేష్‌ను ముస్తాబు చేస్తున్నాడని అందరికీ అర్ధమవుతుంది.

sand mafiaఆంధ్రప్రదేశ్‌లో అధికార దోపిడీకి ప్రధాన మార్గాలు... అమరావతి రాజధాని పేరుతో, సెజ్‌ల పేరుతో భూముల దోపిడీ... మహిళా సంఘాల పేరుతో ఇసుక దోపిడీ... పుష్కరాల పేరుతో వేలకోట్ల దోపిడీ... పట్టిసీమ పేరుతో నిలువు దోపిడీ... ఇక అధికారుల బదిలీ లలో అవినీతి సంగతి సరేసరి! రాష్ట్రంలో ప్రభుత్వం లైసెన్స్‌లిచ్చేసి నట్లుగా పై విషయాలలో దోపిడీ కార్యక్రమాలు యధేచ్ఛగా జరిగి పోతున్నాయి.

వీటన్నింటిలోకల్లా ప్రత్యక్షంగా కోట్ల రూపాయల డబ్బు కనిపించేది ఇసుక దోపిడీలోనే! 2014లో చంద్ర బాబు అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వున్న ఇసుక టెండర్ల విధానానికి స్వస్తి పలికారు. ఇసుకలో ఏదో అద్భుతాలు చేద్దామని ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించారు. అయితే పేరుకే మహిళా సంఘాలు. ఇసుకరీచ్‌లు నిర్వహించిందంతా అధికార పార్టీ నాయకులే! ముఖ్యంగా రీచ్‌లు ఏ నియోజకవర్గ పరిధిలో వుంటే ఆ ప్రాంత అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగించారు. నియోజకవర్గ స్థాయి నాయకుల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అవినీతి ఇసుక సొమ్ము వాటాలందాయి. గతంలో ఎప్పుడూ లేనం తగా ఈ 18నెలల్లో కోట్లాది రూపాయల ఇసుక దోపిడీ జరిగింది. మహిళా సంఘాల ముసుగులో కొందరు నాయకురాళ్లు కూడా కోట్లు గడించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అక్కడి తహశీల్దార్‌ వనజాక్షిని ఇసుక రీచ్‌లోనే జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన దృశ్యాలను రాష్ట్రమంతా చూసింది. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలో వందల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగింది. ఒక పర్మిట్‌తో ఒక్కో బండి రోజుకు పదేసి ట్రిప్పులు తిరిగేవి. అక్రమరవాణాను నివారించడానికంటూ అధికారులు ఏర్పాటు చేసిన సాంకేతికత ప్రయోగాలేవీ అధికారపార్టీ వారి ఇసుక దోపిడీని నివారించలేకపోయాయి. ఇంత భారీ ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతున్నా సామాన్యుడికి మాత్రం ఇంకా ఇసుక అందని ద్రాక్ష మాదిరిగానే వుంది.

18నెలలు అధికారపార్టీ నేతలు దోచుకున్నంత దోచుకుని రీచ్‌లలో ఇసుకను ఊడ్చేసారు. ఇప్పుడు ప్రభుత్వం ఇసుకరీచ్‌లకు పాత పద్ధతిలోనే టెండర్లకు శ్రీకారం చుట్టింది. అయితే సామాన్య ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెస్తామన్న పాలకుల మాటలు ఇక్కడా ఆచరణలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కొత్త విధానం కూడా సామాన్య ప్రజలకు అనుకూలంగా లేదు. ఒక ఘనపు మీటరు ఇసుకకు ప్రభుత్వమే 550రూపాయలు ధరగా నిర్ణయించింది. రీచ్‌ను పాడుకున్న కాంట్రాక్టర్‌కు మాత్రం ఒక ఘనపు మీటరు ఇసుక 178రూపాయలే పడుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనులకు మాత్రం తక్కువ ధరకే ఇసుకను రవాణా చేయాలని నిబంధన పెట్టారు. సామాన్య ప్రజలకు ఏ మాత్రం ధర తగ్గించడం లేదు.

18నెలలు మహిళా సంఘాల పేరుతో ఇసుక దోపిడీ జరిగింది. ఇక అధికారపార్టీ నేతలే కాంట్రాక్టర్లుగా మారి ఇసుకరీచ్‌లను పబ్లిక్‌గానే దోచే కార్యక్రమానికి ప్రభుత్వం పచ్చజెండా వూపినట్లయ్యింది.

adinethaluఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రకు సంబంధించి 2014, 2015... రెండు సంవత్సరాలు కూడా చీకటి జ్ఞాపకాలనే మిగిల్చాయి. 2014లో సమైక్య రాష్ట్రం రెండు ముక్కలైంది. సవాలక్ష సమస్యలతో ఆంధ్రప్రదేశ్‌ నడిరోడ్డు మీద నిలబడింది. విభజన తర్వాత ఏపి పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆర్ధిక సమస్యలన్నీ అలాగే వున్నాయి. రాజధాని లేని రాష్ట్రంలో పరిపాలన ఎంత దరిద్రంగా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. విభజన సమయంలో ఏపికిచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. ఏపి పట్ల కేంద్రం సహాయనిరాకరణోద్యమం చేస్తున్నట్లుగా వుంది. ఏపికిస్తామన్న ప్రాజెక్టుల విషయంలో పెద్దగా కదలిక లేదు.

అన్నింటికంటే ముఖ్యమైంది రాష్ట్రానికి ప్రత్యేకహోదా. పార్లమెంటులో కాంగ్రెస్‌, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఇచ్చిన హామీ ఇది. ఇప్పుడు కేంద్రం దీనిపై మాట మారుస్తోంది. నిబంధనలు ఒప్పుకోవంటోంది. రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని చంద్రబాబు శంకుస్థాపన చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ వచ్చి ఢిల్లీ నుండి తెచ్చిన మట్టి, నీళ్లు అందించి వెళ్లాడు. రాష్ట్ర ఆర్ధిక స్థితి అంతంత మాత్రంగా వుంది. రాజధాని కట్టుకోవడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూపోవాలి. ఋణమాఫీ వంటి ఆర్ధిక భారమైన హామీలను అమలు చేయాలి. రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థ స్థబ్దుగా వుంది. తగినన్ని నిధులు లేవు. పథకాలు, ప్రాజెక్టులు అమలు చేయడానికి నిధులు కొరత వెంటాడుతోంది. స్థూలంగా చూస్తే ఇదే రాష్ట్ర పరిస్థితి.

అయితే సమస్యలెన్నో వున్నా సమర్ధవంతమైన ప్రభుత్వం, అధికార పార్టీ తప్పు చేస్తే చీల్చి చెండాడే ప్రతిపక్షం రాష్ట్రంలో వుంటే ఇలాంటి సమస్యలన్నింటిని కూడా అధిగమించడం పెద్ద సమస్యేమీ కాదు. అయితే మన దురదృష్టం కొద్దీ రెండూ కూడా అలాంటివి లేవు. రాష్ట్రంలో ప్రభుత్వం ఒక ప్రైవేట్‌ కంపెనీలాగా నడుస్తోంది. పరిపాలనలో ఒక పద్ధతి, పాడూ లేదు. ప్రతిదీ వక్రమార్గమే. అమరావతి రాజధాని ఎంపికే రాంగ్‌. పచ్చటి పైర్లు పండే పొలాలను కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చాలనుకుంటున్నారు. రాజధాని వ్యవహారమంతా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలానే వుంది. రైతుల కడుపుకొట్టి విలువైన భూములను సింగపూర్‌ కంపెనీల పేరుతో కబ్జా చేసే ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు సింగపూర్‌ కంపెనీలు ఇచ్చే మాస్టర్‌ ప్లాన్‌లను చూపిస్తూ ఎల్లో మీడియా 'అహో అమరావతి' అంటూ బాకా వూదుతోంది. ఈ రాజధాని వల్ల భవిష్యత్‌లో అక్కడి రైతులకు జరిగే నష్టాన్ని ఎవరూ తలకెక్కించు కోవడం లేదు. ఇక అధికారుల బదిలీలను మొదలుకొని ఇసుక మాఫియా, ఇరిగేషన్‌ పనులు... సెజ్‌ల కేటాయింపులు, భూసేకరణ వంటివన్నీ కూడా వ్యాపార కోణంలోనే జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా గెలిచింది దోచుకోవడానికే అన్నట్లుగా అధికారపార్టీ నాయకుల వ్యవహార శైలి వుంది. గతంలో పారదర్శక పాలనతో, అంతో ఇంతో నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఈ దఫా మాత్రం ఒంటికంతా అవినీతి మలినాన్ని అంటించుకున్నాడు. కనీసం ప్రత్యేకహోదా ఇస్తే రాష్ట్రానికి పట్టిన అరిష్టం కొంతన్నా వదులుతుందనుకుంటే, చంద్రబాబు దాని కోసం చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు. సరే, ప్రభుత్వం ఇంత అవినీతికరంగా వుంది... కనీసం దానిని అదిలించే ప్రతిపక్షమన్నా గట్టిగా వుందా... అంటే అదీ లేదు. అధికార పక్షానికి ఏ మాత్రం తీసిపోనట్లుగా ప్రతిపక్షం వుంది. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వంపై ఎదురుదాడికి రెండే వేదికలు. ఒకటి చట్ట సభలో, రెండోది ప్రజా సభలో. చట్ట సభలలో ప్రజా సమస్యలపై చర్చించే రోజులు పోయాయి. సభ్యులు తన్నుకోవడానికే టైం సరిపోవడం లేదు. ఇక ప్రజాసమస్యలపై మాట్లాడే తీరిక వాళ్లకు ఎక్కడుంది. ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రజల్లోకి పోవాలి. ప్రజాసభలలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. కాని ప్రతిపక్ష నేతలో అంతటి చొరవ కనిపించడం లేదు. గతంలో ప్రతిపక్ష నేతగా దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అటు చట్ట సభలలోనూ, ఇటు ప్రజా సభలలోనూ ఎండగట్టేవాడు. కాబట్టే అప్పుడు చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేశాడు. ఇప్పుడు జగన్‌ అంటే లెక్కలేనితనం అయ్యిందాయనకు. కాబట్టి తాను అనుకున్నవి అడ్డదిడ్డంగా చేసుకుపోతున్నాడు. ఆయన అక్రమాలను అడ్డుకోవాల్సిన ప్రతిపక్షనేత ఆ విషయంలో దూకుడు చూపలేకపోతున్నాడు.

చంద్రబాబు అడ్డగోలు వ్యవహారాలు, జగన్‌ అడ్డుకోలేని వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోంది. ఇద్దరు నేతలు కూడా తమ పంథా మార్చుకోకపోతే 2016లో కూడా రాష్ట్రంలో కష్టాలు, కన్నీళ్ళు తప్పవు.

Page 5 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter