chandraమన రాష్ట్రానికి పైనున్న కేంద్రప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. పైనున్న రాష్ట్రాలూ అన్యాయం చేస్తున్నాయి. రాష్ట్రానికి వివిధ రూపాలలో అన్యాయం జరుగుతున్నా ఇదేమని ప్రశ్నించలేని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతోంది.

అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదనే సామెత వుంది. బెదిరించే వాడికే భగవంతుడు వరమిస్తాడన్న నాటు సామెత ఇంకోటి వుంది. కేంద్రం కూడా అంతే! దబాయించి అడిగే కేసీఆర్‌, జయలలిత, మమతా బెనర్జీ లాంటి వాళ్లు కేంద్రంతో పనులు చేయించుకుంటున్నారు. చంద్రబాబు కేంద్రాన్ని దబాయించే పరిస్థితుల్లో లేడు. అంత దూరం వస్తే వాళ్లు ఆయనను బయటకు పొమ్మనేటట్లున్నారు. ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం ఖరాఖండీగా చెప్పాక కూడా చంద్రబాబులో ఆ రోషం రావడం లేదు. కేంద్రంతో ఘర్షణకైనా సిద్ధం కావడం లేదు. ముఖ్యమంత్రిగా ప్రత్యేకహోదా కోసం ఆయన చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నమే లేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవని ఏం కాదు అని ఆయన అన్నప్పుడే హోదా ఆశలకు గండి పడింది. ప్రత్యేకహోదా కంటే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకే మొగ్గు చూపినప్పుడు కేంద్రంలో మనం చులకనై పోయాము. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు గట్టిగా పోరాడడం గాని, అఖిలపక్ష నాయకులను కలుపుకుని ఢిల్లీకి పోయి కేంద్రంపై ఒత్తిడి పెంచడం కాని చేయలేదు. ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా మాకొచ్చిన ఇబ్బందేం లేదు అన్నట్లుగా వ్యవహరించడంతో, కేంద్రం కూడా అదే రీతిలో మొండిచేయి చూపింది.

చంద్రబాబు నిర్వాకంతో రాష్ట్రానికి మరో ముప్పు వచ్చి పడింది. కృష్ణా, గోదావరి, పెన్నా నదులు రాష్ట్ర రైతాంగానికి ప్రధాన జల వనరులు. మనకు ఎగువనున్న కర్నాటక, మహారాష్ట్రలలో పుట్టే ఈ నదులు ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతంలో కలుస్తుంటాయి. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కర్నాటక, మహారాష్ట్రలతో మనకు వివాదాలున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలోనే కర్నా టక ప్రభుత్వం కృష్ణానదిపై ఆల్‌మట్టి డ్యాం ఎత్తు పెంచడం, మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టడం జరిగాయి. ఈ రెండు ప్రాజెక్ట్‌ల వల్ల ఏపికి నదీ జలాల విషయంలో తీరని నష్టం జరిగింది. ఇప్పుడు ఈ రెండు నదుల విషయంలో పై రెండు రాష్ట్రాలతోనే కాకుండా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణతోనూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు లకు కృష్ణానది యాజమాన్య బోర్డు అను మతి లేదు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం లేదు. కాని కేసీఆర్‌ మూర్ఖంగా మొదలు పెడుతున్నాడు. అను మతులు తీసుకోవాలంటే కుదిరేపని కాదని అతనికి తెలుసు. అందుకే చెప్పా పెట్ట కుండా కటేర్టస్తున్నాడు. వీటిని అడ్డుకోకుంటే ఆంధ్రానోట్లో మట్టే!

ఈ విషయంలో కేంద్రమే జోక్యం చేసుకోవాలి. అక్కడ చూస్తే బాబు కంటే కేసీఆర్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. అదీగాక, కేసీఆర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు తీవ్ర స్థాయిలో పోలేకపోతున్నాడు. ఓటు-నోటు కేసు అప్పటి నుండి చంద్రబాబుకు కేసీఆర్‌ భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఆయన మీద గట్టిగా పోరాడలేకపోతున్నాడు.

చంద్రబాబుకు ఆ పక్క కేంద్రంతో మొహమాటం... ఇక్కడ కేసీఆర్‌తో పర స్పర అవగాహన... ఈ రాజీధోరణి వల్లే చంద్రబాబు రాజకీయ ప్రయోజనా లేమోగాని, రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం బలవుతున్నాయి.

chandrajagan assemతెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందురోజు సీఎం కేసీఆర్‌ ప్రసంగాన్ని చూస్తే భలే ఆశ్చర్యమేసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రావాళ్లను తన్నండి, నరకండి, చంపండి... అన్న కేసీఆర్‌ ఇతనేనా అనిపించింది. ప్రతి సమస్య మీద ఆయన వివరణ ఇచ్చిన తీరు ప్రతిపక్ష సభ్యులను సైతం నోరెత్తకుండా చేసింది. కేవలం ఆయన తెలంగాణ అభివృద్ధి గురించి, సమస్యల గురించి మాత్రమే ఎంతో చక్కగా మాట్లాడారు. వివాదాల జోలికే పోలేదు. ఖబడ్దార్‌, నీ అంతు చూస్తా, మీ లెక్క తేలుస్తా, బుద్దుందా... సిగ్గుందా... వంటి పదాల జోలికే పోలేదు. ప్రశ్నలకు చాలా పద్ధతిగా వివరణ ఇచ్చాడు. చేయలేని పనులను కూడా ఎందుకు చేయలేకపోతున్నామో అర్ధమయ్యేలా వివరించాడు.

రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌ చేతుల్లోపడి తెలంగాణ సర్వనాశనమై పోతుంది, తెలంగాణ అసెంబ్లీలో తన్నుకోవడానికే సరిపోతుంది, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రం దేదీప్యమానంగా వెలిగి పోతుందనుకున్నారు. తీరాచూస్తే సీన్‌ రివర్సయ్యింది. తెలంగాణ సిఎం కేసీఆర్‌ వాస్తవిక కోణంలో అభివృదిధ వైపు పయనిస్తుండగా, మన ప్రభుత్వం మాత్రం ఎడారిలో ఒయాసిస్‌ల కోసం అన్వేషణ సాగిస్తోంది.

అభివృద్ధి అంటే ఎలాగూ లేదు. అసెంబ్లీ సమావేశాలన్నాశుద్ధంగా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు. అసెంబ్లీ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్‌ అవుతోంది. ముఖ్యంగా కోడెల శివప్రసాద్‌ను ఇష్టంలేని స్పీకర్‌ సీట్లో కూర్చోబెట్టారు. ఆ పదవిలో కుదురుకోవడానికి ఆయనకు కష్టంగా వుంది. 1983 నుండి కూడా తెలుగుదేశం నాయకుడిగా అలవాటైన ప్రాణం. ఈరోజు పార్టీ పక్షపాతాన్ని వదిలేసి తటస్థంగా ఉండాలంటే కుదురుతుందా? సభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నాలు నిరాటంకంగా జరిగిపోతున్నాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా ఏపి శాసనసభ వ్యవహారాలలో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే నిర్వాకం ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. సభలో సభ్యులు శృతిమించి ప్రవర్తించినప్పుడు ఒకట్రెండురోజులు సస్పెండ్‌ చేయడం చూసాం, లేదా ఆ సమావేశాల వరకు సస్పెండ్‌ చేయొచ్చు. కాని, వైకాపా ఎమ్మెల్యే రోజాను మాత్రం ఏడాది కాలం సస్పెండ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఏపి అసెంబ్లీ అధికారయంత్రాంగంపై సుప్రీం అక్షింతలు చల్లింది. రోజాపై విధించిన ఏడాది కాలం సస్పెన్షన్‌ను కోర్టు కొట్టేసింది.

ఇక బడ్జెట్‌ సమావేశాలు చూస్తే... ఛీఛీ... ఇదేనా మన అసెంబ్లీ అనిపించేంత రోతగా జరుగుతున్నాయి. సభలో అరుపులు, బెదిరింపులు తప్ప అభివృద్ధి, ప్రజా సమస్యల గురించి చర్చలేవి? ఎంతో సంయమనం పాటించి, దూకుడుగా వుండే ప్రతిపక్ష సభ్యులకు సైతం శాంతంగా సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రే ఖబడ్దార్‌, మీ అంతు చూస్తాం... అంటూ ఆవేశంగా మాట్లాడుతుంటే, ఇక అర్ధవంతమైన చర్చలకు ఆస్కారమెక్కడుంటుంది. ప్రతిపక్ష సభ్యులు చేసే అవినీతి ఆరోపణలకు నేరుగా సమాధానం చెప్పకుండా అధికారపార్టీ సభ్యులు ఎదురు దాడికి దిగుతుండడం, చర్చను పక్కదారి పట్టిస్తుంది.నువ్వు లక్షకోట్లు తిన్నావని అధికారపక్ష నేతలు జగన్‌ వైపు వేలెత్తి చూపితే... మీరు కాంట్రాక్ట్‌ పనుల్లో, ఇసుకలో, రాజధాని భూముల్లో ఇన్నేసి కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షం విమర్శనాస్త్రాలు సంధించింది. ఇరు పార్టీలు కూడా ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టుకోవడం, ఒకరి అవినీతి లెక్కలను మరొకరు చెప్పడంతోనే ఈ సమావేశాల పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ప్రజల సమస్యలపై మాట్లాడదామనే స్పృహ ఏ ఒక్కరికీ తట్టనేలేదు.

ప్రతిపక్షనేతగా జగన్‌ ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి, లేదంటే నీ ఆరోపణలు తప్పని తిప్పికొట్టాలి. అంతేగాని, నువ్వు దొంగవు, ఆర్ధిక ఉగ్రవాదివి, లక్షకోట్లు తిన్నావు, ఇడుపులపాయ బంకర్లలో దాచుకున్నావ్‌... అంటూ సంబంధంలేని మాటలతో ఎదురు దాడి చేయడమేమిటి? జగన్‌ అక్రమాలు, అవినీతి ఆస్తులు వుంటే ఎలాగూ కేసులున్నాయి. ఈడి, సిబిఐ విచారణ జరుగుతుంది. దాని గురించి అధికారపార్టీ వాళ్లు కొత్తగా ప్రశ్నించాల్సింది, పరిశోధించాల్సిందేమీ లేదు. జగన్‌ అసెంబ్లీలో లేవ నెత్తిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని చంద్రబాబు సవాల్‌ విసురుతున్నాడు. జగన్‌ మీద వచ్చిన ఆరోపణలను తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు నిరూపించలేదు. సిబిఐ విచారించిందంతే! ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేసే ప్రతి ఆరోపణను నిరూపించాలంటే వారి జీవితకాలం సరిపోదు. దానికి తగ్గ దర్యాప్తు సంస్థలు విచారణ చేపడితేనే నిజాలు బయటపడతాయి.

మొత్తానికి అసెంబ్లీని అడ్డదిడ్డంగా నడుపుతున్నారనేది పచ్చినిజం. గతంలో అసెంబ్లీ సమావేశాలను పోల్చి చూస్తే ఇవి అసెంబ్లీ సమావేశాలేనా? అని ఆవేదన కలుగుతోంది. ఒకర్నొకరు దూషించుకోవడం, ఒకరివైపు ఒకరు దొంగలని వేలుచూపించుకోవడం తప్పితే, ఈ సమావేశాలు ప్రజాసమస్యలపై చర్చకు ఏమన్నా వేదికవుతున్నాయా? ఇలాంటి సమావేశాలు జరిగితే ఏంటి? జరగకపోతే ఏంటి?

trainఉత్తరప్రదేశ్‌, బీహార్‌, కర్నాటక.... కులరాజకీయాలకు కేంద్రాలుగా నిలిచిన రాష్ట్రాలు. కులమే అక్కడ పార్టీలకు బలం. కులం పునాదుల పైనే పార్టీల నిర్మాణం జరుగుతుంది. అలాంటి రాష్ట్రాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ దాటుతుందా? అభివృద్ధిలో అడుక్కిపోయి కుల కంపుతో అగ్రభాగాన నిలవబోతుందా? జరుగుతున్న పరిణామాలు, మారుతున్న పరిస్థితులు అవుననే అంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఒక కులం పేరుతో జరిగిన విధ్వంసకాండ దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

నిన్న మొన్నటి వరకు కూడా కులం కంపు లేని రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. నీలం సంజీవరెడ్డి, పి.వి.నరసింహరావు, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నందమూరి తారక రామారావు, వై.యస్‌. రాజశేఖరరెడ్డి, టి.అంజయ్య, దామోదరం సంజీవయ్య... ఈ రాష్ట్రాన్ని వివిధ కులాల నాయకులు పరిపాలించారు. వీరి పాలనలో కులం ప్రస్తావన రావడం గాని, కులం ప్రభావం కనిపించడం గాని ఎప్పుడూ జరగలేదు. ప్రజలకు కూడా ఈ కులగజ్జి ఉండేది కాదు. అన్ని కులాల వాళ్లు కూడా ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్లుండేవాళ్లు. కులం ప్రాతిపదికన రాష్ట్రంలో రాజకీయ పార్టీల నిర్మాణం జరగలేదు. ఎందుకంటే కులం పేరుతో పుట్టిన పార్టీకి గాని, కులం పేరుతో వచ్చిన నాయకుడికి గాని రాజకీయ మనుగడ ఉండదని చరిత్ర చెబుతోంది. ఈ రాష్ట్రంలో అన్నికులాల వారు ఆదరించ బట్టే ఎన్టీఆర్‌ అయినా, వై.యస్‌. అయినా ముఖ్యమంత్రులు కాగలిగారు.

కాని ఎప్పుడూ లేని విధంగా గత రెండు మూడేళ్ల నుండే రాష్ట్రంలో కుల రాజకీయాలు రగులుకున్నాయి. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెడితే దానిపై ఒక కులం ముద్ర వేశారు. కాబట్టే అది విజయవంతం కాలేకపోయింది. 2014 ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మీద కూడా ఒక సామాజిక వర్గం ముద్రవేసి కొన్ని వర్గాల ప్రజలను ఆ పార్టీకి దూరం చేయబట్టే జగన్‌ సీఎం కాలేకపోయాడు. 1995 నుండి 2004 వరకు చంద్రబాబు సీఎంగా వున్న కాలంలో కూడా పెద్దగా కులరాజకీయాలు లేవు. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన కాపు కులం ప్రతినిధిగా వచ్చిన చిరంజీవిని కూడా ప్రజలు ఆద రించలేదన్నది నగ్నసత్యం.

మరి రాష్ట్రంలో కుల రాజకీయాలకు బీజం పడింది ఎక్కడన్నదే పెద్ద ప్రశ్న? 2014 ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకంగా మారాయి. విభజన తర్వాత 13జిల్లాలతో మిగిలిన ఏపిలో కాపులు మెజార్టీ వర్గంగా మారారు. దీంతో ఈ వర్గం వారి ఓట్లు కీలకమయ్యాయి. మొదట్నుండి కాపులు ఎక్కువుగా కాంగ్రెస్‌ వైపుండేవాళ్లు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాక కొంత వరకు అటు మొగ్గారు. తర్వాత ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేయ డంతో కాపులకు చిరంజీవి మీద నమ్మకం పోయింది. 2014ఎన్నికల్లో కమ్మ సామా జికవర్గం తెలుగుదేశంకు, రెడ్డి సామాజిక వర్గం వైకాపాకు మధ్య విడిపోయింది. మధ్యలో బలమైన సామాజికవర్గంగా వున్న కాపులు క్రియాశీలకంగా మారారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మునుపటిలానే ఉం డుంటే కాపులు ఆ పార్టీలోనే వుండేవాళ్లు. కాంగ్రెస్‌ జీవం కోల్పోవడంతో ఏదో ఒక పార్టీ వైపు పోవాల్సిన పరిస్థితి వారి ముందు నిలిచింది.

ఇక్కడే చంద్రబాబు చురుకుగా ఆలో చించాడు. కాపులు రానిదే అధికారం కష్ట మని అంచనావేశాడు. బీజేపీకి మాత్రమే ప్రచారం చేస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లాడు. బ్రతిమలాడాడు. ఆయనను తెలుగుదేశంకు ప్రచారానికి ఒప్పించాడు. పవన్‌ ప్రచారం వల్లే ఎక్కువమంది కాపు వర్గీయులు తెలుగుదేశంకు ఓట్లేసారు. కాపులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో చంద్రబాబు కాపులను బిసిలలో చేరుస్తా మని హామీ ఇచ్చాడు. ఒక ఉపముఖ్య మంత్రి పదవి కూడా ఇస్తానని వాగ్ధానం చేశాడు. ఆయన వాగ్ధానాల ప్రభావం ఎన్నికలపై పడింది. కాపులు మద్దతుగా నిలవబట్టే కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో టీడీపీ మెజార్టీ స్థానాలు సాధించగలిగింది. చంద్రబాబుకు అధి కారం ఒక రకంగా కాపుల పుణ్యమే!

అధికారంలోకి వచ్చాక చెప్పినట్లే ఒకరికి డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఇద్దరు కాపు నేతలకు కీలక మంత్రిపదవులిచ్చాడు. తాజాగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చంద్రబాబు చేతిలో పనులు కాబట్టి చేయగలిగాడు. కాని రిజర్వేషన్లు చంద్ర బాబు చేతిలో లేని పని. రాజ్యాంగ పరంగా ఎన్నో అడ్డంకులున్నాయి. ఆరోజు ఓట్ల మీద తాపత్రయంతో అడ్డు అదుపు లేకుండా రైతు ఋణమాఫీలాగే కాపు రిజర్వేషన్లు హామీ కూడా ఇచ్చాడు.

ఆ హామీని అమలు చేయమనే ఇప్పుడు కాపులు ఉద్యమబాట పట్టారు. తుని కేం ద్రంగా కాపుల ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అయితే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టడం, పోలీసు వాహనాలను, పోలీసుస్టేషన్‌ను ధ్వంసం చేయడం వంటివి ఉద్యమంలో అపశృతులు. కాపుల ఉద్యమం చంద్రబాబుకు పెద్ద సంకటమే. విధ్వంసాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసు కోలేడు. అలాగని రిజర్వేషన్లు కల్పించలేడు. కాపు సామాజికవర్గాన్ని ఇక చంద్రబాబు తనతో నిలబెట్టుకోవడం కష్టమే! కాపు సామాజికవర్గంలోని బలమైన నాయకత్వ శక్తులన్నీ కూడా చంద్రబాబుపై నమ్మకం కోల్పోయి వైకాపా వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో అనూహ్యంగా తలెత్తిన కాపు ఉద్యమం తెలుగుదేశంకు సంకటంగాను, వైకాపాకు చెలగాటంగానూ మారడం విశేషం!

Page 4 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter