rabbarsingఏం మాయ చేసాడో, ఏం మత్తు చల్లాడోగాని చంద్రబాబుకు ఫిదా అయిపోయాడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని చంద్రబాబు వద్దకు వెళతాడు. ఆయన ముఖం చూడగానే పవన్‌ ప్రశ్నలు మరచిపోతాడు. చంద్రబాబు చెప్పింది విని బయట కొస్తాడు. చంద్రబాబు లాంటి నాయకుడు ఈ భూమండలంలోనే లేడని పొగుడుతాడు.

పవనిజమేంటో, ఆయన మేనరిజం ఏంటో అర్ధంకాక జనం జుట్టు పీక్కుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. కనీసం ఒక ఎలక్షన్‌లోనన్నా ఒంటరిగా పోరాడి 19మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. అధికారం లేకుండా పార్టీని నడపడం కష్టమని భావించి కాంగ్రెస్‌లో కలిసిపోయాడు. అప్పుడే చిరంజీవిని జనం వేళాకోలంగా చూసారు. అయితే ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఆ మాత్రం పోరాటం కూడా చేయడం లేదు. ఆయన మాటలకు చేతలకు పొంతనే లేకుండా పోయింది. పార్టీని స్థాపించిన తొలి ఎన్నికల్లోనే తన పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీకి, టీడీపీకి మద్దతు పలికాడు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. ఏపికి ప్రత్యేకహోదాపై కేంద్రం మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే చాలనుకుంది. ప్రత్యేకహోదాపై మూడుచోట్ల సభలు పెట్టిన పవన్‌కళ్యాణ్‌ కేంద్రంలోని బీజేపీని తిట్టాడేగాని ప్రత్యేకహోదా కోసం డిమాండ్‌ చేయకుండా ప్రత్యేకప్యాకేజీని ఎంతో అపురూపంగా అంగీకరించిన టీడీపీని పల్లెత్తుమాట అనలేదు. అమరావతి రాజధాని కోసం రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకుంటున్నారని తెలిసి అప్పుడెప్పుడో రాజధాని గ్రామాల్లో ఆయన పర్యటించాడు. ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత అడ్రస్‌ లేడు. ఈమధ్య ప్రత్యేకహోదా సభలు పెట్టాడు. తలా తోకా లేదు.

ప్రశ్నిస్తానని ప్రజల్లోకి వచ్చిన వాళ్లు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండాలి. మూడుకార్లు పంటలు పండే భూముల్లో రాజధాని ఎందుకని ప్రశ్నించాలి? మాగాణి పొలాల్లో ఎయిర్‌పోర్టులు, సెజ్‌లు ఏంటని ప్రశ్నించి వుండాలి? పుష్కరాల పేరుతో వేలకోట్లు దోపిడీ ఏంటని నిలదీసి వుండాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్‌లో వుండగా, పోలవరం పూర్తిచేస్తే ఎందుకూ పనికిరాని పట్టిసీమకు 1400కోట్లు ఎందు కని ప్రశ్నించి వుండాలి? రాజదాని పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ఎందుకని నిలదీసి అడిగి వుండాలి. ప్రత్యేకహోదాను ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారని నిలదీసుండాలి. 2014 ఎన్నికల్లో ఇచ్చిన కాపు రిజర్వేషన్ల హామీ ఏమైందని ప్రశ్నించి ఉండాలి.

కాని, ఈ మూడేళ్లలో చంద్రబాబును పవన్‌కళ్యాణ్‌ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు, సరికదా, చంద్రబాబుతో భేటీకి ప్రత్యేక విమానంలో వెళ్లడం, చంద్రబాబును కలిసాక ఆయనను పొగడడం పవన్‌కు పరిపాటయ్యింది. చిన్నవాన కురిస్తే స్లాబంతా ఉరిసే రాజధాని భవనాలను 196 రోజుల్లో కట్టానని చంద్రబాబు చెప్పుకుంటే, ఇలాంటి అద్భుతాలు మీకే సాధ్యమంటూ పవన్‌ కితాబివ్వడం భలే కామెడీగా వుంది. ప్రజాసమస్యలపై పవన్‌కున్న నాలెడ్జ్‌కు ఇది అద్ధంపడుతోంది. ఎవరన్నా ప్రజాసమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వంతో పోరాడుతారు. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాడట. అంటే ఇకముందంతా కూడా చంద్రబాబుతో కలిసే ఆయన పనిచేయనున్నాడని అర్ధమవుతోంది.

అక్టోబర్‌ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్‌ ప్రకటించుకున్నాడు. వచ్చి ఆయన పీకేదేముంది, చంద్రబాబు డైరెక్షన్‌లో యాక్షన్‌ చేయడం తప్పితే! ఆయన మాటలు, ఆయన చేష్టలు చూస్తుంటే ఇతను గబ్బర్‌సింగ్‌ కాడు చంద్రబాబు చేతిలో 'రబ్బర్‌సింగ్‌' అన్నది స్పష్టంగా అర్ధమవుతోంది.

సినిమాలలో పవన్‌కళ్యాణ్‌కు ఒక ఇమేజ్‌ వుంది. రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు చేతిలో గన్‌లా మారితే అక్కడా, ఇక్కడా రెండు చోట్లా ఇమేజ్‌ దెబ్బతింటుంది. రాజకీయాల్లోకి వస్తే వాస్తవ పరిస్థితులను గుర్తించి ప్రజలపక్షాన నిలిచి ప్రభుత్వంతో పోరాడేటట్లన్నా వుండాలి, అలా చేయలేనప్పుడు గౌరవంగా సినిమాలే చేసుకుంటుంటే ఉన్న ఇమేజ్‌ను కాపాడుకోవడానికన్నా ఆస్కారముంటుంది.

chan jagమన రాష్ట్ర రాజకీయాలకు, కేంద్రంలో జరిగిన, జరుగుతున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఏదో లింకువుంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఎన్డీఏ అభ్యర్థికే రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీలు రెండూ ఓటేశాయి. అలాగే ఉపరాష్ట్రపతికి కూడా ఇరు పార్టీలు మద్దతు పలికాయి.

ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏవో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో ప్రధాని మోడీ అంటే భయపడు తున్న ప్రాంతీయ పక్షాలన్నీ కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో జరిగింది అదే! మన రాష్ట్రంలో జరిగింది కూడా అదే! కొన్ని ప్రాంతీయపార్టీలు ప్రధాని నరేంద్రమోడీ దెబ్బకు జడిసే ఆయన ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపా యనే వాదన లేకపోలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీల సహకారం కూడా అవసరం కాబట్టి బీజేపీ అధినాయకత్వం ఆయా రాష్ట్రాల రాజకీయాల్లో వేలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకోవడం పై కాషాయదండు దృష్టి పెట్టినట్లుగా తెలు స్తోంది. తమిళనాడు రాజకీయాలను ఇప్పటికే కలబెట్టారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత అక్కడ పెను రాజకీయ మార్పులు సంభవించే సూచనలున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ను తొక్కడం వారికి ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆ రాష్ట్రంలో కేసీఆర్‌తో కలిసిపోయి సీట్లు పెంచుకోవడమా లేక కేసీ ఆర్‌తో కొట్లాడి ఇప్పటివరకు ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించడమా? ఈ రెండింటిలో ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది.

అన్నింటికంటే బీజేపీ అగ్రనేతల లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార, విపక్షాలుగా వున్న తెలుగుదేశం, వైయస్సార్‌ కాంగ్రెస్‌లు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు పలికాయి. కేంద్రంలో బీజేపీతో ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్‌లు సఖ్యతనే కోరు కుంటున్నారు. ఇప్పటికిప్పుడు మోడీతో పేచీ పెట్టుకోవాలనే ఆలోచన వారికి లేదు. దీనికి వారి కారణాలు వాళ్ళకు న్నాయి. దేశంలో మోడీ ఇమేజ్‌ పెరిగింది. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా లాభమే కాని నష్టం లేదని ఇద్దరికీ తెలుసు. ఇది రాజకీయ పరమైన ఆలోచన. ఇక రెండోది ఇద్దరి మీద కేసులున్నాయి. చంద్రబాబు మీద ఓటు-నోటు కేసు బలంగా వుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వాన్ని బలహీనపరచాలనుకుంటే కేంద్రం ఈ ఒక్క కేసును కోర్టు మెట్లెక్కిస్తే చాలు. జేఎంఎం ఎంపీలను కొను గోలు చేసిన స్వర్గీయ పి.వి.నరసింహరావు ఎన్ని అవస్థలు పడ్డాడో తెలియంది కాదు. చంద్రబాబు అందుకు మినహా యింపు కాదు. 'ఓటు-నోటు' కేసు నుండి బయటపడేందుకు, దానిని ఎక్కడ తిరగ తోడి తన మీదకు ఉసిగొల్పుతారేమోననే భయంతో ఆయన బీజేపీని వదలడం లేదు. ఇక జగన్‌ మీద అక్రమ ఆస్తుల కేసులు రన్నింగ్‌లో వున్నాయి. వై.యస్‌. పరిపాలనా వ్యవహారాలలో జగన్‌ ప్రత్యక్ష ప్రమేయం ఎక్కడా లేదు. సోనియాగాంధీ కక్షకొద్ది పెట్టిన కేసులివి. ఇప్పుడు జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలంటే కేంద్రం ఈ కేసులను బాగానే వాడుకోవచ్చు. తన మీదున్న కేసుల దృష్ట్యా కూడా జగన్‌ బీజేపీతో సఖ్యతగా ఉంటున్నా డనిపిస్తోంది.

చంద్రబాబు, జగన్‌లిద్దరు కూడా ప్రధానంగా కేసుల దృష్టితోనే బీజేపీతో చెలిమికి సిద్ధమవుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో బీజేపీ ఎవరికి ప్రాధాన్యతనివ్వనుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటివరకైతే తెలుగుదేశంతోనే పొత్తుంది. అయితే ఈ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ లాభపడిందేగాని, టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి ఒరింగిదేమీ లేదు. అదీగాక 1983లో వున్నంత బలంగా కూడా రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడు లేదు. దీనికి కారణం తెలుగుదేశం నీడలో ఎదగలేకపోవడమే! ఆదే వైసిపితో అయితే రాష్ట్రంలో మున్ముందు బలం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అన్ని అవకాశాలను పరి శీలించాకే, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అధిష్టానం రాష్ట్ర రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

chandrasఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కీలకంగా మారింది. ఏపితో పాటు తెలంగాణలో కూడా అధికారపార్టీలు అసెంబ్లీ సీట్లను పెంచడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వంతో ఎంతో సఖ్యతగా వుంటున్నాయి. సీట్లు పెరగడం ఆంధ్రాలో తెలుగుదేశంకు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎంతో అవసరం. ఈ రెండు పార్టీలు కూడా తమ రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్స హించాయి. ఆంధ్రాలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు విలువలను తుంగలో తొక్కి పార్టీ ఫిరాయింపులకు ప్రత్యక్షంగానే పచ్చజెండా ఊపి వైకాపాకు చెందిన 20మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నాడు. అలాగే తెలంగాణలో కేసీఆర్‌ కూడా పార్టీ ఫిరాయింపులను బ్రహ్మాండంగా ప్రోత్సహించాడు. కాంగ్రెస్‌, వైసిపి, టీడీపీల నుండి నాయకులను టీఆర్‌ఎస్‌ లోకి భారీగానే లాక్కున్నాడు. ఇంతవరకు సమస్యలేదు. కాని, రేపు ఎన్నికల్లోనే వీరిద్దరికీ అసలు సమస్య ఎదురుకాబోతోంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీల్లోనూ గెలిచిన, ఓడిన అభ్యర్థులతో పాటు పార్టీలో కొత్తగా చేర్చుకున్న వారికి, గత ఎన్నికల్లో టిక్కెట్టివ్వకుండా రాబోయే ఎన్నికల్లో నీకే సీటు అంటూ గ్యారంటీ ఇచ్చిన వారికి రేపొచ్చే ఎన్నికల్లో సీట్లు అడ్జస్ట్‌ చెయ్యాలి. తెలంగాణలో 119, ఆంధ్రాలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సీట్లు పెరగకపోతే తెలంగాణలో తన పార్టీలో నాయకులకు సీట్లు అడ్జస్ట్‌ చేయడం కేసీఆర్‌కు తలకు మించిన భారమే అవుతుంది. సీట్లు పెరగక పోతే తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్‌కే నష్టం వాటిల్లవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ సీట్లను 225కు పెంచాలనే ప్రతిపాదన వుంది. ఇంతకాలం చంద్రబాబుకు ఎన్నికలలోపు సీట్లు పెరుగు తాయనే ఆశ వుండింది. సీట్లు పెరిగితే అది రాజకీయంగా చంద్రబాబుకే ప్రయోజనం. పార్టీలో పాతవాళ్లతో పాటు కొత్తగా చేర్చుకున్న వాళ్లకు కూడా సీట్లు ఇవ్వొచ్చు. ప్రతిపక్ష పార్టీల నుండి ఇంకా బలమైన నాయకులను పార్టీలోకి లాక్కోవచ్చు.

అయితే చంద్రబాబు, కేసీఆర్‌ ఆశలకు కేంద్రంలోని బీజేపీ నాయకులు గండికొట్టినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఫైలును మొన్నటివరకు కేంద్రమంత్రిగా వున్న వెంకయ్యనాయుడు ముందుకు కదిలిస్తూ వచ్చారు. ఈ రెండు రాష్ట్రాల పర్యటనలో పలుసార్లు ఆయన కూడా తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని గ్యారంటీగా చెప్పారు. కాని వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపిస్తుండడంతో ఇక ఈ సీట్ల పెంపు ప్రతిపాదన అటకెక్కినట్లుగానే కనిపిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాలలో సీట్లను పెంచాలన్న ప్రతిపాదనపై మిగిలిన బీజేపీ నాయకులెవరూ ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో కేసీఆర్‌కు రాజకీయంగా ప్రయోజనం కలిగించే సీట్ల పెంపును ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం బలపడడానికి దోహదపడే సీట్ల పెంపు బీజేపీకి అవసరం లేదు. ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు వల్ల ఈ రాష్ట్రంలో బీజేపీ బాగా నష్టపోయింది. అంతేకాకుండా ప్రతిపక్షంగా వున్న వైసిపి కూడా సీట్ల పెంపును వ్యతిరేకిస్తోంది. బీజేపీకి వైసిపి మిత్రపక్షం కాకపోయినప్పటికి శత్రుపక్షం మాత్రం కాదు. కాబట్టి ఆంధ్రాలోనూ హడావిడిగా సీట్లను పెంచాల్సిన అవసరమేమీ కేంద్రానికి కనిపించడం లేదు.

మొన్న రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, కేసీఆర్‌లకు సీట్ల పెంపుపై కేంద్రపెద్దల నుండి ఎటువంటి హామీ రాలేదు. సీట్లను పెంచడం అంత సులభం కాదు. పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలి. పార్లమెంట్‌లో సీట్ల పెంపు బిల్లును అడ్డుకుంటామని యూపిఏ పక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. రాజకీయంగా తమకు ఏ విధంగానూ ఉపయోగపడని సీట్ల పెంపు బిల్లును కేంద్రం కూడా ముందుకు తెచ్చే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఇద్దరు చంద్రులకు నిరాశే మిగలనుంది!

Page 1 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
  నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter