srideviదాదాపు అయిదు దశాబ్దాల పాటు భారతీయ చిత్రపరిశ్రమను ఉర్రూతలూగించిన అగ్రతార శ్రీదేవి తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో తనదంటూ ఓ ప్రత్యేకముద్ర వేసుకున్న అందాలతార... అతిలోక సుందరి.. అనంతలోకాలకు చేరిపో యింది. అశేష అభిమానజనానికి ఇక సెలవంటూ.. ఏ కన్నీళ్లూ.. ఏ శోకాలూ లేని దిగంతాలకో... ఏ దూర సుదూర తీర సరోవరాలవతలికో తరలివెళ్ళి పోయింది. ఆమె జీవితమంతా నటన లోనే ఉండిపోయింది.. 54 ఏళ్ళ జీవి తంలో 50 ఏళ్ళు నటనారంగంలోనే పండిపోయింది. నటించిన ప్రతి సన్ని వేశంలోనూ జీవించింది. దక్షిణాది,

ఉత్తరాది రాష్ట్రాలను అన్నిటినీ ఒకటి చేస్తూ, ప్రాంతాలకు భాషలకు అతీతంగా నటనా ప్రావీణ్యంతో భారతీయ నటనా రంగంలో ఆమె ఒక విశిష్ట తారగా అవతరించింది. అంతటి విశేషనటనాను భవం ఉన్న ఏకైననటి భారతదేశంలో ఒకే ఒక్క నటి... మహానటి.. శ్రీదేవి కావడం తెలుగువారి అదృష్టం.

శ్రీదేవి... ఈ పేరంటేనే తెలుగుసినీ జగత్తులో ఏదో తెలియని ఆనందం వెల్లి విరుస్తుంది. ప్రత్యేకించి శ్రీదేవి అభిమాను లకు ఆమె పేరంటేనే ఒక సంబరం. ఆమె సినిమాలు చూసి ఆనందించిన ఎందరో అభిమానుల హృదయాల్లో ఆమె అందాల నటిగా.. అత్యద్భుత నటీమణిగా నిలిచి పోయారు. గత నెల 24న ఆమె దుబాయ్‌లో ఓ వివాహానికి వెళ్ళి ఉండగా, హోటల్‌ గదిలో ప్రమాదవశాత్తూ బాత్‌ టబ్‌లో పడి మృతి చెందినట్లు దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వర్గాలు నిర్ధారించాయి. ఆమె మరణవార్త విని యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో గత నెల 28న అశేష జనవాహిని అశృనయ నాల మధ్య ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. శ్రీదేవి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక.. అభిమానజనం ఆమె భౌతికకాయాన్ని చూసి పెద్దపెట్టున రోదించారు. అందరూ శోక తప్త హృదయాలతో ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు తెలిపారు. భర్త బోనీకపూర్‌ ఆమె చితికి నిప్పంటించగా, శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషీ గుండెలవిసేలా విలపిస్తుండగా... దేశవ్యాప్తంగా తరలి వచ్చిన భారతీయ చిత్రపరిశ్రమ ప్రము ఖులు, ప్రత్యేకించి బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు, నటీమణులు ఇతర ప్రముఖులు ఉప్పొంగిన కన్నీటితో వీడ్కోలు చెప్తుం డగా.. అందరి హృదయాలు బాధతో బరు వెక్కుతుండగా శ్రీదేవి అంతిమ సంస్కా రాలు యధావిధిగా జరిగిపోయాయి.

1963లో శివకాశిలో శ్రీదేవి జన్మించారు. 54ఏళ్ళ జీవితంలో దాదాపు 50ఏళ్ళ పాటు సినీలోకాన్ని ఏలిన ఇండి యన్‌ సూపర్‌స్టార్‌ శ్రీదేవి తెలుగమ్మాయే. ఆమె తల్లి రాజేశ్వరి స్వస్థలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌ తమిళనాడులోని శివ కాశిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం వారే. ఆయన తెలుగు చాలా చక్కగా మాట్లాడే వారు కూడా. తల్లిదండ్రులు చెన్నైలో ఉండేవారు. ఈ నేపథ్యంలో శ్రీదేవికి నాలుగేళ్ళ వయసు నుంచే వెండి తెరపై బాలనటిగా నటించే అవకాశం వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సా హంతో 1967లో తొలిసారిగా ఆమె 'కందన్‌ కరుణై' అనే తమిళచిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా 'బడి పంతులు' చిత్రంలో 'బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టెలో

ఉన్నాడు' అనే పాటకు శ్రీదేవి చిన్నతనం లోనే అత్యద్భుతమైన నటన ప్రదర్శించి బాలనటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఆ తర్వాత హీరో యిన్‌గా ఎదిగారు. రెండు తరాల నటు లతోనూ అద్వితీయంగా నటించి అందరినీ తన నటనాచాతుర్యంతో మంత్ర ముగ్ధుల్ని చేశారు. 'అనురాగాలు, 'మా బంగారక్క', 'పదహారేళ్ళ వయసు' వంటి చిత్రాలతో ఆమె అద్వితీయమైన నటనతో ఎదుగుతూ అందరి ప్రశంసలూ అందు కున్నారు. ప్రేమాభిషేకం, వేటగాడు, కొండ వీటి సింహం, దేవత, ఆఖరి పోరాటం వంటి చిత్రాలతో ఆమె నటనా ప్రతిభ

ఉన్నత శిఖరాలకు చేరింది. తెలుగు తమిళ చిత్ర రంగాల మహానటులు ఎన్‌టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌ వంటి నట దిగ్గజాలతో పాటు, మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతో కలసి అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకలోకాన్ని తన నటనాప్రతి భతో మురిపించి మెప్పించిన మహానటి శ్రీదేవి. బొబ్బిలిపులి, ప్రేమకానుక, కార్తీక దీపం ఇలా ఎన్నో చిత్రాలు ఆమె నటనా వైదు ష్యానికి నిదర్శనాలు. జగదేకవీరుడు -అతిలోక సుందరి చిత్రం మరో సూపర్‌ హిట్‌ కావడంతో, హిందీ చిత్రాల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. విశ్వ విఖ్యాత నటుడు కమలహాసన్‌తో కలసి ఆమె నటించిన 'వసంత కోకిల', అకలి రాజ్యం వంటి చిత్రాలు చిత్ర పరిశ్రమ

ఉన్నంత కాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయేవే. తమిళ చిత్ర రంగంలోనూ అని తరసాధ్యమైన రీతిలో విఖ్యాత నటుడు రజనీకాంత్‌తో ఏకంగా 23 చిత్రాల్లో నటించారు, కమల్‌హాసన్‌తో కలసి 22 చిత్రాల్లో నటించారు. అటు తెలుగులోను ఇటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటించి ప్రఖ్యాతి చెందారు. ఆ తర్వాత ఆమెకు హిందీ చిత్రాల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. నటనను ఓ ఛాలెంజ్‌గా తీసు కుని, ఎంతో కృషి పట్టుదలతో ఆమె హిందీ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో అద్వితీయ ప్రతిభతో రాణించడం విశేషం. మవాలీ, తోఫా, మిస్టర్‌ ఇండియా, సద్మా, చాందినీ, చాల్‌బాజ్‌, ఖుదాగవా, లమ్హే తదితర చిత్రాల్లో శ్రీదేవి నటన అపూర్వం. అద్భుతం కూడా. ఇవన్నీ బాక్సాఫీసును బద్దలుకొట్టి రికార్డులు సృష్టించిన చిత్రాలే. శ్రీదేవి హీరోయిన్‌ అయితే చాలు ఆ సినిమా హిట్టే అన్న టాక్‌ అంతటా వచ్చే సింది. అందుకు తగ్గట్టుగానే ఆమె నటించిన అనేక చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. నిర్మాతలకు లాభాల రాశులు పోశాయి. దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి అద్వితీయ అందాల నటిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీదేవి ఇండియన్‌ లెజండరీ యాక్టర్‌గా, ఇండియన్‌ సూపర్‌ స్టార్‌గా విశ్వవిఖ్యాతిగాంచారు. ఎన్నెన్నో విశిష్టమైన పురస్కారాలను, ఘనమైన అవార్డులను ఆమె అందుకున్నారు. 2013లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 'పద్మశ్రీ' అవార్డును కూడా అందుకుని అటు తెలుగు వారికి, ఇటు భారతీయ చిత్రపరిశ్రమకు, నటనారంగానికీ మహానటి శ్రీదేవి ఎనలేని గౌరవం తెచ్చారు. 81 తెలుగు చిత్రా ల్లోనూ, 72 తమిళ చిత్రాల్లోనూ అద్వితీ యంగా నటించి, మరో 72 హిందీచిత్రా ల్లోనూ అమోఘమైన నటనతో ఖ్యాతి చెందారు. ఇవికాక, 25 మలయాళం చిత్రాల్లోనూ, 6కన్నడ చిత్రాల్లోనూ నటిం చారు. మొత్తంగా 254 చిత్రాల్లో ఆమె నటనా వైభవం వర్ణించేందుకు మాటలు చాలవు. (అయితే 'మామ్‌' ఆమె 300వ చిత్రంగా పేర్కొంటున్నారు. మధ్యలోని 45 చిత్రాల వివరాలు తెలియరాలేదు.) వీట న్నిటికీ ప్రధాన కారణం ఆమె నిబద్ధత, క్రమశిక్షణ, అంతులేని కృషి.. నటనా రంగంలో ఆమెకు అనితరసాధ్య మైన ఇంత ఘనకీర్తిని తెచ్చిపెట్టాయి. అత్యంత అమోఘమైన ఆమె నటనా చాతుర్యం భారతీయ సినీరంగానికే శిఖరాయమా నంలా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. హిందీ చిత్రాల నిర్మాత బోనీకపూర్‌తో వివాహమయ్యాక ఆమె సినీ రంగానికి కొంతకాలం దూరమైనా, 2012లో తిరిగి ఆమె నటించిన 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' చిత్రం ఓ సంచలనంగా నిలిచింది. దశాబ్దాదల తర్వాత ఆమె మళ్ళీ మేకప్‌ వేసుకున్నప్పటికీ ఎక్కడా తడబాటు లేకుండా తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది. సినీరంగ ప్రవేశం చేసిన రోజుల్లో తనకంటూ అప్పట్లో ఎవరి దన్నూ లేకపోయినా.. కేవలం స్వయంకృషితో, పట్టుదలతో నటనారంగంలో మెరుగులు దిద్దుకుంటూ, అనుభవపాఠాలు నేర్చుకుంటూ, తననుతనే తీర్చిదిద్దుకుంటూ జీవితంలో ఎంతో కష్ట పడి ఒక మహా నటిగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. తన ముద్దుముద్దు మాటలతో నటనకే అభినయం నేర్పించిన మహానటి.. ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి ఆమె దుబాయ్‌లో మరణించారు. శ్రీదేవి భౌతికంగా మనమధ్య లేకపోయినా సర్వత్రా అందరి హృదయాల్లో నిండిపోయి వుంది. అదిగో ఆ నక్షత్రలోకంలోనూ జగజ్జేయమానంగా వెలుగులీనుతూ మిల మిలమెరిసే తారగా.. దివ్యతారగా.. ధృవ తారగా నిలిచిపోయింది. ఇండియన్‌ లెజండ్‌.. ఇండియన్‌ సూపర్‌స్టార్‌ శ్రీదేవి.. ఇక లేకపోవడం భారతీయ చలనచిత్ర రంగానికే తీరని లోటు. ఏనాటికీ తీరని.. ఒక విషాదమే!.. ఆ మహానటి కిదే.. మా కన్నీటి నివాళి!....

vijayగత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంఘ టన హాస్యనటుడు విజయసాయి ఆత్మహత్య. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరివి వివిధ కోణాలు, పలు కారణాలు. కానీ ఈ ఉదంతం మాత్రం వార్తల్లో నానుతూనే వుంది. ఇందుకు కారణం విజయ్‌ మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో. బహుశా ఇలా సెల్ఫీలలో సైతం మరణవాంగ్మూలం ఇస్తారనే విషయం పోలీసుశాఖకు కూడా తొలిసారిగా అర్థమైనట్లుంది. మామూలుగా లేఖల రూపంలో దొరికే వాంగ్మూలాలని వాళ్ళు ఏమైనా చేసేయగలరు కానీ ఇలా సెల్ఫీవీడియోలను ఏమార్చడం ఎవరి తరమూ కాదు. ఈ సెల్ఫీని విజయ్‌సాయి ఎంతమందికి పంపించి వుంటాడో వారికి తెలియదు కాబట్టి ఈ విషయంలో వాళ్ళు గోల్‌మాల్‌ చేసే అవకాశమే లేదు.

ఇక సెల్ఫీ వీడియోతో పాటు దొరికిన సాక్ష్యాల ఆధారంగా (కార్లు, ఫోన్‌ సంభాషణలు) ఈ వ్యవహారంలో శ్రీనివాస్‌ అనే న్యాయవాది, శశిధర్‌ అనే పారిశ్రామికవేత్త, విజయసాయి భార్య ఏ1 ముద్దాయి వనితరెడ్డిలతో పాటు ఏ2, ఏ3 ముద్దాయిలుగా వుండడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు దొరికిన రెండుకార్లలో ఒక దానిపైన అడ్వకేటు స్టిక్కర్‌ ఉండడం, మరో కారు శశిధర్‌కు చెందిన నవయుగ కంపెనీకి చెందడం.

నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌, నవయుగ ఇన్‌ఫోటెక్‌తో పాటు కృష్ణ పట్నం పోర్టు కంపెనీలు శశిధర్‌కి చెందినవి కావడంతో మీడియా హడావుడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో అయితే గంటకో కథ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చూపిస్తూ ఇది మా పరిశోధన అంటూ జబ్బలు కొట్టుకుం టున్నారు. పై విషయాలన్నీ మన కనవసరం. అసలు ఎక్కడో సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసుకునే విజయ సాయి భార్యకీ ఈ శ్రీనివాస్‌, శశిధర్‌లకీ వున్న సంబంధ భావ్యాలు ఏమిటి...? బంధమా... బంధు త్వమా... లేక వేరే ఏదైనా అనుబంధమా...? ఈ ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్పాల్సివుంది.

నెల్లూరుజిల్లాకి సంబంధించినంత వరకు కృష్ణపట్నం పోర్టన్నా, ఆ కంపెనీ యాజమాన్య మన్నా ఓ ప్రతిష్టాత్మక సంస్థగా ప్రతిష్టాత్మక వ్యక్తులుగా అందరూ చూస్తారు. ఇక జిల్లా యంత్రాంగ మైతే గల్లీ నుండి ఢిల్లీ వరకూ ప్రభుత్వ పెద్దలతో పోర్టు యాజ మాన్యానికున్న పలుకుబడిని దృష్టిలో వుంచుకుని వాళ్ళ ఆజ్ఞలకు, ఆదేశాలకు, ఆలోచనలకు తోక వూపుతూ పని చేస్తారు. ప్రతి ఫలంగా వాళ్ళ మర్యాదలనీ ఆస్వాదిస్తారు.

ఇలాంటి తరుణంలో పోర్టు యం.డి శశిధర్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమా? కాదా? అని రుజువు చేసుకోవలసిన బాధ్యత వారిపైనే వుంది. వారికి అపార పలుకుబడి వుండొచ్చు, వేలకోట్లు ఆస్తులుండొచ్చు... కానీ కాండక్ట్‌ & క్యారెక్టర్‌ చాలా ముఖ్యం. ఇప్పటికే వారి పోర్టులో భాగంగా సముద్ర మధ్యలో మయసభను తలపించే ''దక్షిణ్‌''లో జరుగుతున్న 'దక్షిణ' వ్యవ హారం కథలు కథలుగా బయటకు వినిపిస్తూనే వుంది. వాయు మార్గంలో వచ్చే విఐపిలకు జరిగే విందు వినోదాల ముచ్చట వాడవాడలా షికారు చేస్తూనే వుంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగినట్లుగా ఈ ''దక్షిణ్‌''లో వారు జరిపే కార్యకలాపాలు ఎవరికీ తెలియవని అనుకున్నా అది వారి భ్రమే.

నెల్లూరీయులకు పోర్ట్‌ అంటే ఓ ల్యాండ్‌మార్క్‌. నెల్లూరు అభివృద్ధికి దిక్సూచిగా కృష్ణపట్నం పోర్టును చూస్తారు. అలాంటి సంస్థ యాజమాన్యం ఇలాంటి 'గలీజు' వ్యవహారంలో అభాసు పాలైతే అది వారికే కాదు, వారిపై నమ్మకం పెట్టుకున్న జిల్లా వాసులకీ అవమానమే. నెల్లూరు పారిశ్రామికవేత్తలకు విశ్వ వ్యాప్తంగా ఒక గుర్తింపు వుంది. మేధావులుగా పేరు ఉంది. చిల్లర చేష్టలకు దూరంగా వ్యాపారాన్ని భక్తితో చేస్తారన్న నమ్మకం ఉంది. ఒక జివికె, ఒక శీనయ్య, ఒక గునుపాటి ప్రసాద్‌రెడ్డి, ఒక దొడ్ల కుటుంబం, ఒక అల్లారెడ్డి కుటుంబం, ఒక సీబ్రోస్‌ కుటుంబం లాంటి ఎందరో తమ కండక్ట్‌ని ఉన్నతంగా ఉంచు కున్నవారే. శశిధర్‌ నెల్లూరు వాడు కాకపోయినా ఇప్పుడు నెల్లూరి వ్యాపారవేత్త కిందే లెక్క. ఇప్పుడు ఆయన శీలం ఏ3 నిందితునిగా పోలీస్‌ రికార్డ్స్‌లో భద్రంగాఉంది. అదీ తన భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తూ మరణించిన విజయ్‌ మాటల కారణంగా శశిధర్‌ పరువు బజారున పడింది. ఇప్పుడు తన శీలం ఉన్నతమైందని నిరూపించుకోవాల్సిన బాధ్యత శశిధర్‌పైనే ఉంది. విలువలతో కూడిన వ్యాపారం చేసే నెల్లూరియన్స్‌ పక్కన ధైర్యంగా నిలబడా లంటే కడిగిన ముత్యంలా బయటకు రావాల్సిన అగత్యం ఇప్పుడు శశిధర్‌పైనే ఉంది. వేచిచూద్దాం చట్టం ఎవరికి చుట్టమౌతుందో!

sridevi dauthsaఅలనాటి అందాల సుందరి శ్రీదేవి, వయసు మీద పడ్తున్నా తరగని అందంతో ఇప్పటికీ హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులిస్తోన్న విషయం విదితమే. అడపా దడపా కూతుళ్ళతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తూ, ఆ ఫొటోల్ని మీడియాకి అందిస్తూ వస్తోంది శ్రీదేవి. ఆ ఫొటోల్లో ఒక్కోసారి శ్రీదేవి సైతం బికినీలో కనిపిస్తుండడం గమనార్హం. 

ఇక, కొత్త ఇన్నింగ్స్‌లో నెమ్మది నెమ్మదిగా సినిమాలు చేస్తోన్న శ్రీదేవి, ఇంకోపక్క కుమార్తె జాన్వీని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు పక్కా స్కెచ్‌ ప్రిపేర్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్‌ ఫీచర్స్‌ కోసం జాన్వీని జిమ్‌ల చుట్టూ తిప్పుతోంది.  తల్లికి తగ్గ అందం కాకపోయినా, జాన్వీ కూడా ఈ మధ్య గ్లామర్‌ పెంచుకుంటూ వెళ్తోంది. జాన్వీతోపాటుగా శ్రీదేవి మరో కుమార్తె కుషీ కూడా గ్లామరస్‌గా ఫొటోలకు పోజులిచ్చేస్తోంది. అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ తమ తల్లి శ్రీదేవి పుట్టినరోజు వేడుకల్లో ఇదిగో ఇలా దర్శనమిచ్చారు. జాన్వీ ఓ అడుగు ముందుకేసి బ్యాక్‌లెస్‌ టాప్‌తో అందరి దృష్టినీ ఆకర్షించేసింది.

Page 1 of 7

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter