rabbarsingఏం మాయ చేసాడో, ఏం మత్తు చల్లాడోగాని చంద్రబాబుకు ఫిదా అయిపోయాడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని చంద్రబాబు వద్దకు వెళతాడు. ఆయన ముఖం చూడగానే పవన్‌ ప్రశ్నలు మరచిపోతాడు. చంద్రబాబు చెప్పింది విని బయట కొస్తాడు. చంద్రబాబు లాంటి నాయకుడు ఈ భూమండలంలోనే లేడని పొగుడుతాడు.

పవనిజమేంటో, ఆయన మేనరిజం ఏంటో అర్ధంకాక జనం జుట్టు పీక్కుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. కనీసం ఒక ఎలక్షన్‌లోనన్నా ఒంటరిగా పోరాడి 19మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. అధికారం లేకుండా పార్టీని నడపడం కష్టమని భావించి కాంగ్రెస్‌లో కలిసిపోయాడు. అప్పుడే చిరంజీవిని జనం వేళాకోలంగా చూసారు. అయితే ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఆ మాత్రం పోరాటం కూడా చేయడం లేదు. ఆయన మాటలకు చేతలకు పొంతనే లేకుండా పోయింది. పార్టీని స్థాపించిన తొలి ఎన్నికల్లోనే తన పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీకి, టీడీపీకి మద్దతు పలికాడు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. ఏపికి ప్రత్యేకహోదాపై కేంద్రం మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే చాలనుకుంది. ప్రత్యేకహోదాపై మూడుచోట్ల సభలు పెట్టిన పవన్‌కళ్యాణ్‌ కేంద్రంలోని బీజేపీని తిట్టాడేగాని ప్రత్యేకహోదా కోసం డిమాండ్‌ చేయకుండా ప్రత్యేకప్యాకేజీని ఎంతో అపురూపంగా అంగీకరించిన టీడీపీని పల్లెత్తుమాట అనలేదు. అమరావతి రాజధాని కోసం రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకుంటున్నారని తెలిసి అప్పుడెప్పుడో రాజధాని గ్రామాల్లో ఆయన పర్యటించాడు. ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత అడ్రస్‌ లేడు. ఈమధ్య ప్రత్యేకహోదా సభలు పెట్టాడు. తలా తోకా లేదు.

ప్రశ్నిస్తానని ప్రజల్లోకి వచ్చిన వాళ్లు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండాలి. మూడుకార్లు పంటలు పండే భూముల్లో రాజధాని ఎందుకని ప్రశ్నించాలి? మాగాణి పొలాల్లో ఎయిర్‌పోర్టులు, సెజ్‌లు ఏంటని ప్రశ్నించి వుండాలి? పుష్కరాల పేరుతో వేలకోట్లు దోపిడీ ఏంటని నిలదీసి వుండాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్‌లో వుండగా, పోలవరం పూర్తిచేస్తే ఎందుకూ పనికిరాని పట్టిసీమకు 1400కోట్లు ఎందు కని ప్రశ్నించి వుండాలి? రాజదాని పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ఎందుకని నిలదీసి అడిగి వుండాలి. ప్రత్యేకహోదాను ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారని నిలదీసుండాలి. 2014 ఎన్నికల్లో ఇచ్చిన కాపు రిజర్వేషన్ల హామీ ఏమైందని ప్రశ్నించి ఉండాలి.

కాని, ఈ మూడేళ్లలో చంద్రబాబును పవన్‌కళ్యాణ్‌ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు, సరికదా, చంద్రబాబుతో భేటీకి ప్రత్యేక విమానంలో వెళ్లడం, చంద్రబాబును కలిసాక ఆయనను పొగడడం పవన్‌కు పరిపాటయ్యింది. చిన్నవాన కురిస్తే స్లాబంతా ఉరిసే రాజధాని భవనాలను 196 రోజుల్లో కట్టానని చంద్రబాబు చెప్పుకుంటే, ఇలాంటి అద్భుతాలు మీకే సాధ్యమంటూ పవన్‌ కితాబివ్వడం భలే కామెడీగా వుంది. ప్రజాసమస్యలపై పవన్‌కున్న నాలెడ్జ్‌కు ఇది అద్ధంపడుతోంది. ఎవరన్నా ప్రజాసమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వంతో పోరాడుతారు. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాడట. అంటే ఇకముందంతా కూడా చంద్రబాబుతో కలిసే ఆయన పనిచేయనున్నాడని అర్ధమవుతోంది.

అక్టోబర్‌ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్‌ ప్రకటించుకున్నాడు. వచ్చి ఆయన పీకేదేముంది, చంద్రబాబు డైరెక్షన్‌లో యాక్షన్‌ చేయడం తప్పితే! ఆయన మాటలు, ఆయన చేష్టలు చూస్తుంటే ఇతను గబ్బర్‌సింగ్‌ కాడు చంద్రబాబు చేతిలో 'రబ్బర్‌సింగ్‌' అన్నది స్పష్టంగా అర్ధమవుతోంది.

సినిమాలలో పవన్‌కళ్యాణ్‌కు ఒక ఇమేజ్‌ వుంది. రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు చేతిలో గన్‌లా మారితే అక్కడా, ఇక్కడా రెండు చోట్లా ఇమేజ్‌ దెబ్బతింటుంది. రాజకీయాల్లోకి వస్తే వాస్తవ పరిస్థితులను గుర్తించి ప్రజలపక్షాన నిలిచి ప్రభుత్వంతో పోరాడేటట్లన్నా వుండాలి, అలా చేయలేనప్పుడు గౌరవంగా సినిమాలే చేసుకుంటుంటే ఉన్న ఇమేజ్‌ను కాపాడుకోవడానికన్నా ఆస్కారముంటుంది.

deekshaపోరాడి సాధించుకున్న తెలం గాణలో మాత్రం ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను ఒక్కరోజులో ముగిస్తు న్నారు. సంబరాలు ఆరోజే జరుపుకుం టున్నారు. మిగతా రోజులు యధావిధిగా పనుల్లో పడుతున్నారు. రాష్ట్రం సాధించుకున్నందుకు వాళ్ళు ఒక్కరోజు పండుగ చేసుకుంటుంటే, రాష్ట్ర విభజన రూపంలో దారుణాతి దారుణంగా నష్టపోయిన మనం మాత్రం ప్రతి సంవత్సరం రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 2వ తేదీ నుండి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షల పేరుతో సంతాపసభలను నిర్వహించుకుంటున్నట్లుగా వుంది. మానిన గాయాలను మళ్ళీ పుండ్లుగా రేపుకుంటున్నట్లుంది.

నవనిర్మాణదీక్షల పేరుతో ఈ సంతాప సభలేంటి? రాష్ట్ర విభజనతో నష్టం జరిగిపోయిందని ఎన్ని సంవత్సరాలు ఏడుద్దాం. అసలు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన నవంబర్‌ 1వ తేదీని వదిలేసి, ఆంధ్రుల గుండెల్లో చిచ్చు రగిల్చిన జూన్‌ 2వ తేదీ నాడు ఈ సభలేంటి, ఈ జాతరలేంటి? ఇంకా ఆనాటి ఏడుపులేంటి? అసలు నవనిర్మాణదీక్షలంటూ వారంరోజుల పాటు ఈ తిరునాళ్ళేంటి? ఏం చేయడానికి, ఎవరిని ఉద్ధరించడానికి ఇవి చేస్తున్నట్లు? నవనిర్మాణ దీక్షల పేరుతో వారంరోజుల పాటు జరిగిన జాతర రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల్లోనే కాదు, ప్రజల్లోనూ, ఆఖరుకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తిని రగిల్చింది. ఏదన్నా ఒకరోజు సభ అంటే జనం వస్తారు. అధికారులు వుంటారు. కార్యకర్తలు వింటారు. రోజూ అదే సభ... అదే ప్రసంగాలు... ఊకదంపుడు ఉపన్యాసాలు... ఎంతసేపని వింటారు... ఎన్నిరోజులని వింటారు. ఎవరికి మాత్రం విసుగురాకుండా వుంటుంది.

ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే సోదితో జనం విసుగెత్తిపోతున్నారు. ఈరోజొక మాట, రేపొక మాట చెప్పడం మా ఇంటా వంటా లేదన్నట్లుగా ఆయన ఈరోజు ఏం చెప్పాడో, మరుసటిరోజూ అదే చెబుతున్నాడు. జనం ఒకరోజు వింటారు, రోజూ వినాలంటే వారికి మాత్రం ఓపిక ఉండొద్దా? తెలంగాణ అభివృద్ధి నా పుణ్యమే, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే... హైటెక్‌ సిటీని కట్టింది నేనే... చంద్రబాబు స్కోత్కర్ష! అరిగిపోయిన రికార్డిది. ఇంకా ఎంతకాలం వేస్తారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్‌... దేవుడు ఆదేశించాడట... చంద్రబాబు కడుతున్నాడట! ఏం మాటలివి? ప్రజలు కోరుకున్న పనులు చేయరా? ప్రజల సమస్యలు పరిష్కరించరా? దేవుడు ఆదేశించిన పనులు మాత్రమే చేస్తారా? గతంలో ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసినవాళ్లు దేవుడు ఆదేశించినప్పుడు మాత్రమే ప్రాజెక్టులు కట్టారా? ప్రగతి పనులు చేపట్టారా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన దేవుళ్ళు లేరు. వాళ్ళు ఆదేశించడం లేదు, వారి ఆశలకు తగ్గట్లన్నా పని చేస్తేనే మంచి పరిపాలకులనిపించుకుంటారు.

చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో ప్రచారం జాస్తిగాను, ప్రగతి నాస్తిగానూ ఉండడం తెలిసిందే! ఈ మూడేళ్లలో మనకు ఘనంగా జరిగాయని చెప్పుకునే పనులేంటంటే గోదావరి, కృష్ణ పుష్కరాలు, పట్టిసీమ. ఈ మూడింటి వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మూడేళ్ల నుండి సింగపూర్‌ లాంటి అమరావతి రాజధాని అంటూ డప్పుకొడుతున్నారు. సింగపూర్‌ రాజధాని రంగేమిటో మొన్న అమరావతిలో కురిసిన ఒక్క పదును వానతో తేలిపోయింది. సింగపూర్‌ టెక్నాలజీతో భవనాల నిర్మాణం అంటే భవనాలు పగుళ్లివ్వడం, గదుల్లోకి వర్షపు నీళ్లు కారడమేమోనని జనం అనుకుంటున్నారు.

జరగాల్సిన అభివృద్ధిపై దృష్టి పెట్టడంకంటే కూడా జరగని అభివృద్ధిపై ప్రచారం చేసుకోవడం, సభలు పెట్టి చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయింది. రాష్ట్ర విభజన తేదీలను కూడా ఆయన వారోత్సవాల మాదిరిగా నిర్వహిస్తున్నాడంటే జనానికి ఇంతకుమించిన హింస ఇంకోటి లేదు.

3చంద్రబాబు పక్కా రాజకీయనాయకుడు. కాబట్టే ప్రజానాయకుడు కాక పోయినా ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పరిపాలించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర రాజకీయాలను ఔపాసన పట్టిన నాయకుడు. ఎప్పుడు ఏమి చేయాలో తెలి సిన నాయకుడు. ప్రజల్లో బలం లేక పోయినా, ఆ ప్రజల మద్దతు ఎలా పొం దాలో, ఎన్ని మార్గాలలో రాబట్టాలో తెలిసిన నాయకుడు. అలా తెలిసినవాడు కాబట్టే 2014లో పార్టీ పనైపోయిందను కున్న వాతావరణంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాడు.

ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. ప్రజలు కట్టకట్టుకుని ఓట్లేసేంత మంచిపనులేవీ చంద్రబాబు చేయలేదు. ఈ మూడేళ్లలో చేసినవన్నీ కూడా సొం తంగా ఆర్ధిక వనరులు కూడగట్టుకోవ డానికి చేసినవే! ప్రజల్లో వ్యతిరేక వాతా వరణం బాగానే కనిపిస్తోంది. అయినా కూడా రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఏక పక్షంగా జరగాలనే కాంక్ష చంద్రబాబులో కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గాలు మూడు.

మొదటిది రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను 175 నుండి 225కు పెంచడం. ఇలా చేస్తే తెలుగుదేశంలో వున్నోళ్లకు, కాంగ్రెస్‌, వైకాపాల నుండి చేరినోళ్లందరికీ సీట్లొస్తాయి. డబ్బు ఖర్చుపెట్టే అభ్యర్థులకు తెలుగుదేశంలో లోటు లేదు. కాని వైకాపాకు అలాంటి అభ్యర్థుల కొరత ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షం మొదటి దెబ్బ తింటుంది. తెలుగుదేశం తరపున అన్ని నియోజక వర్గాలలోనూ బలమైన అభ్యర్థులు నిల బడతారు.

రెండోది... పవన్‌ కళ్యాణ్‌ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడంలో ప్రధాన కారణాలలో పవన్‌ కళ్యాణ్‌ ఒకడు. ఆరోజు ఆయన బీజేపీతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశంకు కూడా మద్దతు పలికాడు. దీంతో పవన్‌ అభిమా నులతో పాటు కాపుల ఓట్లు కూడా తెలుగుదేశంకు పడ్డాయి. ఈ మూడేళ్లలో కాపులు చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు. కాపులకు బి.సి రిజర్వేషన్‌లు అమలు చేస్తామన్న బాబు మాట గాలిమూటే అయ్యింది. కాపు రిజర్వేషన్‌ ఉద్యమాలను చంద్రబాబు బలంగానే అణచివేసాడు. ఈసారి కాపుల ఓట్లు తెలుగుదేశంకు పడవని చంద్రబాబుకు తెలుసు. అయితే ఆ ఓట్లు వైకాపాకు పోతే చంద్రబాబుకు డేంజర్‌. వాటిని డైవర్ట్‌ చేయాలి. అందుకు ఆయన ముందున్న మార్గం పవన్‌ కళ్యాణ్‌ జనసేన చేత పోటీ చేయించడం. దీనివల్ల కాపుల ఓటును వైకాపాకు పోకుండా చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైకాపా, జనసేనల మధ్య చీల్చి తెలుగుదేశాన్ని లబ్దిపొందేలా చేయడం.

ఇక మూడోమార్గం అందరికీ తెలి సిన డబ్బు. ఎన్నికలంటేనే దీని పాత్ర ప్రధానమైపోయింది. ఇప్పుడు తెలుగుదేశం నాయకుల దగ్గర ఇది పుష్కలంగా వుంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలోనే ఒక్కో జిల్లాలో ఎన్నేసికోట్లు ఖర్చుపెట్టారో చూసాం. 2014 ఎన్నికల్లోనూ తెలుగు దేశం గెలుపులో డబ్బు ప్రభావం బాగానే పనిచేసింది. ఐదేళ్లు అధికారంలో ఉం డడం వల్ల తెలుగుదేశంపార్టీ ఆర్ధికంగా ఇంకా పుంజుకుంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆర్ధిక శక్తులను బాగానే ప్రయోగిస్తాడు.

ప్రజల్లో బలం లేకున్నా, ప్రజాకర్షక పథకాలు ఏవీ లేకున్నా, అవినీతి అక్ర మాలు పోటెత్తుతున్నా, రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా... చంద్ర బాబుకు వచ్చే ఎన్నికలో మనదే అధికారం అని బల్లగుద్ది చెప్పడానికి బలమైన కారణం ఈ మూడుమార్గాలను బలంగా నమ్ము తుండడమే!

Page 1 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • వీడుతున్న సంకెళ్ళు
  రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు ఇంత కాలం ఒక ఆశ ఉండేది. అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధినేత జగన్‌ జైలుకుపోతాడని, రాష్ట్ర రాజకీయాలలో ఇక తమకు తిరుగుండదని భావిస్తూ వచ్చారు. కాని, ఇప్పుడు వారి ఆశలకు నెమ్మదిగా తెరపడబోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశంను,…

Newsletter