galpikaపట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా రెడీ అయ్యి నాలుగు మసాలా దోశ, ఐదు రవ్వదోశ, ఏడు ప్లేట్ల పూరీతో లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ కానిచ్చి మద్రాసుబస్టాండ్‌ వద్దకొచ్చి నిలబడ్డాడు. ఒక్క క్షణంలోనే పది ఆటోలు తన ముందు నిలవగా విక్రమార్కుడు ఒక ఆటోను సెలక్ట్‌ చేసుకుని ఎక్కాడు. విక్రమార్కుడు సీట్లో కూర్చున్నంతలోనే ఆటో పెద్దాసుపత్రి ముందు ఆగింది. విక్రమార్కుడు ఆటోవాలాతో... మీరు ఫార్ములా వన్‌కు వెళితే ఫస్ట్‌ప్రైజ్‌ తెచ్చుకుంటారు, ట్రై చేయకూడదూ అని వ్యంగ్యంగా అంటూ ఆటో దిగి పెద్దాసుపత్రిలోకి అడుగుపెట్టాడు. మార్చురీ లోపలకు వెళ్ళి స్మెల్‌రాని ఫ్రెష్‌ బాడీని భుజాన వేసుకుని బోడిగాడితోటలోని రోటరీ క్లబ్‌ శ్మశాన వాటిక వైపు నడవసాగాడు. కెవిఆర్‌ పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చేసరికి విక్రమార్కుడికి చెమటలు పట్టాయి. ఓపిక నశించింది. అడుగులు నీరసంగా పడుతున్నాయి. గొంతు దాహంతో ఎండిపోతోంది. నీరసంగానే భేతాళ... భేతాళ అంటూ శవాన్ని తట్టాడు. అప్పుడు శవంలోని భేతాళుడు... రాజా, నీ బాడీ స్టామినా పరీక్షిద్దామని చెప్పే ఇంతవరకు పలకలేదు. నీకు వయసు మీద పడుతున్నట్లుంది. ఇక ఎక్కువకాలం నన్ను మోయలేవు... కాబట్టి టీటీడీలో రమణదీక్షితులు మాదిరిగా రిటైర్మెంట్‌ తీసుకుని కొత్తవారికి అవకాశమివ్వడం మంచిది అని సలహా ఇచ్చాడు. దానికి విక్ర మార్కుడికి ఒళ్ళు మండి నా రిటైర్మెంట్‌ సంగతి నేను చూసుకుంటాను, ముందు నీ డ్యూటీ నువ్వు చెయ్‌... ఏదో సోది పురాణం చెబుతావు కదా, అది చెప్పి ఏడిస్తే నేను త్వరగా రూమ్‌కెళ్ళి పడుకుంటాను అని అడిగాడు. అప్పుడు భేతాళుడు... నీకు ''ప్రపంచాన్ని చుట్టిన వీరుడు - తండ్రిని ముంచిన పుత్రుడు'' అనే లేటెస్ట్‌ పొలిటికల్‌ స్టోరీ చెబుతాను విను అంటూ మొదలుపెట్టాడు.

హైటెక్‌రత్న నారా చంద్రబాబునాయుడు అనే పేరు తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలోనే వుండరు. కంప్యూటర్‌ను కనిపెట్టింది ఆయనే! సెల్‌ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది ఆయనే! భారత దేశానికి నలుగురు ప్రధానులను అందించిన ఘననేత అతను. అంతేనా... బిల్‌క్లింటన్‌ను అమెరికా అధ్యక్షుడిని చేసింది, సత్య నాదెళ్ళను గూగుల్‌ సి.ఇ.ఓ చేసింది ఆయనే! బిల్‌గేట్స్‌కు ఆయనంటే పిచ్చి అభిమానం. ప్రపంచం మెచ్చిన నాయకుడాయన. ప్రపంచంలో 198దేశాలుంటే... కాదు 200 దేశాలున్నాయని కొత్త దేశాలు కనిపెట్టింది కూడా ఆయనే. మరి చంద్రబాబే ఇలా వుంటే ఆయన వారసుడు ఎలా వుండాలి అని భేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్నిం చాడు. చంద్రబాబుకన్నా నాలుగాకులు ఎక్కువ చదివి వుండాలని విక్రమార్కుడు చెప్పాడు. కాని ఇక్కడ సీన్‌ అందుకు భిన్నంగా వుందంటూ భేతాళుడు వేళ్ళతో గాల్లోనే స్క్రీన్‌ గీసి సీన్స్‌ ప్లే చేసి ఈ అద్భుత సుభాషితాలు చూడు అని చెప్పాడు. స్క్రీన్‌ మీద సీన్‌లు... లోకేష్‌బాబు తెరపై ప్రత్యక్షం...

అన్నా... ఈ దేశంలో అత్యంత కులపిచ్చి, మత పిచ్చి, అవినీతి పిచ్చి వున్న పార్టీ ఏదన్నా వుందంటే అది తెలుగుదేశమే. అవు నంటారా? కాదంటారా?... అవును అవును అంటూ సభలోంచి ప్రజల నినాదాలు.

అన్నా మీ అందరికీ ఒకటే చెబుతున్నా, వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటేసారంటే మీ మెడకు మీరు ఉరి వేసుకున్నట్లే.

అది అంబేద్కర్‌ జయంతి వేడుక... లోకేష్‌ మైక్‌ తీసుకుని... అంబేద్కర్‌ మనందరికీ మార్గదర్శకుడు... ఆయన వర్ధంతి సంద ర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

40ఏళ్ళ రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి చంద్రబాబు... ఆయన ప్రతిష్టను అంతం చేయడానికి మనమంతా కంకణం కట్టుకోవాలి.

మహానాడు వేదికపై లోకేష్‌ స్పీచ్‌... పంచాయితీ వార్డు మెంబర్లుగా కూడా గెలవలేనివాళ్ళను ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టినగతే టీడీపీకి పడుతుంది.

ఇక్కడితో లోకేష్‌ సుభాషితాల సీన్‌లు ముగిసాయి. స్క్రీన్‌ క్లోజ్‌ చేసి భేతాళుడు రాజా, చూసావు కదా... లోకేష్‌ ఆణిముత్యాలలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! నీకు ఓపిక వుండి చూస్తే ఇంకా చాలా వున్నాయి. నీకు సబ్జెక్ట్‌ అర్ధం కావడానికి మాత్రమే ఇవి చూపించాను. సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే మన తాడుతో మనం ఉరేసుకున్నట్లే అని ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి కూడా ఏ మీటింగ్‌లో చెప్పలేదు. అలాంటిది భవిష్యత్‌లో చంద్రబాబు తర్వాత తెలుగుదేశంకు నాయ కత్వం వహించాల్సిన లోకేష్‌బాబే ఆ పార్టీ గురించి చెడుగా ఎందుకు మాట్లాడుతున్నట్లు? చంద్రబాబు ప్రతిష్టను నాశనం చేయడానికి ఎందుకు కంకణం కట్టుకున్నట్లు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ ఆఫీసర్‌గా మారి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ల దెబ్బకు మెంటలొచ్చి రోడ్డున పడతావని బెదిరించాడు.

అందుకు విక్రమార్కుడు... భేతాళ... 1995లో ఏం జరిగిందో నీకు తెలిసేవుంటుంది. ఎన్టీఆర్‌ కొడుకులను అడ్డంపెట్టుకునే చంద్ర బాబు ఆయనను పదవీచ్యుతుడిని చేసాడు. ఆ మానసిక వేదనతో ఎన్టీఆర్‌ రగిలిపోయాడు. నా కొడుకుల చేతనే నన్ను ముఖ్యమంత్రి పీఠం నుండి దింపేస్తావా... భవిష్యత్‌లో నీ కొడుకే నీ పార్టీకి శత్రు వవుతాడు... నీ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తాడు... నీ పరువు ప్రతిష్టలకు కళంకం తెస్తానని కంకణం కట్టుకుంటాడు అని శపించాడు. ఆ శాపం ఫలితమే ఈ లోకేష్‌ ఆణిముత్యాలు అని చెప్పాడు. విక్రమార్కుడి సమాధానంతో సంతృప్తి చెందిన భేతాళుడు బాడీలోంచి లేచి తుర్రుమన్నాడు.

galpika''బీజేపీని ఓడించాలి... బీజేపీ ముక్త్‌ భారత్‌... ఇటలీనే ఇండియా... ఇండియానే ఇటలీ... బీజేపీ డౌన్‌ డౌన్‌...'' ఢిల్లీ, టెన్‌జనపథ్‌లోని తన గదిలో పడుకున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గాఢనిద్రలో కలవరి స్తోంది. తెల్లారి ఆరుగంటలు కావ డంతో ఎంపీ వి.హెచ్‌.హనుమంతు రావు బెడ్‌కాఫీని ట్రేలో పెట్టుకుని అమ్మగారికివ్వడానికి వచ్చాడు. సోనియాగాంధీ నోటిలో నుండి వస్తున్న ఆ కలవరింతలను శ్రద్ధగా విన్నాడు. వెంటనే బయటకొచ్చి చూసాడు. అప్పుడే రాహుల్‌గాంధీ సైక్లింగ్‌ ముగించుకుని వచ్చాడు. కాకపోతే ఆయన సైకిల్‌ తొక్కు కుంటూ రాలేదు.. దానిని నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అది చూసి విహెచ్‌కు ఆశ్చర్యమేసింది. రాహుల్‌తో... అదేంటి బాబూ.. సైకిల్‌ తొక్కుకుని రాకుండా నెత్తిన పెట్టుకుని వచ్చావని అడిగాడు. అందుకు రాహుల్‌... నేనేమన్నా అమాయకుడినా... మొన్న డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను... బాడీకి వాకింగ్‌ మంచిదా, సైక్లింగ్‌ మంచిదా? అని అడిగాను. ఆయన రెండూ ఒకటే అని చెప్పాడు. అప్పటి నుండి సైకిల్‌ను నెత్తినపెట్టుకుని వాకింగ్‌ చేస్తున్నాను. అటు సైక్లింగ్‌ చేసినట్లు... ఇటు వాకింగ్‌ చేసినట్లు... అని చెప్పాడు. ఆ సమాధానానికి విహెచ్‌కు దిమ్మ తిరిగింది. తర్వాత తేరుకుని... బాబూ ఒక్కసారి అమ్మగారి గదిలోకి రండి... ఆమె ఒక విషయాన్ని పదే పదే కలవరిస్తోంది. అదేంటో విం దురు రండి అని చెప్పి లోపలకు తీసు కెళ్ళాడు. సోనియాగాంధీ నిద్రలోనే... ''బీజేపీని ఓడించాలి... బీజేపీ ముక్త్‌ భారత్‌'' అంటూ కలవరిస్తూనే వుంది. చూడు బాబూ అమ్మగారి కోరిక. ఆమె ఆశయాన్ని మీరే ఎలా గైనా నెరవేర్చాలని రాహుల్‌తో వి.హెచ్‌ అన్నాడు. అప్పుడు రాహుల్‌... 'అమ్మా' అంటూ అరిచాడు. ఆ గావు కేకకు సోనియా ఉలిక్కిపడి లేచింది. ఏంట్రా సన్యాసి ఎందుకంత కేక పెట్టావ్‌, నా గుండె గట్టిది కాబట్టి సరిపోయింది అని, ఇంతకీ ఎందు కంతలా అరిచావ్‌ అని అడిగింది. అమ్మా, నీ ఆశల పుత్రుడినమ్మా నేను... నీ ఆశయాన్ని నెరవేరుస్తాను, ఈ కొడుకును దీవించండి అని ఆమె పాదాలకు నమస్కరించి... ఇక పని పూర్తయ్యాకే తిరిగొస్తా అంటూ వెళ్ళి పోయాడు. సోనియాకు ఏమీ అర్ధం కాక... హనుమాన్‌జీ వాడెందుకలా ప్రవర్తిస్తున్నాడు, అసలు ఏమైంది వాడికి అని అడిగింది. దానికి వి.హెచ్‌... మీరు నిద్రలో ''బీజేపీని ఓడించాలి'' అని కలవరించడం రాహుల్‌ బాబు విన్నాడు తల్లీ, మీ ఆకాంక్షను నెరవేర్చేందుకే ఆయన కంకణం కట్టుకుని వెళ్లాడు అని చెప్పాడు. అప్పుడు సోనియా... అయ్యో ప్రభువా... నా కలవరింతతో వీడిలో ఇంత మార్పు వస్తుందను కుంటే... అదేదో... రాహుల్‌ పెళ్ళి చేసుకోవాలి, నేను మనవడితో ఆడు కోవాలి అని యాక్టింగ్‌ చేసైనా కలవ రించే దాన్ని కదా అని వాపోయింది. వి.హెచ్‌... అంతా ఆ దేవుడే చూసు కుంటాడులే తల్లీ అని నిట్టూర్చి కాఫీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళి పోయాడు.

మూడు నెలల తర్వాత...

టెన్‌జనపథ్‌లో కాంగ్రెస్‌ నేతలు చిదంబరం గులాంనబీ ఆజాద్‌, మనీష్‌తివారి, అంబికాసోని, పనబాక లక్ష్మి, మల్లిఖార్జునఖర్గేలు కూర్చుని వున్నారు. సోనియా అప్పుడే అక్కడకు వచ్చింది. వి.హెచ్‌.హనుమంతురావు అందరికీ బిస్కెట్లు, కాఫీలు అంది స్తున్నాడు. చిదంబరం వుండి... ఏం మేడమ్‌ అర్జంట్‌గా పిలిపించారని అడిగాడు. రెండు నెలల నుండి రాహుల్‌ కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఓడిస్తానంటూ పోయాడు. ఇదేమన్నా కత్తియుద్ధమా ఒకేసారి ఓడించడానికి... ఆ నరేంద్ర మోడీ, అమిత్‌షాలు అసలే ముదుర్లు... ప్రత్యర్థులను పగబట్టి బొక్కలో వేయి స్తున్నారు. రాహుల్‌కు అసలే లోక జ్ఞానం తక్కువ. అసలే అమాయక రకం. ఈ తింగరోడు ఎక్కడ తిరుగు తున్నాడో... ఎక్కడి కెళ్ళాడో ఏమో... దిగులుగా వుంది అని సోనియా చెప్పింది. అప్పుడు గులాం నబీ ఆజాద్‌ వుండి... రాహుల్‌ ఓ మహాకార్యం తలపెట్టాడమ్మా... దేశంలో వున్న పార్టీలన్నింటిని బీజే పీకి వ్యతిరేకంగా కలుపుతున్నాడు. కత్తిలాంటి కొడుకును కన్నావమ్మా అని చెప్పాడు. అంతలో రాహుల్‌ గాంధీ సడెన్‌గా అక్కడకొచ్చేసాడు. అతనిని చూడగానే సోనియాగాంధీ ఆనందంతో కౌగిలించుకుని... ఇప్పుడే నీ గొప్పతనం గురించి చెబు తుంటే వింటున్నాను నాయనా... వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడా నికి అన్ని పక్షాలను ఏకం చేసావట కదా... ఇంతకీ ఏమేం చేసావ్‌ నాయనా అని సోనియా అడిగింది. అప్పుడు రాహుల్‌ చెప్పసాగాడు. అమ్మా... కర్నాటకలో జెడిఎస్‌తో పొత్తు పెట్టుకుంటాం, వారిచ్చినన్ని సీట్లు తీసుకుని పోటీ చేస్తాం, ఆంధ్రాలో తెలంగాణలో తెలుగు దేశంతోనూ, మహారాష్ట్రలో ఎన్‌సిపి, శివసేనలతోనూ, బీహార్‌లో ఆర్‌జెడి, తమిళనాడులో డిఎంకె, పశ్చిమబెం గాల్‌లో టిఎంసి, వామపక్షాలతో, ఢిల్లీ, పంజాబ్‌, హర్యానాలలో ఆప్‌, ఇతర పార్టీలతోనూ, యూపిలో ఎస్పీ, బిఎస్పీలతోనూ మిగిలిన రాష్ట్రా లలో కూడా భావసారూప్య, బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తుపెట్టుకోబో తున్నాం. అందర్నీ ఆ దిశగా ఒప్పిం చానమ్మా అని చెప్పాడు. మంచిది నాయనా... ఇంతకీ ఏ రాష్ట్రంలో ఎవరెవరికి ఎన్నెన్ని లోక్‌సభ సీట్లు ఇస్తామని చెప్పావు నాయనా అని సోనియా అడిగింది. అడుక్కునే అల వాటు నాకు లేదమ్మా... ఎన్నోకొన్ని సీట్లు వాళ్లే ఇస్తామన్నారు. అయినా ఎన్ని సీట్లు అన్నది ఇంపార్టెంట్‌ కాదమ్మా... బీజేపీని ఓడించాలన్నదే మీ కోరిక... ఆ కోరిక నెరవేర్చడానికే నేను అన్ని పార్టీలను ఏకం చేసాను అని చెప్పాడు. దానికి సోనియా... బీజేపీని ఓడించడమంటే నిన్ను ప్రధా నిగా చూడాలన్నది నా ఉద్దేశ్యం... రేపు అన్ని పార్టీలతో పొత్తులతో అరకొర సీట్లు తీసుకుని పోటీ చేస్తే ప్రధానివి ఎలా కాగలవు... కనీసం కాంగ్రెస్‌కు 170సీట్లన్నా వస్తేనే కదా పీఎం కావడానికి అవకాశం వుండేది అని అడిగింది. అందుకు రాహుల్‌ నవ్వుతూ... నేనేం పిచ్చోడినా అమ్మా... ప్రధాని కావాలంటే 170సీట్లు బల్లేదు... 7సీట్లున్నా చాలు... గతంలో ఇలా ఆరేడు సీట్లు వచ్చిన వాళ్ళను ప్రధానమంత్రిని చేసిన చంద్రబాబును నేను లైన్‌లో పెట్టాను. మనకు పది, పదిహేను సీట్లొస్తే చాలు... ఆయన అండదండలతో ప్రధానినైపోతాను అని చెప్పాడు. రాహుల్‌ చెప్పింది విని సోనియా

కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది.

galpikaకలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం. అప్పుడే సుప్రభాతం, అర్చన, తోమాలసేవ వంటి సేవలు ముగిసి ఆరగింపుసేవ మొదలైంది. అర్చకులు పెద్దపాత్రలలో ప్రసాదాలు తెచ్చిపెట్టారు. శ్రీవారు తనకిష్టమైన లడ్డును ఒక పాత్రలో నుండి తీసుకుని నోట్లో పెట్టుకోబోతుండగా... 'ఉన్నావా అసలున్నావా... ఉంటే కళ్ళు మూసుకున్నావా... ఈలోకం కుళ్ళు చూడకున్నావా...' అనే పాట వినిపించింది. ఆ పాట దెబ్బకు ఉలిక్కిపడి శ్రీనివాసుడు ఆ పాట పాడింది ఎవరా అని చూసాడు. అక్కడచూస్తే కేసీఆర్‌ పాట పాడు తున్నాడు. ఆయనతో పాటే డొనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్ర మోడీ, వై.యస్‌.జగన్‌, గాంధీజీ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ తదితరులున్నారు. స్వామి వారిని చూస్తూ... ఏం ఇలా వచ్చారు, ఏం కష్టమొచ్చింది నాయనలారా అని అడిగాడు. అప్పుడు కేసీఆర్‌ ఏం చెప్పమంటారు స్వామి... చెబితే అయ్యేది కాదు మీరే చూడండి అంటూ గాల్లో వేళ్ళతో స్క్రీన్‌ గీసి సీన్స్‌ ప్లే చేసాడు.

------

అది తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు. హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు ఈ హైదరాబాద్‌ ఈరోజు ఇలా వుందంటే దానికి కారణమెవరు... నేనే. 60ఏళ్ళ పాటు ఈ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాడు. పార్టీ వేదికమీదే వున్న టీడీపీ నేత ఎల్‌.రమణకు ఏదో సందేహం వచ్చి... సార్‌, మీ వయసు ఇప్పుడు 68ఏళ్ళు... 60ఏళ్ళ నుండి హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేసారు... అంటే మీరు 8వ యేట నుండే ఇక్కడ వున్నారా అని సందేహం వెలిబుచ్చాడు. దానికి చంద్రబాబు... 8ఏళ్ళ వయసులో మా అమ్మనాన్నలతో కలిసి హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చాను. అప్పుడు మా బంధువుల ఇంటి పక్కనే ఇంకొకరు ఇళ్ళు కట్టుకుంటూ ఇసుక తోలించి వున్నారు. అప్పుడు నేను ఆ ఇళ్ళు కట్టేవారికి నా చిన్ని దోసెళ్ళతో ఇసుక అందించాను... అంటే 60ఏళ్ళ క్రితం నుండి హైదరాబాద్‌ నిర్మాణానికి నేను కష్టపడుతున్నట్లే కదా అని చెప్పాడు. ఆ లాజిక్‌కు ఎల్‌.రమణ కళ్ళు గిర్రున తిరిగాయి. కొద్దిసేపటికి తేరుకుని తన కుర్చీలో కూర్చున్నాడు. చంద్రబాబు తన ప్రసంగం కొనసాగిస్తూ... హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టించింది నేనే అని చెప్పాడు. అది విన్న మరో టీడీపీ నాయకుడు నర్శిరెడ్డి... అదెలా కుదిరింది సార్‌ అని అడిగాడు. దానికి చంద్రబాబు... మీరు చదువుకునేటప్పుడు 'అట్లాస్‌' అనే బుక్‌ చూసే వుంటారు. అంతకుముందు ఇండియా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు మాత్రమే వ్రాసేవాళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్‌ అనే చోట హైదరాబాద్‌ అని కూడా రాయించాను. ఆ విధంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని వివరణ ఇచ్చాడు. ఓహో అట్లాగ పెట్టించారా అని నర్సిరెడ్డి కూర్చున్నాడు. చంద్రబాబు తన ప్రసంగం కొనసాగిస్తూ... తమ్ముళ్ళూ బేగంపేట ఎయిర్‌పోర్టు మన ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. నిమ్స్‌ ఆసుపత్రిని నా చెమట చిందించి మరీ కట్టాను. చార్మినార్‌ కట్టడానికి ఆరోజుల్లో లక్షరూపాయలు మంజూరు చేయించింది నేనే! హైదరాబాద్‌కు ఎలాగైనా విమా నాలను తీసుకురావాలని చెప్పి బేగంపేటలో ఎయిర్‌పోర్టును కట్టించాను. కళాకారుల కోసం రవీంద్ర భారతి, ప్రేమికుల కోసం ట్యాంక్‌బండ్‌ కట్టించాను. ప్రతిపక్షాలన్నీ గోల్కండ కోట కడుతుంటే వ్యతిరేకించాయి. కాని, నేను ప్రజా సంక్షేమం కోసం దానిని కట్టించాను. ఈరోజు హైదరాబాద్‌కు అదొక ల్యాండ్‌ మార్క్‌గా నిలిచింది. ఆరోజుల్లోనే భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు బ్రిటీష్‌ వారితో తెగ పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గాంధీతో కలిసి ఉప్పు, కందిపప్పు, మినపప్పు సత్యాగ్రహాలు నిర్వహించాం.. తెలంగాణ విమోచనోద్యమంలోనూ మన పార్టీ కీలకపాత్ర పోషించింది. నిజాంను బెండుతీసి లొంగదీయడానికి సైన్యాన్ని పంపించమని సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌కు సలహా ఇచ్చింది నేనే.. మద్రాసు నుండి విడిపోయాక తెలుగురాష్ట్ర రాజధానిని కర్నూలు నుండి హైదరాబాద్‌కు మార్చింది నేనే. మీకో విషయం తెలుసా తమ్ముళ్ళూ... ఐ.కె.గుజ్రాల్‌, దేవేగౌడ, వాజ్‌పేయి, ఇప్పుడు నరేంద్ర మోడీలు ప్రధానులు కావడానికి కారణం నేనే. సచిన్‌కు సిక్సర్‌లు కొట్టడం నేర్పింది, ధోనీని కీపింగ్‌ నేర్చుకోమన్నది నేనే... ఒలం పిక్స్‌లో సింధు తెచ్చిన స్వర్ణపతకం నా పుణ్యమే. సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్‌ సిఇఓ అయినా, సుందర్‌ పిచాయ్‌ గూగూల్‌ సిఇఓ అయినా నా నుండి స్ఫూర్తి పొందారు కాబట్టే. ఈరోజు అమెరికాలో వున్న ప్రవాసభారతీయులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా, ప్రపంచ దేశాలలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నడుస్తున్నాయన్నా, అసలు సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నాడన్నా దానికి కారణం ఎవరో తెలుసా? అని ఆవేశంగా ప్రశ్నించాడు. సభలో వున్న వాళ్ళు ''మీరే మీరే'' అంటూ కేకలేసారు.

ఇక్కడితో ఎయిర్‌ స్క్రీన్‌ మీద సీన్‌లు ఆగిపోయాయి. తర్వాత కేసీఆర్‌ ఇదీ స్వామి చంద్రబాబు పరిస్థితి. హైదరాబాద్‌లో ప్రతి అంగుళం నేనే అభివృద్ధి చేసానంటాడు. ఆయన ఏది చెబితే అదే వార్తన్నట్లు పచ్చమీడియా డప్పు కొడుతుంది స్వామీ అని చెప్పాడు. వేంకటేశ్వరస్వామి వారితో... చంద్రబాబు మాటలతో మీరంతా ఎఫెక్ట్‌ అవుతున్నారు బాగానే వుంది... మరి ఈ ట్రంప్‌ ఎందుకొచ్చినట్లు అని అడిగాడు. అప్పుడు ట్రంప్‌... నాకు తండ్రితో సమస్య లేదు స్వామి... వచ్చిన తలనొప్పంతా కొడుకు లోకేష్‌తోనే. ఇటీవల అమెరికాకు వచ్చిన ఆయన... అమెరికాలోనూ తెలుగుదేశాన్ని అధికారంలోకి తెస్తానని చెప్పాడు. అప్పటి నుండి నాకు భయం పట్టుకుంది. ఆ అబ్బాకొడుకులను మా అమెరికా వైపు చూడకుండా చేయండి స్వామి అని వేడుకున్నాడు. అంతలో లోపల నుండి పద్మావతి దేవి పరుగెత్తుకొచ్చింది... స్వామీ ఈ విచిత్రం చూసారా అంటూ టచ్‌స్క్రీన్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ టీవీ ఛానెల్‌ 9I9=99 ఛానెల్‌ పెట్టింది. విజయవాడలో తెలుగుదేశం మహానాడు... తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ... తిరుమల వెంకన్న అసలు పేరేంటో తెలుసా ''నారా వెంకన్నచౌదరి''... ఆయనను శిలగా మలచింది, ఆయనకు దేవుడి హోదా ఇచ్చింది మన చంద్రన్నచౌదరినే... మన చంద్రన్న చౌదరి కాంతితోనే ఆ వెంకన్నచౌదరి వెలిగిపోతున్నాడు... అని చెప్పాడు. ఆ మాటలకు శ్రీనివాసుడు కళ్ళు తిరిగి అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు.

Page 1 of 50

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter