galpikaపట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌ థర్టీకల్లా నిద్ర లేచాడు. అంతకుముందురోజే సెల్‌ ఫోన్‌లో ప్రధాని మోడీ యోగ విన్యాసాలు చూసి వుండడంతో నిద్రలేవగానే వాటిని ఫాలో అయ్యాడు. ఈ పరంపరలో శీర్షా సనం వేయగా కాళ్ళ సందులో తలకాయ ఇరుక్కుపోయింది. ఆ ఆసనాన్ని ఎలా విప్పాలో తెలియలేదు. ఈలోపు ఎక్కడి కక్కడ బిగించినట్లుండడంతో భయంతో కేకలు పెట్టాడు. ఆ కేకలకు హోటల్‌ సిబ్బంది పరుగునవచ్చి ఆయన కాళ్ళు, చేతుల నుండి తలను విడిపించారు. బుద్ధుంటే వీడియోలు చూసి యోగాస నాలు వేయకూడదనుకున్నాడు. తర్వాత కాలకృత్యాలు ముగించుకుని, మూలాపేట సెంటర్‌లో మటన్‌ బిర్యాని తిని, మద్రాసు బస్టాండు వద్దకొచ్చి ఆటో ఎక్కి పెద్దాసు పత్రి వద్ద దిగాడు. ఆసుపత్రిలోని మార్చురీ గదిలోకి వెళ్ళి స్మెల్‌ లేని శవాన్ని భుజాన వేసుకుని బోడిగాడుతోటలోని రోటరీ క్లబ్‌ శ్మశాన వాటిక వైపు నడవ సాగాడు. విక్రమార్కుడు పెద్దాసుపత్రి మెయిన్‌గోటు దాటేలోపలే బాడీలోని భేతాళుడు.. హౌ ఆర్‌ యు విక్రమ్‌ అంటూ పలుకరించాడు. ఆ పలక రింపుకు విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి భేతాళా ఈరోజు నన్ను ఎక్కువ దూరం నడిపించకుండానే సీన్‌లోకి వచ్చావ్‌. రోజూ నన్ను మూడు కిలోమీ టర్లయినా నడిపించి చెమటలు కక్కించ నిదే నీ శాడిజం తగ్గదుకదా... ఈరోజేం, దయతలచావ్‌ అని అడిగాడు. అందుకు భేతాళుడు... రాత్రి సాకర్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు చూస్తూ అలాగే మేలుకుని వుండిపోయాను. ఇక ఎలాగూ ఇప్పుడు నువ్వొస్తావుకదా అని ఎదురుచూస్తు న్నాను. చంద్రబాబు లాంటి ప్రజాసంక్షేమ పాలకుడు రాజ్యాన్ని ఏలుతున్న కాలంలో కూడా నువ్వు పడుతున్న కష్టాన్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీకు శ్రమ తెలియ కుండా ఉండేందుకు ఇంటర్నేషనల్‌ స్టోరీ ఒకటి చూపిస్తాను, అలా ఆర్‌ అండ్‌ బి బంగ్లాలోకి పద అని చెప్పాడు. ఇద్దరూ ఆర్‌ అండ్‌ బి బంగ్లాలోకి వెళ్ళి సోఫాలో కూలబడ్డారు. భేతాళుడు ల్యాప్‌టాప్‌ తీసి ట్రంప్‌, కిమ్‌ మీట్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసాడు. స్క్రీన్‌ మీద సీన్‌లు మొదలయ్యాయి.

----

అమెరికాలోని శ్వేతసౌధం. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పెద్ద స్క్రీన్‌ వుంది. దానిపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ వున్నాడు. ట్రంప్‌ అతని వైపు సీరియస్‌గా చూస్తూ...'' కిమ్‌ నీ పిచ్చి వేషాలు ఇక చాలించు... ఈ ప్రపంచానికి నేనే పెద్దతోపు... నీ అణుపరీక్షలు ఇక ఆపు'' అని హెచ్చరించాడు. అవతలవైపు నుండి కిమ్‌... ''ఫ్లూటు జింక ముందు ఊదు... ఈ సింహం ముందు కాదు'' అని వ్యంగ్యంగా అన్నాడు. అది విని ట్రంప్‌ ఆవేశంతో... నాకు తిక్కుంది, దానికో లెక్కుంది అని చెప్పాడు. వెంటనే కిమ్‌.. నీ తిక్కకు లెక్కన్నా వుంది... నాకు లెక్కలేనంత తిక్కుంది. దాంతో పెట్టు కుంటే నీకే చిక్కు అని అన్నాడు. వెంటనే ట్రంప్‌.. నేను గట్టిగా తొడ చరిచానంటే ఆ సౌండ్‌కే గుండాగి చస్తావు అని అరిచాడు. అందుకు కిమ్‌... ఈ తొడలు చరిచే అలవాటు ఎక్కడ నేర్చుకున్నావ్‌... హీరో బాలకృష్ణను చూసి నేర్చుకున్నావా అని గేళి చేస్తున్నట్లు అన్నాడు. దానికి ట్రంప్‌కు కోపం మోకాల్లోకి వచ్చి... చూడు నన్ను ఒకవైపే చూడు... రెండో వైపు చూడాలనుకోవద్దు తట్టుకోలేవ్‌... అంటూ అరిచాడు. అందుకు కిమ్‌... కత్తులతో కాదు... కంటి చూపుతో నిన్ను, నీ దేశాన్ని నాశనం చేస్తా అని సవాల్‌ విసిరాడు. దానికి ట్రంప్‌ చూసుకుం దామా... సై చౌడక్కా అని తొడ కొట్టాడు. కిమ్‌ కూడా సైరా సమరవీరా అంటూ బొటన వేలు చూపాడు. ట్రంప్‌... కిమ్‌లు వీరావేశంలో వున్న ఫోటోల మీద 'ఇంటర్వెల్‌' అని అక్షరాలు పడ్డాయి.

భేతాళుడు పార్ట్‌ సెకండ్‌ ఫైల్‌ ఓపెన్‌ చేయడంతో మళ్ళీ స్క్రీన్‌ పై సీన్‌లు మొదలయ్యాయి.

----

అది సింగపూర్‌లోని ఓ హోటల్‌. ట్రంప్‌ పూలబొకే చేతిలో పట్టుకుని గేటు బయట నిలుచుని వున్నాడు. అప్పుడే కొన్ని కార్లు వచ్చి ఆగాయి. అందులో నుండి కిమ్‌ దిగాడు. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్‌... ''ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురవుతుంటే... ఇంకా తెల వారదేమీ... ఈ చీకటి విడిపోదేమీ'' అనే పాట రాసాగింది. కారు దిగిన వెంటనే కిమ్‌ పరుగున వెళ్ళి ట్రంప్‌ను కౌగి లించుకున్నాడు. ట్రంప్‌ తన చేతిలో బొకేను కిమ్‌ చేతిలో పెట్టి అలవాటు ప్రకారం బాగా బలిసావు అంటూ పిర్ర మీద కొట్టాడు. తర్వాత లోపలకు వెళ్ళారు. ఇరువురూ శాంతి చర్చలు జరిపారు. మనం మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు, జీసెస్‌ ఆశయాల బాటలో పయనిద్దాం. ఒక చెంపన కొడితే రెండో చెంపను చూపిద్దాం... అని తీర్మానించారు. ప్రపంచ శాంతి కోసం నేను అణ్వస్త్రాలు విసర్జిస్తానని కిమ్‌ ప్రమాణం చేశాడు. ప్రపంచ శాంతి కోసం నువ్వు చేస్తున్న త్యాగానికి ప్రతి ఫలంగా మీ దేశ రక్షణను నేను బాధ్యతగా తీసుకుంటానని ట్రంప్‌ హామీ ఇచ్చాడు.

ఇక్కడితో సీన్‌లు అయిపోయాయి. భేతాళుడు లాప్‌ట్యాప్‌ మూసేసి... రాజా ఇప్పుడు చెప్పు... మొదటి పార్ట్‌లో పర స్పరం ఒకర్నొకరు నరుక్కునేంత కసితో వ్యవహరించిన ట్రంప్‌, కిమ్‌లు సెకండ్‌ పార్ట్‌లో అంత శాంతికాముకులుగా ఎలా మారిపోయారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావో పిఆర్‌సి మంజూరైనా చేతికి డబ్బులు రాని ఏపి ఉద్యోగిలా మానసిక క్షోభకు గురవుతావని హెచ్చ రించాడు. దానికి విక్రమార్కుడు... వాళ్ళిద్దరి భేటీ వెనుక ఒక అదృశ్య శక్తి వుంది. ఆ శక్తి పేరే హైటెక్‌రత్న చంద్ర బాబు. ట్రంప్‌, కిమ్‌ల రెచ్చగొట్టే ప్రకట నలతో ప్రపంచం ప్రమాదంలో పడుతోం దని ఆయన గ్రహించాడు. వాళ్ళిద్దరినీ దారిలో పెట్టాలనుకున్నాడు. అందుకే ఒక వార్నింగ్‌ పంపాడు. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు అణుబాంబులు వేసుకో వడం కాదు... మీరు దారికొచ్చి శాంతి ఒప్పందం చేసుకోకపోతే మీ రెండు దేశాల మీదకు మా ఐఆర్‌ 20-420 నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలను పంపిస్తా... బ్రతికి నంత కాలం ఛస్తూ బ్రతుకుతుంటారు అని హెచ్చరించాడు. ఆ దెబ్బకు భయపడే వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు అని చెప్పాడు. ఆ సమాధానానికి సంతృప్తి చెందిన భేతాళుడు బాడీని అక్కడే వదిలేసి 'బార్‌'కు దూసుకుపోయాడు.

galpikaఉండవల్లిలోని హైటెక్‌ రత్న చంద్రబాబు నివాసం. రాజమౌళిని తీసుకుని అమరావతి పరిసరాలన్నీ చూపించి, ఎక్కడ కోటలు రావాలి, ఎక్కడ కందకాలు తవ్వాలి, ఎక్కడ అశ్వదళాలు, గజదళాల శాలలు నిర్మించాలన్న దానిపై ఆయనకు సూచనలిచ్చి చంద్రబాబు అప్పుడే వచ్చాడు. హాల్‌లో కూర్చుని టీవీ ఆన్‌ చేసాడు. ఆ క్షణంలో ఆయనకు మనిషన్నాక కూసంత కళాపోషణ వుండాలి, లేకుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏటుంటాది అనే ముత్యాలముగ్గు సినిమాలోని రావుగోపాలరావు డైలాగ్‌ గుర్తుకొచ్చింది. బాడీలో ఏబిసిడి విట మిన్‌లు లోపించినట్లే ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే విటమిన్‌ లోపించినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదని భావించిన చంద్రబాబు ఏదన్నా సినిమా చూసి తరిద్దామని 'మా' టీవీ ఛానెల్‌ పెట్టాడు. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సీమటపాకాయ్‌' సినిమా వస్తుంది. అందులో ఓ సన్నివేశం... అమెరికా నుండి బ్రహ్మానందం తన భార్య, కూతురును వెంటబెట్టుకుని పెద్ద కోటీశ్వరుడైన తన బావ షియాజీషిండే ఇంటికి వస్తాడు. అల్లరి నరేష్‌ అతని కొడుకే! ఆ పెద్ద భవంతిలో షియాజీషిండే, అతని భార్య సుధ, కొడుకు అల్లరి నరేష్‌, మిగతా కుటుంబసభ్యులు పనిమనుషుల్లాగా వుంటారు. పని మనుషులుగా వుండే ఎల్‌.బి.శ్రీరాం, గీతా సింగ్‌లు ఓనర్లుగా కనిపిస్తారు. ఏమైందిరా, ఇంత బికారులు ఎలా అయ్యారురా అని బ్రహ్మానందం అడుగుతాడు. అందుకు అల్లరి నరేష్‌... రాత్రి డ్రైవర్‌తో నాన్న పేకాట ఆడాడు. జోకర్‌ అతనికి పడింది, ఆస్తి మొత్తం అతనికే పోయింది అని చెబుతాడు. ఈ సీన్‌ చూసిన చంద్రబాబు పకపక నవ్వుతూ... నిజజీవితంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారేమోననుకుని, ఈరోజు విశేషా లేంటో చూద్దామని ఏబిఎఫ్‌ న్యూస్‌ ఛానెల్‌ పెట్టాడు. స్క్రీన్‌పై ఐ.టి మంత్రి లోకేష్‌ కనిపించేసరికి చంద్రబాబు ఆసక్తిగా ఆందోళనగా చూడసాగాడు. వీడేం మాట్లాడి ఏం నెత్తి మీదకు తెస్తాడోనని ఆయన బిత్తరబిత్తరగా వున్నాడు.

లోకేష్‌ ప్రెస్‌మీట్‌... ప్రతి ఏడాది ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా ఆస్తులు ప్రకటించడానికే మీడియాను పిలిచాను. మాది చాలా పేదకుటుంబం... నేను పాలు అమ్ముకుంటే, మా నాన్న జున్ను, లస్సీ, మజ్జిగ అమ్ముతున్నారు. మా అమ్మ తోటకూర, పాలకూర కట్టలు, నా భార్య కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే మేం బ్రతుకుబండిని నెట్టుకొస్తున్నాం. పాలు అమ్మగా వచ్చిన ఆదాయంతోనే దేవాన్ష్‌కు పాల డబ్బాలు కొంటున్నాం. ప్రతి నెల రేషన్‌షాపులో రెండు రూపాయల బియ్యం కొంటూ నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. ప్రతి ఏటా చంద్రన్న కానుక ఇస్తుండబట్టి సంక్రాంతి పండక్కి అరిసెలు చేసుకోగలుగుతున్నాం. ఏదో రూపాయి రూపాయి కూడబెట్టి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఫ్లాట్లు, ఒక ఇల్లు, హెరిటేజ్‌ ఫ్యాక్టరీ కట్టుకున్నాం. అన్నీ అమ్ముకోగా, తెచ్చిన అప్పులు పోగా నా ఆస్తి 13కోట్లు అని చెప్పాడు.

అది వినగానే చంద్రబాబు షాక్‌ తిన్నాడు. వెంటనే భువ నేశ్వరి, బ్రాహ్మణి అంటూ కేకేసాడు. ఏమైందండి అంటూ భువ నేశ్వరి, మామగారు అంటూ బ్రాహ్మణి పరుగెత్తుకుంటూ వచ్చారు. చంద్రబాబు వారితో... ఏం చేస్తున్నాడు వాడు, పేకాట ఆడుతు న్నాడా, ఇంకేమైనా చేస్తున్నాడా... తెలివైన వాడని లోకేష్‌కు బాధ్యతలు అప్పగిస్తే ఆస్తులను కర్పూరంలా కరిగించేస్తాడా... అని ఆవేశపడసాగాడు. అసలు ఏం జరిగిందండి అని భువనేశ్వరి అడిగింది. ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు 300 కోట్లు వున్న ఆస్తులను ఇప్పుడు 13కోట్లకు తెచ్చాడు. ఎక్కడ పేకాట ఆడి ఈ ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడో... వచ్చాక నిలదీసి అడగండి అని బాధ్యతగల తండ్రిగా చెప్పాడు. అప్పుడే నైట్‌రైడర్‌, ముదురుదోమల శాఖ మంత్రి పి.నారాయణ అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. సార్‌, వరల్డ్‌ రిచ్చెస్ట్‌ పర్సన్స్‌ అందరూ మన లోకేష్‌ను ఆదర్శంగా తీసుకుని ఆస్తులు ప్రకటిస్తున్నారు. ఒక్కసారి 'టైమ్స్‌ నౌ' ఇంగ్లీష్‌ ఛానెల్‌ పెట్టండి అని అడిగాడు. ప్రపంచ కుబేరులందరూ లోకేష్‌ను ఐకాన్‌గా తీసుకోవడమేంటనుకుంటూ చంద్రబాబు ఆ ఛానెల్‌ పెట్టాడు.

ప్రపంచంలో మేటి కోటీశ్వరుడు బ్రూనైసుల్తాన్‌ ఆస్తుల ప్రకటన... పాడుబడిన కోట పాతిక లక్షలు, తుప్పు పట్టిన విమానాలు నాలుగు 10లక్షలు, పది హెలికాఫ్టర్‌లు, నాలుగు వేల ఎకరాల భూములు, వెయ్యి కిలోల బంగారం... అంతా కలిపి నా ఆస్థి విలువ నాలుగు కోట్లు...

ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం ఆలీబాబా...

చిరిగిన చొక్కాలు పది, కుట్లు పిగిలిన ఫ్యాంట్లు పాతిక, 30 దేశాలలో ఇండస్ట్రీస్‌, 300 బ్యాంకులలో అకౌంట్లు, నాలుగు టన్నుల గోల్డ్‌, 10వేల ఎకరాల పొలాలు, మొత్తం ఆస్థి విలువ 4.15 కోట్లు...

ఐ.టి దిగ్గజం బిల్‌గేట్స్‌...

రంగులు వెలసిన ఇల్లు, అన్ని దేశాలలోనూ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, పది జతల బట్టలు, నాలుగు జతల బూట్లు, ఒక పెంపుడు కుక్క... మొత్తం ఆస్థి విలువ 10.24 కోట్లు.

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబాని...

రెండు విమానాలు, నాలుగు హెలికాఫ్టర్‌లు, రెండు రాష్ట్రాలలో చమురు కంపెనీలు, నాలుగు రాష్ట్రాలలో విద్యుత్‌ ప్రాజెక్టులు, 29 రాష్ట్రాలలో మాల్స్‌, ముంబైలో 30 అంతస్థుల భవనం... అన్నీ కలిపి ఆస్థి విలువ 7.24కోట్లు.

టీవీలో ఇక్కడితో ఆస్తుల ప్రకటనలు ముగిసాయి. న్యూస్‌ రీడర్‌ మళ్ళీ అదే అంశాన్ని కొనసాగిస్తూ... వీళ్ళంతా స్వచ్ఛంధంగా ఆస్తులు ప్రకటించడానికి ముఖ్య కారణం ఏపి ఐ.టి మంత్రి లోకేష్‌. ఎంత ఎదిగినా ఒదిగి వుండాలని, ఎన్ని కోట్లు సంపాదించినా తిండికి టికానా లేనట్లే వుండాలన్న ఆయన నిరాడంబర సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుని తమ ఆస్తులను ప్రకటించినట్లు ఈ ప్రపంచ కుబేరులందరూ పేర్కొన్నారు. లోకేష్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది కుబేరులు తమ ఆస్తులు ప్రకటించడానికి ముందుకొస్తున్నారు అంటూ న్యూస్‌ రీడర్‌ ముగించింది. అదంతా విన్న చంద్రబాబు మనసులో తండ్రిని మించిన తనయుడవని పించుకున్నావు, గ్రేట్‌ లోకేష్‌ అంటూ అభినందించాడు.

galpikaజనవరి 13వ తేదీ... వేకువజామున 4గంటలు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం. మోడీతో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, మనో హర్‌ పారికర్‌, ప్రకాశ్‌జవదేకర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఉన్నారు. వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో అక్కడ భోగి మంట ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని కట్టెలు పేర్చి వెంకయ్య నిప్పుపెట్టాడు. మంట రేగింది. అందరూ దాని చుట్టూ చేరి చలికాచుకో సాగారు. మోడీ వుండి... వెంకయ్యాజీ ఈ భోగి మంటల్లో ఏమేం వేస్తారు అని అడిగాడు. మనం వాడి పక్కనపడేసిన వస్తువులు వేస్తారని చెప్పాడు. వెంటనే మోడీ అరుణ్‌జైట్లీని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. అరుణ్‌జైట్లీ అక్కడనుండి వెళ్లిపోయాడు. పది నిముషాలలో మళ్ళీ ఓ లారీతో వచ్చాడు. వెంకయ్య అది చూసి ఈ లారీ ఏంటని అడిగాడు. దాని నిండా పాత వెయ్యి, ఐదొందల నోట్లున్నా యని, ఎలాగూ అవి చెల్లకుండా పోయాయి కాబట్టి వాటిని భోగి మం టలో వేద్దామని మోడీ అన్నాడు. అరుణ్‌ జైట్లీ అందుకుని... మన బోగి మంటకే కాదు, ప్రజలందరి బోగి మంటలకు పం పిణీ చేద్దామన్నాడు. అప్పుడు వెంకయ్య... సార్‌, జీవితాంతం పాలిచ్చి ఒట్టిపోయిన ఆవులను కబేళాలకు తరలించడాన్నే మనం వ్యతిరేకిస్తుంటాం, అలాంటిది ఇన్నేళ్ల పాటు మన అవసరాలు తీర్చిన ఈ పాత నోట్లను మనమే తగలబెట్టడం భావ్యం కాదు. బోగి మంటకని మా ఊరు చౌటపాలెం నుండి స్పెషల్‌ ఫ్లైట్‌లో తాటాకులు తెప్పించాను. మా ఊరు తాటాకులతో బోగి మంట వేస్తేగాని నాకు తృప్తి వుండదు అని, తాటాకు తేవడానికి తన ఇంటివద్దకు వెళ్లాడు.

---------

అమరావతిలో సీఎం క్యాంపు కార్యా లయం. హైటెక్‌రత్న చంద్రబాబు, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, పి.నారా యణ, పీతల సుజాత, పరిటాల సునీతలు బోగి మంట వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అక్కడ కట్టెలు, తాటాకులు వంటివి లేవు. సార్‌, బోగి మంట వేయడానికి సరంజామా ఏదని దేవినేని ఉమ అడి గాడు. అంతలోనే డబడబ మనే శబ్దంతో హెలికాఫ్టర్‌ అక్కడ దిగింది. అందులో నుండి తాటాకులు, ఆవుపేడ పిడకలు దించారు. ఇదెక్కడ నుండి తెప్పించార్సార్‌ అని పత్తిపాటి పుల్లారావు అడిగాడు. అందుకు చంద్రబాబు... మా నారావారి పల్లె నుండి తెప్పించాను. అవి మా తాటి చెట్ల ఆకులే. అవి మా ఆవుల పేడతో చేసిన పిడకలే! వాటితో బోగి మంట వేసుకుని చలికాచుకుంటే ఆ ఆనందమే వేరు అని అన్నాడు. అది విన్న పి.నారా యణ, హెలికాఫ్టర్‌లో పిడకలు, తాటా కులు తెప్పించి బోగిమంట వేసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచి పోతార్సార్‌ అంటూ కీర్తించాడు.

----------------

ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ముదురుదోమలకు నెలవైన నెల్లూరు. విఆర్‌సి మైదానంలో రాజకీయ నాయకుల సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు జరిగాయి. స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకానందరెడ్డి(66) ఆనం రామనారా యణరెడ్డి, సింహపురి చాణిక్య సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కురుగొండ్ల రామ కృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, కిలివేటి సంజీవయ్య, సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, పి.సురేంద్రరెడ్డి, పి.దశరథరామయ్య, పి.మోహన్‌రావు వంటి అన్ని పార్టీల నాయకులు అక్కడ వున్నారు. మహిళా నాయకురాళ్ళు ఓ పక్క ముగ్గులు వేసు కుంటున్నారు. ఓ పక్క వివేకా భోగిమంట కోసం తాటాకులు పేర్చాడు. దాని మీద పచ్చగడ్డి పరిచాడు. అది చూసి నారా యణ, ఆదాలలు... వివేకా, ఇక్కడ కూడా ఎకసెక్కాలేనా... పచ్చిగడ్డి ఎలా మండుద్ది అని అడిగాడు. దానికి ఒక స్పెషల్‌ ఎఫెక్ట్‌ను అరేంజ్‌ చేసాలే... చూస్తూ ఉం డండి ఎలా మంట అంటుకుంటుందో నని చెప్పాడు. ఏంటో, ఈ వివేకా ఈ జీవితానికి అర్ధంకాడు అని ఆదాల తల గోక్కోసాగాడు. భోగిమంట సెట్టింగ్‌ పూర్త య్యాక వివేకా రెడీ వన్‌, టూ, త్రీ అని అరిచాడు. భోగిమంట సెట్టింగ్‌కు ఓ వైపు నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఇంకోవైపు నుండి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వచ్చారు. అటు సోమిరెడ్డి... ఇటు కాకాణి... మధ్యలో బోగి మంటకు రెడీగా పెట్టిన పచ్చిగడ్డి... వీళ్లిద్దరూ ఒకర్నొ కరు... కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్నట్లు కోపంగా చూసుకో సాగారు. అంతే వాళ్ల చూపుల సెగకు అక్కడున్న పచ్చగడ్డి ఒక్కసారిగా భగ్గున మండింది. వీళ్లిద్దరి మధ్య వున్న రాజకీయ వైరాన్ని వివేకా ఈ విధంగా ఉపయో గించుకున్నాడా... ఔరా ఇతని తెలివి తగలెయ్యా అని అందరూ నోరెళ్ళబెట్టారు. తర్వాత నాయకులకు బొంగరాలాట, బిళ్లంకోడు, దాగుడుమూతలు, గాలి పటాలు ఎగరేయడం వంటి పోటీలు కూడా జరిగాయి. చివరగా కోడిపందే లకు వచ్చారు. తెలుగుదేశం నుండి సోమిరెడ్డి పెంచిన కోడిని, వైకాపా వైపు నుండి కాకాణి కోడిని పందేనికి సిద్ధం చేసారు. సోమిరెడ్డి చేతిలో వున్న కోడిని వివేకా ప్రేమగా నిమురుతూ.. మన కోడికి బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు బాగా తినిపించారా అని అడిగాడు. దానికి సోమిరెడ్డి... ఒక్క పప్పులేంటి, అది ఏం కావాలంటే అది తినిపించాను. పిజ్జా, బర్గర్‌లు కూడా పెట్టించాను. డోప్‌ టెస్టుల్లో దొరికిపోతుందేమోనన్న ఆలోచనతో మద్యాన్ని మాత్రం తాగించలేదన్నాడు. ఓకే వెరీగుడ్‌, బెస్టాఫ్‌ లక్‌ అంటూ కోడి కాలికి షేక్‌హ్యాండిచ్చి... ఈ పందెంలో డబ్బంతా మనకే వస్తుందని వివేకా నమ్మ కంగా చెప్పాడు. అది విని సోమిరెడ్డి... నేనిప్పుడు డబ్బుల కోసం పందెం ఆడడం లేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. అకస్మాత్తుగా వచ్చిపడ్డ వెయ్యికోట్లను ఏం చేసుకోవాలో తెలియక సతమతమవుతు న్నాను. ఒకవేళ పందెంలో డబ్బు వచ్చినా అది పేదల కోసమే ఇచ్చేస్తాను. కేవలం కాకాణి కోడి మీద గెలుపు కోసమే నేను ఈ పందెంలో దిగుతున్నానని చెప్పాడు. తర్వాత ఆదాల మధ్యవర్తిత్వంగా ఇరు వురి కోళ్లపై నాయకులు లక్ష నుండి 10 లక్షల దాకా పందేలు కడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు సోమిరెడ్డి కోడి మీద, వైకాపా వాళ్ళు కాకాణి కోడి మీద భారీగా పందేలు కాసారు. వివేకా మాత్రం ఆదాల వద్దకు వెళ్లి సోమిరెడ్డి కోడి మీద లక్ష, కాకాణి కోడి మీద లక్ష అంటూ పందెం కాసాడు. ఆదాల ఆశ్చర్యంగా... అదేంటి, ఎవరైనా ఒక కోడి మీద పందెం కడతారు, నువ్వేంటి రెండు కోళ్ల మీద బెట్టింగ్‌ పెట్టావ్‌... దీనివల్ల ఉపయోగ మేముందన్నాడు. కోళ్ల పందేలలో నేనూ పాల్గొనాలనేది నా సరదా! అలాగని నా డబ్బులు పోకూడదు. అందుకని రెండు కోళ్ల మీద పందెం కట్టాను. ఏ కోడి గెలిచినా నా కోడి గెలిచిందని సంతోషపడ తాను అని చెప్పాడు. ఆ లాజిక్‌ విని ఆదాలకు బుర్ర గిర్రున తిరిగింది. పందేల తంతు ముగిసాక సోమిరెడ్డి, కాకాణిలు తమ కోళ్లను రెచ్చగొట్టి బరిలోకి దించారు. అందరూ వాటి మధ్య జరిగే భయంకరమైన ఫైటింగ్‌ కోసం ఆసక్తిగా చూడసాగారు. కాని ఆశ్చర్యంగా ఆ రెండు కోళ్లు... కొక్కరోక్కో అంటూ అరుచు కుంటూ ఒకదానితో ఒకటి మెడ మెడ రాసుకుంటూ స్నేహంగా ఉండసాగాయి. అది చూసి అందరికీ మతిపోయింది. ఈ కోళ్లకు ఏమైంది... పౌరుషం చచ్చిందా... ఒంట్లో రక్తం చల్లబడిపోయిందా అని అందరూ గట్టిగా అరిచారు. అప్పుడు అక్కడున్న వారి మధ్యలో నుండి సినీ నటుడు ఆలీ వచ్చాడు. అందరూ ఆశ్చ ర్యంగా అతనిని చూస్తుండగా... ఆలీ అందరితో... ఈ దారిన పోతూపోతూ ఈ పోటీలను చూద్దామని వచ్చాను. నాకు కోడి బాష తెలుసు. ఆ రెండు కోళ్లు ఏం మాట్లాడుకున్నాయో తెలుసా? ఈ నాయ కులు ఈరోజు తన్నుకుంటారు, రేపు కలిసిపోతారు. వీళ్ల పంతాలు, పందేల కోసం మనల్ని మనం ఎందుకు చంపు కోవాలి. ఇద్దరం రాజీ పడదాం అని చెప్పుకున్నాయి, అందుకే అవి తన్నుకోలేదు, అవి చూపిన స్ఫూర్తితోనైనా మీరు కలిసి మెలసి ఉండండి అని చెప్పాడు. ఔరా! కోళ్లకు కూడా రాజకీయ నాయకుల నైజం గురించి తెలిసిపోయిందా? అంటూ అక్క డున్నవాళ్లు నోరెళ్లబెట్టారు.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter