congressరాజకీయాలలో ఉంటే రాజులా వుండాలి. లేదంటే రాజు అన్యాయాలను, అక్రమ పరిపాలనను ఎదురించే పోరాట యోధుడిలా వుండాలి. అంటే ప్రతిపక్షం అన్నమాట. ఈ రెండుపాత్రలు తప్పితే భారత రాజకీయాలలో ఇంకే పాత్రయినా నిరర్ధకమే!

గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో రాజకీయ చర్చకు కారణమైన కర్నాటక సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడి ప్రమాణస్వీకారం తంతును కూడా పూర్తి చేసింది. ఇరు పార్టీల మధ్య మంత్రి పదవుల పంపిణీ కూడా సజావుగానే జరిగింది. కర్నాటక రాజకీయాలలో కింగ్‌మేకర్‌ అవుతాడనుకున్న జెడి(ఎస్‌) అధినేత కుమారస్వామి ఏకంగా కింగే అయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ కర్నాటక పీఠం బీజేపీకి దక్కకూడదన్న సోనియాగాంధీ లక్ష్యమే కుమారస్వామికి లక్షణంగా సీఎం కుర్చీని అప్పగించింది.

మొదట గవర్నర్‌ పిలుపు ప్రకారమే బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆయనకు బల నిరూ పణకు గవర్నర్‌ 15రోజులు గడువు ఇచ్చినా, సుప్రీం కోర్టు రూపంలో యడ్యూరప్పకు అపశకునం ఎదు రైంది. కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు యడ్యూరప్ప బలనిరూపణకు ఒకరోజే గడువు ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. విపక్షాల ఎమ్మెల్యేలను క్యాంపులు పెట్టి మరీ కట్టడి చేయడంతో తగినంత సంఖ్యా బలం లేక బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సివచ్చింది. ఆయన రాజీనామా చేయగానే కాంగ్రెస్‌తో పాటు ఆయా ప్రాంతీయపార్టీల నేతలు ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టిందని, రాజ్యాంగ విలువలను సుప్రీంకోర్టు కాపాడిందంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్టేట్‌ మెంట్లిచ్చారు. ఇలా ప్రజాస్వామ్య విలువలు గురించి ప్రవచనాలు చెప్పిన వారిలో తన రాష్ట్రంలో విపక్షానికి చెందిన ముగ్గురు ఎంపీలను, 23మంది ఎమ్మెల్యేలను రిటైల్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా వుండడం గమనార్హం.

కర్నాటకలో ఇంతవరకు ముగిసింది ఒక ఎపిసోడ్‌ మాత్రమే! ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన పాత్రే తనంతట తానుగా ఆత్మహత్యకు బాటలు వేసుకున్నట్లుగా వుంది. బీజేపీని నిలువరించడం కోసం జెడి(ఎస్‌)కు కాంగ్రెస్‌ మద్దతు పలికింది. అంటే కర్నాటకలో అధికారపక్షం కాకపోగా కనీసం ప్రతిపక్ష పార్టీ పాత్రను కూడా తనంతట తాను వదులుకుంది. కుమారస్వామి మంత్రి వర్గంలో కాంగ్రెస్‌కు విదిల్చింది ముష్టి మంత్రిపదవులే! అసలు అధికారం ముఖ్యమంత్రిదే! కాబట్టి కర్నాటకలో వుండేది జెడి(ఎస్‌) ప్రభుత్వమే అవుతుంది.

యడ్యూరప్ప రాజీనామా చేయగానే కర్నాటకలో ప్రజాస్వామ్యం తిరిగి ప్రాణం పోసుకుందంటున్నారు. ఏ విధంగా ప్రాణం పోసుకున్నట్లు? కర్నాటక ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి, తిరస్కరించిన పార్టీకి అధికారం అప్పగించింది కాంగ్రెస్‌. ఇదేనా ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవడం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, జెడి(ఎస్‌)ల మధ్య పొత్తులేదు. ఎవరికి వాళ్ళే విడివిడిగా పోటీ చేసారు. ఎన్నికల ప్రచారంలోనూ ఒకరిపై ఒకరు ఘాటుగానే విమర్శలు చేసుకున్నారు. ఇరు పార్టీలు కూడా అన్ని స్థానాలలో పోటీచేసాయి. ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీకి 104సీట్లొచ్చి పెద్దపార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 78సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇక అన్నిచోట్ల పోటీ చేసిన జెడి(ఎస్‌) 38స్థానాలలో మాత్రమే నెగ్గింది. అది కూడా ఆ పార్టీకి వచ్చిన సీట్లన్నీ దాదాపు ఒక ప్రాంతంలోనివే! సీట్ల పరంగా చూస్తే ప్రజలు బీజేపీని ఆదరించారు. ఓట్ల పరంగా చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్‌కు అదనంగా రెండు శాతం ఓట్లొచ్చాయి. అంటే అన్ని ప్రాంతాలలో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించ లేదు. కర్నాటక ప్రజల తీర్పు బీజేపీ లేదా కాంగ్రెస్‌లకు అనుకూలంగా వుండింది. జెడి(ఎస్‌) దాదాపు 150సీట్లలో మూడోస్థానంలో వుండడమో, డిపాజిట్లు కోల్పోవడమో జరిగింది. జెడి(ఎస్‌)ను కర్నాటక ప్రజలు అధికారంలో వుండాలని కోరుకోలేదు. కుమారస్వామిని ముఖ్యమంత్రిగా కోరుకోలేదు. ప్రజలు కోరుకోని దానిని కాంగ్రెస్‌ ప్రజల మీద రుద్దింది. కర్నాటకలో కాంగ్రెస్‌ తొందరపడి జెడి(ఎస్‌)కు మద్దతు తెలిపివుండ బల్లేదు. తమకు మద్దతునివ్వమని అడిగి వుండొచ్చు. కుమారస్వామికి డిప్యూటి సీఎంను ఆఫర్‌ చేసి ఉం డొచ్చు. ఒకవేళ జెడి(ఎస్‌) తమతో రాకుండా బీజేపీతో వెళ్ళివుంటే హూందాగా ప్రతిపక్ష పాత్రను స్వీకరించి ఉండొచ్చు. ఇప్పుడు కర్నాటకలో పూర్తిగా అధికారం లేక, అటు ప్రతిపక్షంగా లేక కాంగ్రెస్‌ పరిస్థితి రెంటికీ చెడిన రేవడి అయ్యింది.

ఒకపక్క కాంగ్రెస్‌ ఒక్కో రాష్ట్రంలో కనుమరు గవుతూ పోతుంది. ఈరోజు ఆ పార్టీకి ఉండేది రెండే రెండు రాష్ట్రాలు పంజాబ్‌, మణిపూర్‌. మరో పక్క బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటూ పోతోంది. బీజేపీ లక్ష్యం ఒక్కటే! ఏ రాష్ట్రంలోనైనా అధికారాన్ని సాధించడమా లేకుంటే ప్రతిపక్షంగానైనా ఉండడమా? ఈరోజు దేశంలో 20రాష్ట్రాలలో ఆ పార్టీ సొంతంగా లేదా భాగస్వామ్య పార్టీలతో అధికారంలో వుందంటే కారణం కొడితే అధికారం లేదంటే ప్రతిపక్షంగా పోరాటం అనే మార్గాన్ని అనుసరించడమే. కాబట్టే ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ జెండా కనపడడమే గగనం అనుకున్న రాష్ట్రాలలోనూ ఈరోజు ఆ పార్టీ అధికారంలో వుందంటే వారు అనుసరించిన మార్గమే దానికి కారణం. కమ్యూనిష్టు కంచుకోటలు పశ్చిమబెంగాల్‌, కేరళలోనూ ఆ పార్టీ ఎదుగుతుందంటే కారణం... టార్గెట్‌ అధికారమే కాదు, ప్రతిపక్షంగానైనా వుండాలన్న తపన కూడా! బీజేపీ ఎంచుకున్న మార్గానికి భిన్నంగా కాంగ్రెస్‌ పయనిస్తోంది. కాబట్టే ఒక్కో రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోతోంది. కర్నాటకను కూడా వాళ్ళు ఇలాగే చేసుకున్నట్లయ్యింది.

conge bjpఆంధ్రప్రదేశ్‌ అనే వ్యక్తిని కాంగ్రెస్‌ అనే హంతకుడు కత్తితో కిరాతకంగా పొడిచి పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌ చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అదే సమయంలో అక్కడకు బీజేపీ అనే వాడొచ్చాడు. అతను సరిగా స్పందించి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆసుపత్రిలో చేర్చివుంటే బ్రతికి వుండేవాడేమో? కాని బీజేపీవాడు ఆ పని చేయలేదు. కొన ఊపిరితో వున్నావు కదా అంటూ... గొంతులో తులసినీళ్ళు పోసాడు. మరి ఈ మొత్తం ఎంపిసోడ్‌లో నిందితుడెవరు? పొడిచి పారిపోయిన కాంగ్రెసోడా? లేక కాపాడకుండా ప్రేక్షకపాత్ర పోషించిన బీజేపీ వాడా?

కర్నాటక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ వాళ్ళు నిర్వహించిన ప్రచారం తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలే రాకమానవు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కొందరు మంత్రులు బీజేపీని ఓడించాలంటూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ కోసం ఆర్ధిక సహకారం కూడా అందించినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే అది చంద్రబాబు సత్తానేనని ప్రచారం చేసుకోవచ్చని వీరి ప్లాన్‌. అందుకే గతంలో సమైక్యాంధ్ర

ఉద్యమాన్ని తాకట్టుపెట్టి చంద్రబాబుకు బిళ్ళబంట్రోతుగా పనిచేస్తున్న ఎన్జీఓల నాయకుడు అశోక్‌బాబును కూడా కర్నా టకా ఎన్నికల ప్రచారానికి పంపించారు.

కర్నాటకలో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం ప్రచారం చేసింది. అక్కడి తెలుగుప్రజల్లో విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేసింది. సరే, అక్కడ బీజేపీని ఓడించాలంటే ఎవరిని గెలిపించమని అర్ధం... ఒకటి కాంగ్రెస్‌, రెండోది జేడిఎస్‌. ముందు జేడిఎస్‌ను చూద్దాం.. ఇది పక్కా ప్రాంతీయ పార్టీ. ఆంధ్రా ప్రయోజనాల కంటే కర్నాటక ప్రయోజనాలకు ప్రాధాన్యత నిచ్చుకుంటారు. ఒకవేళ కేంద్రం ఏపికి ప్రత్యేకహోదా ఇద్దామనుకున్నా దానిని వ్యతిరేకించే పార్టీలలో జేడిఎస్‌ వుంటుంది. అదీగాక ఈ పార్టీ వ్యవస్థాపకులు దేవేగౌడ ప్రధానిగా వున్న సమయంలోనే కర్నాటకలో ఆల్‌మట్టి డ్యాం ఎత్తు పెంచి కృష్ణ నీళ్ళు కిందకు రాకుండా ఆంధ్రా నోట్లో మట్టి కొట్టాడు. మరి అలాంటి పార్టీకేమన్నా టీడీపీ నాయకులు ఓట్లేయమంటారా?

ఇక కాంగ్రెస్‌ను చూద్దాం. 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో యూపిఏను నిలబెట్టిందే ఏపిలో సాధించిన లోక్‌సభ సీట్లు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాలేదు. అలాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏం చేసింది. విభజన పేరుతో కుక్కలు చింపిన విస్తరి చేసింది. అత్యంత కర్క శంగా, పాశవికంగా, దారుణాతిదారు ణంగా రాష్ట్రాన్ని విభజించింది. ఆస్తుల పంపకం చేయలేదు. హైదరాబాద్‌లో మన వాటాను ప్రస్తావించలేదు. విభజన బిల్లులో కనీసం ప్రత్యేకహోదా అంశాన్ని కూడా చేర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విష యంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేసింది కాంగ్రెస్‌పార్టీ. కనీస కనికరం కూడా ఏపి పట్ల చూపకుండా వ్యవహరించింది. ఆనాటి రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు చూసిన వాళ్లెవరు కూడా వారి జన్మలో కాంగ్రెస్‌కు ఓటెయ్యరు. ఏపి ప్రజల మీద పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్నట్లుగా సోనియాగాంధీ విభజనకు పాల్పడింది. ఏపి పట్ల ఇంత రాక్షసత్వంగా వ్యవహరిం చిన కాంగ్రెస్‌కు ఓట్లేయమంటాడా చంద్రబాబు?

ఏపికి బీజేపీ కూడా అన్యాయమే చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మొహం చాటేసింది. అయితే బీజేపీకి ఏపికి న్యాయం చేయడానికి ఇంకా అవకాశం మిగిలేవుంది. ఈరోజు కాకపోతే రేపు ప్రత్యేకహోదా ఇచ్చి, విభజన హామీ లను అమలు చేసినా బీజేపీ తన పాపానికి ప్రాయశ్చితం చేసుకున్నట్లే! కాంగ్రెస్‌కే ఆ అవకాశం లేదు. ఏపి ప్రజల దృష్టిలో ఆ పార్టీ ఎప్పటికీ హంతకుడిగానే మిగిలి పోద్ది. కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ గెలవా లని కోరుకుంటున్న చంద్రబాబు కూడా కాం గ్రెస్‌ సహనిందితుడిగానే మిగిలిపోతాడు.

tdp congressవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చచ్చిపోయింది. తన గోతి తానే తవ్వుకుంది. తన నెత్తిన తానే మట్టి పోసు కుంది. ఇదీ చాలామంది అభిప్రాయం. కాని, లోతుగా పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ చచ్చిపోలేదు... తెలుగుదేశం రూపంలో బ్రతికొచ్చింది.

'యముడికి మొగుడు' సినిమాలో ఇక చనిపోతాడనుకున్న 'చిరంజీవి' పాత్రధారి శరీరంలోకి యమలోకంలో వున్న మరో చిరంజీవి ఆత్మను ప్రవేశపెడతారు. 2014 ఎన్నికల సమయంలోనూ రాష్ట్రంలో ఇదే జరిగింది. అప్పటికే ఈ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ చిక్కి శల్యమైపోయింది. అంతకుముందు ఐదేళ్లలో వై.యస్‌. ప్రజా పాలన దెబ్బకు శిథిలమైపోయింది. చాలా చోట్ల అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. అటువంటి వాతావరణంలో తెలుగుదేశం పార్టీ పాలిట సోనియాగాంధీ ఇటలీ దేవత అయ్యింది. ఆంధ్రుల పాలిట దెయ్య మైంది. రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశంకు ప్రాణ ప్రతిష్ట చేసింది. ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, రాజకీయాలలో మనుగడ లేదు అనుకున్న చంద్రబాబుకు రాజకీయ పునర్జన్మనిచ్చింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బ్రెయిన్‌డెడ్‌కు గురై, కోమాలో వున్న తెలుగుదేశంకు తన గుండె, కిడ్నీలు, కాలేయం, కళ్ళు దానం చేసింది. దాంతో కాంగ్రెస్‌ ఆత్మ, అవయవాలు అన్నీ కూడా తెలుగుదేశంలో అంతర్భాగమై, ఆ పార్టీ కోమా నుండి కోలుకుంది. ఒకరకంగా చెప్పాలంటే సోనియాగాంధీ తన బిడ్డలైన కాంగ్రెస్‌వాళ్ళను చంపుకుని, పరాయి బిడ్డ లైన చంద్రబాబు, కేసీఆర్‌లను ముఖ్య మంత్రులను చేసిందనే చెప్పవచ్చు. ఇందులో ఆమెకు ప్రత్యక్ష పాత్ర లేకపో యినా, రాష్ట్ర విభజన ద్వారా ఆమె తీసు కున్న నియంతృత్వపు విధానాలే దీనికి కారణమయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పుడున్నది ఎన్టీఆర్‌ ఆశయాలకనుగుణంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక లాంటి పార్టీ కాదు. తెలుగుకాంగ్రెస్‌ పార్టీ... కాంగ్రెస్‌ ఆత్మతో, కాంగ్రెస్‌ అవయవాలతో మనుగడ సాగి స్తున్న పార్టీ. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్‌ నాయకులే దిక్కయ్యారు. ఆ పార్టీ గెలుపుకు దోహదం చేసింది కాంగ్రెస్‌ నాయకులే! చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రివర్గంలోను, నామినేటెడ్‌ పదవు ల్లోనూ వారిదే హవా! సోనియాగాంధీకి రెండుసార్లు కేంద్రంలో తమను గద్దెనెక్కిం చడానికి ఏపి నుండి మెజార్టీ లోక్‌సభ సీట్లు అందించిన వై.యస్‌. కుటుంబం కంటే కూడా చంద్రబాబే ఎక్కువయ్యాడు. చంద్రబాబుతో కలిసే జగన్‌ను కేసుల్లో ఇరికించి ఇబ్బందులపాల్జేసారు.

ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. చంద్ర బాబు మాత్రం అవసరమైతే అధికారం కోసం కాంగ్రెస్‌తో కూడా పొత్తుపెట్టుకు నేటట్లున్నాడు. ఎందుకంటే ఆయన బ్లడ్‌లో కాంగ్రెస్‌ వుంది. ఎన్టీఆర్‌ రాజకీయ జీవితం స్వచ్ఛమైన తెలుగుదేశం నేతగా మొదలైంది. చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే మొదలైంది. కాబట్టి ఆ లక్షణాలు ఎక్కడికీ పోవు. ఎన్టీఆర్‌ ఫీల్డ్‌లో వున్నంతవరకు, వెన్నుపోటుకు గురి కానంతవరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకతాటి పైకి తెచ్చాడు. కాని, చంద్రబాబు చేతిలోకి రాగానే 1996లో ఆయన చేసిన మొదటి పని కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం. 2009 ఎన్నికల దాకా రాష్ట్రంలో కాంగ్రెస్సే ప్రధానపార్టీ కాబట్టి ఆయన ఆ పార్టీతో ఫైట్‌ చేస్తూ వచ్చాడు. 2014 ఎన్నికల నుండి సీన్‌ మారింది. రాష్ట్రంలో వైసిపి ప్రధాన ప్రత్యర్థి అయ్యింది. ఇప్పుడాయన కాంగ్రెస్‌తో స్నేహం చేసినా ఇబ్బంది లేదు. తెలంగాణలో ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏతో డైవోర్స్‌ అయ్యింది. ఇక కలవక పోవచ్చు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు చంద్రబాబు మీద పగబట్టి వున్నారు కాబట్టి వాళ్ళు చేసేది చేయకమానరు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ఇంకో 5ఏళ్ళు కేసుల భయం లేకుండా గడపొచ్చు. ఆ దిశగానే చంద్రబాబు స్నేహ గీతం మారుస్తున్నట్లుగా సమాచారం.

Page 1 of 6

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter