karnatakaకర్నాటక ఎన్నికల ఫలితాలు కలకం సృష్టించాయి. ప్రధాన పార్టీలైన మూడు పార్టీల వారికీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ ఎవరు ప్రభుత్వం ఏర్పాటుచేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మే 15న వెలువడిన ఫలితాల్లో బిజెపిదే అగ్రస్థానం. కర్నాటకలో అత్యధికస్థానాల్లో విజయం సాధించి బిజెపి విజయభేరీ మోగించింది. కన్నడనాట కమలం విజయదరహాసంతో వికసించింది. కర్నాటక ప్రజలు అత్యధికస్థానాలతో (104) బిజెపికే పట్టం కట్టారు. అయితే, ప్రభుత్వఏర్పాటుకు అవసరమైన 112 స్థానాలు రాకపోవడంతో, ఇదే అదనుగా ఎలాగైనా సరే బిజెపిని అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్‌ పావులు కదపడం, జేడీఎస్‌తో కలయికకు రంగం సిద్ధం చేస్తూ 'హంగ్‌' ప్రభుత్వానికి దారులు తీస్తుండడంతో కన్నడనాట రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.

కర్నాటకలో మే 12న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 222 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడ్డాయి. అయితే ఆ రోజే..ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే కర్నాటకలో రసవత్తర రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కర్నాటకలో అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది. బిజెపికి ఇది చరిత్రాత్మక విజయం. ఉద్దండులైన కాంగ్రెస్‌ రాజకీయయోధులను సైతం ఓడించి బిజెపి విజయ దుందుభి మోగించింది. ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా బిజెపి బలోపేతం అవుతోన్న నేపథ్యంలో తొలిసారిగా ఇప్పుడు దక్షిణాదిలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించడంతో బిజెపి బలం మరింతగా పెరిగింది. ఈ గెలుపు ద్వారా దక్షిణభారతంలోనూ బిజెపి తన హవా చాటుకుంది. ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల రాజకీయ వ్యూహాల మధ్య కాంగ్రెస్‌ నిలవలేక చతికిల పడిపోయింది. అయితే, ఫలితాలు వెలువడుతున్న తుదిదశలో జరిగిన అనూహ్య రాజకీయపరిణామాలు బిజెపిని సందిగ్ధతలోకి నెట్టాయి.

ఫలితాలు వెలువడినరోజు సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, మొత్తం 222 స్థానాల్లో 104 స్థానాల్లో బిజెపి విజయపథంలో ఉంది. కాంగ్రెస్‌ 78 స్థానాల్లోనూ, జెడిఎస్‌ 38 స్థానాల్లోనూ లీడింగ్‌లో ఉండగా, మరో రెండు స్థానాల్లో ఇతరులు విజయపథంలో ఉన్నారు. బిజెపి 104 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా తన సత్తా చాటుకుంది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 112 స్థానాలకు అడుగు దూరంలో నిలబడిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 8 స్థానాలు తక్కువ కావడంతో చివరి నిమిషంలో ఏమిచేయాలో బిజెపి నేతలకు అయోమయంగా మారింది. ఇదే అదనుగా కాంగ్రెస్‌ చకచకా పావులు కదిపింది. కేవలం 78 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌, 38 స్థానాల్లో విజయం సాధించిన జెడిఎస్‌ పార్టీతో బయటినుంచే పొత్తుపెట్టుకోవడానికి సిద్ధం కావడంతో, ఈ రెండు పార్టీలు కలిస్తే 116 స్థానాలు అవుతాయి కనుక, ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందనే ధీమాతో కాంగ్రెస్‌ నేతలు పావులు కదపడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కేవలం 38 స్థానాలు దక్కించుకున్న జెడిఎస్‌ (జనతాదళ్‌-ఎస్‌)తో కలవడానికి కాంగ్రెస్‌ సుముఖంగా ఉండడం, అందుకు ఆ పార్టీ కూడా అంగీకరించినట్లు సమాచారం రావడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. దీంతో ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు సాయంత్రం దాకా రాజకీయాలు చకచకా మారుతూనే వచ్చాయి.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన సిద్దరామయ్య రాజీనామా చేయడం, ఢిల్లీ నుంచి సోనియాగాంధీ ఆదేశంతో కాంగ్రెస్‌ నేతలు గులామ్‌నబీ అజాద్‌ వంటివారంతా రంగంలోకి దిగి జేడిఎస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు రాజకీయ వ్యూహాలు రచించడంతో పరిస్థితి జేడీఎస్‌ చేతుల్లోకి వచ్చింది. కాంగ్రెస్‌తో కలిస్తే జేడిఎస్‌ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకైనా సిద్ధమని కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేయడంతో, ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో అప్పటిదాకా కేవలం కింగ్‌మేకర్‌ అవుతుందనుకున్న జేడిఎస్‌ ఒక్కసారిగా కింగ్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో, అత్యధిక స్థానాలు సాధించి కర్నాటకలో విజయకేతనం ఎగురవేసినా, ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవసర మైన మ్యాజిక్‌ ఫిగర్‌ 112 స్థానాలు రాకపోవడంతో బిజెపి పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఈ దశలో బిజెపి అగ్రనేతలు అమిత్‌షా తదితరులంతా కలసి కాంగ్రెస్‌ వ్యూహానికి ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేవలం అయిదారు గంటల్లోనే ఈ క్షణక్షణ రాజకీయాలు కర్నాటకనే కాక, దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఫలితాలు వెలువడిన రోజంతా... ఇదే సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న విషయం ఒక కొలిక్కి రానేలేదు. అధికారం లోకి వచ్చేందుకు ఆయా పార్టీల నేతలు ఎవరికి వారు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తుండడంతో కర్నాటక రాజకీయాలు క్షణక్షణం రసవత్తరంగా మారాయి.

అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను ఓడించి అక్కడి ప్రజలు బిజెపికి పట్టం కట్టినా, చివరి దశలో ఏర్పడిన ఈ సంకటస్థితి బిజెపికి సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌-జేడిఎస్‌ ఒకటైతే పూర్తిస్థాయి మెజారిటీకన్నా ఎక్కువ స్థానాలే వస్తాయి కనుక, ఎలాగైనా సరే బిజెపిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ వ్యూహాలు పన్నుతోంది. అయినప్పటికీ కర్నాటకలో అత్యధికంగా 104 స్థానాలు సాధించి కమలం జెండాను రెపరెపలాడించిన బిజెపికి, ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటుతూ అతిపెద్దపార్టీగా అవతరించిన బిజెపికి ఈ పరిస్థితిని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇప్పటికే గవర్నర్‌ బీజేపీకి తొలి అవకాశమిచ్చారు. వారంలోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోమన్నారు. జేడీఎస్‌లో చీలిక తెచ్చే దిశగా బీజేపీ నాయకత్వం పావులు కదిపింది. దేవేగౌడ పెద్దకొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం గాలం వేసింది. ఇది సక్సెస్‌ అయితే బల నిరూపణ బీజేపీకి పెద్ద సమస్య కాకపోవచ్చు.

karnatakaఈ నెలలో జరుగనున్న కర్నాటక ఎన్నికలు ప్రధాన పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. చివరికి ఫలితాలు ఎలా ఉంటాయి?.. అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ ఇదే. ఈ ఎన్నికలు జాతీయస్థాయిలో ప్రభావం చూపుతాయి కనుక, ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటాయా?.లేదా బిజెపికి పట్టం గడతాయా?.. అన్న ఊహాగానాలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు సెమీఫైనల్స్‌గా, రానున్న లోక్‌సభ ఎన్నికలు ఫైనల్స్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కర్నాటకలో గెలుపు.. రేపటి విజయానికి మలుపు అన్నట్లుగా ఆయా పార్టీలు, రాజకీయవర్గాలు భావిస్తూ ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. అయినా.. ఎవరి ఊహాగానాలు వారి అన్నట్లుగా దేశవ్యాప్తంగా అటు రాజకీయవర్గాల్లోనే కాక, సామాన్య జనంలోనూ కర్నాటక ఎన్నికల ఫలితాల మీదనే ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి, జేడిఎస్‌ పార్టీలదే ప్రధాన పాత్ర. ఈ పార్టీల నాయకులంతా ఎన్నికల రణరంగంలో ఆరితేరిన యోధులే. ఎవరూ ఎవరికీ తీసిపోరు. ఎత్తులకు పైఎత్తులు, వ్యూహరచనల్లో ఎవరికి వారే ఘనాపాటీలు. తామే గెలుస్తామంటూ ఎవరికి వారు ధీమాగా పోటీ పడుతూ ఈ మండే ఎండల్లో అలుపూ సొలుపూ లేకుండా మొన్నమొన్నటిదాకా భారీగా ప్రచార యుద్ధాలు చేశారు. ఓట్లు రాబట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నికల ప్రణాళికల్లో ప్రజలకు రక రకాల వాగ్దానాలు కుమ్మరించారు. ప్రజల ఓట్ల కోసం, అత్యధికంగా ఉన్న లింగాయత్‌ల ఓట్ల కోసం ఆయా పార్టీల వారు ఎవరికి వారు రాజకీయ వ్యూహా లతో పెద్దఎత్తున ప్రచారాలు చేసుకున్నారు కూడా. బిజెపి తరఫున రంగంలోకి దిగిన ప్రధాని మోడీ, అమిత్‌షాలు కాంగ్రెస్‌ తీరుపై మండిపడుతూ ముమ్మ రంగా ప్రచారాలు చేశారు. కర్నాటక అంతా సుడి గాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్‌ను ఓడించాలంటూ ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్‌ది విభజించి పాలించే రాజకీయమని, తమది ప్రజాసంక్షేమం కోసం దేశభక్తితో దేశాన్ని పాలించే విధానమని మోడీ స్పష్టం చేశారు. కర్నాటకలో గెలుపు తమదేనని ఆయన ధీమాగా ఉన్నారు. అంతేకాక, ప్రస్తుత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గ సభ్యుల్లో అవినీతి ఆరోపణలకు గురికాని మంత్రి ఒక్కరూ లేరంటూ మోడీ తన ప్రసంగాల్లో దుయ్యబట్టారు. సమాజాన్ని చీల్చి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్‌ తాపత్రయపడుతోందని, ఎట్టి పరిస్థితిలోనూ కర్నాటకలో కాంగ్రెస్‌ గెలవదని అన్నారు. రాహుల్‌ తమను గెలిపిస్తాడని కాంగ్రెస్‌పార్టీ నేతలకు కూడా నమ్మకం లేదన్నారు. వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్‌ దేశాన్ని నాశనం చేసిందంటూ మోడీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మరోవైపు సిద్ధరామయ్య తరఫున కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ చాలాకాలం తర్వాత మళ్ళీ ఈనెల 8న ఎన్నికల ప్రచారసభలో పాల్గొనడంతో కాంగ్రెస్‌వర్గాల్లో ఉత్సాహం రేకెత్తింది. ఈ సందర్భంగా మోదీ పాలనాతీరును సోనియాగాంధీ తీవ్రంగా విమర్శించారు. మోడీ మాటల గారడీ తప్ప ఈ నాలుగేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ లేని భారత్‌ను మోడీ కోరుకుంటున్నారని, అయితే ఒక్క కాంగ్రెసే కాదు, తనకు ఎదురుగా ఎవరున్నా మోడీ సహించలేరని ఆమె విమర్శించారు. అవినీతి నిర్మూలనకు

ఉద్దేశించిన లోక్‌పాల్‌ బిల్లు ఏమైందని సోనియా ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల కంటే కర్నాటకకు చాలా తక్కువ నిధులిస్తూ సహాయ నిరాకరణ చేసినందుకు ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలంటూ ఆమె పెద్దఎత్తున ప్రచారం సాగించారు. సోనియా ప్రచారానికి రావడంతో కాంగ్రెస్‌శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తింది.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్నాటకలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. కర్నాటక ఎన్నికలు స్వచ్ఛ రాజకీయాలకు, మురికి రాజకీయాలకు మధ్య సమరమన్నారు. ముఖ్యంగా మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దనరెడ్డి బృందాన్ని బిజెపి ఎన్నికల బరిలోకి దింపడాన్ని రాహుల్‌ సూటిగా ప్రశ్నించారు. వేలకోట్లరూపాయల ఇనుప ఖనిజాన్ని దోచుకున్న గాలి సోదరుల కోటాలో కొంతమందికి బిజెపి టిక్కెట్లు ఇవ్వడం ఏమి టని రాహుల్‌ ప్రశ్నించిన తీరు బిజెపిలోని అసంతృప్తి వాదులను సైతం ఆలోచింపజేసిందనడంలో అతి శయోక్తి లేదు. అవినీతి, కుంభకోణాల నేతలను బిజెపి రంగంలోకి దించిందంటూ రాహుల్‌ బిజెపిని ఎద్దేవా చేయడమే కాక, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లు సాధిస్తే ప్రధాని అయ్యేందుకు తాను సిద్ధమని రాహుల్‌ మరోసారి స్పష్టం చేయడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచిఫలితాలు సాధిస్తే కాబోయే ప్రధానిని తానేనంటూ రాహుల్‌ ధీమా వ్యక్తం చేయడం కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్తేజపరుస్తోంది. మళ్ళీ మోడీ ప్రధాని కావడం కల్ల అని, విపక్షాలన్నీ కలిసి బిజెపి ఓటమికి గట్టిగా కృషిచేస్తున్నాయని రాహుల్‌ ఆశాభావంతో ఉన్నారు. ఇలా.. ఇరుపార్టీలవారు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ... ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరిపోసుకుంటూ ప్రచారం గడువు ముగిసేదాకా ప్రచారాలు సాగించారు. మరోవైపు అదే సందర్భంలో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం కూడా సాగిపోయిందని, ఎన్ని కోట్లు ఖర్చయినా సరే తాము గెలిచి తీరాలంటూ బలమైన అభ్యర్థులంతా డబ్బు ఖర్చుకు వెనుకాడలేదనే ఆరోపణలు కూడా సర్వత్రా వెల్లువెత్తాయి. ఇదిలావుంటే, కాంగ్రెస్‌-బిజెపిలపై విసుగెత్తిన ప్రజలు తమనే గెలిపిస్తారని జేడీఎస్‌ ఆశాభావంతో ఉండడం కొసమెరుపు. ఎట్టకేలకు ప్రచార హోరు జోరుగానే ముగిసింది. పోలింగ్‌ తేదీ సమీపించడంతో ఇక ఎన్నికల్లో ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఈ నెల 12న ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని 224 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో ఎవరి అదృష్టం ఎలా ఉందో తేలనుంది. ఈనెల15న ఫలితాలు వెలువడే దాకా ఆయా పార్టీల అభ్యర్థుల అదృష్టాదృష్టాలు ఎలా ఉన్నాయో.. ఓటర్లు ఏ పార్టీకి విజయం అందిస్తారో..ఎవరిని అందలం ఎక్కిస్తారో వేచిచూడాల్సిందే!...

karantakaఆ రెండు పార్టీలకూ ఇప్పుడు కర్నాటక ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారైంది. రానున్న ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్నదే ఆ పార్టీలకు గుబులుగా మారింది. వచ్చే నెల 12న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా హోరాహోరీగా తలపడుతున్న బిజెపి-కాంగ్రెస్‌ పార్టీల ప్రతిష్టకు ఇవి ఎంతో కీలకమైనవని వేరే చెప్పనక్కరలేదు. రాష్ట్రంలోని 224 స్థానాలకు మే 12న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ పార్టీల నాయకులకు నిదురే కరువవుతోంది. ఎక్కడ విన్నా ఎన్నికల మాటే. ఈ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందా.. కాంగ్రెస్‌ నిలుస్తుందా అన్న చర్చలే. ఈ రెండు పార్టీలతో పాటు, ఈ ఎన్నికల్లో జేడీ (ఎస్‌)పార్టీ మద్దతు పార్టీలపై మరింత కీలకంగా ఉంటుందని కూడా రాజకీయవర్గాల అంచనాలు వేస్తున్నాయి. అయితే, ఇప్పటికే వివిధ మీడియాసంస్థలు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంది. ఇక్కడ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరిస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని సర్వేలు బిజెపియే అధికస్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నాయి. పార్టీలకు స్వల్ప ఆధిక్యత వచ్చి 'హంగ్‌' ప్రభుత్వం ఏర్పడే అవకాశం కూడా లేక పోలేదు. కర్నాటక బిజెపి నేత, మాజీ సిఎం యెడ్యూ రప్ప, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య (కాంగ్రెస్‌)ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓటర్లు ఎవరిని అందలమెక్కిస్తారో తెలియదు కానీ, ఈ ఎన్నికల పుణ్యమా అని కర్నాటక అంతా ఈ ఎండల్లో రాజకీయ సెగలతో మరింత వేడెక్కిపో తోంది. నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా బిజెపి బలోపేతం కావడం తెలి సిందే. అయితే, దక్షిణాదిలో ఇప్పుడు జరుగుతున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కో వడం బిజెపికి ఇదే తొలిసారి. ఇక్కడ విజయం సాధిస్తే బిజెపికి ఇక దక్షిణాదిలో కూడా తిరుగే ఉండదని ఆ పార్టీ గట్టిగా భావిస్తోంది. కర్నాటకలో గెలుపు ద్వారా దక్షిణాధిలో విజయభేరీ మోగించవచ్చని, తద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ తమకు ఎదురుండదని బిజెపి అంచనాలు వేసుకుంటోంది. అయితే, మారుతున్న రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఇక్కడి వాతావరణం అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నా, బిజెపి కూడా ఎక్కడా తగ్గకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తూనే ఉంది. ఇక్కడ విజయం అంత సులువు కాదని అర్ధమవుతున్నా, ఎలాగైనా పట్టుబట్టి విజయం సాధించాలనే పట్టుదలతో బిజెపి వ్యూహరచన చేస్తోంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా కర్నాటకలో బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే, అంతర్గత విభేదాలతో తన విజయావకాశాలను తనే దెబ్బతీసుకుంది. 2013 ఎన్నికల్లో అధికారాన్ని కాంగ్రెస్‌కు బంగారుపళ్లెంలో పెట్టి మరీ అందించింది. అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో కర్నాటకలోని అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు బిజెపికి లభించాయి. మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో 17 బిజెపికి రాగా, 9 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. అయితే, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారిందని, గతంలో ఉన్నంత మోడీ ప్రభంజనం ఇప్పుడు లేదని సర్వేలు పేర్కొంటు న్నాయి. మరోవైపు ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌, పూల్పూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పరాజయం పాలవడంతో బిజెపి ఇప్పుడు మరింతగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మునుపున్నంత దూకుడుగా లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కర్నాటకలోని మఠాలు మఠాధిపతుల చుట్టూ తిరుగుతూ అమిత్‌షా బిజెపి ఓటుబ్యాంక్‌ను కాపాడుకోవాలని తీవ్రప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఎన్నికలో ఇక కర్నాటక నుంచి కాంగ్రెస్‌ తొలగిపోతుందని, ఇక్కడి గెలుపుతో దక్షిణాది జైత్రయాత్రకు సింహద్వారాన్ని తెరచినట్లేనని, ఇక్కడ గెెలిస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో కూడా విజయదుంధుభులు మోగించవచ్చని బిజెపి నేత అమిత్‌షా కార్యకర్తలకు ఉత్సాహం నూరిపోస్తున్నారు. అయితే, మోడీ ప్రతిష్ట మసకబారిందని, మునుపటి పరిస్థితి ఇప్పుడు లేదని, ప్రజల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లినట్లు ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోందని, కనుక కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో విజయం తథ్యమని కాంగ్రెస్‌ నాయకులు ధీమాగా చెప్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి సిద్దరామయ్య రంగంలో ఉండడంతో, ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆయన గెలుపుకు ఎలాంటి ఢోకా లేదని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై కూడా ప్రజలకు అభిమానమే ఉన్నా సొంతపార్టీలోనే అసమ్మ తుల కుంపట్లసెగ ఎక్కువగా ఉంది. కర్నాటకలో అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే లింగా యతుల ఓట్ల కోసం ఇరు పార్టీలు చేస్తున్న రాజకీయ వ్యూహాలతో కర్నాటకలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. లింగాయత్‌లకు మైనార్టీ హోదా ఇస్తామనే తాయిలంతో ఆ వర్గాన్ని సిద్ధ రామయ్య ఇప్పటికే తనవైపుకు తిప్పుకున్నారు. అత్యధికులైన లింగాయతులను తమవైపు తిప్పు కునేందుకు బిజెపి కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అదేవిధంగా, సుమారు 35 నియోజక వర్గాల్లో ప్రభావం చూపే తెలుగు ఓటర్లు కూడా కర్నాటకలో గణనీయంగానే ఉన్నారు. బెంగుళూరులోని అత్యధిక ప్రాంతాల్లో తెలుగువారే అధికం. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందనే ఆగ్రహం తెలుగువారిలో స్పష్టంగా ఉంది. ఈ వ్యతిరేకతే గతంలో కాంగ్రెస్‌ను మట్టికరిపించింది కూడా. ఇప్పుడు బిజెపి ఆ తప్పును సరిదిద్దకపోవడంతో కర్నాటకలోని ఆంధ్రులు బిజెపికి ఓట్లేసే పరిస్థితి ఉండదని, కనుక ఇది తమకు అనుకూలమని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఒకవైపు బిజెపి నేత అమిత్‌షా, మరోవైపు కారగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇప్పటికే కర్నాటకనంతా ఒక చుట్టు చుట్టేశారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌, దేశంలో బిజెపి అధికారంలో ఉండడం వల్ల ఆ రెండు పార్టీలకు డబ్బుకు కొదవలేదు కనుక ప్రచారార్భాటాలకు తక్కువేమీ లేదు. అయితే, ఎవరెలా ప్రచారాలు చేసుకున్నా తుది నిర్ణయం మాత్రం ఓటర్లదే కనుక, ఓటర్లు చివరికి ఎవరిని తిరస్కరిస్తారో.. ఎవరిని వరిస్తారో.. వచ్చే నెల 15న ఫలితాలు వెలువడే దాకా వేచిచూడాల్సిందే!...

Page 1 of 66

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter