mundastuరాష్ట్రంలో రాజకీయ వాతావరణం మనకు అనుకూలంగా వుంది. మన పరిపాలన అద్భుతంగా ఉంది. మన అభివృద్ధి పథకాలకు ప్రజలు జేజేలు కొడుతున్నారు. మనం చేసిన రెండు పుష్కరాలు ప్రజలను మెప్పించాయి. మనం కడుతున్న అమరావతి రాజధానికి ప్రపంచ దేశాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం, పట్టిసీమ, పురు షోత్తమ పట్నం ప్రాజెక్ట్‌లైతేనేమీ, ఋణమాఫీ అయితేనేమీ.... ఇవి చంద్రబాబే చేయగలడు అనిపిం చేలా చేసాం. కాపు రిజర్వేషన్లతో ఆ వర్గం వారినీ దూరం కాకుండా చేసుకున్నాం, బి.సిలు మనల్ని వదిలి ఎక్కడికీ పోరు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రెడ్ల మధ్య ఏ మేరకు చిచ్చు పెట్టాలో, చీల్చాలో ఆమేరకు చేసాం. ముగ్గురు వైసిపి ఎంపీలను, 23మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాం, చాలా చోట్ల వైసిపికి అభ్యర్థులనే లేకుండా చేసాం, ఎన్నికలకు ఇంతకంటే మంచి వాతావరణం ఇంకేముంటుంది. కొలిమి బాగా వేడిమీదున్నప్పుడే ఇనుమును వంగదీయాలి. రాజకీయ వాతావరణం అనుకూలంగా వున్నప్పుడే ఎన్నికలకు పోయి లబ్ది పొందాలి. ఈ ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

2014లో అధికారం దక్కడమే చంద్రబాబుకు రాజకీయ పునర్జన్మలాంటిది. ఆ ఎన్నికల్లో ఓడిపోయుంటే ఆయన పరిస్థితి వేరేగా వుండేది. అధికారం దక్కింది మొదలు ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం కంటే రాష్ట్రంలో ప్రతి పక్షాన్ని నిర్వీర్యం చేయడం కోసమే ఎక్కువుగా కృషి చేసాడు. బలమైన ప్రతిపక్షం లేకుంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి సులభంగా అధికారం దక్కించుకోవచ్చన్నది ఆయన ఆశ. అందుకే ప్రతిపక్షాన్ని అసెంబ్లీలోనూ, బయటా బలహీనపరచడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. దీని కోసం విలువలను, రాజ్యాంగ నిబంధన లను తుంగలో తొక్కారు కూడా!

ఇక నంద్యాల, కాకినాడ ఉపఎన్నికల్లో విజయాలు చంద్రబాబులో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఎన్ని కోట్లు ఖర్చుపెడితే, ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే అక్కడ గెలిచామన్నది ఆయన ఆలోచించడం లేదు. ప్రతిపక్షం బలహీనంగా వుంది, ప్రజలు మనల్ని బలంగా నమ్ముతున్నారనే నమ్మకంతోనే వున్నాడు. అలాగే జగన్‌ కేసుల విషయంలో ఏదో ఒకటి తేలకముందే ఎలక్షన్‌కు పోవాలి. 2జీ స్పెక్ట్రం కేసు చూసాక జగన్‌ కేసు విషయంలో కూడా సందేహాలు నెలకొన్నాయి. జగన్‌ మీద ఇప్పుడెలాగూ లక్షకోట్ల అవినీతి ముద్ర వేసారు. కేసులు, కోర్టులు చూపించే ఇంతకాలం అసెంబ్లీలో, బయటా జగన్‌పై ఎదురుదాడి చేస్తూ వచ్చారు. జగన్‌పై కేసులు ప్రజల్ని కొంతవరకు ప్రభావితం చేస్తూనే వున్నాయి. అంతపెద్ద 2జీ స్పెక్ట్రం స్కామ్‌ గాల్లో తేలిపోయింది. అలాంటిది జగన్‌పై కేసులు కక్ష పూరితంగా పెట్టినవి. సోనియాగాంధీకి ఎదురుతిరిగాడు కాబట్టే ఆయనపై కేసులు నమోదయ్యాయన్నది జగమెరిగిన సత్యం. ఇటీవల రాజకీయ నాయకులపై నమోదైన కేసులన్నీ కూడా త్వరిత గతిన విచారణ జరిపి తీర్పులొస్తున్నాయి. ఆ కోణంలో జగన్‌ కేసు కూడా తుదివిచారణ కొచ్చి నిర్దోషిగా తేలితే... తెలుగుదేశం చేతిలో వున్న ఆ ఒక్క ఆయుధం పోతుంది. జగన్‌ను వీళ్ళు వేలెత్తి చూపడానికి ఏమీ ఉండదు. ప్రజల్లో కూడా జగన్‌ పట్ల సానుభూతి పెరుగుతుంది. ఒకవేళ దోషిగా తేలినా ఇప్పటికీ అప్పటికీ పెద్ద మార్పుండదు. అంతేకాదు, పార్లమెంటు ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలను జరిపించి అందులో గెలిస్తే జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ప్రాధాన్యత పెరుగుతుంది. లోకేష్‌ను రాష్ట్రంలో వుంచి చంద్రబాబు ఢిల్లీ వైపు చూడొచ్చు. ఇప్పటివరకు తనను చిన్నచూపు చూసిన బీజేపీని దూరంగా పెట్టి, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక కూటమిగా ఏర్పాటు చేయొచ్చు. ఆ కూటమికి తానే నేతృత్వం వహించవచ్చు. 2019 ఎన్నికల్లో హంగ్‌ ఫలితాలు వస్తే ప్రత్యామ్నాయ కూటమిదే కీలకపాత్ర అవుతుంది. అప్పుడు తృతీయ కూటమి నుండి ప్రధాని పదవికి చంద్రబాబు పేరును కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాష్ట్రాలను వదిలొచ్చే పరిస్థితుల్లో లేరు. సీనియర్‌గా ములాయంసింగ్‌ యాదవ్‌ వున్నా యూపీలో బలహీనపడ్డాడు. కొడుకును రాష్ట్ర రాజకీయాలలో వుంచి ఢిల్లీలో ఉండగల అవకాశం చంద్రబాబుకే వుంది. కాబట్టే 2018లోనే ఆయన 'ముందస్తు'కు రెడీ అవుతున్నాడు. ముక్కోటి దేవతలు ఆయన ఆలోచనలను పసిగట్టి తధాస్తు అంటే మనకు ముందస్తే...!

cash politicsఐపిఎల్‌ మ్యాచ్‌లొచ్చాక క్రికెట్‌ వాతా వరణం చెడిపోయింది. జట్టు సభ్యులు కలగా పులగమయ్యారు. అన్ని రాష్ట్రాల ఆటగాళ్ళు, అన్ని దేశాల ఆటగాళ్ళు ప్రతి జట్టులోనూ వుంటున్నారు. దీంతో ఫలానాది మా జట్టు.. ఆ జట్టు గెలవాలి అనే ఫీలింగ్‌ క్రికెట్‌ అభిమా నుల్లో లేకుండా పోయింది. అదే ఐపిఎల్‌ రాక ముందు వివిధ దేశాల మధ్య ఇంటర్నేషనల్‌ వన్డే, టి20 మ్యాచ్‌లు జరుగుతుంటే మన దేశం గెలవాలి, ధోనీ సెంచరీ కొట్టాలి... అనే ఫీలింగ్‌ వేరు. ఇప్పుడు రాజకీయాలలోనూ ఐపిఎల్‌ వాతా వరణం వచ్చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లాగానే ఎలక్షన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తయారైంది.

గతంలో పార్టీ జెండాలు మోసినవాళ్లను, ఏళ్లతరబడి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినవాళ్ళను, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లినవాళ్లను పార్టీపరంగా ఉద్యమాలు చేసినవాళ్లను పార్టీ పట్ల భక్తి, అభిమానం వున్నోళ్లను ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించేవాళ్లు. ఇంతకుముందు ఎలక్షన్‌లలో ఏ పార్టీకైనా అభ్యర్థి కావాలంటే నాయకుడికి పార్టీలో సీనియార్టీ, ప్రజాసేవలో వున్న సిన్సియార్టీ కొలమానంగా ఉండేది.

ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఈయన జెండా మోసాడా? మన పార్టీ బ్యానర్‌ కట్టాడా? మన వాల్‌పోస్టర్‌ అంటించాడా? మన సభలలో పాల్గొన్నాడా? మన పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసాడా? పార్టీలో ఇవేమీ పట్టించుకోవడం లేదు. పార్లమెంటు అభ్యర్థి అయితే వంద కోట్లు ఖర్చు పెట్టుకుంటాడా? అసెంబ్లీకి అయితే పాతిక కోట్లు పెట్టుకోగలడా? అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానాల ఆలోచనా ధోరణి ఇదే! ఐపిఎల్‌లో ఫ్రాంచైజీ కంపెనీలు బాగా ఆడేవాళ్లను ఎక్కువ ధరపెట్టి కొంటాయి. ఇక్కడ మాత్రం బాగా ఖర్చుపెట్టేవారికి పార్టీలు టిక్కెట్లిస్తుంటాయి. అంతే తేడా!

రాష్ట్రంలో అధికార తెలుగుదేశం అయినా, ప్రతిపక్ష వైకాపా అయినా కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్లకే టిక్కెట్లు అంటున్నాయి. మొన్న నంద్యాల ఉపఎన్నికను చూసిన తర్వాత లోక్‌సభకు అయితే వందకోట్లు, అసెంబ్లీకైతే పాతికకోట్లు అన్నది ఫిక్స్‌ అయిపోయింది. రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలలో తప్పితే జనరల్‌ నియోజకవర్గాలలో ఈ మాత్రం ఖర్చు తగ్గదు. ఓటర్లకు పంచడానికి వీలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2వేల నోట్లను విడుదల చేసిపెట్టింది. ఈసారి 500 నోటు చెల్లదు. కాబట్టి 2వేల నోటును ఆశ్రయించాల్సిందే! కాబట్టి అభ్యర్థుల ఎంపికలో నాయకుల సర్వీసును ఏ మాత్రం పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు. వాళ్లకు జెండాలు మోసే పనే! ఆరోజుకు ఎవరు డబ్బు ఖర్చు పెట్టుకోగలరనుకుంటే వారికే టిక్కెట్లు?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో పడ్డాడు. రాష్ట్రంలో పాతిక లోక్‌సభ స్థానాలున్నాయి. రిజర్వ్‌డ్‌ స్థానాలను పక్కనపెట్టి మిగిలిన లోక్‌సభ స్థానాలలో కోట్లకు పడగలెత్తి వంద కోట్లు అంటే లెక్కపెట్టని వాళ్లను అభ్యర్థులుగా నిర్ణయించబోతున్నారు. వైకాపా అధినేత జగన్‌ కూడా లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో కోట్లు ఖర్చు పెట్టడాన్నే ప్రధాన అర్హతగా చూస్తున్నాడు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కూడా 'కోట్లు' ప్రామాణికం కాబోతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు నిర్దయగా వ్యవహరిస్తాడు. కోట్లు లేకుంటే ఖచ్చితంగా పక్కన పెడతాడు. జగనే కొంత నయం. తనను నమ్ముకుని వచ్చారని చెప్పి డబ్బులు లేకున్నా కొందరికన్నా పార్టీ జెండాలు మోసినోళ్లకు టిక్కెట్లిచ్చే అవకాశముంది.

ఈసారి ఎన్నికలు ఐపిఎల్‌ మ్యాచ్‌లను తలపించడం ఖాయం. ఈ పార్టీలో వున్నోళ్ళు ఆ పార్టీ అభ్యర్థులు కావచ్చు... ఆ పార్టీలో వున్నోళ్ళు ఈ పార్టీ అభ్యర్థులు కావచ్చు. జనం మాత్రం యధాఫలంగా బకరాలు కావడానికి సిద్ధంగా వుండాలి.

voteకర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో 2019లో డైరక్ట్‌గా ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాలనుకుంటున్న చంద్రబాబుకు 'నంద్యాల' రూపంలో సెమీ ఫైనల్స్‌ ఆడాల్సివస్తోంది.

రాష్ట్రంలో ఏ ఒక్క అసెంబ్లీకి కూడా ఉపఎన్నికలు జరిపించడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అలా జరిగి తెలుగుదేశం బోర్లా పడితే తమ పతనం అక్కడనుండే మొదలవుతుందని, ఒక అసెంబ్లీ ఎన్నిక ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడుతుందని చంద్రబాబు భయం. ఆ భయంతోనే ఆయన ఏదో ఒక ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి తన కొడుకు లోకేష్‌ను ఉపఎన్నిక ద్వారా శాసనసభకు పంపించే అవకాశ మున్నా, ఆ సాహసం చేయలేక శాసనమండలికి పంపించాడు.

ఇప్పుడు నంద్యాల ఉపఎన్నికను తప్పించుకోలేని పరిస్థితి. మన రాష్ట్రంలో ఒక సాంప్రదాయం వుంది. ఏ పార్టీకి చెందిన సభ్యుడైనా చనిపోతే, ఆ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల్లో సదరు సభ్యుడి కుటుంబసభ్యులు పోటీచేస్తే ప్రతిపక్షం పోటీ పెట్టదు. అయితే ఇంతవరకు ఆ విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వారంతా కూడా పార్టీ గుర్తు మీద గెలిచాక ఆ పార్టీలో ఉంటూ చనిపోయిన వాళ్ళే! కాని, ఇక్కడ భూమా నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నుండి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా గెలిచాడు. ఏడాది తర్వాత తెలుగుదేశంలో చేరాడు. ఇప్పుడు తెలుగుదేశం నాయకుడిగా మృతిచెందాడు. కాబట్టి నంద్యాల అసెంబ్లీ సీటు మాది అన్నది జగన్‌ వాదన. ఆ సీటు మాది కాబట్టే మేం పోటీకి దిగుతామంటున్నాడు.

జగన్‌ వాదనతో ఏకీభవించి చంద్రబాబు అభ్యర్థిని పెట్టకుండా ఉండలేడు, ఖచ్చితంగా పోటీ పెట్టాల్సిందే! మరణించిన నాయకుడి కుటుంబసభ్యులను పోటీకి దించితేనే కొంతన్నా సానుభూతి ఉంటుంది. కాని ఇక్కడ చూస్తే నాగిరెడ్డి పెద్దకూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండో కూతురు, కొడుకు చిన్నపిల్లలు. వారిని పోటీకి దించడం కష్టమే! ఆ కుటుంబసభ్యులు కాకపోతే కనీసం సానుభూతి కూడా పనిచేయదు. ఇక 2014 ఎన్నికల్లో నాగిరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన శిల్పామోహన్‌రెడ్డిని దించాలి. ఆయనను దించితే భూమా వర్గీయులు పనిచేయరు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేస్తోంది. ఒకవేళ శిల్పా మోహన్‌రెడ్డికి తెలుగుదేశం సీటివ్వకపోతే, ఆయనను తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడానికి వైకాపా రెడీగావుంది. మారిన పరిస్థితుల్లో భూమా మృతి పట్ల కూడా పెద్దగా సానుభూతి వచ్చే అవకాశం లేకపోవడం తెలుగుదేశంకు ఇబ్బందికర వాతావరణమే! కర్నూలుజిల్లాలో వైకాపా బలంగా ఉండడం, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరుగుతుండడం, కోట్ల కుటుంబం వైకాపాలో చేరుతుండడం, తెలుగుదేశంపై కె.ఇ సోదరులు అసంతృప్తిగా ఉండడం వంటి పరిణామాలన్నీ వైకాపాకు కలిసొచ్చేవే!

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter