farmerఎన్నికలప్పుడు నాయకులిచ్చిన వాగ్దానాలను నమ్మేస్తుండడం, తీరా ఆ వాగ్దానాలు ఉత్తుత్తివే అని తేలినప్పుడు ఆవేదన చెందుతుండడం మనకు కొత్తేమీ కాదు. నమ్మించడం వారి వంతు.. నమ్మడం మన వంతు. ఇది ఎంతోకాలం నుంచి వస్తున్న తంతు. ప్రజలను ఏదోవిధంగా మభ్యపెట్టి పదవు లందుకోవాలనే తపనే ఇప్పుడు నాయకుల్లో అధికమవుతూ ఉండడం అందరికీ తెలిసిందే. చెప్పిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఈ కాలానికి విరుద్ధమో ఏమో!. లేక, కలికాలపు రాజకీయాలు ఇలాగే ఉం టాయో ఏమో మరి!..మనదేశంలో ఇలాంటి వైఖరులవల్లే సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పుడు

ఉత్తరాదిన జరుగుతున్నది కూడా ఇదే. అక్కడ రైతులోకం ఇప్పుడు తీవ్ర ఆగ్రహంలో ఉంది. కారణం, అక్కడి ప్రభుత్వాలు తమ న్యాయమైన కోరికలు తీర్చడం లేదనే. ఏళ్ళు గడుస్తున్నా నాయకులిచ్చిన హామీలు నేటికీ నెరవేర్చడం లేదనే.

ఈ నెల1 నుంచి ఉత్తరాదిలో మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హరియానాల్లో రైతులతో పాటు చత్తీస్‌ఘడ్‌, కర్నాటక తదితర రాష్ట్రాల్లో కూడా రైతులు పెద్దఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ నెల 5 నుంచి రైతుల ఆందోళన మరింత ఉధృతం చేయాలని, 10న భారత్‌ బంద్‌ కూడా చేపట్టనున్నామని అఖిలభారత కిసాన్‌ సభ ప్రకటించింది కూడా. గత నెలలో ఇచ్చిన ఏ హామీనీ మహారాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, అందు వల్ల రైతుల ఆందోళన ముమ్మరం చేయాలని ఆ సంఘం నాయకులు నిర్ణయించారు. అనేక రాష్ట్రాల్లో రైతులు తమ బాధలు తీరుతాయని ఇంతకాలంగా ఎదురుచూసి విసిగిపోయారు. ఇక ఏ దారీ లేక రోడ్లెక్కి ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఎంతో కష్టపడి పండించుకున్న పంటను, కూరగాయల్ని తెచ్చి అసహనంతో రోడ్ల మీద కుమ్మరించేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూరగాయల ధరలు ఆకాశానికంటుతున్నాయి. చివరికి పాలసరఫరా కూడా నిలచిపోవడంతో పట్టణాలు, నగరాల్లోని ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. రైతుల కోరికలు కూడా న్యాయమైనవే. అవి గొంతెమ్మ కోరికలేమీ కాదు. వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, అన్నదాతలకు కనీస ఆదాయ పథకం అమలుచేయాలని, స్వామినాధన్‌ కమిటీ సిఫార్సులు అమలుచేసి తమ కష్టాలు తీర్చాలని, ఎరువుల ధరలు తగ్గించాలని వగైరా డిమాండ్లను నెరవేర్చాలని రైతులు ఎంతోకాలంగా కోరుతున్నారు. వాటిని 'తప్పకుండా నెరవేరుస్తాం'..అని నాయకులు ఎప్పుడో హామీలు కూడా ఇచ్చివున్నారు.

అయితే, ఎప్పటికప్పుడు దాటవేత ధోరణితో రైతులను వారు అసహనానికి గురిచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇక సమ్మె చేస్తే తప్ప తమ సమస్యల సాధనకు ప్రభుత్వాలు కదలవని రైతుసంఘాలతో కలసి రైతన్నలంతా సమ్మెకు సిద్ధమయ్యారు. దాదాపు వందకు పైగానే రైతు సంఘాలు కిసాన్‌ మహాసంఘ్‌ (ఆర్‌కెఎస్‌)గా ఏర్పడి రైతులకు రుణమాఫీ, మద్దతు ధర పెంపు తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మెలోకి దిగాయి. గ్రామీణప్రాంతాల రైతాంగం కూడా సమ్మెకు మద్దతునిస్తుండడంతో దేశవ్యాప్తంగా మార్కెట్లు మరింత సంక్షోభంలో పడ్డాయి. పదిరోజులపాటు పట్టణాలు, నగరాలకు పాలు-కూరగాయలు బంద్‌ అంటే తట్టుకోవడం కష్టమే! ఇప్పటికే ఢిల్లీలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. అయితే, ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే. రైతులు తమ బాధలు తీరడం లేదంటూ కడుపుమండి రోడ్డెక్కితే...'ఇదంతా వారు కేవలం ప్రచారం కోసమే చేస్తున్నారంటూ' కేంద్రంలోని ఒక మంత్రి అంటే, మరో మంత్రి ఇదంతా 'ఒక పబ్లిసిటీ స్టంట్‌' అంటూ బిజెపి మంత్రులు ఎకసక్కాలు పడుతుండడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. కేంద్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు రైతులను ఇలా అవహేళనగా మాట్లాడుతుండడం రైతుల్లోనే కాదు, ప్రజల్లోనూ సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 'అధిక వ్యవసాయ దిగుబడుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిం దంటూ' మరో మంత్రి వింత వాదన రైతులను మరింత చిర్రెత్తిస్తోంది. 'వాళ్లకి మరో పనేమీ లేదు. అర్ధంపర్ధం లేని ఆందోళన చేస్తున్నారు. పదిరోజుల పాటు వారు ఉత్పత్తులు ఆమ్ముకోకపోతే ఎవరికి నష్టం.. రైతులకే కదా'.. అంటూ హర్యానా ముఖ్య మంత్రి రైతులపై, రైతు సంఘాలపై విరుచుకు పడుతుండడం దేన్ని సూచిస్తున్నదో కేంద్రంలోని రాజకీయ విజ్ఞులకే తెలియాలి. కేంద్రం కూడా రైతు లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారి సమస్యలకు స్పందించక, ఏలినవారే నేరుగా విమర్శలకు దిగు తుండడం వింతపోకడ కాక ఏమవుతుంది?.. ఇలాంటి వాటివల్ల రైతుల నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకతనే ఆ నాయకులు 'మూట'కట్టుకోవాల్సి వుంటుంది తప్ప చివరికి సాధించేదేమీ వుండదు.

ఏదేమైనా రైతులకు అన్నివిధాల అండగా

ఉంటామని చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వంలో, ఏళ్ళు గడుస్తున్నా రైతుల బతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం ఎంతో విచారకరం!...రైతుల రుణమాఫీ పథకాలు ఒక ప్రహసనంగా మారుతుండడం ఎంతో బాధాకరం!.. రైతుల కష్టాలు తీర్చకుండా... రైతులనే హేళనగా మాట్లాడుతుండడం దారుణం!.. ఇకనైనా అలాంటి తీరు మారాలి. రైతుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగిరావాలి. ఆరుగాలం కష్టించి పంట పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. దళారుల మాయాజాలం నుంచి, బడా వ్యాపారుల మోసాల నుంచి రైతులను రక్షించాలి. స్వామినాధన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేసి వెంటనే రైతుల బాధలు తీర్చాలి. రైతు సౌభాగ్యమే.. దేశ సౌభాగ్యం కనుక... అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు అటు నాయకులు, ఇటు పాలకులు, ప్రభుత్వాలు అందరూ కృషిచేయాలి. ఆ కృషి కూడా పదికాలాలపాటు కృషీవలురకు మేలుబాటలు పరిచేదిగా ఉండాలి. అప్పుడే రైతుకు మంచి చేసినట్లవుతుంది!...తద్వారా దేశానికీ మేలు జరుగుతుంది!..

farmersఅదేమి వింతపోకడో తెలియదు గానీ, ఏలినవారికి జనం సమస్యలు తెలిసినా పట్టనట్లుంటుంటారు. ఎన్నిసార్లు తమ కష్టాలను కుయ్యోమొర్రోమంటూ విన్నవించుకున్నా 'సరే చూద్దాం..చేద్దాం' అంటూ నాన్చేస్తుంటారు. ఇక ఆ కష్టాలు భరించలేకనో, లేదా నేతల నిర్లక్ష్యాన్ని సహించలేకనో ఆగ్రహం ప్రదర్శించి ఏ నిరసనలో, అందోళనలో చేస్తే.. నాయకులు ఇక తప్పదన్నట్లుగా అప్పుడు 'అన్నీ చక్కదిద్దుతామని' చెప్పి చేతులు దులుపుకుంటుంటారు. ఇవన్నీ మనం చూస్తున్నవే. రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమై పోతున్నాయి. అయితే, అన్నిటికీ ఒకే మంత్రం పనికిరాదు. అందులోనూ, అందరికీ అన్నం పెట్టే అన్నదాతల విషయంలో నాయకులు నిర్లక్ష్యం ప్రదర్శించడం మంచిదికాదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే, జై కిసాన్‌ అంటూ జైజైలు కొడుతూనే.. రైతన్నే లేకపోతే దేశానికి అన్నం పెట్టేదెవరు?.. అంటూనే, మరోవైపు ఆ కర్షకుల కన్నీటిని మాత్రం పట్టించుకోకపోవడం ఎంత బాధాకరమో!..అందులోనూ వ్యవసాయమే ప్రధానంగా ఉన్న మన దేశంలో ఏళ్ళ తరబడిగా రైతుల పరిస్థితిని కానీ, రైతు కుటుంబాల దయనీయ స్థితిని గానీ పాలకులు పట్టించుకోకపోవడం విచారకరం. పచ్చని పంటపొలాలతో దేశాన్ని పత్రహరితం చేసి, సస్యశ్యామలం చేసే రైతుల బాధలను నిర్లక్ష్యం చేయడం కంటే ఘోరమైన విషయం ఇంకోటుం టుందా?.. ఇవన్నీ నేతలకు తెలియని విషయాలేమీ కావు. కానీ, వారి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. కాలాలు మారినా, తరాలు మారినా.. ప్రభుత్వాలు మారినా... నేతలే మారినా చివరికి అన్న దాతల తలరాతలు మాత్రం మారనే మారడం లేదు. వారి కష్టాలు మాత్రం తీరనే తీరడం లేదు. సేద్యానికి పొలం వద్దకు వెళ్ళినకాడి నుంచీ ఎన్నో రకాల సమ స్యలు. పంట పండేదాకా ఎన్నో బాధలు, వ్యయప్రయాసలు. దీంతో ఇంటినిండా అప్పుల కుప్పలు. ఎలాగో ఆరుగాలం కష్టించి, చెమటోడ్చి పంటలు పండించినా చివరికి తిండిగింజలు ఇంటిదాకా వస్తాయన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఏ అకాల వర్షానికో పంట నీట మునిగిపోవచ్చు. లేదా సరైన గిట్టుబాటు ధరలు లేక చేసిన కష్టమంతా నష్టాల పాలుకావచ్చు. రైతన్నలు ఇలా ఏళ్ళ తరబడి బాధల సుడిగుండాల్లో మునిగిపోతూ..వారి కుటుంబాలు అప్పుల నిప్పుల్లో కాగిపోతుంటే.. రైతు తనకు తనే కరిగిపోయిన కన్నీటిముద్ద అవుతాడే తప్ప, ఎవరికీ ఆ బాధను తెలియనివ్వడు. చిరునవ్వుతోనే మళ్ళీ సేద్యం చేసి పంటలు పండించాలనే తపనతో.. పొలాలవైపు అడుగులువేసే అత్యంత సహనశీలి..అన్నదాత. అందుకే, సహనంలో భూమాత తర్వాత అంతటి స్థానం అన్నదాతదే నంటుంటారు పెద్దలు. అలాంటి అన్నదాతలో సహనం నశిస్తే..అన్నదాతకే అగ్రహం వస్తే... ఏమవుతుంది?.. సాగరములన్నీ ఏకము గాకపోవచ్చుగాక... ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. సరిగ్గా ఇప్పుడు ముంబైలో జరిగింది కూడా ఇదే. ఏళ్ళ తరబడిగా తమ సమస్యలు పట్టించుకోని ప్రభుత్వతీరుపై రైతులు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. పంట రుణాలను సంపూర్ణంగా అందజేయాలని, విద్యుత్‌ బిల్లులను మాఫీ చేసి ఆదుకోవాలని, విపత్తుల్లో దెబ్బతిన్న బాధిత రైతాంగానికి బాసటగా ఉంటూ తగు పరిహారం అందించాలని, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న అటవీభూములను వారికే కేటాయించాలని, స్వామినాధన్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని తదితర డిమాండ్ల సాధనకు రోడ్డెక్కారు. వేలాదిమంది నినాదాలు చేస్తూ రోడ్డెక్కడంతో ముంబైవాసులు సైతం ఆశ్చర్యపోయారు. ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసుకున్నా తమను పట్టించుకోని మొండిసర్కారు అవాక్కయ్యేలా చేసేందుకు.. ఎవరూ ఊహించనివిధంగా సుమారు 60వేల మంది కర్షకులు 'మహాపాదయాత్ర' చేసి రైతన్న ధీశక్తి ఏమిటో ప్రభుత్వానికి కళ్ళారా చూపించారు.. కాళ్ళారా నడిచి మరీ చూపించారు. దాదాపు 180 కిలోమీటర్ల దూరం..ఎండను సైతం లెక్కచేయక.. కాళ్ళు కాలుతున్నా కఠోరదీక్షతో పాదయాత్ర చేశారు. ఎండదెబ్బకు కాళ్ళు మాడిపోయి పుండ్లు పడినా మహిళా రైతులు సైతం రోడ్డుమీంచి పక్కకు వెళ్ళలేదు. యాత్ర వారం రోజులపాటు ఎంతో క్రమశిక్షణగా ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా సాగడం మరో విశేషం. ఇది రైతుల లాంగ్‌మార్చ్‌గా అందరి కితాబును అందుకో వడం వేరే విషయం. తమ కష్టాలు తీర్చాలంటూ, రాజ్యాంగబద్ధమైన తమ హక్కుల సాధన కోసం వేలాదిమంది రైతులు నాసిక్‌ నుంచి ముంబైకి పాద యాత్రగా బయలుదేరారు. కర్షకులంతా వేలాదిగా కదలివస్తున్న దృశ్యం చూసి ముంబై అవాక్కయింది. ఆ మహాకర్షక జనసముద్రాన్ని చూసి ముంబైవాసు లంతా నివ్వెరపోయారు. ఆయాప్రాంతాల్లో జనం వారిని ఆదరించి స్వాగతించారు. నీళ్ళు, బిస్కెట్లు అందించారు. ఆ కష్టజీవులకు రెండుచేతులా తమ సౌహార్ద్రాన్ని అందించారు. సిపిఎం అనుబంధసంస్థ అయిన అఖిలభారత కిసాన్‌సభ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరిగింది. ఈ మహాపాద యాత్రతో మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం దిగివచ్చింది. ప్రతిపక్షాలతో పాటు, శివసేన నాయకుల వత్తిడితో అన్నదాతలు కోరిన కోరికలన్నిటినీ తీర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎట్టకేలకు కర్షకులు శాంతించారు. తమ అందోళన విరమించారు. ఇది రైతుల ఘనవిజయంగా అందరూ కొనియాడారు.

అయినా, ఆ శ్రమజీవుల కష్టాలను ప్రభుత్వాలు ఇన్నేళ్ళుగా పట్టించుకోకపోవడం.. వారు ఎండల్లో రోడ్లెక్కి పాదయాత్రలు చేసే దుస్థితిని తీసుకురావడం ఎంత బాధాకరం?.. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను నిర్లక్ష్యం చేయడం, వారి బాధలు తీర్చకపోవడం ఎంత విచారకరం. ఇకనైనా ప్రభుత్వాలు.. పాలకుల తీరు మారాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వదిలి అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకోవాలి. మాటలతో రైతులను మభ్యపెట్టక..చిత్తశుద్ధితో వారిని ఆదుకోవాలి. సమాజానికి..దేశానికి.. అందరికీ అన్నం పెట్టే రైతన్న కంటనీరు పెట్టుకునే దుస్థితి ఇకనైనా పోవాలి. కర్షకులు, వారి కుటుంబాలు చల్లగా పదికాలాలపాటు జీవించినప్పుడే అందరికీ ఆనందం. అదే..దేశానికీ సౌభాగ్యం!....

danyamరైతు దేశానికి వెన్నెముక. రైతేరాజు, జై కిసాన్‌, అన్నదాత లేనిదే ఈ దేశం లేదు... ఈ మాటలన్నీ వినడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. కాని ఆచరణలోకి వచ్చేసరికి రైతు పరిస్థితి నైట్‌వాచ్‌మెన్‌ కంటే ఘోరంగా ఉంటుంది. రైతుకు సరైన ఆదరణ, సముచిత ప్రాధాన్యత లేక, వ్యవసాయం చేసేవారికి సరైన హోదా, గౌరవం లేక రానురాను వ్యవసాయం చేసేవాళ్లే తగ్గిపోతున్నారు. రైతులకు ఏ ప్రభుత్వంలోనూ న్యాయం జరక్కపోతుండడం మూలంగా అసలు వ్యవసాయం చేయాలనే ఉద్దేశ్యమే కనుమరు గవుతుంది. రైతు ఆరుగాలం కష్టించి పెట్టుబడి పెడితే ఫలసాయం చేతి కొస్తుంది. కాని, అతను ఉత్పత్తి చేసినప్పుడు అతని చేతికొచ్చే రేటుకు, మార్కెట్‌లో అదే ఉత్పత్తి వినియోగదారుడి చేతిలోకి వెళ్ళినప్పుడు అతను చెల్లిస్తున్న రేటుకు బండకు, కొండకు ఉన్నంత వ్యత్యాసముంటుంది.

ఉదాహరణకు ఒక రైతు తన పొలంలో పండిన కొబ్బరికాయ లను కాయ ఒకటి 5రూపాయల లెక్కన అమ్మాడనుకుందాం. అదే రైతు ఊర్లోకి వచ్చి దానిని కొనబోతే పాతికరూపాయలు చెబుతారు. ఏడాది పొడవునా కష్టపడి, పెట్టుబడిపెట్టి దిగుబడి సాధించిన రైతుకేమో 5రూపాయలు, ఒక్కరోజు పెట్టుబడిపెట్టి దానిని కొన్న వ్యాపారులకేమో 20రూపాయల ఆదాయం. ప్రతి పంటలోనూ రైతులు ఇదే విధంగా నష్టపోతున్నారు.

ముఖ్యంగా జిల్లాలో ఇప్పుడు వరికోతలు మొదలుకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5లక్షల ఎకరాలలో వరిసాగు చేస్తున్నారు. గూడూరు, నాయుడుపేట డివిజన్‌లలో కొంత ముందుగా పైర్లు వేయడంతో ఈ నెలాఖరుకు కోతలు పూర్తి కానున్నాయి. మిగతా ప్రాంతాలలో వచ్చే నెలలో కోతలుంటాయి. వరి కోతలు మొదలవ గానే దళారులు రాజ్యమేలుతుంటారు. పంట పండించిన ప్రతి రైతు తన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకెళ్ళి అమ్ముకోలేడు. అలాగని గిట్టుబాటు ధరలు వచ్చేవరకు గోడౌన్‌లలో దాచుకోలేడు. దానికి తగ్గ గోడౌన్‌లు కూడా లేవు. పైర్లు వేయడానికే అప్పులు తెచ్చి వుంటారు. ఈ అప్పులు తీర్చుకోవడానికి కళ్లాల్లోనే ధాన్యాన్ని దళారులు చెప్పిన రేటుకే తెగనమ్ముకుంటుంటారు. జిల్లాలో వరికోతలు మొదలు కానున్నాయి. ఇప్పటికే దళారులు రంగప్రవేశం చేశారు. మార్కెట్‌లో రేటుకు కళ్లాల్లో వాళ్ళు కొంటున్న రేటుకు దాదాపు వెయ్యి నుండి 1500 రూపాయల దాకా తేడా వుం టుంది. ఎకరాకు నాలుగు పుట్లు పండితే దాదాపు అయిదారువేలు అక్కడే నష్టపోతున్నాడు. అధికారులు చొరవ తీసుకుని రైతులకు అవగాహన కల్పించి, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వారి కష్టానికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి. సేద్యంపై రైతులు విరక్తి పెంచుకోకుండా, వారికి తగిన న్యాయం చేయాలి!

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter