galpikaన్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయం. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అనంత కుమార్‌ తదితరులు వున్నారు. అప్పుడే ఒక స్పెషల్‌ ఫ్లైట్‌ ల్యాండయ్యింది. అందులో నుండి ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు దిగాడు. మోడీ ఆయనకు ఎదురెళ్లి ఆత్మీయంగా కౌగిలించుకుని స్వాగతం పలికాడు. నెతన్యాహు తనతో పాటు తెచ్చిన బ్యాగులను తెరిచాడు. అందులో నుండి మోడీకి ఇష్టమైన సూటూ, కోటు, వాచీలు తీసి ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. అలాగే సుష్మాస్వరాజ్‌, నిర్మలా సీతారామన్‌లకు పట్టుచీరలు, పసుపు కుంకమలు అందజేసి మొన్న రక్షాబంధన్‌కు ఇండియా వచ్చి మీ చేత రాఖీ కట్టించు కోవాలను కున్నాను! కాని, బిజీ వల్ల రాలేకపోయాను, ఈ అన్నయ్యను క్షమిం చండమ్మా! మీరే నా చెల్లెళ్ళు, ఈ రాఖీలు కట్టండి అంటూ వారి చేతులకు రాఖీలిచ్చి తన చేతికి కట్టించుకున్నాడు. నెతన్యాహు చూపించిన అభిమానానికి వాళ్ళకు ఏమీ అర్ధం కాలేదు. అక్కడ స్వాగత సత్కార్యాలయ్యాక అందరూ కార్లెక్కారు. కాన్వాయ్‌ బయలు దేరింది. మొదట తాజ్‌మహల్‌ వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడకు పెద్దఎత్తున భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు చేరి వున్నారు. బెంజిమన్‌ నెతన్యాహు వారిని చూసి... వీళ్ళంతా ఎవరు? ఎందుకొచ్చారని అడిగాడు. వాళ్ళంతా భజరంగ్‌దళ్‌ సభ్యులు, తాజ్‌మహల్‌ ఒకప్పుడు శివాలయం అని వారి నమ్మకం. అందుకే ప్రతిరోజూ వచ్చి పూజలు చేస్తుంటారని మోడీ వివరించాడు. ప్రపంచంలో ఇదో వింత కదా అని నెతన్యాహూ అడిగాడు. దానికి రాజ్‌నాథ్‌సింగ్‌... మాకు ఈ సమాధి వింతేం కాదు, కాని బయట దేశాలవాళ్ళు వచ్చి దీనిని చూడడమే మాకు పెద్ద వింత అని చెప్పాడు. తాజ్‌మహల్‌ కట్టిం చిందెవరు? అని నెతన్యాహు అడిగాడు. వెంటనే అనంతకుమార్‌... దీనిని కట్టించిన తాపీమేస్త్రి బ్రతికిలేడు, అప్పుడే చచ్చిపోయాడు అని చెప్పాడు. తాజ్‌మహల్‌ అంటే వీళ్ళందరికీ ఒళ్ళు మంట లాగుందని గ్రహించిన నెతన్యాహు అది చూడ్డం ఆపి మళ్ళి కారెక్కాడు. కాన్వాయ్‌ నేరుగా ప్రధాని కార్యాలయానికి చేరుకుంది. భారత్‌-ఇజ్రాయిల్‌ దేశాల అధికారులు, రాయబారులు, విదేశాంగ మంత్రులు అక్కడకు వచ్చేసారు. బెంజిమన్‌ నెతన్యాహుకు దోశెలు, చికెన్‌, అరిసెలు, వడలతో అల్పాహారం పెట్టారు. ఇవి ఎక్కడివి, ఈ వంటకాలను ఎప్పుడూ చూడలేదే అని నెతన్యాహు సందేహం వెలిబుచ్చాడు. అందుకు మోడీ... ఇవి సంక్రాంతి వంటకాలు... మా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు నుండి పంపించాడు. బాగా వుంటాయి తినండి అని చెప్పి వడ్డించాడు. నెతన్యాహు వాటిని లొట్టలేసు కుంటూ తిన్నాడు.

తర్వాత ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయి. ప్రధాని మోడీ... మా దేశ రక్షణ విషయంలో మీ సహకారం కావాలి. వంద యుద్ధ విమానాలు, 150 హెలికాఫ్టర్‌లు, అత్యాధునిక గన్‌లు లక్ష, 500 శతృఘ్నులు, 250 బాంబర్లు కావాలి... ఎంత డబ్బు చెల్లిం చాలో చెప్పండి అని మోడీ అడిగాడు. మీరు అడిగిన వాటికి రెండింతల ఆయుధాలు, యుద్ధ విమానాలు అందజేస్తాం. ఇక డబ్బు అంటారా? మీతో మాది స్నేహబంధమేకాని వ్యాపార బంధం కాదు అని నెతన్యాహు చెప్పాడు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వుండి... మా సరిహద్దుల్లో చైనా, పాక్‌లతో నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయి. మా సరిహద్దుల్లోకి చొరబడుతున్నారు. కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. వారితో మాకు ఎప్పుడైనా యుద్ధం రావచ్చు. వాళ్ళతో యుద్ధమే వస్తే మాకు మీ సాయం కావాల్సి వుంటుందని అడిగింది. నెతన్యాహు దానికి బదులిస్తూ... ఇక్కడ మీరు వేరు కాదు, మేము వేరు కాదు... మన దేశాలు వేరు కావొచ్చేమో, రెండింటి ప్రాణం మాత్రం ఒక్కటే! మీ దేశం మీదకు ఎవరైనా యుద్ధానికి వచ్చారంటే వాళ్ళు మా దేశం మీదకు కూడా వచ్చినట్లే! మీ గుండెకు గాయమైతే మా గుండెకు గాయమైనట్లే! మీరు ఓడిపోతే మేము ఓడిపోయినట్లే! మీరు గెలిస్తే మేం గెలిచినట్లే... అని ఎంతో అభిమానం చూపిస్తూ చెప్పాడు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ వుండి... వ్యవసాయ రంగంలో మేమింకా చాలా వెనుకబడి వున్నాం. మీరు మాకంటే ఎంతో ముందున్నారు. ఏడారిలో కూడా పంటలు పండిస్తున్నారు. మీ వ్యవసాయ టెక్నా లజీని మా రైతులకు కూడా నేర్పించాలి. అందుకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం అని చెప్పాడు. ఆ మాట వినగానే నెతన్యాహు కాలికున్న చెప్పును చేతిలోకి తీసుకున్నాడు. ఆ సంఘటనతో అందరూ షాకయ్యారు. నెతన్యాహు తన చేతిలోని చెప్పును మోడీ చేతిలో పెట్టి... ఇంకోసారి మన మధ్య 'డబ్బు' అనే మాట వినిపిస్తే ఈ చెప్పుతో నన్ను కొట్టండి, మీరు కొట్టకుంటే నేనే కొట్టుకుంటాను. మన మధ్య డబ్బు అనే మాటే వుండకూడదు. మన బంధానికి డబ్బు అడ్డురాకూడదు అని చెప్పాడు. నెతన్యాహు చూపిస్తున్న ప్రేమకు మోడీతో పాటు అక్కడున్న అందరి కళ్ళల్లోనూ నీళ్ళు తిరిగాయి. మోడీ మనసులో నేను పీఎం అయ్యాక ఒబామాను చూసాను, ట్రంప్‌ను చూసాను, థెరిసామే, మోర్కెలా ఏంజిల్‌, షిజోఅంబే, నవాజ్‌ షరీఫ్‌, జిన్‌పింగ్‌లు... ఇలా ఎంతోమందిని కలిసాను. అందరూ తమ దేశ ప్రయోజనాలు చూసుకొన్నవాళ్ళే గాని, అవతల దేశం గురించి ఆలోచించినవాళ్ళు లేరు. కాని నెతన్యాహు నిజమైన మిత్రుడు, తన దేశం కంటే కూడా అతను భారతదేశం గురించి ఎక్కువుగా ఆలోచి స్తున్నాడు. థాంక్‌యు నెతన్యాహు అని అనుకున్నాడు. సుష్మాస్వరాజ్‌ వుండి... భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం కోసం మీరు మద్దతు ఇవ్వగలరా? అని అడిగింది. అది విని నెతన్యాహు... ఇవ్వగలరా? సహకరించగలరా? అనే ప్రశ్నలే వద్దక్కా, మీరు ఆదేశించాలి, నేను పాటించాలి. మీ కోసం నేను బావిలో దూకమన్నా దూకుతాను, మీరు ఇక్కడ సంతకం పెట్టండి అని చెబితే చాలు కళ్ళు మూసుకుని ఎక్కడైనా పెట్టేస్తాను. నేను మీ మనిషిని. పరాయివాడిగా చూడొద్దు అని నిష్టూర పోయాడు.

అప్పుడు మోడీ అతనితో... నువ్వు మాలో మనిషివే, మా మనిషివే... నువ్వు మా పట్ల ఇంత ప్రేమాభిమానం చూపిస్తున్నావ్‌, ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం అని అన్నాడు. అందుకు నెతన్యాహు... మీరు నాకు ఏమీ ఇవ్వబల్లేదు. నాలుగు టన్నులు నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలన్విండి... అవి నా దగ్గరుంటే చుట్టుపక్కల అరబ్బు దేశాలకు వణుకు పుట్టిస్తాను అని తన మనసులోని మాటను చెప్పాడు. అది విని మోడీతో సహా అందరూ నెల్లూరు దోమలు ఇంత పవర్‌ఫుల్లా అని నోర్లు తెరిచారు.

galpikaఅది స్నానానికి వాడిన నీటిని సైతం రీసైక్లింగ్‌ చేసుకుని తాగునీటిగా వాడుకునే సింగపూర్‌ దేశం, రాష్ట్రం, జిల్లా మరియు నగరం కూడా! ఆ దేశ ప్రధాని లీ.... తన సహచరమంత్రులతో సమావేశమై ఉన్నారు. ప్రధాని ముఖంలో ఏదో ఆందోళన కని పిస్తోంది. మంత్రి డుపెంగ్‌ లేచి... ఇప్పుడు సమావేశానికి కారణ మేంటని అడిగాడు. ప్రధాని లీ స్పందిస్తూ... మనం ఆ స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనవసరంగా రాజధాని ఒప్పందం కుదుర్చుకున్నామనిపిస్తోంది. మనం రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చామో లేదో సింగపూర్‌ను మించిన రాజధానిని నిర్మిస్తామం టున్నాడు. మనమిచ్చిన మాస్టర్‌ప్లాన్‌తో మనల్ని మించిన రాజధాని కడితే మన ప్రజల దృష్టిలో మనం చులకనైపోమా, వెర్రి వెంగళప్పలం కామా... అనేదే నా బాధ. అసలే ఆ చంద్ర బాబు సూది దూరే సందిస్తే దూలం దూర్చే రకమన్నాడు. వెంటనే ఇంకో మంత్రి తన్నీరు సెల్వం లేచి... అవును సార్‌, మీరంటుంటే నాకు చంద్రబాబు మీద ఎందుకో సందేహమొస్తుంది. ఈమధ్య ఆంధ్రప్రదేశ్‌కు సింగపూర్‌ రాజధానినందిస్తానని ఆయన పదేపదే అంటున్నాడు. ఇటీవలకాలంలో హైదరాబాద్‌లో కంటే, విజయవాడలో కంటే కూడా సింగపూర్‌లోనే ఎక్కువుగా వుంటున్నాడు. ఏ.పి రాష్ట్ర పరిపాలన కోసం సింగపూర్‌లోనే ఒక క్యాంపు కార్యా లయాన్ని వెదుకుతున్నట్లు తెలిసింది. చివరకు ఆయన ఏం చేయబోతాడంటే సింగపూర్‌లోనే మకాం పెట్టి దీనినే ఏపి రాజధానిగా ప్రకటిస్తాడేమోనని భయంగా వుందని చెప్పాడు. చంద్రబాబుకు పట్టిన సింగపూర్‌ పిచ్చి వదిలించాలంటే ఏం చేయాలని ప్రధాని లీ అడిగాడు. ఆయనకు సింగపూర్‌ పిచ్చిని వదిలించడం కాదు, ఆయనను సింగపూరే వదిలేలా చేయాలి, దీనికి బెస్ట్‌ ఆప్షన్‌ హైదరాబాద్‌లో జరిగినట్లుగా 'ఓటు-నోటు' లాంటి కేసును ఇక్కడ కూడా సృష్టించి ఆయ నను ఇరికిస్తే సరి అని సలహా ఇచ్చాడు మంత్రి చువాంగ్‌. ప్రధాని లీ వెంటనే దానికి ఓకే అని చెప్పాడు.

----
హైదరాబాద్‌లో హైటెక్‌రత్న చంద్రబాబు నివాసం. చంద్రబాబుతో పాటు మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, జేసీ దివాకర్‌రెడ్డిలు ఉన్నారు. పత్తిపాటి పుల్లారావు వుండి... సార్‌, ప్రత్యేకహోదా మీద ఆ జగన్‌ నిరాహారదీక్షకు కూర్చుంటున్నాడు, ఎలాగైనా ఆపాల న్నాడు. అది విన్న జె.సి.దివాకర్‌రెడ్డి... మీ అందరికీ తల కాయలున్నాయా లేవా...? జగన్‌ దీక్ష చేస్తే హీరో అవుతాడు, దీక్ష మానేస్తే జీరో అవుతాడు. ఈ చిన్న లాజిక్‌ను మీరు ఎలా మిస్సవుతున్నారని 'అతడు' సినిమాలో ప్రకాష్‌రాజ్‌ లెవల్లో అడిగాడు. ఈ లాజిక్‌లతో మాకెందుకు... జగన్‌ దీక్ష చేయకుండా అడ్డుకోవడమే మా టార్గెట్‌ అని చంద్రబాబు అప్పటికప్పుడు డిజిపి జె.రాముడుకు ఫోన్‌ చేశారు. చూడు డిజిపి... నిరాహారదీక్ష చేయడమంటే ఆత్మహత్యకు ప్రయత్నిం చడమే... ఆ జగన్‌ ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తున్నాడు. అదీగాక ప్రశాంతంగా నిరాహారదీక్ష చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన దీక్ష చేయకుండా అడ్డుకోండి సార్‌ అని చెప్పాడు. అది విన్న జె.సి.దివాకర్‌రెడ్డి వెంటనే తన సెల్‌ఫోన్‌ తీసి జగన్‌కు ఫోన్‌ చేశాడు. ఆయన ఫోన్‌ ఎత్తగానే... ఓబ్బి జగన్‌... నీకు నిరాహారదీక్ష చేసే పని లేదు... శుభ్రంగా తిని పడుకో... దీక్ష చేస్తే వచ్చే పాపులారిటీకంటే మీ దీక్షను ఆపి ఎక్కువ పాపులారిటీని మావాళ్లే ఇస్తున్నారు. వీళ్ల తెలివితెల్లారా... అంటూ ఫోన్‌ పెట్టేసాడు. జేసీ మాటలు విన్న చంద్రబాబు ముఖం చిట్లించుకుని.. దారినపోయే ముళ్లకంపను తగిలించు కున్నట్లయ్యింది నా పని అనుకుంటూ... ఇక సింగపూర్‌ విశేషాలేంటని నారాయణను అడిగాడు. దానికి నారాయణ.. సార్‌, హైదరాబాద్‌ నుండి సింగపూర్‌కు డైలీ సర్వీసు నడప బోతున్నాం. మీరు, మన మంత్రులమూ, పిఎస్‌లందరమూ ఉదయాన్నే ఆ ఫ్లైట్‌లో సింగపూర్‌కు వెళతాము, అక్కడే క్యాంప్‌ ఆఫీసును సిద్ధం చేసాము. సాయంత్రం దాకా పరి పాలనకు సంబంధించిన పనులు చూసుకుంటాము, సాయంత్రం అందరం కలిసి అదే ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు వచ్చి ఎవరిళ్లకు వాళ్లం పోతాము. అప్పుడు సింగపూర్‌ లాంటి రాజధాని కాన్సెప్ట్‌ పోయి సింగపూరే మన రాజధాని అవుతుంది. కొన్నాళ్లు సింగపూర్‌లో మనం మకాం పెట్టామనుకోండి... ఇప్పటికే తెలుగుదేశంను జాతీయ పార్టీగా ప్రకటించి ఉన్నాము, సింగ పూర్‌లో కూడా పార్టీని పెట్టి అంతర్జాతీయ పార్టీగా ప్రకటించ వచ్చు. సింగపూర్‌ లాంటి రాజధాని కట్టే పని లేకుండా సింగ పూర్‌నే మనం ఆక్రమించేయవచ్చు... అని చెప్పాడు. మరి రాజధాని కోసం సేకరించిన అమరావతి భూములను ఏం చేద్దామని చంద్రబాబు అడిగాడు. మనమేమన్నా సింగపూర్‌ లాంటి రాజధానిని నిజంగానే కడదామని అక్కడ భూములు సేకరిం చామా... రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులతో నాలుగు రేకులషెడ్లు కూడా వేసుకోలేము. మన దగ్గర చూస్తేనా ఉన్న నిధులను పుష్కరాలకు, పట్టిసీమకు అని చెప్పి గోదావరిలో తోసేసాము. కాబట్టి రాజధాని పేరుతో వున్న భూములను అమ్ముకుని నిధులు సమీకరిద్దాం. సింగపూర్‌ రాజధాని ఏదయ్యా అని భూములిచ్చిన రైతులు అడిగితే... అందర్నీ విమానాలలో ఎక్కించి సింగపూర్‌ చూపించుకుని వద్దాం, రైతులిచ్చిన భూముల విలువతో పోలిస్తే సింగపూర్‌ ట్రిప్‌కు పెద్ద ఖర్చేమీ కాదని అన్నాడు. నారాయణ మాటలకు ముగ్ధుడైన చంద్రబాబు... నారాయణ, నీలాంటివాడు నాకు 1985 నుండే తోడై వుంటే అలెగ్జాండర్‌ మాదిరిగా ఈ ప్రపంచాన్నే దున్నేసేవాడినన్నాడు. నారాయణ మనసులో... నీలాంటోడు నాకు తగిలివున్నా ఈవరకే ప్రపంచంలోని అన్ని దేశాల్లో నా విద్యాసంస్థలే వుండేవనుకుంటూ సింగపూర్‌ బయల్దేరడానికి లేచారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter