galpikaఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. కాపువీధిలోని ఆనం నివాసం. రాత్రి డైనింగ్‌ టేబుల్‌ వద్ద స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకానందరెడ్డి(66+), ఆనం రామనారాయణరెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌ రెడ్డి, ఆనం చెంచుసుబ్బారెడ్డి, రంగమయూర్‌రెడ్డి, శుభకర్‌రెడ్డి, కార్తికేయ రెడ్డిలు భోజనానికి కూర్చోగా మహిళలు ప్లేట్లలో వడ్డించసాగారు. భోజనం చేయడానికి ముందు వివేకా కళ్లకున్న నల్లద్దాలు తీసి పక్కనపెట్టి చొక్కా జేబులో నుండి ఓ చీటీ తీసి మడత విప్పాడు. గోడకు వున్న తన మాతృమూర్తి స్వర్గీయ రమణమ్మ గారి ఫోటోను చూస్తూ...

అమ్మా...

మేకప్‌ వేసుకోవడానికి అందమైన ముఖాన్నిచ్చావ్‌

సెకండ్‌షోలకు వెళ్ళడానికి డబ్బులిచ్చావ్‌

రాసుకోవడానికి పలకనిచ్చావ్‌

గీసుకోవడానికి గడ్డమిచ్చావ్‌

తిరగడానికి కారిచ్చావ్‌

తాగడానికి నీరిచ్చావ్‌

నలుగురిని అభిమానించే మనసునిచ్చావ్‌

నలుగురి మెప్పుపొందే లీడర్‌షిప్‌నిచ్చావ్‌

మరి ఎందుకమ్మా మమ్మల్ని వదిలి వెళ్లావ్‌...

మమ్నల్ని వదిలి వెళ్లావ్‌...

అయినా నువ్వెప్పుడూ మా గుండెల్లోనే ఉంటావ్‌...

మా గుండెల్లోనే ఉంటావ్‌...

ఒక్కసారి నీ ఒడిలో పడుకుని నిద్రపోవాలని ఉందమ్మా...

చిన్నపిల్లాడినై నీ చేతి గోరుముద్దలు,

నీ చేత చెంపదెబ్బలు తినాలని ఉందమ్మా...

అని అంటూ వెక్కివెక్కి ఏడవసాగాడు. అందరూ ఆయనను ఓదార్చారు. భోజనాలయ్యాక వివేకా తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.

్య్య్య్య్య

''బుడిబుడినడకల తప్పటడుగులే మణిమాణిక్యాలు' అనే 'యమలీల' సినిమా పాట వినిపించడంతో వివేకా కళ్లు తెరిచాడు. ఎదురుగా ఆయన అమ్మ వెంకటరమణమ్మ చేతిలో ఇడ్లీ గిన్నెతో వుంది. వివేకా ఆనందంతో లేచాడు. ఒకసారి తనను చూసుకు న్నాడు. మనిషి నిక్కరు, చొక్కా మీద వున్నాడు. పక్కనేవున్న అద్దంలో తనను తాను చూసుకున్నాడు. ఆశ్చర్యం... పదేళ్ళ బాలుడిలా వున్నాడు. ఒక్క నిముషం అతనికేమీ అర్ధం కాలేదు. నేనింకా చిన్నపిల్లాడినేనా... నేను కాలేజీకి పోవడం, క్లాసు ఎగ్గొట్టి గోడలు దూకి సినిమాకు పోవడం, స్కూటర్‌ మీద రౌండ్లు కొడుతూ అమ్మాయి లకు సైటు కొట్టడం, ఏ.సి సెంటర్‌లో వేరుశెనక్కాయలు తినడం, నెల్లూరు మున్సిపల్‌ ఛైర్మెన్‌ కావడం... మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం... ఇదంతా కలేనా? మరి నాకు పరిచయమైన వీళ్లంతా ఎవరు... నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.యస్‌.రాజశేఖరరెడ్డి, చంద్ర బాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, కె.వి.పి.రామచంద్రరావు, బొత్స సత్య నారాయణ, సి.వి.శేషారెడ్డి, డేగా నరసింహారెడ్డి, కలికి యానాదిరెడ్డి, చాట్ల నరశింహారావు, పిండి సురేష్‌, భానుశ్రీ, బర్నా, మాధవ... అసలు వీళ్లంతా ఎవరు? వీళ్లతో నాకు పరిచయం వున్నట్లు వచ్చిన ఈ కలంతా ఏంటి...? తెల్లారుజామున వచ్చిన కలలు నిజమవుతా యంటారు. నేను పెద్దయ్యాక ఎమ్మెల్యేనవుతానేమో... వీళ్ళందరితో పరిచయం కలుగుతుందేమో... ఆ కలలో వచ్చిన సంఘటనలు ఇంకొన్ని మరిచిపోయా... నెల్లూరులో షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్‌. సినిమా హీరోయిన్‌లు రావడం, హీరో మాదిరిగా వారితో కలిసి తాను వాటిని ప్రారంభించడం.. అబ్బో ఈ కలే ఇంత అందంగా వుంటే ఇక నిజమైతే ఇంకెంత బాగా ఉంటుందో అని మనసులో అనుకున్నాడు. ఈలోపు వెంకటరమణమ్మ... ఏంటి కన్నా అంతగా ఆలోచిస్తున్నావ్‌ అని అడిగింది. అప్పుడు తనకొచ్చిన కలల గురించి వివేకా చెప్పాడు. నా బుజ్జికొండకు అన్నీ మంచి కలలే వస్తాయి. నువ్వు పెద్దయ్యాక పెద్ద లీడర్‌వు అవుతావుగాని. ఇప్పుడు మాత్రం బుద్దిగా చదువుకో... ఇదిగో ఈ రెండు ఇడ్లీలు తిను అంటూ ఇడ్లీ ముక్క తుంచి నోటిలో పెట్టబోయింది. అప్పుడు వివేకాకు మళ్ళీ ఇంకో ఆలోచన... రియాజ్‌ బిరియాని, రాగిసంగటి, పాయ, తల కాయ కూర... నేను ఇవన్నీ తింటుంటానే... ఓహో... అది కూడా కలే అయ్యుంటుందని అనుకుని తన తల్లికి ఆ కల గురించి కూడా చెప్పాడు. నువ్వు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఆదివారం బిర్యానీ చేసి పెడతానులే అని రమణమ్మ చెప్పారు. బిర్యానీ అన గానే... అది ఎలా వుంటుందో తినాలనిపించింది వివేకాకు. తల్లి పెట్టిన టిఫిన్‌ తిని లేచి గబగబ రెడీ అయ్యి తెల్లచొక్కా, బ్లూ నిక్కర్‌ యూనిఫామ్‌ వేసుకున్నాడు. రమణమ్మగారొచ్చి తలకు ఆముదం పెట్టి నున్నగా దువ్వి... ఇప్పుడూ చక్కగా చూడముచ్చటగా వున్నా వని కొడుకును మెచ్చుకుంది. వివేకా తనతో పాటు తమ్ముళ్ళు రామనారాయణ, జయ, విజయలను తోడబెట్టుకుని స్కూల్‌ కెళ్లాడు. వివేకా ఐదో తరగతి, రామనారాయణ నాలుగో తరగతి, జయ, విజయలు మూడో తరగతి. అప్పుడే సోషల్‌ టీచర్‌ వచ్చాడు. పిల్ల లకు ప్రశ్నలు వేయసాగాడు. అమెరికా అధ్యక్షుడు ఎవరు? అని అడిగాడు. వివేకా టక్కున లేచి... డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాడు. టీచర్‌కు మండింది. తిక్కతిక్క సమాధానాలు చెప్పకు... ట్రంప్‌ ఎవరు...? ఆ పేరెప్పుడూ వినలేదే... అమెరికా ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ నిక్సన్‌ అని చెప్పి... మళ్ళీ కనీసం ఇండియా ప్రధాని అన్నా తెలుసా? అని అడిగాడు. వివేకా వెంటనే నరేంద్ర మోడీ అని చెప్పాడు. ఈసారి టీచర్‌ బెత్తం తీసుకుని వివేకా పిర్ర మీద కొట్టి.. ఈ పేర్లన్నీ ఎక్కడ కనిపెట్టావ్‌... మన ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ... అని చెప్పాడు. వివేకాకు అంతా అయోమయంగా వుంది... ట్రంప్‌... నరేంద్రమోడీల గురించి కూడా కలే అయ్యుంటుందనుకున్నాడు. టీచర్‌ పాఠం ఆపి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లు ఇవ్వసాగాడు. వివేకా కూడా వెళ్ళి ప్రోగ్రస్‌రిపోర్ట్‌ తీసుకున్నాడు. 100కి 10మార్కులు వచ్చాయి. ఈ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూపిస్తే అమ్మ బిర్యానీ కాదు కదా పొద్దున్నే చద్దనం కూడా పెట్టదు అనుకున్నాడు. 10 పక్కన సున్నా పెడితే తేడా కనిపెడతారనుకుని 10 ముందు 1ని చేర్చడం సులభమవుతుందని చెప్పి ఆ పని చేసాడు. స్కూల్‌ వదలగానే ఇంటికెళ్లాడు. ఎంతో హుషారుగా బ్యాగులో నుండి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ తీసి గర్వంగా తన తల్లి చేతికిచ్చి... బిర్యానీకి సామాన్లు రెడీ చేసుకోమన్నట్లుగా చూసాడు. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను చూసిన రమణమ్మ గారు పక్కనే వున్న బెత్తం తీసుకుంది. ఆమె బెత్తం తీసుకోవడంతోటే వివేకా నిక్కర తడుపుకున్నాడు. వెదవా... ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నావా... ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో మార్కులను నువ్వే దిద్దుకుంటావా? అని కోపంగా అడిగింది. నేనెంతో తెలివిగా దిద్దానమ్మా... నువ్వెలా కనిపెట్టావని వివేకా అడిగాడు. ప్రపంచంలో వందకు నూటపది మార్కులు ఏ తల మాసినోడికన్నా వస్తాయా... ఆ మాత్రం తెలియదా అంటూ బెత్తంతో రెండు దెబ్బలు తిగిలించింది. అమ్మా కొట్టొద్దమ్మా... ఇంకెప్పుడూ అలా చేయనమ్మా... కొట్టొద్దమ్మా... కొట్టొద్దమ్మా... అంటూ వివేకా కేకలు పెట్టసాగాడు. ఆ కేకలు విని క్రింద వున్న ఏ.సి.సుబ్బారెడ్డి, రంగమయూర్‌రెడ్డి, పి.ఏ రాజులు పరుగెత్తుకుంటూ పైకి వెళ్లారు. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన వివేకా... ఆ నిద్ర మత్తులోనే కొట్టొద్దమ్మా... కొట్టొద్దమ్మా అని అరుస్తున్నాడు. రాజు కొంచెం నీళ్ళు తెచ్చి ఆయన ముఖాన చల్లాడు. అప్పటికిగాని ఆయనకు నిద్రమత్తు వదల్లేదు. కొద్దిసేప టికి అప్పటిదాకా జరిగిందంతా కల అని గ్రహించాడు. రాత్రి పడుకునే ముందు తన తల్లినే తలచుకుని నిద్రపోవడంతో, ఆమె ఈ విధంగా తన కలలోకి వచ్చి తనను చిన్నతనంలోకి తీసుకెళ్ళి ప్రేమగా చూసుకుంది అని మనసులో అనుకుని... పక్కనే వున్న సిగరెట్‌ పెట్టె అందుకున్నాడు.

galpikaఅది మూడున్నరేళ్ళ నుండి ఐటి హబ్‌గా మారుస్తానని హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్న విశాఖపట్నం. అగ్రిటెక్‌ వ్యవసాయ సదస్సు ప్రాంగణం. ఆ సదస్సుకు సీఎం చంద్రబాబు, వ్యవ సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, ఐ.టి మంత్రి లోకేష్‌, చింతకాయల అయన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపి కంభంపాటి హరిబాబులు సూటూ, కోటు, బూటూ వేసుకుని వచ్చారు. అప్పుడే సదస్సు ప్రాంగణానికి రైతులు కూడా రాసా గారు. వారిని చూసి చంద్రబాబు ఆశ్చ ర్యానికి గురై... చంద్రమోహన్‌రెడ్డి, ఏంటి వీళ్ళంతా రైతులేనా? అందరూ సూటూ, బూటూ వేసున్నారు, వీళ్ళు ఆంధ్రారైతులా? అమెరికా రైతులా? మన రైతులంటే పంచెకట్టు, తలపాగా చుట్టుకుని కొంచెం బక్కచిక్కి ఉండాలి కదా. వీళ్లేంటి మనకంటే టిప్‌టాప్‌గా, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మాదిరిగా వున్నారు అని అడిగాడు. అందుకు సోమిరెడ్డి... మీ ఆశలు, ఆశయాలు నాకు తెలి యవా సార్‌, ఏ.పి. రైతులను మీరు చూడాలనుకుంటున్నది ఇలాగనే కదా... ఈమధ్య మన రైతులను సింగపూర్‌, జపాన్‌, జర్మనీ, స్వీడన్‌, డెన్మార్క్‌లకు పంపించాం కదా. ఆ దేశాలు తిరిగొచ్చిన తర్వాత మన రైతులు ఈ గెటప్‌లోకి మారిపోయారు. అందరూ సూటూ బూట్లలోనే కనిపి స్తున్నారు. ఇలాంటి రైతులు అమెరికాలో కూడా ఉంటారు. మన రైతుల గెటప్‌, సెటప్‌ చూసి ఆ బిల్‌గేట్స్‌కు మైండ్‌ బ్లాక్‌ కావాలని చెప్పాడు. చంద్రబాబు మురిసిపోతూ... శెభాష్‌ చంద్ర మోహనా... అసలు ఈ సదస్సుకు అమెరికా ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ను, ఇంగ్లాండ్‌ ప్రధాని థెరిస్సామేను, జపాన్‌ ప్రధాని షింజో అబేలను కూడా ఆహ్వా నించి వుంటే బాగుండేది. మన రైతు లను చూసి వాళ్ళు వాళ్ల దేశాలలో రైతులను ఇలా మార్చి ఉండేవాళ్ళు అని చెప్పాడు. అంతలో తలకు పాగా చుట్టి తెల్ల బనియన్‌, పెద్ద పంచె కట్టు కుని ఒక వ్యక్తి లోపలకు పోబోతు న్నాడు. అక్కడేవున్న లోకేష్‌ టక్కున అతనిని ఆపి... కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అంటే ఇట్లా వుంటిరి... కనీసం తెలుగు దేశం వచ్చాకన్నా మీరు మారరా... మేం మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోవా లనుకుంటాం.. మీరు అక్కడికి రారు... అవతల రైతులందరినీ చూడు... సూటూ బూటూ వేసుకుని ఎంత నీటుగా వచ్చారో. నువ్వు మాత్రం ఈ పాతతరం పంచెకట్టుకుని వచ్చావు. సొంత సూటు లేకుంటే కనీసం బాడుగ సూటు అయినా తెచ్చుకుని ఉండా ల్సింది. మా పరువు తీయడానికే ఈ గెటప్‌తో వచ్చావు. అవతల బిల్‌గేట్స్‌ వచ్చే టైం అయ్యింది, పక్కన నిల బడు... నిన్ను చూస్తే మన రాష్ట్రం పరువే మటాష్‌ అవుతుంది, ఎవరికీ కనపడకుండా అటు దూరంగా పోయి కూర్చో అని చెప్పాడు. అప్పుడా వ్యక్తి తల పాగా తీసి... మీరు ఎదురు చూస్తున్న బిల్‌గేట్స్‌ను నేనే అని చెప్పాడు. ఆయనను చూసి చంద్ర బాబుతో సహా అందరూ షాక్‌కు గురయ్యారు. చంద్రబాబు తేరుకుని... అదేంటిసార్‌, మేము సూటూ, బూటూ, కోటు వేసుకుని దర్జాగా వస్తే మీరు మాత్రం మా అనంతపురంలో అప్పుల పాలైన రైతు మాదిరిగా వచ్చారని అడిగాడు. అందుకు బిల్‌గేట్స్‌... నాకు మీ రైతుల పంచెకట్టు అంటే ఇష్టం... అందుకే రైతు సదస్సుకు ఇలా వచ్చా అని చెప్పాడు. చంద్రబాబు మనసులో ఏడ్చినట్టే వుంది మీ గెటప్‌... మేం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటే మీరు డౌన్‌ అవుతున్నారు అనుకుని ఆయనను వేదికమీదకు తీసుకెళ్లాడు. సదస్సు మొదలైంది. సోమిరెడ్డి, ఇతర మంత్రులు మాట్లాడారు. తర్వాత చంద్రబాబు లేచాడు. మా రాష్ట్రంలో వ్యవసాయానికి టెక్నాలజీని జోడి స్తున్నాం. రైతులు పొలాలకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని సేద్యం చేసే స్థాయికి టెక్నాలజీని అభివృద్ధి చేసాం అని చెప్పాడు. మధ్యలో బిల్‌గేట్స్‌ కల్పించు కుని... ఈ టెక్నాలజీ మా దేశంలోనే లేదు... మీ రాష్ట్రంలో ఎలా సాధ్య మైందని ప్రశ్నించాడు. దానికి చంద్ర బాబు... ప్రతి రైతుకు సి.సి. కెమెరాలు, కంప్యూటర్లు అందజేసి, వాటికి ఇంటర్‌ నెట్‌ సదుపాయాన్ని కల్పించాం. పొలాల్లో సి.సి. కమెరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో కూర్చుని పొలంలో ఏం జరుగుతుందనేది కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూస్తుంటారు. పొలానికి నీళ్ళు పట్టాల్సి వస్తే... కంప్యూటర్‌లో ఒక బటన్‌ నొక్కితే పొలంలో మోటార్‌ ఆన్‌ అయ్యి నీళ్ళు పారుతాయి. కంప్యూటర్‌ ద్వారానే మోటార్‌ను ఆఫ్‌ చేయొచ్చు. పంట కోతకు వచ్చినప్పుడు కూడా పైరు కటింగ్‌, లోడింగ్‌ అంతా కంప్యూటర్‌ లలోనే చూస్తుంటారు. ఇక సాగునీళ్ళ సమస్య తలెత్తకుండా ఆకాశంలో మేఘాలకు కంప్యూటర్‌ చిప్స్‌ అమ రుస్తాం... కంట్రోల్‌ కమాండింగ్‌ సిస్టం ద్వారా ఈ మేఘాలను ఏ ప్రాంతంలో అయితే వర్షాలు అవసరమో గుర్తించి, ఆ ప్రాంతంలో వర్షం కురిసేలా చేస్తాం. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడా సాగునీటికి కొరతరాదు. అలాగే ప్రతి రైతుకు కోటు, సూటుతో పాటు ల్యాప్‌టాప్‌ను కూడా ఉచితంగా అందజేయనున్నామని, ఏపిలో రైతులను హైటెక్‌ రైతులను చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పాడు. అప్పుడు బిల్‌గేట్స్‌ లేచి... మరి వ్యవసాయ రంగాన్ని ఇంతగా అభివృద్ధి చేయాలనుకుంటున్న మీరు అమరావతి రాజధాని పేరుతో మూడు పంటలు పండే 35వేల ఎకరాల భూము లను ఎందుకు నాశనం చేస్తున్నారు? అని ప్రశ్నించాడు. వెంటనే చంద్ర బాబు... దీనికి సమాధానం నానోటితో చెప్పను, మీ కళ్ళకు చూపిస్తాను పదండి అంటూ అక్కడి నుండి లేచాడు.

/////

అమరావతి రాజధాని ప్రాంతం. అప్పుడే వైజాగ్‌ నుండి చంద్రబాబు, బిల్‌గేట్స్‌, సోమిరెడ్డి, లోకేష్‌, ఇతర మంత్రులు అక్కడకు చేరుకున్నారు. అక్కడక్కడా తలపాగా, పంచెకట్టుతో వున్న కొందరు గేదెలను, గొర్రెలను, ఆవులను మేపుకుంటున్నారు. అది చూపిస్తూ చంద్రబాబు.. చూడండి బిల్‌గేట్స్‌ గారు... 35వేల ఎకరాలలో పచ్చగడ్డిని ఎంత బాగా పెంచుతు న్నామో... గొర్రెలు, బర్రెలు మేపు తున్నది మా ఎమ్మెల్యేలే... రాజధాని ప్రాంతంలో పాడిపంటలను మేం ఈ విధంగా అభివృద్ధి చేస్తుంటే, అన వసరంగా మా మీద అభాండాలు వేస్తున్నారని వాపోయాడు. అది చూసిన బిల్‌గేట్స్‌... నిజమే చంద్రబాబు, గడ్డి పెంపకం కూడా వ్యవసాయంలో ఓ భాగమే కదా, నిన్ననే 'ఈ టి.వి. అన్న దాత'లో చూసాను అంటూ అక్కడ నుండి బయలుదేరారు.

galpika'జగనన్నా జగనన్నా మీ వెంటే మేమన్నా... రాజన్న పుత్రుడవు, రైతన్న మిత్రుడవు' అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌తో సాగుతున్న జగన్‌ పాద యాత్రను ఉండవల్లిలోని తన ఇంట్లో కూర్చుని 'ఆత్మసాక్షి' ఛానెల్‌లో చూస్తున్నాడు నవ్యాంధ్రసారధి, హైటెక్‌రత్న చంద్రబాబునాయుడు. జమ్మల మడుగు ప్రాంతంలో పాదయాత్ర జరుగుతోంది. జనం పోటెత్తినట్లు వచ్చారు. అటు ఆదినారాయణరెడ్డి, ఇటు రామసుబ్బారెడ్డిలు తన పార్టీ లోనే వున్నా జగన్‌ కోసం అంతమంది జనం రావడం చూసి చంద్రబాబు బిత్తరపోయాడు. వెంటనే మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్‌ చేశాడు. ఆదినారాయణరెడ్డి ఫోన్‌ ఎత్తగానే... నీ నియోజకవర్గంలో ఏం జరుగు తుందో చూస్తున్నావా? అని ప్రశ్నించాడు. అందుకు ఆదినారాయణరెడ్డి... నా నియోజకవర్గంలో జరిగేదేముంది... పగలు ఎండకాస్తోంది, రాత్ర యితే చీకటి పడుతోంది... అప్పుడప్పుడూ మబ్బు కాస్తే వర్షం పడు తోంది. ఎక్కడైనా ఇదేగా జరిగేది అని చెప్పాడు. వెంటనే టీవీ ఆన్‌చేసి చూడు... నీ నియోజకవర్గంలో జగన్‌ పాదయాత్రకు ఎంతమంది జనం వచ్చారో! మీరిద్దరు వుండి కూడా అంతమంది జనం అక్కడకు వెళ్లడమేంటని చంద్రబాబు అడిగాడు. అందుకాయన... జనానికి, ఓట్లకు సంబంధం లేదు సీఎం గారు... మొన్న నంద్యాలలో కూడా జగన్‌ వస్తే ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. మీరొస్తే ఈగలు తోలుకుంటున్నాం, అంతమాత్రం చేత ఓట్లు వాళ్లకు పడ్డాయా? మనకు పడ్డాయా? ఓట్ల లెక్కకు పాదయాత్ర జనం లెక్కకు సంబంధం లేదప్పా... వాళ్ళంతా పెళ్ళిళ్ళకు వచ్చిన జనం... మా ఊర్లో చేడమ్మ తల్లి జాతరకు కూడా జనం బ్రహ్మాండంగా వస్తారు, అలాగని ఎన్నికల్లో ఆ చేడమ్మ తల్లి వచ్చి పోటీ చేసినా డబ్బు లియ్యందే ఓట్లేయరు, మీరేం వర్రీకాకండి, ఎన్నికలంతా లెక్కా చారంతోనే జరిగిపోతాయని చెప్పి పెట్టేశాడు. ఆదినారాయణరెడ్డి మాటతో చంద్రబాబు మనసు కుదుటపడలేదు. 'ఆత్మసాక్షి' ఛానెల్‌లో జగన్‌కు వస్తున్న జనాన్ని చూస్తూ అన్యమనస్కంగానే వున్నాడు. దీనికితోడు అప్పుడే పాదయాత్రలో చిన్న విరామం అంటూ న్యూస్‌ రీడర్‌ చెప్పాడు. వెంటనే వాణిజ్య ప్రకటనలు... ''వేల కిలోమీటర్ల నడక... నేలపైనే పడక... ఎన్ని వందల కిలోమీటర్లు నడిచినా పాదాలకు నొప్పులు తెలియవు... జగన్‌ పాదయాత్రలో అద్భుత రహస్యం... ఆడిడాస్‌ బూట్లు... మీరూ కొనండి... పాదయాత్ర చేయండి'' అంటూ ఒక యాడ్‌... అది అయిపోగానే... ''రామ్‌రాజ్‌ బనియన్లు, డ్రాయర్లు... నాడు రాజశేఖరరెడ్డి నుండి నేడు జగన్మో హన్‌రెడ్డి దాకా పాదయాత్రకు అందరూ వాడే డ్రాయర్లు... మీరెక్కడ నడుస్తున్నా రామ్‌రాజ్‌ డ్రాయర్‌ మీ వెంటే'' అంటూ ఇంకో యాడ్‌. వీటిని చూడగానే చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో పాటే జగన్‌ పాదయాత్రను ఆపే ఐడియా కూడా వచ్చింది. వెంటనే ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్‌ను పిలిపించాడు. ఆయనకు చెవిలో ఏదో వూదాడు.

----

జగన్‌ పాదయాత్ర జమ్మలమడుగు వైపు నుండి పొద్దుటూరు రోడ్డులో రాసాగింది. ఆ రోడ్డు పొడవునా ఆంధ్రప్రభుత్వ వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హోర్డింగ్‌లు... వాటిపై ఇలా వ్రాసి వుంది. ''అతి నడక అనర్ధదాయకం... ఎక్కువ దూరం నడిస్తే మోకాళ్ళ చిప్పలు అరిగి కీళ్ళ వాతం వచ్చి, ఎముకలు చచ్చుబడిపోవచ్చు. పాదయాత్రలు మానుకోండి.. మీ కాళ్ళను కాపాడుకోండి.''

ఇట్లు

మీ ఆరోగ్యం కోసం తపించే...

ఆరోగ్యశాఖ మంత్రి

కామినేని శ్రీనివాస్‌...

దారి పొడవునా ఇవే హోర్డింగ్‌లు. ఆ హోర్డింగ్‌ల మీద వ్రాసిన మెసేజ్‌ చదివి జగన్‌ నవ్వుకున్నాడు. తన పాదయాత్రకు బ్రేక్‌ వేయడానికి చంద్రబాబు వేసిన ప్లాన్‌ అని గ్రహించాడు. వెంటనే తన సెల్‌ఫోన్‌ తీసి ఒక మెసేజ్‌ టైప్‌ చేసి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఫోన్‌కు పోస్ట్‌ చేసాడు.

్య్య్య్య్య

చంద్రబాబు ఛాంబర్‌లో ఆయనతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, దేవినేని ఉమలు వున్నారు. మనం పెట్టిన హోర్డింగ్‌లు చూసి ఆ జగన్‌ భయపడతాడా? పాదయాత్ర ఆపుతాడా? అని చంద్రబాబు అనుమానంగా అడిగాడు. ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది సార్‌, అంత భయపెట్టేలా హోర్డింగ్‌లు రాయించానని కామినేని శ్రీనివాస్‌ చెప్పాడు. అప్పుడే తన సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో కామినేని దానిని ఓపెన్‌ చేసి చూసాడు.

''కాలు కదిలితే కొవ్వు కరుగుతుంది...

కాలు పరుగెడితే గుండె స్పీడవుతుంది...

కాలు ముందుకు పడితే షుగర్‌ వెనకడుగు వేస్తుంది...

కాలు కదం తొక్కితే బి.పి. పరారవుతుంది...

మీ హోర్డింగ్‌ల మీద వీటిని వ్రాయించండి.

ఇట్లు

మీ,

జగన్‌.

ఆ మెసేజ్‌ చూడగానే కామినేని బిత్తరపోయాడు. ఇతని పాదయాత్రను ఆపేదెట్లా అని చంద్రబాబు దిగులుపడ్డాడు. అప్పుడే ఐ.టి మంత్రి లోకేష్‌ అక్కడకు వచ్చాడు. విచారంగా వున్న తన తండ్రిని చూసి విషయం ఏంటని అడిగాడు. పక్కనే వున్న దేవినేని... ఏం చెప్పమంటావు బాబూ... జగన్‌ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి మీ తండ్రిగారిలో నరాలు ఎక్కువుగా స్పందిస్తున్నాయి. ఆయనేమో ముఖ్యమంత్రి, పాదయాత్ర చేయకూడదు... 2002లో వై.యస్‌. పాద యాత్ర చేసాడు, సీఎం అయ్యాడు. 2013లో మీ నాన్నగారు పాదయాత్ర చేసారు, సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ జగన్‌ పాదయాత్ర చేస్తున్నాడు... అదే మీ నాన్నగారి బెంగ అని చెప్పాడు. అది విన్న లోకేష్‌... ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, పాదయాత్రను పాదయాత్రతోనే కొడతాను, అతనికంటే ఎక్కువ కిలోమీటర్ల దూరం నడిచి శెభాష్‌ అనిపించుకుంటాను... ఇదే నా శపథం అంటూ తొడ చరిచాడు. లోకేష్‌ ఉత్సాహం చూసి చంద్రబాబుతో పాటూ మంత్రు లందరిలోనూ ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. వెంటనే లోకేష్‌కు బట్టలు సర్ధి, నాలుగు జతల బూట్లు పెట్టి రెడీచేసి బండెక్కించి పంపారు. చంద్రబాబు రాత్రి రెండు పుల్కాలు తిని లోకేష్‌ నా వరాల పుత్రుడు.. పాదయాత్ర చేస్తానని చెప్పి నా గుండెల్లో వున్న భారం దించాడు. జగన్‌కన్నా ఎక్కువ దూరం పాదయాత్ర చేస్తానన్నాడు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు తిరుగుతాడేమో నా బంగారు కొండ అని మురిసి పోతూ... సుమతి శతకం తీసి

''పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా

పుత్రుని గనుగొని పొగడగ

బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతి''

అనే పద్యం చదువుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు.

----

తెల్లారింది. చంద్రబాబు లేచి రోజువారీ కార్యక్రమాలు ముగించు కుని హాల్‌లోకొచ్చి టీవీ ఆన్‌ చేసి కూర్చున్నాడు. లోకేష్‌ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని తిరుపతి నుండి పాదయాత్ర మొదలుపెడతాడేమోనని చంద్రబాబు ఆలోచించసాగాడు. అప్పుడే న్యూస్‌ ఛానెల్‌ 'చంద్రజ్యోతి'లో బ్రేకింగ్‌ న్యూస్‌... కాశ్మీర్‌ నుండి కన్యాకుమారికి పాదయాత్రను మొదలుపెట్టిన నారా లోకేష్‌... కాశ్మీర్‌లో పాదయాత్రను ప్రారంభించిన కాశ్మీర్‌ సీఎం మెహబూబా మఫ్తీసయ్యద్‌.. అని న్యూస్‌రీడర్‌ చెప్పగానే... జగన్‌ కంటే ఎక్కువ దూరం పాదయాత్ర చేస్తానంటే ఇదా... అని చంద్రబాబు అలాగే షాక్‌కు గురై కుర్చీలో కూలబడ్డాడు.

Page 1 of 59

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter