దక్షిణాసియాలో తొట్టతొలిసారిగా అంతర్జాతీయస్థాయిలో ఔత్సాహిక పారి శ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సును అత్యంత వైభవంగా జరగడం భాగ్యనగరానికో భాగ్యం. అందులోనూ ఇంతటి ప్రతిష్టాత్మక మైన సదస్సు ఇక్కడ నిర్వహించడం మన తెలుగువారందరికీ ఎంతో గర్వకారణం కూడా. సృజనాత్మకశక్తికి మెరుగులుదిద్ది ప్రతిభకు పట్టాభిషేకం చేసేందుకు ఔత్సా హిక పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహాన్ని చ్చేందుకు, సరికొత్త ఆవిష్కరణలను మానవాళి ముంగిట ఆవిష్కరించేందుకు ప్రారంభమైన ఈ సదస్సు ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సకల ప్రపంచాన్నే ఆకట్టుకున్న ఈ సదస్సులో స్త్రీ శక్తి ఎంతటి విలక్షణమైనదో, ఎంత విశిష్టమైనదో ప్రపం చానికి చాటేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ చేసిన మార్గదర్శకాలు ఎంతైనా అనుసర ణీయం. 150కి పైగా దేశాల నుంచి విచ్చే సిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల, దిగ్గ జాలైన వ్యాపారవేత్తలతో భాగ్యనగరం కళకళలాడింది. అటు ప్రధాని మోడీ, ఇటు అమెరికా అధ్యక్షుని సలహాదారు ఇవాంకా ట్రంప్ ఈ సదస్సులోపాల్గొనడంతో సదస్సుకే ప్రపంచస్థాయిలో సమున్నతమైన గౌరవం ఏర్పడింది. ఈ సందర్భంగా అన్నింటా తామై అన్నిరంగాల్లో అత్యంత ప్రతిభాపాటవాలతో ముందుకు సాగుతున్న మహిళలు పారిశ్రామిక రంగంలోనూ అగ్రస్థానంలో నిలుస్తున్న విషయాలను ఇవాంకా ట్రంప్ కన్నులకు కట్టినట్లుగా అత్యద్భుతంగా వివరించడంతో సదస్సులో మహిళాశక్తికి అగ్రపీఠం వేసినట్లయింది. మహిళాశక్తి ఔన్నత్యాన్ని ఆమె చాటిచెప్పిన తీరుకు అందరి నుంచి హర్షధ్వానాలు వెల్లు వెత్తాయి. మన సమాజంలో ఉన్న అడ్డం కులను తొలగించడానికి అవసరమైన సరికొత్త మార్గాలను కనుగొందాం.. అడ్డం కులు ఎన్నున్నా ఎదుర్కొందాం...ఒకరి నుంచి మరొకరం తెలుసుకుందాం. మహి ళలు విజయాలను, సాధికారతను సాధించ డానికి, వినూత్న ఆవిష్కరణలు చేయడా నికి, మన పిల్లలకు సమున్నతమైన భవితను ఇవ్వడానికి కృషి చేద్దాం... అంటూ ఇవాంకా చేసిన ప్రసంగం ఆద్యంతం అద్భు తంగా ఉండి.. అందరికీ మార్గదర్శకమై నిలిచింది. అమెరికాలో కోటీ పది లక్షల మందికి పైగానే మహిళలు సొంతంగా వ్యాపార వాణిజ్యాలను చేపట్టి 90 లక్షల మందికి ఉపాధి కల్పించడమేకాక, సుమారు లక్షకోట్ల డాలర్ల రాబడిని సృష్టిస్తున్నట్లు ఇవాంకా ట్రంప్ ఈ సందర్భంగా సగ ర్వంగా ప్రకటించారు కూడా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అత్యంత వేగంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న భారతదేశం మహిళలకు పారిశ్రామిక రంగంలోనూ అండగా నిలవాలన్న ఆమె ఆకాంక్ష సదస్సు ధ్యేయాన్ని మరింతగా ప్రకాశింపజేసింది. అంతేకాదు, మహిళ లకు సాధికారత కల్పించకపోతే మానవాళి పురోగతి అసంపూర్తిగా ఉంటుందన్న మాటలను, ప్రధాని విశ్వాసాలను ఇవాంకా ప్రశంసించడం, గత పదేళ్ళలో వ్యాపారరంగంలో వినూత్నమైన ఆవిష్కర ణలకు శ్రీకారం చుట్టడంలో నారీమణులు అత్యంత ప్రతిభావంతగా, విజయవం తంగా ముందుకు సాగుతున్నారంటూ వివరించడం అందరినీ బాగా ఆకట్టు కుంది. అంతేకాదు, వికసిస్తున్న ఆర్ధిక వ్యవస్థగా, ప్రజాస్వామ్యనికి దీపశిఖగా, ప్రపంచానికి ఆశాజ్యోతిగా భారత్‌ను తీర్చిదిద్దుతున్న మీకు ధన్యవాదాలు.. అంటూ ఇవాంకా ట్రంప్ మన ప్రధాని మోడీని, భారత్ ప్రగతికై ఆయన చేస్తున్న కృషిని, సాధిస్తున్న విజయాలను ఈ సంద ర్భంగా ప్రశంసించడం విశేషం.
ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ, మన పురాణేతిహాసాల ప్రకారం స్త్రీ అంటే శక్తి అవతారమని, మహిళా సాధికారత అభివృద్ధికి కీలకమని అంటూ మహిళా శక్తిని కొనియాడారు. భారత్ వృద్ధి ప్రస్థానంలో ప్రపంచ పారి శ్రామికవేత్తలంతా భాగస్వాములు కావా లని ప్రధాని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. మహిళా శక్తి ఎంతో గొప్పదని, భారతీయ సంస్కృతిలో మహిళలను శక్తి స్వరూపిణులుగా కొలుస్తారన్నారు. సులభ తరమైన వ్యాపార నిర్వహణకు వీలుగా తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కర ణలు తీసుకువచ్చిందన్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహించాలని, మహిళ లను గౌరవించడం భారతదేశ సంస్కృతి అని అంటూ, భారతీయ మేధస్సు ఈ తరానికి స్ఫూర్తి అన్నారు. మేక్ ఇన్ ఇండి యాను అందరూ ప్రోత్సహించాలన్నారు. మూడురోజులపాటు అత్యద్భుతంగా జరిగిన ఈ సదస్సులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ తదితర ముఖ్యులంతా పాల్గొన్నారు. ప్రత్యేకించి అంకుర సంస్థల్ని మార్కెట్లోకి తీసుకురావడం, పెట్టుబడులు సమకూర్చుకోవడం, ఇంధన రంగం, ఆరోగ్యం, డిజిటల్, మీడియా, వినోదర తదితర రంగాలపై జరిగిన చర్చలు యువతకు మార్గదర్శకంగా నిలిచాయి.