cm jaganమేం అధికారంలోకి వస్తే ఫ్రీ బియ్యం... ఫ్రీ కరెంట్‌... ఫ్రీ గ్యాస్‌... చదువు కునేవాళ్ళకు ల్యాప్‌టాప్‌లు... మహిళలకు మిక్సీలు, సీరియల్స్‌ చూడడానికి ఉచిత టీవీలు... రూపాయికే చపాతి... పావలాకే దోశ... గత తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఓ పార్టీ వారి వరాలు.

మరి ఇంకో పార్టీ వాళ్ళు వూరుకుంటారా? ఫ్రీగా బియ్యమిస్తే సరిపో తుందా? కూరలు పల్లేదా? మేం అధికారంలోకి వస్తే కూరగాయలు ఫ్రీ, ఉప్పు, పప్పుదినుసులన్నీ ఫ్రీ... ప్రభుత్వ క్యాంటీన్‌లలో టిఫిన్‌ ఫ్రీ... సీలింగ్‌ ఫ్యాన్‌లు, ఏ.సి.లు, రిఫ్రిజరేటర్లు ఫ్రీ అన్నారు.

రాజకీయపార్టీల శృతిమించిన హామీలు ఇవి. మనం ఇప్పటివరకు తమిళనాడు ఎన్నికల ప్రచారాలలో మాత్రమే ఇలాంటి హామీలు చూసాం. ఇప్పుడు ఆ రాష్ట్ర సరిహద్దునే వున్న మన రాష్ట్రానికి కూడా ఆ గాలి సోకినట్లుంది. మన రాష్ట్ర నాయకులకు కూడా అక్కడి నాయకుల హామీలు వంటబట్టినట్లున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలపై వరాల జల్లు కురిపించడానికి ప్రధానపార్టీలు సిద్ధమవుతున్నాయి.

2014 ఎన్నికలలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నోటికి అడ్డు అదుపు లేకుండా హామీలిచ్చాడు. వాటిలో లక్షకోట్ల పైనే వున్న ఋణమాఫీ ఒకటి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకా కొన్ని వందల హామీలను పొందుపరిచారు. అధికారంలోకి వచ్చాక వాటిలో అమలు చేసినవి చాలా తక్కువ. చంద్రబాబులాగా నోటికి ఏదొస్తే అది చెప్పకపోవడం వల్లే జగన్‌ ప్రతిపక్ష నేతగా మిగిలిపోవాల్సివచ్చింది. జగన్‌ నోటి నుండి ఒక్క ఋణమాఫీ వాగ్దానం వచ్చివున్నా ఈరోజు చంద్రబాబు, జగన్‌లు ఆపోజిట్‌ పొజిషన్‌లలో ఉండేవాళ్ళు. కాని, జగన్‌ అలా హామీలు ఇవ్వకపోవడం, చంద్రబాబు నోటికేదొస్తే అది ఇవ్వడం వల్లే తెలుగుదేశం అధికారంలోనూ, వైసిపి ప్రతిపక్షంలోనూ వుంది. 2014లో చేసిన తప్పులు జగన్‌ మరోసారి చేయవద్దనుకుంటున్నాడు. ఎన్నికల్లో గెలుపోటములపై హామీలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనిని జగన్‌ వంట బట్టించుకున్నాడు. మొన్న నంద్యాల ఉపఎన్నికలప్పుడు 'నవరత్నాలు' పేరుతో పలు హామీలు గుప్పించిన జగన్‌, ఇప్పుడు ప్రజాసంకల్ప పాదయాత్రలోనూ హామీల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, తాత్కాలిక ఉద్యోగులు, వృద్ధులు, కార్మికులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్‌లు... ఇలా ఎవరినీ వదలకుండా వారిని ఆకట్టుకునే రీతిలో హామీలు ఇస్తున్నాడు. 2014లో ఋణమాఫీ అన్నది అసాధ్యమైన పని అని తెలిసి ఆయన ఆ వాగ్ధానం చేయలేదు. చంద్రబాబు అది సాధ్యం కాదని తెలిసి కూడా అధికారం లక్ష్యంగా చేసుకున్నాడు కాబట్టి చెప్పేసాడు. అధికారంలోకి వచ్చాక దానిని ఎంత అవతారంగా అమలు చేస్తున్నాడన్నది చూస్తూనే వున్నాం. ఋణమాఫీ లాంటి అసాధ్యమైన హామీనే ఇచ్చిన చంద్రబాబు రేపటి ఎన్నికల్లో ఇంకా పెద్దపెద్ద వాగ్ధానాలే చేస్తాడు తప్ప, వెనక్కి తగ్గడు. కాబట్టి వచ్చే ఎలక్షన్‌లలో రాష్ట్ర ప్రజలు ఇరు పార్టీల నేతల హామీల వర్షంలో తడిసి ముద్దవడం ఖాయం.

jaganప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట ఆషామాషీగా తీసుకున్నారు. నంద్యాల ఎన్నికల్లో కూడా జగన్‌ సభలకు జనం బాగానే వచ్చారు. అయినా మేమే గెలిచాం... ఇక అన్ని చోట్లా అలాగే ఉం టుందిలే అనుకున్నారు. నంద్యాల ఎన్నికలు వేరు... అది కేవలం ఒక అసెంబ్లీ పరిధికి లోబడిన ఎన్నికలు. ఒక రకంగా పంచా యితీ ఎన్నికలు మాదిరిగా జరిగాయని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలు గాని, ప్రభుత్వ వైఫల్యాలు గాని ఆ ఎన్నికలపై ప్రభావం చూపలేదు. మా నంద్యాలకు ఏమిచ్చారు... మాకు ఏం తెచ్చారు అన్న విధానంలోనే జరిగిన ఎన్నిక అది. ఈ ఎలక్షన్‌లో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ప్రభుత్వమేమీ మారేదిలేదు... అన్న ఆలోచన ప్రాతి పదికగా జరిగిన ఎన్నిక కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

కాని, ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందన్నది జగన్‌ పాదయాత్ర ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఇడుపుల పాయ నుండి ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర కడప జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల మీదుగా కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. ఇప్పటివరకు జరిగిన పాదయాత్రను గమ నిస్తే పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా జనం పోటెత్తి వస్తున్నారు. జగన్‌కు నీరా జనం పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. జగన్‌కు తమ సమ స్యలు చెప్పుకుంటున్నారు. పేదల ఇళ్ళలో ప్రజల ముంగిళ్ళలో జనంతో జగన్‌ మమేక మవుతున్న తీరు 2003లో దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాదయాత్రను తలపించేలా వుంది. జగన్‌ పాదయాత్రకు జనం స్వచ్ఛంధంగా వస్తున్నారు. ఆయనతో కలిసి నడవడానికి ఉత్సాహం చూపుతు న్నారు. రాజన్న బిడ్డ వచ్చాడంటూ జనం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటున్నారు.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి జగన్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఒక రకంగా ఇది ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ అనే అనుకోవచ్చు. ప్రతిపక్ష నేతకు వున్న అవకాశం ఇది. ప్రజాసమస్యలపై నడుస్తూ రాష్ట్రమంతా తిరగొచ్చు. కాని, ముఖ్య మంత్రిగా చంద్రబాబు ఆ పని చేయలేడు. ఆయన ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తే ప్రభుత్వం ఫెయిల్యూర్‌ అని లెక్క.

జగన్‌ పాదయాత్రతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు రావచ్చు. నంద్యాల ఓటమితో దిగాలుపడ్డ వైకాపా కేడర్‌కు జగన్‌ పాద యాత్ర ఎక్కడలేని ఉత్సాహాన్నిచ్చింది. అదే సమయంలో అధికారపార్టీలో భయం మొదలైంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారం చేతులు మారడానికి పెద్ద తేడా అవసరం లేదు. 2014 ఎన్నికల్లో అధి కారంలోకొచ్చిన తెలుగుదేశంకు, ప్రతి పక్షంలో కూర్చున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మధ్య ఓట్ల తేడా కేవలం 5లక్షలే! 2014లో జగన్‌కు ఓటేసిన ప్రతి వంద మందిలో ఖచ్చితంగా 90 నుండి 95 మంది రేపటి ఎన్నికల్లో కూడా జగన్‌కే మద్దతునిస్తారు. మరి 2014లో తెలుగు దేశంకు ఓటేసిన ప్రతి వంద ఓట్లలో ఇప్పు డాయనకు 50 ఓట్లకు మించి గ్యారంటీ లేదు. మిగిలిన ఓట్లు అటూ ఇటైతే పరిస్థితి తలక్రిందులే!

జగన్‌ ప్రజాసంకల్పయాత్ర అలాంటి ఓటర్లనే ప్రభావితం చేస్తోంది. పోయిన సారి చంద్రబాబు మేధావి, అనుభవజ్ఞుడని చెప్పి తటస్థులు ఆయనకు ఓట్లేసారు. చంద్రబాబు ఈ మూడున్నరేళ్లలో అలాంటి వారి నమ్మకాన్ని కోల్పోయాడు. జగన్‌ మాత్రం అలాంటి వారి నమ్మకాన్ని పొందే విధంగా, తన నాయకత్వాన్ని నిరూపించు కునే దిశగా రాష్ట్రమంతటా నడుస్తున్నాడు. జగన్‌ పాదయాత్ర ఖచ్చితంగా అన్నివర్గాల వారిపై ప్రభావం చూపుతోంది. పాద యాత్రతో ఓట్ల బ్యాంకులు కదులుతా యనే ఆందోళన తెలుగుదేశం వర్గాలలో వ్యక్తమవుతోంది.

jaganమొరిగే కుక్కలు ఎంతైనా మొరగనీ... అరిచే కుక్కలు ఎంతైనా అరవనీ... నీతి తప్పిన చేతులు ఏమైనా రాసుకోనీ... గతి తప్పిన ఛానెళ్ళు ఎంతైనా వాగనీ... నా సంకల్పం చెక్కు చెదరదు... నా ఆత్మస్థైర్యం అణువంత కూడా తగ్గదు... మీరు నేలకు కొట్టాలనుకునే కొద్ది బంతిలా ఇంకా పైకి ఎగురుతూనే వుంటాను... మడమ తిప్పని, మాట తప్పని వై.యస్‌.రాజశేఖర రెడ్డి బిడ్డను నేను... నాలో ప్రవహించేది ఆయన రక్తమే... ప్రజలకిచ్చిన మాట కోసం ఢిల్లీనే ఎదురించాను... ఎన్ని కష్టాలుపెట్టినా ఎదురొడ్డి నిలిచాను... ఈ బాబులు, ఔరంగ జేబులు నాకొక లెక్కా... ఈ జనం కోసం నేను నడుస్తాను... నా చావైనా, బ్రతుకైనా ఈ జనం కోసమేనంటూ అతను ముందడుగు వేసాడు. ఆ అడుగే ప్రజా ప్రభంజనమై, ప్రత్యర్థుల గుండెల్లో ప్రకంపనమై మారుమోగుతోంది.

తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, అక్రమాల పాలనపై సమర శంఖం పూరిస్తూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి దండయాత్ర ప్రారంభించాడు. ఈ నెల 6వ తేదీన వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి సమాధి చెంత ప్రణమిల్లి, ఆయనకు నివాళులర్పించిన జగన్‌ అక్కడనుండి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టాడు. విభజనతో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేవాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, ప్రతి పేదబిడ్డకు ఉన్నత చదువులు అందాలని, అన్నదాతలకు వ్యవసాయం పండుగ కావాలని, ప్రతి చేనుకు నీరు రావాలని, ప్రతి పైరుకు కరెంట్‌ ఉచితంగా అందాలని, మద్యం తొలగిపోయి మహిళల్లో ఆనందం నిండాలని, రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలని, కార్మి కులు సంతోషంగా వుండాలని, పేద, దళిత, బలహీన, మైనార్టీ ప్రజల సమస్యలు తొలగిపోవాలని, రైతన్నల ఆత్మహత్యలు ఆగి పోవాలని, నేత కార్మికుల బ్రతుకులు బాగు పడాలని, అక్కచెళ్ళెళ్ళపై వేధింపులు రూపుమాపాలని, నిరా శ్రయులైన వృద్ధులను ఆదు కోవాలని, ప్రతి ఒక్కరికీ ఇళ్ళుండాలని, ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలని, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం వెల్లివెరి యాలని, ప్రతి జిల్లాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో జగన్‌ ముందడుగు వేసాడు. 13జిల్లాలు... 3వేల కిలోమీటర్లు... 6 నెలలు... ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర... ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వంపై సాగిస్తున్న దండయాత్ర.

జగన్‌ పాదయాత్రను అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. పాదయాత్రకు అనుమతులు లేవంటూ అడ్డుపుల్ల వేయాలని చూసారు. వై.యస్‌., చంద్రబాబులతో సహా రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రలు చేసిన వాళ్లెవరు కూడా అనుమతులు తీసుకోని విషయాన్ని పోలీసులే విడమర్చి చెప్పేసరికి తోక ముడిచారు.

మూడున్నరేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అటకెక్కిం చారు. అమరావతి రాజధాని నిర్మాణం 'మొగలిరేకులు' సీరియల్‌ లాగా తయారైంది. 35వేల ఎకరాల మాగాణి భూములు లాక్కుని అటు భూములను, ఇటు రైతులను నాశనం చేశారు. రాజధాని పేరు చెప్పుకుని విదేశాలకు తిరిగిందే తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వంలో రాజధాని పెద్ద అట్టర్‌ఫ్లాప్‌షో! నూరు శాతం ఋణమాఫీ వాగ్దానం నీరుగారిపోయింది. ఋణమాఫీపై చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన మాటకు, ఎన్నికల తర్వాత చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. లక్షల ఉద్యో గాలు కనుచూపు మేరలో కనపడడం లేదు. వేలకోట్ల పెట్టుబడుల ఒప్పందాలన్నీ ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. నిరుద్యోగుల భృతి మరుగున పడిపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా... అడుగడుగునా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అధికారులపై వేధింపులతో... రాష్ట్రంలో గూండారాజ్‌ రాజ్య మేలుతోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వేదిక అసెంబ్లీ. అయితే అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షం గొంతు నొక్కే పాత్రను ప్రతిసారీ విజయవంతంగానే నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షం సమస్యలను, ప్రభుత్వ వాగ్ధానాల వైఫల్యాలను ప్రస్తావించి నప్పుడల్లా అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష నేతపై అనవసరపు మాటలతో ఎదురుదాడికి దిగుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. సభా సంప్రదాయాలను మంటగలుపుతూ సభను ఒక కప్పల చెరువుగా మారుస్తున్నారు.

ఈ దశలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి జగన్‌ ప్రజల ముందుకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇక వారితో కలిసే పయనించడానికి పాదయాత్రకు బయలుదేరాడు.

ఒక నాయకుడు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసు కోబట్టే... ఒక ఆరోగ్యశ్రీ పుట్టింది. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వచ్చింది. పేదలకు, రైతులకు ఉచిత కరెంట్‌ను తెచ్చింది. ఆపదలో వున్న వారింటికి 108 అంబులెన్స్‌ పరుగులు పెట్టింది. ఏ దిక్కూ లేని అవ్వలు, తాతలకు పింఛన్‌ ఇచ్చింది. భారీగా పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి వచ్చేలా చేసింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందేలా చేసి రైతన్న కంటిలో నీరు రాకుండా చేసింది. 2002 సంవత్సరం... మండుటెండల్లో దివంగత నేత వై.యస్‌.రాజ శేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా సాగించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఫలితాలివి. ఆనాడు చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం దాకా 1474 కిలోమీటర్లు చేసిన పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల కష్టాలను, కన్నీళ్ళను దగ్గరగా చూసాడు. కాబట్టే 2004లో సీఎం కాగానే వారి కష్టాలు తొలగించడానికి,

కన్నీళ్ళు తుడవడానికి చరిత్రలో నిలిచిపోయే బృహత్తర కార్య క్రమాలను చేపట్టాడు. తండ్రి ఆశయాల బాటలో నడుస్తూ, ఆయన రాజకీయ వారసుడిగా, ఆయన ఇచ్చిన ఈ ప్రజా కుటుంబానికి సేవకుడిగా జగన్‌ మరో ప్రస్థానానికి నాంది పలికాడు. ప్రజల్లో నడిచిన వాడు, ప్రజల్లో నిలిచిన వాడు, ప్రజలతో కలిసిన వాడు, ప్రజల కోసం పనిచేసిన వాడే ప్రజానాయకుడని వై.యస్‌. నిరూ పించాడు. ఆ స్ఫూర్తితోనే ఆ ప్రజల దీవెనల కోసం బయలుదేరిన జగన్‌ పాదయాత్ర రేపటి జైత్రయాత్రగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Page 1 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • ఇసుకతో ఇక్కట్లు
  నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…

Newsletter