venkaఆరడుగుల ఆజానుబాహుడు..

అడ్డ పంచెకట్టుతో అలరించే తెలుగువాడు...

ఆంధ్రనాట విరిసిన కమలనాథుడు...

అసెంబ్లీ టైగర్‌గా ప్రసిద్ధింగాంచినవాడు...

అందరూ అభిమానించే నాయకుడు...

అద్భుతమన్పించే మాటల మాంత్రికుడు...

ఎవరు... ఎవరు... ఇంకెవరు...

మన నెల్లూరు ముద్దుబిడ్డడు

ముప్పవరపు వెంకయ్యనాయుడు.

ఆధునిక భారత రాజకీయ రంగాన మెరుస్తున్న నెల్లూరు ధృవతార వెంకయ్యనాయుడు. నెల్లూరీయులు మా వెంకయ్య అని చెప్పుకుని గర్వించే స్థాయికి ఎదిగిన నాయకుడు. వెంకయ్య ఉన్నతిని చూసి, ఆయన ప్రస్థానాన్ని చూసి నెల్లూరీయులు ఇప్పటికే ఎన్నో సార్లు గర్వించారు, హర్షించారు. అయితే ఇప్పటిదాకా వెంకయ్య సాగించిన ప్రస్థానం వేరు, ఇప్పుడు సాగించబోయే ప్రయాణం వేరు. ఇప్పటివరకు కొనసాగింది రాజకీయ ప్రయాణం. ఇక నుండి కొనసాగించబోయేది రాజ్యాంగ ప్రయాణం.

నెల్లూరీయుడు, మన ఆంధ్రుడు, మన తెలుగువాడు... అన్నింటికి మించి నిష్కళంక భారతదేశ భక్తుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఈ నెల 18వ తేదీన నామినేషన్‌ దాఖలు చేసారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా ప్రతిపాదించగా, ఎన్డీఏ పక్షాలు సమర్ధించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలు ఉపరాష్ట్రపతిగా ఆయన అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు. దీంతో ఉషాపతికి ఉపరాష్ట్రపతి కాక తప్పడం లేదు. వెంకయ్యనాయుడు అనుభవం, సమర్ధత, దేశంలోని అన్ని పార్టీల నాయకులతో వున్న సంబంధాలు,

ఛైర్మెన్‌ హోదాలో ఆయనైతేనే రాజ్యసభను సమర్ధవంతంగా నడి పించగలరన్న నమ్మకం... ఇత్యాది కారణాలతోనే ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఎన్నిక లాంఛనమే:

ఉపరాష్ట్రపతి పదవి కోసం ఆయన యూపిఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీతో పోటీ పడుతున్నారు. ఈయన మహాత్మగాంధీ మనుమడు. అయినా కూడా ఇప్పుడున్న బలాబలాలను చూసు కుంటే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నిక లాంఛనమే అనుకోవచ్చు.

తొలి నెల్లూరీయుడు... మూడో తెలుగువాడు

దేశ రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవిని ఇంత వరకు ఇద్దరు తెలుగువాళ్లు మాత్రమే అధిరోహించారు. ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అయితే రెండోవ్యక్తి వి.వి.గిరి. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తమిళనాడులో జన్మిస్తే, వి.వి.గిరి ఒడిస్సాలో జన్మిం చారు. కాబట్టి ఉపరాష్ట్రపతిగా గెలిస్తే తెలుగు గడ్డపై పుట్టి ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలివ్యక్తి ఆయనే అవుతాడు.

కొందరికి పడని వాడు... ఇప్పుడు అందరివాడు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేసే ముందు క్షణం వరకు వెంకయ్య వేరు... నామినేషన్‌ వేసాక వెంకయ్య వేరు. అంతకుముందు ఆయన కాకలు తీరిన రాజకీయ యోధుడు. విపక్షాలకు ఆయనంటే హడల్‌. సరిహద్దుల్లో ఉగ్రవాదుల మీదకు సైనికులు బుల్లెట్లను వదులుతారు. పార్లమెంట్‌లో విపక్షాలపైకి ఈయన మాటలనే బుల్లెట్లుగా చేసి వదులుతాడు. ఏ నిముషంలో ఎవరు ఏ భాషలో ఆరోపణలు, విమర్శలు చేసినా, అదే భాషలో వాటిని తిప్పికొట్టగల ఘనాపాటి వెంకయ్యనాయుడు. అసెంబ్లీలో నైనా, పార్లమెంట్‌లోనైనా మాటలతో, పడికట్టు పదాలతో ప్రత్యర్థు లను ముప్పతిప్పలు పెట్టేవాడు. మూడు చెరువుల నీళ్ళు తాగించే వాడు. ప్రతిపక్షంలో వుంటే అధికారపక్షం పైన, అధికారంలో వుంటే ప్రతిపక్షంపైన ఎప్పుడూ మాటల యుద్ధానికి సిద్ధంగా వుండేవాడు. కాని ఉపరాష్ట్రపతి అయ్యాక రాజ్యసభ ఛైర్మెన్‌ హోదాలో ఎదురుగా అధికార, విపక్ష సభ్యులు యుద్ధం చేసుకుం టుంటే ఆయన కళ్లప్పగించి చూస్తుండాలి!

ఆ ప్రాసలు ఇక వినలేమా?

ఉప్పు... పప్పు... చెప్పు... అప్పు'.. డిజిటలైజేషన్‌, నేషనలై జేషన్‌, రోడ్‌ కనెక్టివిటి... ఎయిర్‌ కనెక్టివిటి... వాటర్‌ కనెక్టివిటి... వెంకయ్య ప్రసంగాలలో ప్రాసలు వరదలా పోటెత్తుతాయి. ఆయన మాట్లాడుతుంటే ఎదురుగా లక్షలాది జనం వున్నా వారి చెవులు మాత్రమే పని చేస్తాయి. ఎందుకంటే ఆయన ప్రసంగాలలో మాటల అల్లిక, పదాల పొందిక అంత అద్భుతంగా వుంటుంది. పదాలతో ప్రజల్ని అట్టే కట్టిపడేస్తారాయన. రోజూ పదినిముషాలు ఆయన ప్రసంగం వింటే చాలు... బి.పి, షుగర్‌లకు ప్రత్యేకంగా మందులు వాడనక్కరలేదు. ఆయన ప్రసంగాలలోని ప్రాసలే దివ్యౌషధంగా పనిచేస్తాయి. గలగల పారే సెలయేరుకు అడ్డుకట్ట వేసినట్లు, చెట్టు మీద కూస్తున్న కోకిలమ్మ ముక్కుకు ప్లాస్టర్‌ వేసినట్లుగా ఈ ప్రాసల పిట్ట నోటికి తాళం వేసే పదవి ఇచ్చారు. ఇప్పటిదాకా రాజ్యసభలో ఆయనను కంట్రోల్‌ చేయడానికి ఛైర్మెన్‌ స్థానంలో వున్న వ్యక్తి ఆపసోపాలు పడేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను వెంకయ్యకు అప్పగించారు.

ఉషాపతే కాదు... ఉపరాష్ట్రపతి కూడా!

ఈమధ్య రాష్ట్రపతి పదవికి అభ్యర్థుల పరిశీలనలో వెంకయ్య నాయుడు పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అప్పుడు ఆయన మీడియాతో నేను ఉషాపతినే కాని, రాష్ట్రపతిని కాను అని తనదైన శైలిలో చమత్కరించారు. అయితే వూహించని విధంగా ఉషాపతి ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యారు. కన్నతల్లి లాంటి బీజేపీని వదిలిపోవడం ఆయనకు సుతారం ఇష్టం లేదు. చివరివరకు బీజేపీ నాయకుడిగానే వుండాలని కోరిక! కాని క్రమశిక్షణగల పార్టీ కార్యకర్తగా అధిష్టానం ఆదేశాలకు తలొంచక తప్పలేదు. భారమైన హృదయంతోనే ఆయన పార్టీ సభ్యత్వానికి, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఆయన ప్రయాణమే ఒక పాఠం

వెంకయ్యనాయుడు వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎన్నో కోణాలు ఉండొచ్చు. అభిమానించే వారికి మంచి మాత్రమే కనిపించవచ్చు... వ్యతిరేకించే వారికి చెడు కూడా కనిపించవచ్చు. కాని, ఒక మారుమూల పల్లెటూరిలో సామాన్య రైతుకుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి ఎటువంటి రాజకీయ నేపధ్యం లేకుండానే, పూర్వీకులు కూడబెట్టిన కోట్ల ఆస్తులు లేకుండానే, గాడ్‌ఫాదర్‌లే కాదు జన్మనిచ్చిన ఫాదర్‌ కూడా ఈ లోకంలో లేకుండానే... ఓ వ్యక్తి చవటపాలెం నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో మలుపులు దాటి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి... ఈరోజు దేశంలోనే అత్యున్నత పదవుల్లో రెండోదైన ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపికయ్యారంటే... అది నిజంగా భావితరాలకు కాదు నేటి తరాలకు కూడా పాఠ్యాంశమే! ప్రతిఒక్కరూ చదివి తీరాల్సిన అధ్యాయమే! ఒక వ్యక్తి నిబద్ధతతో వుంటే, ఒక వ్యక్తి క్రమశిక్షణతో మెలిగితే... ఒక వ్యక్తి ఒకే జెండాను పడితే ఒకే ఎజెండాను నమ్మితే, ఒకటే సిద్ధాంతాన్ని ఆచరిస్తే, క్రమశిక్షణతో పోరాడితే మనిషి ఏ స్థాయికి ఎదుగుతాడన్నదానికి వెంకయ్యనాయుడే అతిపెద్ద ఉదాహరణ!

నెల్లూరీయులు గర్వించే నాయకుడు

ఉపరాష్ట్రపతి స్థాయికి ఇంతవరకు నెల్లూరుజిల్లా వాసులు ఎదగలేదు. స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పని చేశారు. స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్య మంత్రిగా పని చేశారు. వెంకయ్యనాయుడు రాజకీయ ప్రయాణం కేంద్రమంత్రిగానే ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. కాని ఉపరాష్ట్రపతిగా ఎంపిక కానుండడంతో ఆయన ప్రయాణంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. దేశంలోనే అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి నెల్లూరీయుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోనుంది. విద్యార్థి నాయకుడు నుండి సంఘ్‌ కార్యకర్తగా, జనతాపార్టీ నాయకుడిగా, ఉదయగిరి ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర సారధిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, నాలుగుసార్లు వరుసగా రాజ్యసభ సభ్యుడిగా, ఐక్యరాజ్య సమితిలో ఆవాసం ఛైర్మెన్‌గా... ఇలా ఆయన రాజకీయ ప్రయాణంలో ప్రతి పదవీ ఒక మజిలీనే! చేపట్టిన ప్రతి పదవిని సమర్ధవంతంగా నిర్వహించి... వెంకయ్యా... నీకెవరూ సాటిలేరయ్యా అని నిరూపించుకున్నారు. ఎలాంటి పదవినైనా అవలీలగా నిర్వర్తించి అందరి మన్ననలు అందుకునే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిలోనూ సమర్ధవంతంగా రాణించగలడు. అందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. తెలుగుతనానికి నిలువెత్తు రూపం మన వెంకయ్య... ఉపరాష్ట్రపతిగానే కాదు, భవిష్యత్‌లో రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు నిర్వహించి భారతావని సేవకు పునరంకితం కావాలని, పుట్టిన నెల్లూరుగడ్డ పేరును చరిత్ర పుటల్లో నిలపాలని ఆకాంక్షిస్తూ... అభినందనలు తెలుపుతోంది 'లాయర్‌'.

kovindభారత్‌ 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించారు. ఆయనకు 7,02,044 విలువ ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి యూపిఏ అభ్యర్థి మీరా కుమార్‌కు 3,67,314 విలువ ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రపతి పదవికి ఈ నెల 17వ తేదీ ఎన్నిక జరిగింది. పోలైన ఓట్లలో రామ్‌నాథ్‌ కోవింద్‌కు 2,930 ఓట్లు రాగా, మీరాకుమార్‌కు 1844 ఓట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ నుండి మొత్తం ఓట్లన్నీ ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కే పడడం విశేషం. ఒక్క ఓటు కూడా యూపిఏ అభ్యర్థిని మీరాకుమార్‌కి రాకపోవడం గమనార్హం. ఏపిలోని అధికార తెలుగుదేశం, బీజేపీలతో పాటు, ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలపడం తెలిసిందే! దేశంలోని 29 రాష్ట్రాల్లో యూపిఏ అభ్యర్థి ఒక్క ఓటు రానీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు నెలకొల్పింది. దేశంలోని పార్లమెంట్‌ సభ్యులు, వివిధ రాష్ట్రాలలోని శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనేక ఊహాగానాలు, పలువురి పేర్ల పరిశీలన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తెరమీదకు తెచ్చింది. అప్పటికే ఆయన బీహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు. ఎక్కడా వివాదాలు, ఆరోపణలు లేవు. దళిత వర్గాలకు చెందిన వాడనే కాదు, ఆరోపణలు లేని సమర్ధుడు కూడా కాబట్టి రాష్ట్రపతిగా ఆయన ఎంపికను ఏకగ్రీవం చేయొచ్చని బీజేపీ నాయకులు భావించారు. అయితే అభ్యర్థి విషయంలో బీజేపీ ఏకపక్షంగా వ్యవహ రించిందంటూ కాంగ్రెస్‌పార్టీ మాజీ లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ను తమ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టింది. రామ్‌నాథ్‌కోవింద్‌కు ఎన్డీఏ పక్షాలతో పాటు యూపిఏలోని కొన్ని భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. అలాగే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలన్నీ దాదాపుగా రామ్‌నాథ్‌ కోవింద్‌కే మద్దతు తెలిపాయి. దీంతో రాష్ట్రపతిగా ఆయన ఎన్నిక లాంఛనమే అయ్యింది. ఈ నెల 25వ తేదీన భారత 14వ రాష్ట్రపతిగా ఆయన రాష్ట్రపతి భవన్‌లోకి అడుగిడనున్నారు.

pattamఅద్వానీ... సుష్మాస్వరాజ్‌... మురళీమనోహర్‌ జోషి... రతన్‌ టాటా... ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి... అమితాబ్‌బచ్చన్‌... మోహన్‌ భాగవత్‌... రాష్ట్రపతి రేసులో చక్కర్లు కొట్టిన పేర్లు. వీరిలో ఎవరో ఒకరి పేరు ఖాయమనుకున్నారు. తీరా చూస్తే ఎవరూ వూహించని పేరు వెలువడింది. ప్రతిపక్షాలకు ఎలాంటి పోబిడి ఇవ్వకుండా, వేలెత్తి వంక చూపే వీలు లేకుండా దళిత వర్గాలకు చెందిన బీహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా అందరూ అద్వానీ పేరు వెలువడుతుందని ఆశించారు. నరేంద్ర మోడీ ఆ విధంగా అద్వానీ పట్ల తన గురుభక్తిని చాటుకుంటాడనుకున్నారు. బీజేపీని ఈ స్థాయికి చేర్చడంలో అద్వానీది కీలకపాత్ర! కాని ఆయనకు పార్టీ పరంగా కీలక పదవులేమీ రాలేదు. ఆయన స్థాయికి తగ్గ పదవి ఇక రాష్ట్రపతే! అది కూడా వయసురీత్యా ఇది చివరి అవకాశం ఆయ నకు. ఇప్పుడు ఆయనను రాష్ట్రపతిని చేయలేకపోతే ఇంకెప్పుడూ చేయలేమని తెలిసి కూడా బాబ్రీకేసులో సిబిఐ ఛార్జి షీట్‌ను సాకు చూపి ఆయనను పక్కన పెట్టారు. అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే తాము మద్దతునిస్తామని ఏన్డీఏతర పార్టీలు కొన్ని ముందుకొచ్చాయి. అద్వానీ పట్ల వారికున్న అభిమానం సొంత పార్టీ వారికి లేకుండా పోయింది. నరేంద్రమోడీ, అమిత్‌షాల ద్వయం అద్వానీ పేరును వ్యూహాత్మకంగానే వెనక్కునెట్టేసింది. ఆయన రాష్ట్రపతి అయితే మున్ముందు తమకు సమస్యలు సృష్టిస్తాడనే భయం కావచ్చు, లేక తామిద్దరం కూడా గుజరాతీయులమే కాబట్టి మరో అత్యున్నత పదవి కూడా గుజరాతీలకే ఇస్తే... అన్నీ పదవులు మీకేనా అని ఇతర రాష్ట్రాల వారిలో వ్యతిరేకత వస్తుందనే ఆలోచన కావచ్చు... అద్వానీని పూర్తిగా పక్కన పెట్టేసారు. విపక్షాలపై తిరుగులేని దళిత బ్రహ్మాస్త్రాన్ని ప్రయో గించారు.

దళితనేత, బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాధ్‌ కోవింద్‌ పేరును బిజెపి రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా బిజెపి తన ప్రత్యే కతను.. రాజకీయచతురతను మళ్ళీ నిల బెట్టుకుంది. హేమాహేమీలెందరో ఈ పదవికి పోటీ పడుతున్నా, ఈ పదవికి బిజెపి ఎవరిని సూచిస్తుందా అని దేశంలో ఎంతో ఉత్కంఠత ఆవరించివున్న పరిస్థి తుల్లో అనూహ్యమైన రీతిలో బిజెపి వివాద రహితుడు, సౌమ్యుడు.. సహృదయుడు, పేదల హక్కుల పోరాటయోధుడు.. అన్నిటికీ మించి బడుగు బలహీనవర్గాల వాణిని వినిపింపజేసే దళితనేత అయిన రామ్‌నాధ్‌కోవింద్‌ పేరును ప్రకటించి దేశాన్నే ఆశ్చర్యపరచింది. న్యాయవాద వృత్తి నుంచి ఎదిగి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత గవర్నర్‌గా..ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆయన జీవిత ప్రస్థానం ఎంతో విశేషమైనది. ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 71 సంవత్సరాల కోవింద్‌ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌ జిల్లా దేరాపూర్‌ తాలూకా పారాంఖ్‌ అనే గ్రామం. 1945 అక్టోబర్‌ 1న ఆయన దళిత కుటుంబంలో జన్మిం చారు. కాన్పూర్‌ వర్శిటీలో బికాం, ఎల్‌ఎల్‌బి పూర్తిచేసి, 1971లో న్యాయవాదిగా స్థిర పడ్డారు. 1977-79 మధ్యకాలంలో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేంద్రప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.ఆ తర్వాత న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం పాటు జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయికి ఆర్ధికశాఖకు సంబంధించి వ్యక్తిగత కార్యదర్శిగా, 1980-83 సంవ త్సరాల్లో సుప్రీంకోర్టులో కేంద్రప్రభుత్వ స్టాండింగ్‌ కాన్సుల్‌గా, 1986లో డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగల్‌ఎయిడ్‌ బ్యూరో జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆలిండియా కోలీ (ఎస్‌సి) సమాజ్‌కు నాయకత్వం వహిం చారు. ప్రత్యేకించి ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం వున్న కోవింద్‌ కమలదళానికి విధేయులు. మతానికంటే బడుగు బలహీనవర్గాల సాధికారత రాజకీయాలవైపే ఆయన ప్రధానంగా మొగ్గుచూపుతుంటారు. ఇక పోతే, ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోమ్‌శాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌కు సన్నిహితునిగా పేరుంది. 1991లో లోక్‌ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఆయన

ఉత్తరప్రదేశ్‌లోని ఎస్‌సి రిజర్వుడ్‌ సీటుగా వున్న ఘాటంపూర్‌ నుంచి పోటీచేసి ఓడి పోయారు. ఆ తర్వాత 1994, 2006లో బిజెపి తరఫున రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లపాటు ఎంపీగా పనిచేసి, 2007లో తన సొంతజిల్లాలోని భోగినీపూర్‌ స్థానం నుంచి యుపి అసెం బ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. యుపి బిజెపి ప్రధాన కార్య దర్శిగా పనిచేసిన కోవింద్‌ 1998-2002 మధ్య బిజెపి దళితమోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక సాధికారత కమిటీ సహా అయిదు పార్లమెంటరీ కమిటీల్లో వున్నారు. 2002లో ఐక్యరాజ్యసమితికి భారత బృందం సభ్యునిగా వెళ్ళి అక్కడ ప్రసంగిం చారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చాక కోవింద్‌ను బిహార్‌ గవర్నర్‌గా నియమించారు. తాజాగా ఆయన పేరును బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ విధంగా ఆయన ప్రస్థానం రాజ్‌

భవన్‌ నుండి రాష్ట్రపతి భవన్‌ వైపుకు మళ్ళనుంది.

Page 1 of 6

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వెనక్కి తగ్గేదే లేదు!
  పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఎస్‌ఐ మా మాట వినడం లేదు... ఎస్‌ఐ చేత పని చేయించుకోలేకుంటే నా అనుచరుల ముందు నా పరువు పోతుంది.. ఎస్‌ఐ వద్దే పరపతిలేనోడివి... నువ్వేం నాయకుడివని అనుచరులు నన్ను వదిలిపోతున్నారు.... ఓ మండల స్థాయి నాయకుడు తన…
 • ఉంటారా? వెళ్ళిపోతారా?
  రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరు కింగ్‌లవుతారో, ఎవరు తెరమరుగవుతారో అంతే పట్టదు. రాజకీయాలలో ఎల్లకాలం వెలగడం అన్నది ఎవరికీ శాశ్వతం కాదని చాలామంది నాయకుల చరిత్రను పరిశీలిస్తే అర్ధమవుతుంది. నెల్లూరుజిల్లాలో సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉం డేది ఆనం…
 • వర్గాన్ని కాపాడుకోవడమా..? నియోజకవర్గాన్ని వదులుకోవడమా?
  జిల్లాలో పసుపు కొనుగోలు అక్రమాల సంగతేమోగాని దీనిమూలంగా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు పెద్ద చిక్కొచ్చిపడింది. పసుపు కొనుగోలు వ్యవహారాన్ని పెద్దకుంభకోణంగా చిత్రించిపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. విచారణకు ఆదేశించి భారీ ఎత్తున ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది. ఈ…
 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…

Newsletter