buildingతిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిన పురచ్చితలైవి కుమారి జె.జయలలితకు నెల్లూరు నగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జనం మెచ్చిన నాయకురాలే కాదు, నెల్లూరుకు మనుమరాలు కూడా!

నెల్లూరుతో ఆమెది విడదీయరాని బంధం. రంగనాధుడి గుడి, అక్కడే వున్న చిత్రకూటం, పక్కనేవున్న పెన్నానది, తిక్కన పార్కు జయలలిత జీవిత చరిత్రలో మరపురాని జ్ఞాపకాలు. జయలలిత తల్లి సంధ్య సినీనటి! ఆమె సొంతూరు నెల్లూరే! రంగనాయకులపేటలోని చిత్రకూటం వద్ద వారిళ్లుండేది. నెల్లూరులో వున్నప్పుడే సంధ్య సినీ పరిశ్రమలోకి వెళ్లారు. అప్పుడే మైసూరు రాజా ఆస్థానంలో వైద్యుడిగా పనిచేస్తున్న జయరామన్‌ను ఆమె వివాహమాడారు. వారికి జయలలిత జన్మించింది. సంధ్య అత్తమామలు కర్నాటకలోని శ్రీరంగంలో ఉండేవారు. సంధ్య సినిమాలలో బిజీగా వున్న సమయంలో ఆమె భర్త మరణించారు. ఆ సమయంలో ఒకటిన్నర ఏడాది వయసున్న జయలలితను ఆమె నెల్లూరులోని తన తల్లి వద్ద వుంచింది. అలా 5ఏళ్ల వయ సొచ్చే దాకా జయలలిత నెల్లూరులోనే పెరిగింది. ఆ తర్వాత చెన్నైకు వెళ్ళినా సెలవుల సమయంలో నెల్లూరొచ్చి తన మేన మామల వద్ద గడిపేది. చిత్రకూటం ప్రాంతంలో చిన్నతనంలో జయలలితకు చాలామంది స్నేహితులుండేవాళ్లు. ఈ ప్రాంతాల్లో తోటి స్నేహితులతో కలసి ఆమె సరదాగా ఆడుకునేది. రంగనాథ స్వామి ఆలయంకు క్రమం తప్పకుండా వెళుతుండేది. జయలలిత సినిమాల్లోకి వెళ్లాక నెల్లూరుకు రావడం మానేసింది.

నెల్లూరీయులతో సత్సంబంధాలు

నెల్లూరుతో వున్న ప్రత్యేక అనుబంధమో ఏమోగాని నెల్లూరుకు చెందిన వ్యక్తులను ఆమె ఎంతగానో అభిమానించేవారు. ముఖ్యంగా స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబానికి ఆమె అత్యంత ఆప్తురాలు. 1992లో నెల్లూరు ఏ.సి స్టేడియంలో జరిగిన మాగుంట సుబ్బరామిరెడ్డి తనయుడు మాగుంట విజయ్‌రెడ్డి వివాహానికి ఆమె రావడం జరిగింది. 1995లో నక్సలైట్ల చేతుల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి దారుణహత్యకు గురైనప్పుడు కూడా ఆమె నెల్లూరొచ్చి సుబ్బరామన్నకు నివాళులర్పించారు. అలాగే తమిళనాట తెలుగువారి కీర్తి బావుటాగా వున్న ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సి.ఎం.కె.రెడ్డి, సీబ్రోస్‌ అధినేత సుబ్బారెడ్డి లాంటి నెల్లూరీయులతోనూ ఆమెకు సత్సంబంధాలున్నాయి. ఇలా నెల్లూరుతోనూ, నెల్లూరీయులతోనూ జయలలితకు వున్న అనుబంధం చరిత్రలో తీపిజ్ఞాపకంగా మిగిలిపోనుంది.

jayalalithaఒక గుండె ఆగింది... కోట్ల గుండెలు రోదించాయి.

ఒక శ్వాస ఆగింది... కోట్లాదిజనం ఆశలు గల్లంతయ్యాయి.

రెండుకళ్లు మూత పడ్డాయి... కోట్ల కళ్లు కన్నీరు కార్చాయి.

ఒక ధృవతార నేలను వీడి నింగికి చేరింది...

కోట్లాది మంది అభిమానుల రోదనలు నేల నుండి నింగిని తాకాయి.

అమ్మా... అమ్మా... అంటూ అరచిన ఆ కోట్ల గొంతుకల వేదనను భగవంతుడు మన్నించలేదు. మీకేనా అమ్మ... నాకు మాత్రం 'అమ్మ' అక్కర లేదా అంటూ వ్యక్తిగత జీవితంలో 'అమ్మ' కాలేకపోయినా ప్రజా జీవితంలో కోట్లాదిమంది ప్రజలకు 'అమ్మ'లా నిలిచిన జయరాం జయలలితను దేవుడు తన దగ్గరకు తీసుకెళ్లాడు. అమ్మను అక్కడకు తీసుకెళ్లి తాను ఆమెకు బిడ్డలా మారి ప్రేమగా చూసుకుంటున్నాడు.

ఒక సంచలనానికి తెరపడింది. ఒక శకం ముగిసింది. సవాళ్లకే సవాళ్లు విసిరి, కష్టాల చేతే కన్నీళ్లు పెట్టించి, సమస్యలకే సమస్యలు సృష్టించి, పురుషాధిక్య ప్రపం చంలో కొమ్ములు తిరిగిన మొనగాళ్ల నడు ములు వంచిన వీరనారి, విప్లవనాయకి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ నెల 5వ తేదీ రాత్రి 11.30గంటలకు ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు పలికి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. కోట్లాది మంది అభిమానులను శోకసముద్రంలో ముంచిన ఆమె, తన 68వ ఏట జీవన ప్రయాణాన్ని ముగించారు. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ ఎన్నో పోరాటాలలో విజయం సాధించిన ఆమె మృత్యువుతో 75రోజులు సుధీర్ఘ పోరాటం సాగించినా చివరికి దాని ముందు తలవంచక తప్పలేదు. ఈ ప్రపం చంలోనే ఒక అద్భుత మహిళాశక్తికి పునర్జన్మనివ్వాలని చెన్నైలోని అపోలో వైద్యులు చేసిన విశ్వప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమయ్యాయి.

తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో ఆమె సెప్టెంబర్‌ 22న చెన్నై, గ్రీమ్స్‌రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తొలుత ఆమె ఆరోగ్యంపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అప్పుడే ఆమె ఆరోగ్యం విష మించిందనే వార్తలు రావడంతో అభి మానులు ఆందోళన చెందారు. అపోలో వైద్యులతో పాటు, ఎయిమ్స్‌ వైద్యులు, లండన్‌కు చెందిన డాక్టర్‌ రిచర్డ్‌బేలే ఆధ్వర్యంలో ఆమెకు అత్యాధునిక వైద్యం అందించారు. ఈ క్రమంలో ఆమె కోలు కున్నారని, పత్రికలు చదవడం, ఆహారం తీసుకోవడం చేస్తున్నారని, త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామని ఆసుపత్రి వర్గాలు పేర్కొనడంతో అభిమానులు ఊరటచెందారు. అమ్మ ఆరోగ్యం బాగయ్యిందని ఆనందపడి గుళ్లలో మొక్కులు కూడా తీర్చుకున్నారు. జయలలిత ఆస్పత్రిలో బెడ్‌ మీద కూర్చున్న ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో రావడం అభిమానులకు నమ్మకాన్ని కలి గించింది. అయితే అంతా సాఫీగా సాగిపో తుంది, జయలలిత త్వరలోనే డిశ్చార్జ్‌ అవుతుందనుకున్న తరుణంలో విధి అడ్డం తిరిగింది. ఈ నెల 4వ తేదీ ఆమె తీవ్ర మైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించి ఎక్మో ద్వారా అధునాతన చికిత్స అందించారు. అయినా ఆమె ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు కాలేదు. ఢిల్లీ నుండి ఎయిమ్స్‌ వైద్యులు కూడా వచ్చి పరీక్షిం చారు. జయలలితను ఇక దేవుడే బ్రతి కించాలి అనేది అప్పుడే తెలిసిపోయింది. కాని అమ్మ గుండె ఆగింది... అమ్మ ఇక లేదు... అమ్మ మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయింది... అని ఆసుపత్రి గేట్ల ముందు వున్న పిచ్చి అభిమానులకు చెప్పేదెవరు? అలా చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? ఒకవేళ అలా చెబితే తమిళనాడు పరిస్థితి ఏంటి?

వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేంద్రం

జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమిళనాడు ప్రభుత్వాన్ని మొత్తం తమ అదుపులోకి తీసుకుంది. 4వ తేదీ సాయంత్రం జయలలిత గుండెపోటుకు గురైంది. 5వ తేదీ మధ్యాహ్నానికల్లా ఆమెను బ్రతికించడం కష్టమని తేలిపోయింది. తమ అమ్మ చని పోయిందని తెలిస్తే అభిమానులు అప్పటికప్పుడు పెనువిధ్వంసాలకు పాల్పడే అవకాశ ముంది. పరిస్థితులను గమనించిన కేంద్రం ముందుగా 9కంపెనీల పారామిలటరీని, భారీఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించింది. జయలలిత పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు మాత్రమే రాత్రి వరకు ప్రజల్లోకి పంపారు. ఈ విధంగా అభిమానులను మానసికంగా సిద్ధం చేశారు. అపోలో ఆసుపత్రి వద్ద వున్న అభిమానులను పంపించేసారు. తమిళనాడులోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో అన్ని వ్యాపార సముదాయాలు మూసివేసే టైం దాకా వేచిచూసారు. బస్సులు కూడా డిపోలకు చేరేదాకా చూసారు. తమిళనాడు ఇక నిద్రకు ఉపక్రమించిన సమయంలో అంటే 5వతేదీ రాత్రి 11.30 గంటలకు జయలలిత చనిపోయిన విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ అనుమతి తీసుకుని ప్రకటించారు. అప్పుడు ఈ వార్త తెలిసినా జనాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి లేదు. ఆ రాత్రంతా కూడా తమిళ ప్రజలు ఇళ్లల్లోనే బాధను అనుభవించారు. తెల్లవారగానే 'అమ్మ'ను చూడడానికి పొయెస్‌ గార్డెన్‌, రాజాజీ హాల్‌లకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఎలాంటి విధ్వంసాలు జరుగకుండా కేంద్రం ముందుగానే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు.

ఆరోగ్యంపై నిర్లక్ష్యమే కారణం!

ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకుండా వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితం లోనూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తమిళనాడు రాజకీయాలతో పాటు పలు సందర్భాల్లో దేశ రాజకీయాలను సైతం శాసించిన జయలలిత తన ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. ఆమె కోరుకుంటే ప్రపంచ దేశాలలో మేటి వైద్యులు ఆమె వద్దకే వచ్చి చికిత్స చేస్తారు. లేదా ప్రపం చంలో ఏ అగ్రదేశానికైనా ఆమె వెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. కాని ఆరోగ్యం పట్ల ఆమె అశ్రద్ధ చేసింది. ఆమెకు ముఖ్యమను కున్న వాళ్లు కూడా ఆమె ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఊబకాయం, మధు మేహం, అధిక రక్తపోటు ఆమె శరీరాన్ని శక్తిహీనం చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో ఆమెకు నియంత్రణ ఉండేది కాదని తెలుస్తోంది. ఫలితంగా ఆమెకు కిడ్నీ, కాలేయంకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది ఎన్ని కలకు ముందే ఆమె విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలనుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో ప్రతిపక్షం తనపై దుష్ప్రచారం చేస్తుందనే ఉద్దేశ్యంతో ఆగి పోయారు. ఈ ఏడాది ఎన్నికల సభలలో కూడా ఆమె తక్కువుగానే పాల్గొన్నారు. అయినా కూడా అంచనాలకు అందని విజయం సాధించారు. తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టు కున్న ఖ్యాతి ఆమెది. అయితే ఆ ఆనందాన్ని ఆరునెలలు కూడా అనుభవించకుండానే భువి నుండి దివికేగారు.

పోటెత్తిన అభిమానం

జయలలిత చనిపోయిందనగానే తమిళనాడులో చాలామంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. కోట్లాదిగుండెలు రోదించాయి. అమ్మ చివరి దర్శనం కోసం ప్రజలు రాజాజీ హాల్‌కు పోటెత్తినట్లు వచ్చారు. భారత రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్‌లు, ముఖ్య మంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు... ఇలా అన్ని రంగాల వారు తరలివచ్చి 'అమ్మ'కు నివాళులర్పించారు. సాయంత్రం జయలలిత భౌతిక కాయంతో రాజాజీ హాల్‌ నుండి మెరీనా బీచ్‌ వరకు అంతిమయాత్ర లక్షలాది జన సమూహం మధ్య సాగింది. స్వర్గీయ ఎం.జి.రామ చంద్రన్‌ ఘాట్‌ పక్కనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. చెక్కపెట్టెలో ఆమె మృత దేహాన్ని వుంచి సైనికలాంఛనాలతో ఖననం చేస్తుంటే... ఒక చరిత్ర కాలగర్భంలో కలిసి పోతున్నట్లే అనిపించింది.

గత ఏడాది జల సముద్రం... ఈ యేడాది జన సముద్రం

కాలమో, విధి వైపరీత్యమో గాని సరిగ్గా 2015 డిసెంబర్‌ నెలలోనే చెన్నై నగరం జలసాగరంగా మారింది. కుండపోతగా కురిసిన వర్షాలతో నగరం మొత్తం వరదలో చిక్కుకుంది. దాదాపు తేరుకోవడానికి నెలరోజులు పట్టింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇదే నెలలో చెన్నై నగరం 'అమ్మ' మరణంతో జన సముద్రంగా మారింది. జనం కన్నీటితో నగరంలో మరోసారి వరదలు పోటెత్తినట్లైంది. 2015లో వరదల నుండి నెలలోనే తేరుకున్న చెన్నై ప్రజలు మరి అమ్మ లేదనే జ్ఞాపకం నుండి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుందో?

ఏదేమైనా, దేశ రాజకీయాలలో జయలలిత అనబడే ఈ కోమలవల్లి ఒక చరిత్ర... పోరాటానికి నిలువెత్తు రూపం... స్త్రీ తనను తాను మలచుకుంటే వ్యక్తి కాదు శక్తి అని నిరూపించిన ధీరవనిత. 'అమ్మ'గా బిడ్డలకు పాలివ్వకపోయినా... అమ్మలా ప్రజలను పాలించి, వారి గుండెల్లో దీపమై వెలుగుతున్న జీవనజ్యోతి జయలలిత!

వెంకయ్య కీలకపాత్ర

తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో నెల్లూరీయు డైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారు. జయలలిత ఆరోగ్యం విషమించిందని తెలియ

గానే ప్రధాని నరేంద్రమోడీ వెంటనే వెంకయ్యను చెన్నైకు పంపించారు. చెన్నైకు వచ్చిన వెంకయ్య ఇక్కడ పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రధానికి చేరవేయడమేకాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వెంకయ్య సూచనల ప్రకారమే కేంద్రం అన్ని చర్యలు చేపట్టింది. ఇక జయలలిత వారసుడిగా పన్నీరు సెల్వంను ఎంపిక చేయడంలోనూ వెంకయ్య తన పాత్ర పోషించారు.

ఒక దశలో కేంద్ర పెద్దలకు తెలియకుండానే జయ సన్నిహితురాలు శశికళ వ్యూహాత్మ కంగా సిఎం పీఠాన్ని తన అనుచరుడు పళనిస్వామికి అప్పగించడానికి ప్రయత్నించింది. ఆసుపత్రిలో ఓ పక్క జయలలిత మృతదేహం ఉండగానే మరోపక్క శశికళ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారందరిదగ్గర మూడు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఒకటి పళనిస్వామిని సీఎంను చేయడానికి, రెండోది తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడానికి, మూడోది అమ్మ ఆరోగ్యం బాగు చేయడానికి ఆసుపత్రి వర్గాలు బాగా కృషి చేసాయని చెప్పడానికి. తెరవెనుక శశికళ ఆడుతున్న నాటకాన్ని పసిగట్టిన వెంకయ్య అప్పటికప్పుడు ప్రధానితో సంప్రదించి తమిళ ప్రజలకు, తమకు అనుసంధానంగా ఉండే పన్నీర్‌సెల్వంను సిఎంగా ఎంపికచేయడంలో చురుకైన పాత్ర పోషించారు. తమిళనాడు ఇన్‌ఛార్జ్‌ గవర్నర్‌గా వున్న మరో తెలుగువాడు విద్యాసాగర్‌రావు కూడా వెంకయ్యకు ఈ రాజకీయ పరిస్థితుల్లో బాగా సహకరించారు.

jayaతమిళనాడు రాజకీయాల్లో పురచ్చితలైవి జయలలిత ఎప్పుడూ సంచలనమే! అధికా రంలోకొచ్చినా సంచలనమే, ప్రతిపక్షంలో కూర్చున్నా సంచలనమే! దత్తపుత్రుడికి పెళ్లి చేసినా సంచలనమే! సిబిఐ దాడులు జరిగినా సంచలనమే!ఈ సంచలనాలన్నీ ఒకెత్తయితే ఇప్పుడు ఆమె అనారోగ్యం కూడా తమిళనాడు లోనే కాదు, దేశ వ్యాప్తంగా సంచలమైంది. దాదాపు 20రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన జ్వరంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా తర్వాత కిడ్నీలు, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స చేస్తున్నారు. లండన్‌ నుండి వైద్యులను పిలిపిం చారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు వచ్చి ఆమె చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. జయలలితను ఒక దేవతగా ఆరాధించే తమిళులకు కంటికి కునుకు, కడుపుకు తిండి లేదు. అమ్మ కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. నాలుకలకు శూలాలు గుచ్చుకుని తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. జయలలిత ఆరోగ్యంగా తిరిగి రావాలని కనిపించిన దేవుడికల్లా మొక్కుతున్నారు.

ఆసుపత్రిలో ఆమెకు వెంటిలేటర్‌ మీద చికిత్స అందిస్తున్నారు. ఆమె శరీరం చికిత్సకు సహకరిస్తుం దని, త్వరలోనే కోలుకుంటుందని అప్పుడప్పుడు వైద్యులు హెల్త్‌బులెటిన్‌లు విడుదల చేస్తున్నారు.

ఇంకో పక్క తమిళనాట రాజకీయాలు సెగ పుట్టిస్తున్నాయి. జయలలితకు వారసులమంటూ ఆమె బంధువులు తెరపైకి వస్తున్నారు. రేపు జరగరానిది జరిగితే ఆమె రాజకీయ వారసత్వం తమకే దక్కాలని పాకులాడుతున్నారు. ఇక తమిళ సినీహీరో అజిత్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. జయలలితను అజిత్‌ తన తల్లిలాగా చెప్పుకుంటుంటాడని, జయలలిత కూడా తన వారసుడిగా అజిత్‌ పేరుతో వీలునామా రాసి పెట్టిందన్న ప్రచారం చక్కర్లు కొడు తుంది. జయలలిత ఆరోగ్య సమాచారాన్ని బయట పెట్టాలంటూ డిఎంకె అధినేత కరుణానిధి డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా ఉండగా రాష్ట్రంలో పరిపాలన స్థంభించి పోకుండా ఉండేందుకు జయలలిత నిర్వహిస్తున్న శాఖలను ఆర్ధికమంత్రి పన్నీరుసెల్వంకు బదిలీ చేస్తూ ఇన్‌ఛార్జ్‌ గవర్నర్‌ సి.హెచ్‌.విద్యాసాగర్‌రావు సెక్షన్‌ 166 ద్వారా ఉత్త ర్వులు జారీ చేశారు.

తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ టెన్షన్‌ పర్వంలో కేంద్రప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో లేనప్పటికీ బీజేపీకి అన్నాడిఎంకె పరోక్ష మద్దతుదారుగా వుంది. 2019ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకునే అవకాశం కూడా వుంది. జయలలిత ఆరోగ్యం దెబ్బతింటే, అన్నాడిఎంకె పార్టీనే విచ్ఛినమయ్యే పరిస్థితి. బీజేపీ దీనిని కోరుకోవడం లేదు. జయలలిత ఆరోగ్యం దెబ్బతిన్నా అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని, పార్టీని నిలబెట్టాలన్నది బీజేపీ నేతల వ్యూహం. అందుకే జయకు ప్రత్యామ్నాయ నాయకత్వంపై సైతం బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో జయ సస్పెన్స్‌ డ్రామాను ఇక ఎంతోకాలం కొనసాగించలేరు! ఆమె పరిస్థితి ఏంటి? ఆమె ఆరోగ్యం ఎలా ఉందన్న టెన్షన్‌కు త్వరలోనే తెరపడొచ్చు!

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter