kak mutపొలిటికల్‌ గేమ్‌లో అధికారులు అప్పుడప్పుడూ పావులుగా మారుతుంటారు. 'కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం' అనే సామెతకు అధికారులు అద్దినట్లు సరిపోతుంటారు. అధికారంలో వున్న నాయకుల మాటలు వింటే ప్రతిపక్ష నాయకులు తూర్పారబడతారు, వినకపోతే అధికారపార్టీ నాయకులు కక్షగట్టి అప్రాధాన్యత ప్రాంతాలకు బదిలీలు చేయడం వంటివి చేస్తుంటారు. రాష్ట్ర రాజకీయాలలో అధికారుల పరిస్థితి ఎప్పుడు కూడా అడకత్తెరలో పోకచెక్క మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం నెల్లూరుజిల్లాలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి వర్సెస్‌ కలెక్టర్‌ల మధ్య జరుగుతున్న పోరును చూస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుపై ఎమ్మెల్యే కాకాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేసాడు. కలెక్టర్‌ను పచ్చచొక్కా వేసుకున్న తెలుగుదేశం కార్యకర్తగా అభివర్ణించాడు. కలెక్టర్‌ ప్రోటోకాల్‌ పాటించడం లేదు, తెలుగుదేశం తొత్తుగా మారాడు. మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నాడు. వెంకటాచలంలో రూర్బన్‌ క్రింద జరుగుతున్న పనులు ఘోరంగా వుంటే కలెక్టర్‌ పట్టించుకోడం లేదు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కొడుకు రాజగోపాలరెడ్డిని ఏ హోదాలో అధికారిక సమావేశా లలో వేదికలపై కూర్చోబెడుతున్నారు. సర్వేపల్లి నియోజక వర్గంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యేగా నన్ను పిలవకుండా మంత్రి కొడుకును ఎందుకు పిలుస్తున్నారు. పంచాయితీలలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తే ఒక్క వైసిపి సర్పంచ్‌లపై మాత్రం వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇలా ఎన్నో ఆరోపణలతో కాకాణి కలెక్టర్‌పై విరుచుకుపడడమే కాక ఇవిగో ఆధారాలంటూ 9వ తేదీ నెల్లూరు కలెక్టరేట్‌లో జేసీ-2 కమలకుమారిని కలిసి కొన్ని పత్రాలు అందజేశారు. కలెక్టర్‌పైనే కాకాణి పదునైన విమర్శలతో దాడి చేయడంతో ఉద్యోగ సంఘాలు రియాక్టయ్యాయి. కలెక్టర్‌పై కాకాణి వ్యాఖ్యలు దారుణమంటూ రెవెన్యూ సంఘాలు మండిపడుతున్నాయి. బి.సి ఉద్యోగులు నెల్లూరులో కాకాణికి వ్యతిరేకంగా ధర్నా చేసారు. ఇక జిల్లా అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న కలెక్టర్‌ను తిడతారా... కలెక్టర్‌కు మేం అండగా వున్నాం అంటూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో సోమవారం వెంకటా చలంలో భారీ ర్యాలీ చేసారు. అయితే తనపై ఇంత దాడి జరుగుతున్నా కలెక్టర్‌ ముత్యాలరాజు ఎక్కడా నోరు మెదపకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఈ వివాదం చిలికిచిలికి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి! జిల్లాలో ప్రజాప్రతినిధులకు అధికారులకు మధ్య విభేదాలు, వాగ్యుద్దాలు కొత్తేం కాదు, కాని గతంలో అధికారపార్టీ నాయకు లతో అధికారులకు వైరం ఏర్పడేది. గతంలో కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కలెక్టర్‌ శ్రీలక్ష్మిల మధ్య గొడవ చూసాం. కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌ల వివాదం చూసాం. గతంలో ప్రతిపక్ష నేతలు కూడా కలెక్టర్‌, ఎస్పీ వంటి అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. అంతెందుకు ఇటీవలే రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జిల్లా ఎస్పీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం చూసాం. ఇప్పుడు కాకాణి, కలెక్టర్‌ గొడవ... చిలికి చిలికి గాలి వానగా మారకముందే సమిసిపోతే మంచిది!

mantaluఒకప్పుడు సి.వి.శేషారెడ్డి... ఆ తర్వాత ఆదాల ప్రభాకర్‌రెడ్డి... ఇప్పుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి... గత పాతికేళ్ళ కాలంలో తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి ప్రత్యర్థులు మారారంతే... సర్వేపల్లి నియోజకవర్గం కేంద్రంగా సాగే రాజకీయ యుద్ధం మాత్రం ఆగడం లేదు. సోమిరెడ్డి ఎవరితోనూ యుద్ధం ఆపడం లేదు. సరికదా ప్రత్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తన యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసాడాయన.

2014 ఎన్నికల్లో సర్వేపల్లి నుండి వైసిపి అభ్యర్థిగా కాకాణి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డిలు పోటీ చేయడం, కాకాణి కొద్దిమెజార్టీతో గెలవడం తెలిసిందే! ఈ ఎన్నికలకు ముందు సోమిరెడ్డి, కాకాణిలు వేర్వేరు పార్టీలలో వున్నప్పటికీ ఎలాంటి రాజకీయ శత్రుత్వం ఉండేది కాదు. కాని 2014 ఎన్నికల్లో ప్రత్యర్థులు కాబట్టి ఎన్నికల తర్వాత కూడా ఆ రాజకీయ వైరం కొనసాగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సర్వేపల్లి రాజకీయాలను హీటెక్కిస్తూ వచ్చారు. ఇలా వేడెక్కిన రాజకీయాలు 2016 సంవత్స రాంతంలో కీలక మలుపుతిరిగాయి. రాజకీయ పోరాటం వ్యక్తిగత పోరాటంగా మారింది. వ్యక్తిగత విమర్శలకు దిగారు. భూకబ్జాలు, ఆస్తుల గురించి ఆరోపణలు చేసుకున్నారు. ఈ పరంపరలోనే 2016 డిసెంబర్‌లో కాకాణి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ... సోమిరెడ్డికి సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ దేశాలలో వేలకోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అంతే కాదు, విదేశాలలో వున్న బ్యాంకు అకౌంట్లు అంటూ కొన్ని బ్యాంకుల పాస్‌పుస్తకాలను, లావాదేవీలు జరిపారంటూ కొన్ని పత్రాలను చూపించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరుతో ఇంకో పాస్‌పోర్టు వుందంటూ పాస్‌పోర్టును, ఆయన ఆయా దేశాలకు వెళ్లాడంటూ అందులో పొందుపరచిన వివరాలను వెల్లడించారు. మీడియాలో ఇది చూసి సోమిరెడ్డికే మైండ్‌ బ్లాకయ్యింది. నాకు తెలియకుండా విదేశాలలో నాకు వందలకోట్ల ఆస్తులు ఎక్కడనుండి వచ్చాయబ్బా అనుకుని డైలమాలోపడ్డారు. ఏదేమైనా కాకాణి తనపై చేసిన ఆరోపణల విషయంలో నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన నెల్లూరురూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, పోలీసులు తీగ లాగితే డొంకంతా కదలడం తెలిసిందే!

చిత్తూరుజిల్లాకు చెందిన చిరంజీవి అలియాస్‌ మణిమోహన్‌ అనే వ్యక్తి సృష్టించి ఇచ్చిన నకిలీ పాస్‌పోర్టు, బ్యాంకుల పాస్‌బుక్‌లు, ఇమిగ్రేషన్‌ పత్రాలను నమ్మి కాకాణి అప్పుడు తన గోతిలో తానే పడ్డాడు. నెల్లూరురూరల్‌ పోలీసులు 2017 జనవరిలోనే చిరంజీవి అలియాస్‌ మణిమోహన్‌ను అరెస్ట్‌ చేయడంతోనే సోమిరెడ్డి విదేశీ ఆస్తుల స్టోరీ అంతా తుస్‌ అని తేలిపోయింది. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను కాకాణిపై నెల్లూరురూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన పోలీసులు కాకాణిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడం తెలిసిందే! గత ఏడాది 36వారాలపాటు ఆయన పోలీసుస్టేషన్‌కు వెళ్ళి సంతకం చేసొచ్చిన దాఖలాలు కూడా వున్నాయి.

అయితే ఇక్కడితో కూడా వీళ్ళ మధ్య పోరు ఆగలేదు. ఇటీవలకాలంలో కూడా సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని, సిబిఐ ద్వారా విచారణ జరిపించి వాటి బండారం బయటపెట్టాలంటూ కాకాణి డిమాండ్‌ చేశాడు. ఈ దశలో సోమిరెడ్డి వెనక్కి తగ్గలేదు. తనకు విదేశాలలో వేలకోట్ల ఆస్తులున్నాయని అబద్దపు ప్రచారం చేసి, తన పరువుకు నష్టం కలిగించినందుకు 5కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ కాకాణిపై నెల్లూరుజిల్లా సివిల్‌ కోర్టులో సెక్షన్‌ 26 ఆర్డర్‌-7 రూల్‌ క్రింద పరువునష్టం దావా వేసారు. అంటే వీరి మధ్య రాజకీయ పోరాటం ఇక నుండి న్యాయపోరాటంగా మారిందన్నమాట. ఎలాగూ ఈ ఏడాదిలోనే ఎలక్షన్స్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఇక సెగ తగ్గే అవకాశం లేదు. ఎలక్షన్‌ దాకా వీరిమధ్య ఈ మంటలు పెరగడమే కాని, ఆరడం అంటూ ఉండదు.

kakani sanjeeవైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 25పార్లమెంట్‌ స్థానాలను 25 జిల్లాలుగా మారుస్తామని చెప్పి ఆ పార్టీ అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ఆ దిశగా తన పార్టీ నుండే తొలి అడుగు వేసాడు. ఈసారి జిల్లాల వారీగా కాకుండా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించాడు. ఇప్పటివరకు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా వున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇక నుండి నెల్లూరు పార్ల మెంటు(నెల్లూరు సిటీ, నెల్లూరురూరల్‌, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, ప్రకాశంజిల్లాలోని కందుకూరు అసెంబ్లీలు) అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అలాగే సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీ వయ్యను తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించారు. నెల్లూరుజిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి అసెంబ్లీలతో పాటు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…

Newsletter