కృత్రిమ రసాయ నాలతో పండ్లను మాగ బెట్టి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడితే సహించేది లేదంటూ న్యాయస్థానాలు చేసిన హెచ్చరికలు సత్ఫ లితాలనే ఇస్తున్నట్లుంది. ఎండాకాలం అంటే మామిడిపండ్ల సీజన్. వీటితో పాటు పుచ్చ, కర్బూజా, ద్రాక్ష, నేరేడు వంటి కాయలు మార్కెట్లోకి వచ్చినా ఈ సీజన్లో మామిడిపండే కింగ్! ఈ కాలంలో మామిడి పండు తినని మనిషంటూ ఉండడు. మామిడిపండ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ప్రతి ఏడాది కాయ కాపుకు రాకముందే చెట్ల నుండి కోసి రసాయనాలతో మగ్గబెట్టేవాళ్ళు. దీనిమూలంగా పండు పైతొక్క నిగనగలాడుతుండేది, కోసి చూస్తే లోపలంతా చెడిపోయి ఉండేది. ఇలాంటి పండ్లు రుచిగా కూడా వుండవు. ఎవరైనా ఆరోగ్యం కోసం పండ్లు తింటారు. కాని రసాయనాలతో మాగేసిన మామిడిపండ్లను తింటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లుండేది. న్యాయస్థానం దీని మీద చాలా సీరియస్‌గా స్పందించడమే కాక ఒకట్రెండు కేసుల్లో ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వ్యాపారులకు శిక్షలు కూడా వేసింది. దీంతో రసాయనాలతో మాగేసే విధానం తగ్గిపోవడంతో మార్కెట్లో మామిడి పండ్లు చాలా తక్కువుగా కనిపిస్తున్నాయి. లేకుంటే ఇదివరకే మామిడి పండ్లు మార్కెట్లో గుట్టలు గుట్టలుగా ఉండేవి.
22April2018