నెల్లూరు మేయర్ అజీజ్ వైఖరిపై తెలుగుదేశం నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక అజీజ్‌ను కొనసాగిస్తే నగరంలో తెలుగుదేశం మనుగడ సాగించడం కష్టమనే భావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అజీజ్ ఒంటెత్తు పోకడల మూలంగా నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాల్లో కొన్ని వర్గాల ప్రజలు పార్టీకి దూరమవుతున్నారని నాయకులు వాపోతున్నారు.
ముఖ్యంగా మేయర్ అజీజ్ వైఖరితో నగరంలో పార్టీ నష్టపోతుందని ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌ను అవినీతికి నమూనాగా మార్చారు. సామాన్య ప్రజలకు పైసలివ్వందే పనులు కావడం లేదు. టౌన్‌ప్లానింగ్‌లో పనులు చేయించుకోవాలంటే తలప్రాణం తోకలోకి వస్తోంది. కార్పొరేషన్లో ప్రతిపనికి ఒక రేటు కట్టేసారు. మేయర్ అజీజ్ సోదరుడు జలీల్ కేంద్రంగా అవినీతి సామ్రాజ్యం నడుస్తోందనే ఆరోపణలున్నాయి. అలాగే ప్రతి విభాగానికి నెలకు ఇంత అని అవినీతి సొమ్ము టార్గెట్ పెట్టారని తెలుస్తోంది. ఇక పింఛన్లు, ఋణాలు వంటివాటి మంజూరు విషయంలో అజీజ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు, ఋణాల పంపిణీ విషయంలో నగర, రూరల్ ఇన్ఛార్జ్లు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నారాయణ చేసిన సూచనలను కూడా అజీజ్ లెక్కపెట్టలేదు. నగరంలో కార్పొరేషన్ పరంగా పెద్దగా అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. కనీసం చెత్తా, చెదారం పనులు కూడా సక్రమంగా చేయడం లేదు. ఇప్పుడు అజీజ్ తెలుగుదేశం మేయర్ క్రింద లెఖ్ఖ! కార్పొరేషన్ జమానాలో జరిగే అవినీతి అక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ఖాతాలోనే పడుతున్నాయి. ఇదంతా తెలుగుదేశంకు నష్టం కలిగించే ప్రక్రియే! అజీజ్ వైకాపా మేయర్‌గానే ఉండుంటే తెలుగుదేశంపై ఈ ప్రభావం ఉండేది కాదు.
నెల్లూరు మేయర్ పనితీరు వల్ల నగరం, రూరల్ నియోజకవర్గాలలో పార్టీకి కొంచెమన్నా ఉపయోగం ఉండాలి. కాని, అజీజ్ చర్యలతో పార్టీ నష్టపోతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలుండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల దాకా అజీజ్‌నే మేయర్‌గా కొనసాగిస్తే ఈ రెండు నియోజకవర్గాలలోనూ పార్టీ దెబ్బతింటుంది. పార్టీకి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, జడ్పీలకన్నా కూడా అసెంబ్లీలు ముఖ్యం. నగరం, రూరల్‌లో తెలుగుదేశం బలహీనంగా వుంది. గత ఎన్నికల్లో ఈ రెండు సీట్లు కోల్పోయింది కూడా! ఈసారి రెండింటిలో ఒక్కటన్నా గెలుచుకోవాలి. ఈసారి కూడా ఎన్నికలు గట్టిపోటీ మధ్యే వుంటాయి. కాబట్టి ప్రతి అసెంబ్లీ మీద పెద్ద కసరత్తే చేయాల్సి వుంటుంది. కాని ఇక్కడ అజీజ్ వైఖరి వల్ల ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో కొన్ని వర్గాలవారు పార్టీకి దూరమవుతున్నారు. అట్లాగని అజీజ్ మూలంగా పార్టీకి ముస్లింలు దగ్గరయ్యారా అంటే అదీ లేదు. ఈసారి తెలుగుదేశం ఎమ్మెల్యే టిక్కెట్ అజీజ్‌కు ఇచ్చినా కూడా ముస్లింలు వైకాపా వైపే నిలుస్తారు. ఆయా ప్రాంతానికి మిగిలిన వర్గాలను దూరం చేసుకోవడమెందుకనే ఆలోచనలో తెలుగుదేశం అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఆయన వైఖరి ఉంది. ఇదే విధంగా కొనసాగిస్తే, ఆయనను మేయర్ కుర్చీ నుండి పంపించే ప్రయత్నం కూడా జరగొచ్చు.
ఎవ్వరి మాటా వినడు ఈ సీతయ్య అన్నటైపులో తయారయ్యాడు నెల్లూరు మేయర్ అజీజ్. నాకెవరూ బాస్‌లు లేరు. నాకు నేనే బాస్‌ని అన్నట్లుగా వ్యవహరిస్తూ తన పార్టీ వాళ్లకు, తనను పార్టీలోకి తీసుకొచ్చిన వాళ్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాడు. జిల్లా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకుడితోనూ ఆయనకు సఖ్యత, సమన్వయం లేకుండా పోయాయి. సోమిరెడ్డి, ఆదాల, బీద... ఇలా అందరితో దూరమే! ఆనం అంటే ముందు నుండీ పడదు. సరే, వీళ్లందరినీ పక్కనపెట్టినా తనను పార్టీలోకి తీసుకొచ్చిన మంత్రి నారాయణతోనన్నా బాగుంటున్నాడా? ఆయన మాటకు గౌరవమిస్తున్నాడా అంటే అదీ లేదు. మంత్రి నారాయణ అంటే ఆయనకు బొటనవేలి మీద వెంట్రుకతో సమానమైంది. మేయర్‌కు మంత్రితో పాటు ముఖ్యమైన జిల్లా తెలుగుదేశం నాయకులతో సఖ్యత లేదు. తన పార్టీ కార్పొరేటర్ల మద్దతు లేదు. అయినా అజీజ్ అందరినీ ఢీకొంటున్నాడు. ప్రతి ఒక్కరితో కయ్యానికి సై అంటున్నాడు. అతని ధైర్యానికి కారణమేంటి? అతను ఆడుతున్న గేమ్ ఏంటి?
అతనికి జిల్లా తెలుగుదేశం నాయకులతో సఖ్యత లేకపోయినా తెలుగుదేశం యువరాజు లోకేష్‌తో సన్నిహితంగా ఉంటున్నాడు. తనపై లోకేష్ బ్రాండ్ వేయించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అజీజ్‌కు మైనార్టీ ముద్ర కూడా కలిసొచ్చే అంశం. వచ్చే ఎన్నికల్లో మైనార్టీ కోటా నుండి నెల్లూరు నగరం సీటును దక్కించుకోవాలని అతని ప్లాన్. అందుకు లోకేష్ ఆశీస్సులుంటేచాలని నమ్మకం. కాబట్టే లోకేష్‌ను కాకా పడుతున్నాడు. అదే సమయంలో నెల్లూరు కార్పొరేషన్లో వైకాపా వారితో మంతనాలకు తెరతీసి డబుల్ గేమ్ ఆడుతున్నాడు. పార్టీ మారి తప్పు చేసానని, వైకాపా కార్పొరేటర్లు సహకరిస్తే కార్పొరేషన్లో తెలుగుదేశం వాళ్లతో ఫుట్‌బాల్ ఆడుకుంటానంటున్నాడు. ఈమేరకు కార్పొరేషన్లో వైకాపా ప్రతినిధులుగా వ్యవహరించే పి.రూప్‌కుమార్‌యాదవ్, బొబ్బల శ్రీనివాసయాదవ్‌ల సహకారం అభ్యర్థించాడు. అయితే ఒకసారి అజీజ్ చేతిలో మోసపోయిన వాళ్లు మళ్లీ అంత తొందరగా అజీజ్‌ను నమ్మలేరుగా! అదీగాక ఈ విషయంలో వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనిల్‌ల నిర్ణయమే కీలకం. అజీజ్ తెలుగుదేశంలోనే వుంటే ఆయనకు సహకరించినంత మాత్రాన వైకాపాకు అదనంగా వచ్చే ప్రయోజనమేదీ లేదు.
రాజకీయంగా మంత్రి నారాయణకు ఇంతవరకు ఎవరితోనూ పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు కూడా ఆయన ఏదో నాలుగు సినిమా డైలాగ్‌లు వదిలి సరిపెట్టుకున్నాడు గాని, వారితో తీవ్రమైన రాజకీయ యుద్ధం జరిపింది లేదు. అజీజ్ రూపంలో ఎదురైన సవాలే మంత్రి నారాయణను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అజీజ్‌పై ఏదన్నా చర్య తీసుకుందామా? అంటే మైనార్టీ ముద్ర అడ్డమొస్తోంది. అలాగని చూస్తూ వదిలేస్తే సొంత కార్పొరేషన్లో అడ్డం తిరిగిన మేయర్‌నే ఏం పీకలేని నారాయణ ఇక మంత్రిగా ఏం వెలగబెడతాడనే ప్రశ్న వస్తుంది! మొత్తానికి అజీజ్ వైఖరితో జిల్లా తెలుగుదేశంలోనే అంతర్మధనం మొదలైందని చెప్పొచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లే, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా మొక్కుబడిగా కౌన్సిల్ సమావేశాలు పెడుతున్నాడు. కౌన్సిల్ సమావేశాలు పెడితే ఆయనను ఉతికి ఆరేయాలని ప్రతిపక్ష కౌన్సిలర్లు కాచుక్కూర్చున్నారు. తనకు కావాల్సిన పనులను ఆయన స్టాండింగ్ కమిటి సమావేశంలో ఆమోదింప చేసుకుంటూ కౌన్సిల్ సమావేశాల జోలికి పోవడంలేదు. మూడు నెలలకోసారి పెట్టా ల్సిన కౌన్సిల్ సమావేశాన్ని కనీసం ఆరు నెలలకోసారి కూడా జరపకపోతుండడంతో కార్పొరేటర్లు ఆయనపై తీవ్ర అసహనంతో ఉన్నారు. తమ డివిజన్లలోని సమస్యలను కౌన్సిల్లో ప్రస్తావించి తమకు ఓట్లేసిన ప్రజల ముందు పనిచేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వా లన్నది కొందరి కార్పొరేటర్ల తపన. కొందరైతే సమస్యలను నిజంగానే సమావేశంలో చర్చిం చాలనుకుంటున్నా, మేయర్ అవ కాశమివ్వడం లేదు. ఎమ్మెల్యే అనే ఫీలింగ్ రావాలంటే అసెంబ్లీలో మైకు పట్టుకుని 'అధ్యక్షా!' అని పిలవాలి. కౌన్సిల్లో కూడా అంతే... కార్పొరేటర్ తన పదవిని ఎంజాయ్ చేసేది కూడా కౌన్సిల్ సమావేశాలలో లేచి సమస్యలను ప్రస్తావించినప్పుడే...! మన మేయర్ మాత్రం కార్పొరేటర్లకు ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు.