pasuvuనీళ్ళు లేక, మేత దొరక్క మూగజీవాల ప్రాణాలు పోతున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు జిల్లా అధికారగణం కానీ పట్టించు కోవడం లేదు. మండే ఎండల్లో నోళ్ళు పిడచకట్టుకుపోయి ఆవులు, గేదెలు తదితర మూగజీవాలు విలవిలలాడుతున్నా ఎవరికీ పట్టడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు నిత్యం పడుతున్న వేదనలను అసలు పట్టించుకునేవారే లేరు. రైతులకు అనేక పథకాలు ప్రవేశపెట్టామని, రైతుదే రాజ్య మని, తమది రైతు ప్రభుత్వమని ఇలా రకరకాలుగా మభ్యపెట్టే ప్రకటనలే తప్ప ఆచరణలో రైతుల దుస్థితిని పట్టించుకునే వారెవరూ లేరు. మూడుకార్లు పంటలతో సస్యశ్యామలంగా వుండే నెల్లూరుసీమలో చివరికి పచ్చిగడ్డికి, ఎండుగడ్డికి కూడా కరువొచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీ యంగా వుందో తేటతెల్లమవుతుంది. చివరికి తాగేందుకు నీళ్లు లేక, మేత దొరక్క పాడిపశువులు, అనేకరకాల మూగ జీవాలు బక్కచిక్కిపోయి.. ఊపిరి ఉగ్గబట్టు కుని బతుకుతున్నాయి. అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ దుస్థితిని పట్టించుకోకపోవడంతో రైతులు తమ మూగజీవాలను బతికించుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాటిని అత్యంత తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు. అసలే వర్షా భావంతో నెల్లూరుసీమలోని అనేక మెట్ట ప్రాంతాలు ఇప్పుడు తీవ్రంగా కరువు బారిన పడివున్నాయి. పంటలు ఎటూ పండేది లేదు కానీ, కనీసం పశువులనైనా కాపాడుకుందామని అనుకున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోతున్నాయి. ఈ నేపథ్యంలో పేదరైతుల దుస్థితి మరింత దయనీయంగా వుంది. ముఖ్యంగా జిల్లాలోని మెట్టప్రాం తాల్లో వస్తే వడగళ్ళు..లేదంటే కన్నీళ్ళు అన్నట్లుగా వుంది పరిస్థితి. ఈ మండే ఎండల్లో ఎక్కడా చుక్క నీరు దొరక్క పశువులు, మేలు వగైరా జంతుజాలమంతా పిడచకట్టుకుపోతున్న గొంతులతో విలవిల లాడుతున్నాయి. వానలు కురవక, భూగర్భ జలాలు అడుగంటిపోయి, చెరువులు దొరువులు కాలువలన్నీ ఎండిపోయి మెట్ట ప్రాంతాల్లోని అనేక మండలాలు బీడుపడి పోతున్నాయి. ఎక్కడ వెతికినా పచ్చిగడ్డి కాదు కదా, కనీసం ఎండుగడ్డి కూడా దొరకడం లేదు. దీంతో, ఇంతకాలం కన్న బిడ్డలా పెంచుకున్న ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు వగైరాలన్నిటినీ ఇక సాక లేక అతితక్కువ ధరకే రైతులు అమ్మేసు కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మేత లేక పశువులు అల్లాడుతుంటే, తమ కళ్ళ ముందే అవి బక్కచిక్కిపోయి చావుకు దగ్గరవుతుంటే రైతులు చూడలేక కడివెడు కన్నీటితో వాటిని అమ్మేసుకుంటున్న దయ నీయ దృశ్యాలు ఇప్పుడు మెట్టప్రాంతాల్లో కోకొల్లలు. ముఖ్యంగా, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, కలువాయి, చేజర్ల, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు, బాలాయపల్లి, తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, దొరవారిసత్రం, ఏఎస్‌ పేట, అనంతసాగరం, బోగోలు, జలదంకి, మర్రిపాడు, గూడూరు, వెంకటాచలం తది తర అనేక మండలాల్లో కరువు ముసురు కుంది. తాగేందుకు నీళ్ళు, తినేందుకు మేత లేక తమవైపే దీనంగా చూస్తున్న మూగ జీవాలను ఎలా పోషించుకోవాలో తెలియక అనేకమంది రైతులు ఇతరప్రాంతాలకు వాటిని తీసుకువెళ్ళి ఎంత తక్కువ ధరకైనా సరే వాటిని అమ్మేసుకుంటున్నారు. పూటకి కనీసం మూడు లీటర్ల పాలిచ్చే గేదెలను సైతం వాటి ధర కనీసం 60 వేలకు పైగానే వున్నా, ఈ కరువు పరిస్థితుల్లో అవి బతి కుంటే చాలని కోరుకుంటూ పాతిక, ముప్పై వేలకే అమ్మేస్తున్నారు. పశుగ్రాసం దొరక్క రైతాంగం తీవ్రవేదన పడుతున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం కానీ అసలు పట్టించుకో వడం లేదు. అందరికీ అన్నంపెట్టే అన్న దాతలు ఎంత దయనీయస్థితిలో వున్నా అటు అధికారుల్లో కానీ, ఇటు ప్రభుత్వంలో కానీ ఏమాత్రం స్పందన వుండడం లేదు. ఈ దుస్థితి ఇలాగే కొంతకాలం సాగితే మెట్ట ప్రాంతాల్లో పాడిపశువులకు ఇక కను మరుగైనట్లేనని రైతులు ఆవేదనతో చెప్తు న్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇకనైనా యుద్ధప్రాతి పదికన పశుగ్రాసకేంద్రాలను -తాగునీటి వసతులను ఏర్పాటుచేసి మూగ జీవాల ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టు కోవాలని రైతులు వేడుకుంటున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!
    కలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు…

Newsletter