modiప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 22వ తేదీన జిల్లాలోని శ్రీహరికోట షార్‌ సెంటర్‌కు రానున్నట్లు తెలు స్తోంది. భారీ రాకెట్‌ ప్రయోగాలకు అనువుగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 630కోట్ల వ్యయంతో షార్‌లో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని(సెకండ్‌ వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌)ను ఆయన ప్రారంభించనున్నారు. భవిష్యత్‌లో ప్రతి ఏటా 12రాకెట్‌ ప్రయోగాలు జరపాలని ఇస్రో నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే రెండో వాహన అనుసంధాన భవనాన్ని నిర్మించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి వుంది.

bjpసరిగ్గా నెలరోజుల క్రితం కర్నాటకలో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు అను కూలంగా ఉండింది. ఏ సర్వే చూసినా కాంగ్రెస్‌ తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందనే చెప్పాయి. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారని, ఈ ప్రభావం కర్నాటక ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని కూడా భావించాయి.

కాని, నెలరోజుల్లోనే అక్కడ సీన్‌ను మార్చేసింది అమిత్‌షా బృందం. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారంతో అక్కడ ట్రెండ్‌ మారింది. 21చోట్ల ప్రధాని మోడీ రోడ్‌షోలు జరిగాయి. బయట రాష్ట్రాలకు చెందిన 50వేల మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు కర్నాటకలో దిగిపోయారు. కర్నాటక ఆరెస్సెస్‌ శాఖలు వీరికి సహకరించాయి. నియోజకవర్గానికి 500మంది కార్యకర్తలను బూత్‌లెవల్‌ ప్రచారానికి వినియోగించారు. అమిత్‌షా బెంగుళూరులోనే తిష్టవేసి ఎన్నికలను పర్యవేక్షించాడు. ఆయన బృందంలోని సభ్యులు గెలుపే లక్ష్యంగా శ్రమించారు. కర్నాటకలో 222 స్థానాలుంటే తమ అభ్యర్థి కాంగ్రెస్‌, జేడిఎస్‌ల కంటే వెనుకబడి వున్నాడన్న నియోజకవర్గాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. గెలుపు ఖాయమనుకున్న స్థానాలతో పాటు రెండో స్థానంలో వున్నామని రిపోర్ట్‌ వచ్చిన స్థానాలపై ప్రత్యేకదృష్టి పెట్టారు. కాబట్టే కాంగ్రెస్‌ కంటే మొత్తంగా ఓట్లు తగ్గినా సీట్ల పరంగా మొదటి స్థానంలో నిలవగలిగారు. కేవలం వ్యూహాత్మక రాజకీయాలతోనే బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది.

దేశమంతటా ఉత్కంఠ రేపిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 15వ తేదీ వెలువడ్డాయి. పలు సర్వే సంస్థలు ఊహించినట్లే హంగ్‌ ఫలితాలు వచ్చి కర్నాటకలో అధికార కుర్చీ ఆట మొదలైంది. బీజేపీకి 104 సీట్లు వచ్చి పూర్తి మెజార్టీకి 8సీట్ల దూరంలో ఆగింది. ఇక అధికార కాంగ్రెస్‌ 78సీట్లతో రెండో స్థానానికి పరిమితం కాగా, జేడీఎస్‌ 38సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. ఫలితాల సరళినిబట్టి ఒక దశలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధిస్తుందనుకున్నప్పటికీ చివరిలో కాంగ్రెస్‌ పుంజు కోవడంతో బీజేపీ అధికారానికి 8సీట్ల దూరంలో ఆగింది.

అప్రమత్తమైన కాంగ్రెస్‌...

హంగ్‌ ఫలితాలు వచ్చాయని తెలియగానే కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. గతంలో గోవా, నాగాలాండ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకత్వం అప్రమత్తమైంది. సోనియాగాంధీనే నేరుగా జేడీఎస్‌ అధినేత దేవేగౌడకు ఫోన్‌ చేసి కుమారస్వామిని ముఖ్య మంత్రిని చేస్తామని ప్రతిపాదించింది. దీంతో జేడీఎస్‌ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సై అంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు సులభమే!

రేవణ్ణకు బీజేపీ ఆఫర్‌...

అయితే బీజేపీ కాంగ్రెస్‌కు ఛాన్స్‌ ఇస్తుందా? కాంగ్రెస్‌ కుమార్‌స్వామికి గాలం వేస్తే బీజేపీ దేవేగౌడ్‌ పెద్దకొడుకు రేవణ్ణకు వల విసిరింది. జేడీఎస్‌లో కుమార స్వామి, రేవణ్ణ వర్గాలు వేర్వేరుగా వున్నాయి. తమ్ముడు సీఎం అవుతుంటే అన్న రేవణ్ణ చేతులు ముడుచుకుని వుంటాడా? బీజేపీ వాళ్ళు రేవణ్ణలో పదవీ ఆకాంక్షను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం లేదా కేంద్రమంత్రి పదవి ఆఫర్‌ చేస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్‌లో వున్న లింగాయత్‌ కులానికి చెందిన ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేడీఎస్‌, కాంగ్రెస్‌ల నుండి కొంతమంది ఎమ్మెల్యేలు చీలి వచ్చినా బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమే అవుతుంది.

ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు గవర్నర్‌ చేతిలో వుంది. పెద్దపార్టీని మొదట ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే బీజేపీ పట్ల గవర్నర్‌ తన స్వామిభక్తిని చాటుకున్నట్లే! ఎందుకంటే ఇటీవలే గోవా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పెద్దపార్టీగా అవతరిస్తే అక్కడి గవర్నర్‌ పెద్దపార్టీ కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు. జేడీఎస్‌ - కాంగ్రెస్‌ కూటమికి మొదటి ఛాన్స్‌ ఇచ్చేంత సాహసం గవర్నర్‌ చేయకపోవచ్చు. ఎంతైనా ఆయనా ఒకప్పటి బీజేపీ నాయకుడే కదా!

కాబట్టి మొదటి అవకాశం బీజేపీకే ఇచ్చి బలనిరూపణకు సమయం ఇవ్వొచ్చు. ఈలోపు మిగతా ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు జేడీఎస్‌, కాంగ్రెస్‌లను చీల్చి తెచ్చుకోవచ్చు.

కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధం

కర్నాటకలో ఓటమి కాంగ్రెస్‌ చేజేతులా తెచ్చుకున్నదే! ఇక్కడ సిద్ధ రామయ్య ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. సీఎంగా యడ్యూరప్ప, కుమారస్వామిలకంటే ఆయనవైపే ప్రజలు మొగ్గుచూపారు. కాని కొన్ని సొంత తప్పులే కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసాయి. జేడీఎస్‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్‌ సక్సెస్‌ కాలేకపోయింది. పొత్తు కుదిరివుంటే ఈరోజు ఫలితం ఇంకో విధంగా వుండేది. ఇక మతపరమైన సెంటిమెంట్ల జోలికి పోయి హిందువులలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఎవరూ అడగకపోయినా టిప్పుసుల్తాన్‌ జయంతి అంటూ ఆర్భాటం చేయడం, లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ కేబినెట్‌లో ఆమోదించడం వంటివి ఆయనపై కొన్ని వర్గాల్లో అసంతృప్తిని కలిగించాయి. బీజేపీ ఎన్నికల ప్రచారంలో వీటిని బాగానే వాడుకుంది. రాహుల్‌, సోనియాలొచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు ఉప యోగం లేకుండాపోయింది. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్న పెద్ద రాష్ట్రం ఇదే! ఇప్పుడు ఈ రాష్ట్రం కూడా చేజారిపోయినట్లే!

దీంతో కాంగ్రెస్‌ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయినట్లయ్యింది. పంజాబ్‌, మిజోరాం రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో వుంది. అంటే కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నా లక్ష్యం అన్న మోడీ లక్ష్యం దాదాపు 90శాతం నెరవేరినట్లయ్యింది. బీజేపీ మాత్రం మిత్రపక్షాలతో కలిసి 20 రాష్ట్రాలలో వుండగా కర్నాటకలో కూడా అధికారం చేపడితే అది 21వ రాష్ట్రం అవుతుంది.

modi andhraఈమధ్య సినిమా యాక్టర్‌ శివాజీ ఆపరేషన్‌ గరుడ, ఆపరేషన్‌ ద్రవిడ, ఆపరేషన్‌ పెరుగువడ అంటూ అయ్యవారు లాగా బ్లాక్‌బోర్డు మీద వ్రాసిమరీ విలేకరులకు వివరించాడు. శక్తివంతమైన ఇంటలిజన్స్‌ విభాగానికి సైతం అందని సమాచారం తనకు అందినట్లు ఆయన ఫోజిచ్చాడు. అయితే ఆపరేషన్‌ గరుడ, పెరుగువడ సంగతేమోగాని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో తన మిషన్‌ను ఆపరేషన్‌ను అమలు చేయడం మాత్రం గ్యారంటీగా కనిపిస్తోంది. బహుశా కర్నాటక ఎన్నికలు ముగిసాక బీజేపీ పెద్దలు ఏ.పి రాజకీయాలపై దృష్టిపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

కమలదళం ఆపరేషన్‌ మొదలుపెట్టడమంటే మొదట ఈ నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు అక్రమాల చిట్టాను బయటకు తీయడమే! ఒకటా రెండా... ఈ నాలుగేళ్ళ పాలనలో ఎన్నో లొసుగులున్నాయి. ఎన్నో వేలకోట్ల దుర్వినియోగం వుంది. దుబారా వుంది. లెక్కలేనంత అవినీతి వుంది. ఈ దేశంలో 29రాష్ట్రాలుంటే సగానికిపైగా రాష్ట్రాలలో కుంభమేళా, పుష్కరాలు జరుగుతుంటాయి. కాని, ఏ రాష్ట్రంలో కూడా వేలకోట్లు పెట్టి పుష్కరాలను చేయలేదు. కేవలం దోపిడీ పథకంలో భాగంగానే ఏపిలో గోదావరి, కృష్ణ పుష్కరాలను నిర్వహించినట్లుగా వుంది. పుష్కరాలప్పుడు చేసిన పనులు, వాటి అంచనాలు, లెక్కలు బయటకు తీస్తే ఆశ్చర్యపరిచే బొక్కలు బయటపడతాయి. పట్టిసీమ ప్రాజెక్ట్‌ పేరుతో ఎంత దోచుకున్నారన్నది బీజేపీ నాయకులు లెక్క లతో సహా చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో పోలవరం పెద్ద స్కాం. 16వేల కోట్ల అంచనాలను ప్రభుత్వం 58వేల కోట్లకు తీసుకుపోయింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వేసిన అంచనాలను చూస్తే కళ్ళు బైర్లు కమ్మక తప్పదు. ఈ ప్రభుత్వంలో అతిపెద్ద బూటకం అమరావతి రాజధాని. మూడు పైర్లు పండే 35వేల ఎకరాల మాగాణి పొలాలను రాజధాని కోసం తీసుకున్నారు. నాలుగేళ్ళుగా విదేశీయాత్రలు, గ్రాఫిక్‌ డిజైన్‌లు తప్పితే రాజధాని నిర్మాణంలో అడుగు ముందుకు పడింది లేదు. 700 కోట్లు పెట్టి తాత్కాలిక భవనాలను కట్టు కున్నారు. అది కూడా చదరపు అడుగు 8వేల రూపాయల ఖర్చుతో! ప్రపంచంలోనే ఇంత రేటు ఎక్కడా ఉండదేమో! రాజధాని నిర్మాణానికంటూ కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళించారు. కట్టని భవనాలను కట్టినట్లుగా యూసీలు పంపారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రతిపక్ష పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను కొన్నారు. ఓటు నోటు కేసు ఎలాగూ పెండింగ్‌లో ఉంది.

ఇక నోట్ల రద్దు తర్వాత అన్ని రాష్ట్రాల కంటే కరెన్సీ మన రాష్ట్రానికే ఎక్కువుగా వచ్చింది. అయితే ఇప్పటికీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే కరెన్సీ కొరత ఏర్పడుతోంది. వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం నాయకులే కరెన్సీని డంప్‌ చేస్తున్నారనే సమాచారం కేంద్రం వద్ద వుంది. టీటీడీ బోర్డు మెంబర్‌ శేఖర్‌రెడ్డి ఇంట్లో భారీ ఎత్తున కరెన్సీ కట్టలు దొర కడం తెలిసిందే! ఆయన ఇంటికి కరెన్సీ కట్టలు తరలిపోవడం వెనుక తెలుగుదేశం పెద్దల సహకారం వుందనేదానిపై కూడా అనుమానాలున్నాయి. ఈ నాలుగేళ్ళలో ఇవే కాదు, ఇంకా అనేక లొసుగులున్నాయి. ఇటీవల కాగ్‌ రిపోర్ట్‌ కూడా ఏపి ప్రభుత్వ లెక్కలను కడిగిపెట్టింది. ఇక అవినీతిలోనూ ప్రతి ఏటా రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. వీటిలో దేనిమీద విచారణకు ఆదేశించినా చంద్రబాబుకు సమస్యలు మొదలవడం ఖాయం.

ప్రభుత్వంతో ఏ సంబంధం లేక పోయినా, అధికారికంగా ఏ పదవీ లేకున్నా జగన్‌ మీద అక్రమ ఆస్తుల కేసులు బనా యించి 16నెలలు జైలులో వుంచారు. ఈ నాలుగేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై ఎటువంటి విచారణకు ఆదేశిరచినా చంద్రబాబు ఎక్కడోచోట అధికారికంగానే దొరుకుతాడనే చర్చ జరుగుతోంది. కాబట్టే ఆయన భయపడుతున్నాడని సమాచారం.

కర్నాటకలో గెలిచినా ఓడినా బీజేపీ వాళ్ళు ఏపిలో తమ ఆపరేషన్‌ను ప్రారం భించడం ఖాయం. మొదటిది చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపించి వాటి నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టడం, ప్రజల్లో చంద్రబాబును అవినీతి నాయ కుడిగా చూపించడం.. ఇక రెండోది ఏపి ప్రజల్లో బీజేపీపై వున్న వ్యతిరేకతను తొలగించుకోవడం, దీనికి ప్రధానమార్గం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించడం. కర్నాటక ఎన్నికల కోసమే ఇంతకాలం ఏపికి కేంద్రం ప్రత్యేకహోదాను ప్రకటించ లేకపోయిందని తెలుస్తోంది. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే ఆ ప్రభావం కర్నాటక మీద పడుతుంది. కర్నాటకలో పెట్టాల్సిన పెట్టు బడులు ఏపికి తరలివచ్చే అవకాశం వుంది. కర్నాటకలో కాంగ్రెస్‌కు ఇది కలిసిరావచ్చు. బీజేపీకి అక్కడ అధికారం లోకి రావడానికి అవకాశాలున్నాయి. కాబట్టే కర్నాటక ఎన్నికల వరకు ఏపికి కఠినంగానే మొండిచేయి చూపిస్తూ వచ్చింది. కర్నాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించవచ్చు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఈ రాష్ట్రంలో సీట్లు, ఓట్లు రాకపోయినా తెలుగుదేశం అధికారంలోకి రాకూడదన్నది టార్గెట్‌. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఆ స్థానంలోకి బీజేపీ రావచ్చు. భవిష్యత్‌లో బలపడ వచ్చు. ఈ దిశగానే బీజేపీ ఏపి ఆపరేషన్‌ ఉండబోతున్నట్లు సమాచారం.

Page 1 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ప్రశాంతతే.. మా లక్ష్యం!
    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
  • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
    మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
  • రాజకీయ దారులు వేరవుతాయా?
    నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
  • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
    ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
  • ఆనంతో... అదనపు బలం!
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter