modi''ఈ స్వాతంత్య్రదినం మనకెంతో ప్రత్యేకమైనది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న సంవత్సరమిది. సబర్మతీ ఆశ్రమం, చంపారన్‌ సత్యాగ్రహాలకు 75 ఏళ్ళు, లోకమాన్య బాలగంగాధర తిలక్‌ 'స్వరాజ్యం నా జన్మహక్కు' అని పిలుపునిచ్చి ఈ ఏడాదికి వందేళ్ళయ్యాయి. దేశప్రజలను ఒకటిచేసిన గణపతి ఉత్సవాలు మొదలై ఈ ఏడాదికి 125 ఏళ్ళయ్యాయి.1942-47 మధ్య దేశవ్యాప్తంగా ఐకమత్యం వెల్లివిరిసింది. ఇప్పుడు కూడా మనం అదే స్ఫూర్తిని కనపరచాలి. 2022లో ఆ స్ఫూర్తిదీప్తిని మరింతగా చాటాలి''... అంటూ 71వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగం ఎంతో ఉత్తేజభరితంగా.. స్పూర్తిదాయకంగా ఉండి దేశప్రజలందరినీ బాగా ఆకట్టుకుంది. అందులోనూ స్వాతంత్య్రదినోత్సవం రోజు, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం కూడా అదే రోజు రావడంతో ఈ వేడుకలు మరింత శోభాయమానమయ్యాయి.

ప్రధాని ప్రసంగం ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగింది. 'దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారికి నూటపాతిక కోట్ల మంది ప్రజల తరఫున శిరసు వంచి అభివందనం చేస్తున్నా'..నంటూ ప్రధాని ప్రసంగం అనర్ఘళంగా సాగిపోయింది. స్పష్టమైన ప్రధాని వాక్‌ఝరీప్రవాహంలో ఎన్నో బాసలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఉద్వేగాలు.. ఎన్నెన్నో నిర్ణయాలు జలపాతంలా దూసుకువచ్చాయి. దుర్నీతులను, దురవస్తలను పారద్రోలి నవభారతాన్ని నిర్మించుకోవా లన్నదే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలని ప్రధాని ఇచ్చిన పిలుపు యువతలో ఉత్సాహాన్ని

ఉరకలు వేయించింది. భారతదేశ ప్రగతి రథాన్ని పరుగులు తీయించడానికి అవసరమైన అన్ని రకాల వనరులు, ప్రతిభాపాటవాలు మనకు పుష్కలంగా

ఉన్నాయని, ఉన్నతమైన లక్ష్యాల సాధన కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలని ప్రధాని ఆకాం క్షించారు. వచ్చే ఏడాది ఆరంభానికి ఈ శతాబ్దంలో నవయవ్వనంలోకి అడుగుపెట్టే యువత సంఖ్య 20 కోట్లకు చేరుకుంటుందని, వారంతా కొత్త ఉత్సాహంతో సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారని, వారి కలలను సాకారం చేసేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం కోసం మనందరం కలిసి 'నవభారత్‌'ను నిర్మిద్దామన్న ప్రధాని పిలుపు దేశప్రజలకు ఎంతో చైతన్యాన్నిచ్చింది. దేశంలోని 125 కోట్లమంది అంతా సమానమేనని, మనం ఏ ప్రాంతం వారమనే ధ్యాస లేకుండా దేశాభ్యున్నతికి అందరూ చేయిచేయి కలిపి కలసికట్టుగా పని చేయాలని, సమృద్ధ భారత్‌ సాధనకు బలమైన ఆర్థిక వ్యవస్థ కావాలని, 21వ శతాబ్దంలోకి భారత్‌ దూసుకెళ్ళాలని ఆయన అంటూ, 75వ స్వాతంత్య్రదినోత్సవం నాటికి మనమంతా ఐకమత్యంతో, మనశక్తినంతా కేంద్రీకరించి ఎలాంటి భీతి లేని, సంపన్నమైన, సుదృఢమైన దేశాన్ని ఆవిష్కరింపజేసేందుకు కృషి చేయాలన్నారు. అదే మన నూతన భారత్‌ కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రధాని ప్రసంగంలోని ప్రతిమాటా ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. ప్రధాని తన ప్రసంగంలో ఆధార్‌ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దాకా, రహదారుల అభివృద్ధి నుంచి జమ్ముకాశ్మీర్‌కు పునర్‌వైభవం కలిగించే విషయం దాకా ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ 54 నిమిషాల పాటు ధారాళంగా ప్రసంగించారు. దేశరక్షణే తమ ప్రధమ ప్రాధామ్యమన్నారు. అందులో రాజీపడేదే లేదన్నారు. సముద్రంలోనైనా సరిహద్దుల్లోనైనా..ఆన్‌లైన్‌లోనైనా ఆకాశం లోనైనా..ఎలాంటి భద్రతాపరమైన సమస్య ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలు భారత్‌కు ఉన్నాయని స్పష్టం చేశారు. దాదాపు దేశంలోని అన్ని రంగాలనూ ఆయన ప్రస్తావించారు. దేశప్రగతికి ప్రభుత్వం చేస్తున్న అనేకరకాల అభివృద్ధిపనులను ఈ సందర్భంగా ప్రధాని వివరరగా ప్రసంగించారు. ఏళ్ళ తరబడి జనం సొమ్ము దోచుకున్నవారికి మనశ్శాంతి లేకుండా చేశామన్నారు. ఇప్పటికే దేశంలో 1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీశామని, అవినీతిపై మహాసంగ్రామమే చేస్తన్నామని అన్నారు. డొల్ల కంపెనీల భరతం పడతామన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఉగ్రవాదంపై పోరాటంలో ఇప్పుడు భారత్‌ ఒంటరిది కాదని, ప్రపంచంలోని అనేకదేశాలు ఉగ్రవాదంపై

ఉమ్మడిపోరుకు మద్దతునిస్తున్నాయన్నారు. కశ్మీర్‌ గురించి ప్రస్తావిస్తూ, గుప్పెడుమంది వేర్పాటువాదులు కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారని, వాటిని తిప్పికొట్టి కశ్మీర్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. తీవ్రవాదులు, ఉగ్ర వాదులపై మెతకవైఖరి అవలంభించే ప్రసక్తే ఉండ దన్నారు. మతవాదం, కులతత్వం విషంతో సమాన మన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రిలో ఇటీవల చిన్నారుల మరణాలను ప్రస్తావిస్తూ, ఆ ఘటన ఎంతో విషాదకరమని అంటూ ప్రధాని వారికి ప్రగాఢ సాను భూతిని వ్యక్తం చేశారు. ఇకపోతే, ఆహారధాన్యాల

ఉత్పత్తిలోనూ, అంతరిక్ష పరిశోధనల్లోనూ మనదేశం సాధించిన కీర్తి తక్కువేమీ కాదని, ఇతర దేశాల ఉప గ్రహాలను సైతం అంతరిక్షం లోకి పంపడంలో మన ఇస్రో రికార్డులు సృష్టిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. ఎవరో రావాలి.. ఏదో చేయాలి అనే నైరాశ్యపు ధోరణి వదిలి సరికొత్త ఉత్తేజంతో ప్రగతిపథంలో దూసుకుపోవా లన్నారు. ఇలా ఎన్నో రకాల అంశాల మీద ప్రధాని చేసిన వివరణాత్మక ప్రసంగం ఎంతో ఉత్తేజభరితంగా, ఆలోచనాత్మకంగా ఉండి దేశప్రజలను బాగా ఆకట్టుకుంది. దేశప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో జీవించాలని, నీతివంతమైన..ఆరోగ్యవంతమైన సమాజంతో సురాజ్య నిర్మాణం సాధించుకోవాలని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏదేమైనా, అటు రాష్ట్రపతి ప్రసంగంలోనూ, ఇటు ప్రధాని ప్రసంగంలోనూ ప్రకటితమైన నవభారత్‌ లక్ష్యాలు దేశానికి మార్గదర్శకాలన్నది స్పష్టం. ఆ లక్ష్యసాధనకు అటు ప్రభుత్వాలే కాక, దేశంలోని ప్రజలంతా సమిష్టికృషిని తోడ్పాటుగా అందివ్వాలి. అప్పుడే ఇలాంటి బృహత్తరమైన లక్ష్యాలను చేరుకోగలం.. ఆ కలలను సాకారం చేసుకోగలం!...

modiప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాల అధినేతలు ఎంతో ఆనందంతో.. ఆత్మీయతతో కలుసుకుని పరస్పరం గౌరవం, ప్రేమాభిమానాలను పంచుకున్న దృశ్యం.. ఎంతైనా అపూర్వం, చరిత్రాత్మకం. భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా, అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మోడీని ఘనంగా స్వాగతించి.. చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, పరస్పర ప్రేమానుబంధంతో ఇరువురు దేశాధినేతలు సంతోష కరమైన వాతావరణంలో ఇరుదేశాల ప్రగతికి దోహదం చేసే అనేకవిషయాలు ముచ్చటించుకోవడం విశేషం. అగ్రరాజ్యమైన అమెరికా నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత ప్రధాని నరేంద్రమోడీకి శ్వేతసౌధంలో ఎంతో ఘనంగా.. ఆత్మీయంగా ఘనస్వాగతం లభించడం.. ఓ అద్భుత ఘట్టమనే చెప్పవచ్చు.

పొరుగుదేశాల్లోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్‌ క్షుద్ర వ్యూహాలను ఈ సందర్భంగా భారత్‌ అమెరికాలు తీవ్రంగా గర్హించడం, సీమాంతర ఉగ్రవాదానికి తన భూభాగాన్ని ఎవరూ ఉపయో గించుకోకుండా చూసుకోవాలని పాక్‌కు సూచించడం, ఉగ్రమూకలను ఉపేక్షిస్తే సహించేది లేదంటూ హెచ్చ రించడం ద్వారా భారత్‌-అమెరికాలు ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు మరింత సంకల్పదీక్షతో కంకణం కట్టుకున్నట్లే. దీంతోపాటు అనేక అంశాలపై సాను కూల చర్చల ద్వారా మోడీ అమెరికాతో మైత్రీభావాన్ని మరింతగా పెంపొందించడం విశేషం. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా మోడీ పట్ల ఎంతో ఆదరణ చూపడం హర్షదాయకం. మోడీ రాక కోసం శ్వేతసౌధంలో స్వాగతం పలికేందుకు తామంతా ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందస్తుగానే ట్వీట్‌ చేయడం దగ్గరనుంచి మోడీ అమెరికా పర్యటన పూర్తయ్యేదాకా ట్రంప్‌- మోడీల ఆత్మీయతానుబంధం విశ్వవ్యాప్తంగా అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిందంటే అతిశయోక్తి కాదు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఆ దేశ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోడీ రాకపట్ల ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా ఎంతో ఆత్మీయత వ్యక్తం చేయడమే కాక, మోడీ తనకు అసలైన మిత్రుడని, ఒక నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలను చర్చించబోతున్నామని ట్రంప్‌ ట్వీట్‌ చేయడం ఎంతో విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే భారత ప్రధాని మోడీకి అమెరికాలో అంచనాలకు మించిన ఆదరణే లభించింది. ఈ పరస్పర స్నేహానుబంధమే ఇరుదేశాల సుదృఢ మైత్రి మరింత బలోపేతం అయ్యే దిశగా సాగింది.

అంతేకాదు, పాక్‌ ప్రేరేపణతో ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తున్న కశ్మీర్‌ ఉగ్రవాద సంస్థ హిబ్జుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయ్యద్‌ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా విదేశీవ్యవహారాలశాఖ ప్రకటించడం, మోడీ అమెరికాలో అడుగుపెట్టకముందే ఈ ప్రకటన రావడం మోడీకి అమెరికా ఇచ్చిన ఒక ముందస్తు చిరుకానుకే అనుకోవచ్చు. భారత్‌, అమెరికా రెండూ ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న దేశాలే కనుక, ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో వున్నా నిలువునా పాతరేసేందుకు రెండు దేశాలూ ఈ సందర్భంగా కంకణం కట్టుకోవడం అన్నిటికన్నా ఆనందదాయకమైన ముఖ్యవిశేషం. అందుకే, భారత్‌ అమెరికాల మధ్య వున్న వ్యూహాత్మక సంబంధాల తర్కం వివాదరహితమైనదని, ప్రపంచాన్ని

ఉగ్రవాదం, విప్లవభావజాలం, సంప్రదాయేతర దాడుల నుంచి రక్షించడంపై రెండు దేశాలూ అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నాయని, అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ దినపత్రికలో ప్రధాని మోడీ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ల మధ్య స్నేహానుబంధం వృద్ధి చెంది భాగస్వామ్య స్థాయికి ఎదిగిందని, పౌర అణురంగం, రక్షణ రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లోను, ఆర్ధిక వాణిజ్య రంగాల్లోనూ సహకారానికి, ఉగ్రవాదంపై పోరు విషయంలోనూ ఉమ్మడిగా కలసి పనిచేసేందుకు మార్గం సుగమమైందని, ఈ రెండు దేశాలు కలసి పనిచేస్తే ప్రపంచానికెంతో ప్రయోజనకరమని ప్రధాని మోడీ స్పష్టం చేయడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో ఇరుదేశాలు కృత నిశ్చయంతో వున్నాయని స్పష్టంగా చెప్పడం ద్వారా ఉగ్రవాదులకు ప్రధాని మోడీ గట్టి హెచ్చరికే చేశారు. ఇలా..అడుగడుగునా మంచి నిర్ణయాలతో, భారత్‌- అమెరికాల మధ్య సుదృఢబంధాన్ని పెనవేస్తూ మోడీ పర్యటన ఎంతో హూందాగా సాగింది. ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన అపూర్వమైన గౌరవ మర్యాదలు, ఆత్మీయతతో అతిథ్యం ఇచ్చిన తీరు ప్రపంచంలో మనదేశం ప్రాధాన్యత బాగా పెరుగు తోందనడానికి చక్కని నిదర్శనమనే అనుకోవచ్చు. అయితే, అమెరికాలో భారతీయులకు సమస్యగా మారిన హెచ్‌1 బి వీసాలపైనా, భారతీయుల ఉద్యో గాలపైనా ఈ సందర్భంలో ఇరుదేశాల నేతల మధ్య చర్చకు వచ్చి ఏదైనా వెసులుబాటు కలుగుతుందేమో అని ఆశించినవారి ఆశలు నిరాశలే అయ్యాయి. ఈ విషయం అసలు ప్రస్తావనకే రాకపోవడం నిరాశాజనకమే అయింది. అయితే, భవిష్యత్తులోనైనా ఇరు దేశాధీశుల సంప్రదింపుల్లో ఈ సమస్య ఒక కొలిక్కివస్తుందని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఏదేమైనా, అమెరికా అధ్యక్షుని సాదరపూర్వక ఆదరణతో, అనేక అంశాల పట్ల ఇరుదేశాల సౌహార్ద్ర పూరితమైన చర్చలతో ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఆసాంతం దిగ్విజయమైంది. అమెరికాతో మన అనుబంధం మరింత గాఢంగా పెనవేసుకున్నట్లయ్యింది. ఈ పరిణామాలు భారత్‌కు ఎంతో శ్రేయోదాయకం.. అంతేకాదు, భవిష్యత్‌లోనూ ఈ స్నేహానుబంధం భారత్‌కు ఎంతైనా... శుభదాయకమే నని వేరే చెప్పనక్కర లేదు.

modiప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఈ మూడేళ్ళ కాలంలో అనేక విజయాలనే సాధించారు. దేశాభ్యున్నతి కోసం సాహసమైన నిర్ణయాలే తీసుకుని దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. సమస్యలెన్నున్నా ధీటుగా ఎదుర్కొంటూ అప్రతిహతంగా ముందుకు సాగిపోతున్నారు.

పాలనాపరంగా పారదర్శకత, గట్టి రాజకీయ నిర్ణయాలు, వినూత్నమైన ఆలోచనలు..మంచిమంచి పథకాలు, ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రధాని మోడీ అందరి మనసులను ఇట్టే ఆకట్టుకుంటున్నారు. మంచి పరిపాలనా దక్షునిగా పేరు తెచ్చుకుని, బిజెపి అగ్రనాయకునిగా ఆయన తన ప్రతిష్టను ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే వున్నారు. దేశంలో ఆరోవంతు జనాభా వున్న ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రావడమంటే మాటలు కాదు. అలాంటిది ఎవరూ ఊహించని విధంగా ఆయన సారధ్యంలో, బిజెపి నేతృత్వంలో అక్కడ అద్భుతమైన విజయాన్నే సాధించి రికార్డ్‌ సృష్టించారు. ఒక్క యుపిలోనే కాదు, ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, మణిపూర్‌లలో బిజెపి ప్రభుత్వాలు ఏర్ప డ్డాయి. జమ్ము కశ్మీర్‌లోనూ పిడిపితో కలిసి బిజెపి సంకీర్ణప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం జరిగింది. ఆ తర్వాత జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, గోవాల్లోనూ బిజెపి తిరుగులేని పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ బిజెపి తన సత్తా చాటింది. ఇదంతా మోడీ ప్రభావంతోనేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కమాటలో చెప్పా లంటే ఈ విజయాలన్నీ ఆయన ఖాతాలోనివే. మోడీ ధాటికి కాంగ్రెస్‌ ఎక్కడా నిలబడలేకపోతోంది. ప్రతి పక్షాలు సైతం మోడీ నిర్ణయాలను కాదనలేని పరిస్థితి. ఒక్క రాజకీయంగానే కాక, అనేక ప్రజాసంక్షేమ పథకాలతో, మంచి నిర్ణయాలతో మోడీ ప్రభుత్వం ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం సాధించుకుంటూ ముందుకు సాగుతోంది. అధికారం తమ చేతుల్లో వుంటే ఎన్నో కుంభకోణాలతో దేశాన్ని అవినీతి మయం చేసినవారిని కూడా మనం చూశాం. అధికారం ఉంది కదా అని ఎన్నో అక్రమాలకు పాల్పడి దేశాన్ని గుల్ల చేసిన వారినీ చూశాం. అయితే, నరేంద్రమోడీ ఆధ్వర్యంలో, బిజెపి పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ఎంతైనా చెప్పుకోదగిన విషయం. ఇది మోడీ మార్క్‌ పాలనకు..మంచి పరిపాలనకు గుర్తుగా నిలిచిపోతోంది. ప్రజాబలమే దన్నుగా మోడీ జనరంజక పాలన సాగిస్తుండడంతో మొన్నటిదాకా దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీ సైతం క్రమేణా కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. పెద్దనోట్ల రద్దు విషయంలోనూ జరిగిందిదే. అప్పట్లో ఇది అసాధ్యమన్న కొందరు నాయకులు మోడీ దృఢనిశ్చయంతో ఆ నిర్ణయం అమలులోకి రావడం.. అది సుసాధ్యం కావడంతో ఇప్పుడు గుడ్లు తేలేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో అవినీతి నడ్డి విరగడంతో పాటు, సామాన్యప్రజల్లో మోడీ విధానాలు ఎంతో మెచ్చుకోదగ్గవిగా ప్రశంసలందుకుంటున్నాయి. మరోవైపు ప్రపంచ మానవాళిని భయకంపితుల్ని చేస్తున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించేందుకు ప్రపంచదేశాలన్నీ కలసి సమిష్టిగా పోరు సాగించాలని కోరుతూ దేశవిదేశాల్లో ఆయన చేస్తున్న ఉత్తేజపూరిత ప్రసంగాలు ప్రపంచ ప్రజలందరినీ బాగా ఆకర్షిస్తున్నాయి.

ఈ మూడేళ్ళలో ప్రధాని వినూత్నంగా ప్రవేశపెట్టిన డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, జన్‌ ధన్‌ యోజన, స్వచ్ఛభారత్‌ వంటి పథకాలతో పాటు మోడీ తనదైన శైలిలో ప్రారంభించిన మన్‌ కీ బాత్‌, 'యోగా' వంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్ధికాభివృద్ధి వేగం పుంజుకోవడం, జిడిపి వృద్ధి రేటు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గుతూ వుండడం గమనించాల్సిన విషయం. ఇది మోదీ మార్క్‌ అభివృద్ధికి సంకేతం. అంతేకాదు, చిత్తశుద్ధి, దైవభక్తి, దేశభక్తి కలగలిసిన ప్రధాని నరేంద్రమోడీ ఏమిచెప్పినా అది ప్రజలకు ప్రయోజనకరంగానే వుంటుందనే విశ్వాసం ప్రజల్లో పాదుకోవడంతో ఆయన దేశంలోనే ఒక శక్తిమంతమైన నాయకునిగా నిలిచి ప్రజలందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అందుకే, ఈ మూడే ళ్ళలోనే సోషల్‌మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌ వున్న అతితక్కువ ప్రపంచనాయకుల సరసన ప్రధాని నరేంద్రమోడీ స్థానం సంపాదించం ఎంతైనా విశేషం. ఫేస్‌బుక్‌లో మోడీకి మూడేళ్ళ క్రితం 1.4 కోట్ల మంది ఫాలోయర్లు వుండగా, తాజాగా ఇప్పుడది 4.1 కోట్లకు చేరుకుందంటే మోడీ పట్ల ప్రజాభిమానం ఎలా వెల్లువెత్తుతోందో అర్ధం చేసుకోవచ్చు. మోడీ ప్రవేశ పెట్టిన డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, జన్‌ ధన్‌ యోజన, స్వచ్ఛభారత్‌ పేజీలకు కూడా ఫేస్‌ బుక్‌లో మంచి ఆదరణ లభిస్తోండడం ఆ పథకాల పట్ల జనాదరణకు మంచి సూచిక. అయితే, భారత్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా అనేకమైన సవాళ్లు ఎదురవుతూనే వున్నాయి. ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలు, కశ్మీర్‌ సమస్య ఇలా అనేక సమస్యలు చుట్టుముట్టే వున్నాయి. పథకాల ప్రచారపటాటోపం కంటే ప్రయోజనం తక్కువగా వుంటోందని, దేశంలో నిరుద్యోగం సమసిపోలేదని, పేదరికం పోవడం లేదని, ప్రజా సంక్షేమ పథకాలు అసలైన లబ్దిదారు లకు చేరడం లేదనే విమర్శలూవున్నాయి. వీటన్నిటినీ కూడా పరిశీలించి పరిష్కరించాల్సి వుంది.

ఏదేమైనా, ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి కావడం హర్షదాయకం. ఏళ్ళ తరబడిగా కుంభకోణాలు, అవినీతి అక్రమాలతో, అన్ని రంగాలు వెనుకబడిపోయి అస్తవ్యస్థ స్థితిలో వున్న దేశంలో, కేవలం ఈ మూడేళ్ళ కాలంలోనే అత్యద్భుతమైన ప్రగతిని సాధించడం ఎవరికైనా కష్టమే. అయితే, ఆ దారిలో కృతనిశ్చయంతో సాహసోపేతంగా పనిచేస్తూ దేశాన్ని ప్రగతి దారి పట్టించినందుకు, ఈ మూడేళ్ళలో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా, దేశాభ్యున్నతికి కంకణం కట్టుకుని అహరహం

చిత్తశుద్ధితో పని చేస్తున్నందుకు ప్రధాని మోడీని, మోడీ ప్రభుత్వాన్ని అందరూ అభినందించాల్సిందే.

Page 1 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
  నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter