ఆ క్షణం... ఎంతో భయంకరం... ఆ క్షణం జీవితంలోనే అత్యంత విషాదం... ఆ క్షణం... జీవితమంతా శూన్యం. నీ బిడ్డ ఇక లేడు అన్న వార్తను విన్న ఆ క్షణం... ఆ తండ్రి అనుభవించే బాధను వర్ణించడానికి మాటలు వుండవు. వ్యక్త పరచడానికి భావాలుండవు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు, తన కలల సామ్రాజ్యానికి వారసుడనుకున్న కొడుకు... ఇక లేడు... ఇక రాడు... ఈ క్షణం నుండి నీకు శాశ్వతంగా దూరమయ్యాడు అని తెలిసిన ఆ క్షణం... ఆ తండ్రి పడ్డ వేదన ఎలా ఉంటుందో వూహించగలమా? ఆ క్షణంలో ఈ వ్యాపారాలెందుకు, ఈ కోట్ల ఆస్తులెందుకు, ఈ మంత్రి పదవులెందుకు... అనిపించకుండా ఉంటుందా? పదవీ, పరపతి, ఆస్తులు, అంతస్తులు అన్నీ వున్నా అన్నింటికంటే ప్రాణంగా ప్రేమించే కొడుకు దూరమైతే ఆ తండ్రి పడే మానసిక క్షోభకు ఏమని పేరు పెట్టగలం.
ఈ నెల 10వ తేదీ తెల్లారుజామున 2గంటల ప్రాంతంలో హైదరాబాద్, జూబ్లీహిల్స్, రోడ్డు 36లో వున్న మెట్రో పిల్లర్ 9ఆర్ని 210 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బెంజ్ లగ్జరీ కారు ఢీకొట్టింది. ఆ ఫోర్స్‌కు కారు వెనుక భాగం పైకి లేచింది. కారు బానెట్ నుజ్జునుజ్జయ్యి ఇంజన్ కారు మధ్య భాగంలోకి దూసుకొచ్చింది. ఆ ప్రమాద తీవ్రతకు కారును నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖామంత్రి, దేశ వ్యాప్తంగా 13రాష్ట్రాల్లో నడుపబడుతున్న నారాయణ విద్యాసంస్థలకు అధినేత పొంగూరు నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23) అతని స్నేహితుడు రాజారవిచంద్ర(23)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఏ తండ్రయినా, తల్లయినా బిడ్డ తమకు తల కొరివి పెట్టాలని కోరుకుంటారు. కాని, ఇక్కడ విధి తలరాతను మార్చింది. మీ బిడ్డ ఇక లేడు అనే మాటను ఆ తల్లిదండ్రులకు చెప్పగలిగేదెవరు? కాని నిజం చెప్పక తప్పదుగా! లండన్ పర్యటనలో వున్న తండ్రి నారాయణకు కొడుకు మరణవార్త తెలిసింది. ఆ క్షణంలో ఆ తండ్రి అనుభవించిన బాధను ఏ విధంగానూ వర్ణించలేము. దేవుడు అతని ముందు కొచ్చి... నారాయణా, నీకు ఒక్క అవకాశమిస్తున్నాను, నీకు నీ బిడ్డ కావాలా? లేక మంత్రి పదవి, వేలకోట్ల ఆస్తులు, విద్యా సంస్థలు కావాలా? అనే చిన్న ఆప్షన్ ఇచ్చి వుంటే ఆ తండ్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసి వుండడు. నా బిడ్డను నాకివ్వు స్వామి, కట్టుబట్ట లతో రోడ్డు మీద నిలబడతాను అని చెప్పుకుని ఉండే వాడు. ఒక్క నారాయణే కాదు, బిడ్డల విషయంలో ఏ తండ్రి అయినా ఇలాంటి ఆప్షనే తీసుకుంటాడు. ప్రభుత్వం పెట్టే పరీక్ష అయితే ఆప్షన్ అన్నా ఉండేది. కాని దేవుడు పెట్టే పరీక్షకు సెకండ్ ఆప్షన్ లేకుండా పోయింది. తన బిడ్డను కాపాడుకునే ఏ చిన్న ఆప్షన్ కూడా నారాయణకు లేకుండా పోయింది. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాపాయ స్థితిలో తమ ఆసుపత్రిలో చేరిన ఎంతోమందికి ప్రాణం పోసిన నారాయణ ఆసుపత్రి అధినేతకు కనీసం తన బిడ్డ ప్రాణాలను నిలబెట్టుకునే అవకాశం కూడా రాలేదు.
ఎదిగొచ్చిన కొడుకు, 23ఏళ్ల ప్రాయం, చదువు పూర్తయ్యింది, ఆరు నెలల క్రితమే నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు... తండ్రి రాజకీయాలలో, అమరావతి రాజధాని పనుల్లో తలమునకలై వుంటే నిషిత్ నారాయణ దేశ వ్యాప్తంగా 13రాష్ట్రాలలో వున్న నారాయణ విద్యాసంస్థలను పర్యవేక్షించసాగాడు. ఇంకో ఏడాది గడిస్తే నారాయణ ఇక విద్యాసంస్థల జోలికే రాకుండా రాజకీయాలలోనే పూర్తికాలం గడిపేయొచ్చన్నంతగా నిషిత్ నారాయణ సమర్ధవంతంగా పనిచేయసాగాడు. అయితే అతని జోరుకు విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో నిషిత్‌ను ఆ తండ్రికి దూరం చేసింది.
నిషిత్ నారాయణ భౌతిక కాయానికి 10వ తేదీ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం రాత్రికి భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించారు. కొడుకు మరణవార్త వినగానే లండన్ పర్యటనలో వున్న నారాయణ 10వ తేదీ అర్ధరాత్రికి నెల్లూరు చేరుకున్నారు. కొడుకు మృతదేహం పై పడి తండ్రి నారాయణ, తల్లి రమాదేవిలు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిషిత్ మరణవార్త తెలిసి రాష్ట్ర మంత్రివర్గమే నెల్లూరుకు కదలివచ్చింది. నారాయణ ఆసుపత్రి ప్రాంగణం శోకవనంగా మారింది. మంత్రులు, అన్ని పార్టీల ప్రముఖులు, ఉన్నతాధికా రులు, ప్రజలు నిషిత్ నారాయణ భౌతిక కాయం వద్ద నివాళులర్పించి నారాయణను పరామర్శించారు.
11వ తేదీ ఉదయం నారాయణ ఆసుపత్రి నుండి పెన్నానది ఒడ్డున శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. చితిపై నిషిత్ భౌతిక దేహాన్ని ఉంచగా... నాకు కొరివి పెడతావనుకుంటే నా చేత తలకొరివి పెట్టించుకుంటున్నావా అని ఆ తండ్రి నారాయణ మనసులో అనుకుంటూ బిడ్డకు తలకొరివి పెట్టిన సంఘటన ప్రతి మనసును చలించేలా చేసింది. చేతికందిన చెట్టంత కొడుకును కోల్పోయిన నారాయణ, రమాదేవిలకు సానుభూతి తెలుపుతూ, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోంది 'లాయర్'.