అంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయంగా పెద్ద దేశాలతో పోటీపడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని అందుకుంది. 12వ తేదీ గురువారం తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్) నుండి ప్రయోగించిన పిఎస్ఎల్వి-సి41 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తెల్లవారుజామున 4.04గంటలకు పిఎస్ఎల్వి-సి41 చీకట్లను చీల్చుకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. మొత్తం 19నిముషాల వ్యవధిలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉపగ్రహాన్ని 143కోట్లతో, వాహకనౌకను 100కోట్లతో రూపొందించారు. స్వదేశీ నేవిగేషన్ వ్యవస్థ అభివృద్ధి కోసమే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రయోగం విజయవంతం కాగానే షార్ అంతటా ఆనందం వెల్లివిరి సింది. శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రయోగాన్ని పర్యవేక్షించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు కొరుకుడుపడని కొయ్యగా మారి పలు సందర్భాల్లో మొండికేసి ఇబ్బంది పెట్టిన జిఎస్ఎల్వి మెడలను ఆ సంస్థ ఎట్టకేలకు వంచింది. క్రమంగా దారి తప్పుతున్న జిఎస్ఎల్వి సిరీస్‌ను ఒక దారిలో పెట్టింది. ఇస్రోకు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రెండూ ముద్దుబిడ్డలే! కాకపోతే పీఎస్ఎల్వి ముందుగానే దారిలో పడి 'ఇస్రో' చెప్పినట్లు క్రమశిక్షణతో నడుచుకుంటుంది. జిఎస్ఎల్వి మాత్రం అప్పుడప్పుడూ మొండికేస్తుండేది. అలాంటి మొండిఘటాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దారికి తెచ్చారు. అంతరిక్ష ప్రయోగాల పరంపరలో మరో మైలురాయిని అధిగమించారు. జిఎస్ఎల్వి ప్రయోగాలలో మరో విజయాన్ని నమోదు చేశారు.
మార్చి 29వ తేదీ సాయంత్రం 4.56గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించిన జిఎస్ఎల్వి-ఎఫ్08 విజయవంత మైంది. ఈ ప్రయోగం ద్వారా 2,140 కిలోల బరువుగల జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్వదేశీ ఉపగ్రహం. దేశీయ మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు మల్టీబీమ్ ప్రసారాలను ఇది అందించనుంది. మొబైల్ బ్రాడ్‌బాండ్ సేవలకు ఎస్ బాండ్ బీమ్‌లు ఉపయోగపడనున్నాయి. ఈ ఉపగ్రహం తయారీకి దాదాపు 210 కోట్లు ఖర్చయ్యింది. పదేళ్ళ పాటు ఇది తన సేవలను అందించనుంది. మొత్తం 17.46 నిముషాలలో ప్రయోగం పూర్తయ్యింది. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో ఛైర్మెన్ శివన్‌తో పాటు షార్ శాస్త్రవేత్తలు ఒకరినొకరు కౌగిలించుకుని అభినందనలు తెలుపుకున్నారు. జిఎస్ఎల్వి సిరీస్‌లో ఇది 12వ ప్రయోగం. భారీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి జిఎస్ఎల్వి సిరీస్ ఉపయోగపడుతుంది. 2001 నుండి 2010దాకా రష్యా క్రయోజనిక్ ఇంజన్లతో ఆరుసార్లు జిఎస్ఎల్వి ప్రయోగాలు చేసారు. వాటిలో రెండు మాత్రమే విజయవంతమయ్యాయి. 2010లో రష్యా క్రయోజనిక్ ఇంజన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించడం నిలిపేసింది. దీంతో ఇస్రోనే సొంతంగా క్రయోజనిక్ టెక్నాలజీని రూపొందించుకుంది. ఇంతవరకు సొంత టెక్నాలజీతో 5ప్రయో గాలు జరుపగా మొదటిది తప్ప మిగతా నాలుగు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఆరవ ప్రయోగం కూడా విజయవంతం కావడంతో జిఎస్ఎల్వి సిరీస్‌పై నమ్మకం మరింత పెరిగింది.
ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, అపర శంకరాచార్య, హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు, కంచి కామకోటి పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ శివసాయుజ్యం పొందారు. హిందూ ధర్మాన్ని జగజ్జేయమానం చేస్తూ, ప్రత్యే కించి శంకరమఠం ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు జీవితాంతం అహర్ని శలు నిర్విరామంగా శ్రమించారు జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ. ఆయనకు 83 ఏళ్ళు. తమిళనాడులోని కంచి కామకోటి పీఠానికి ఆయన 69వ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 27 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామీజీ, అనంతరం తన గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భక్తులు హుటాహుటిన సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయి స్తుండగా, ఉదయం గుండెపోటు వచ్చి స్వామివారు మహానిర్యాణం చెందారు. జయేంద్ర సరస్వతి స్వామీజీ పార్ధివ దేహానికి మఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి పూజలు చేశారు. స్వామిజీ నిర్యాణం చెందడంతో భక్తులు కన్నీరుమున్నీరయ్యారు.
జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవన్. మన్నార్గుడి సమీపంలోని ఇరుళ్నీక్కి అనే కుగ్రామంలో ఆయన జన్మించారు. వేద విద్యాభ్యాసం చేసిన తరువాత 1954లో అప్పటి పీఠాధిపతి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి నుంచి సన్యాసం స్వీకరించారు. ఆ పీఠానికి బాల శంకరాచార్యులుగా అప్పట్లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 40ఏళ్ళకు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ నిర్యాణం చెందడంతో 1994లో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కంచికామకోటి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. జనకల్యాణ్, జనజాగరణ్ల పేరుతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావపరంపరలను పెంపొందించారు.
మాధవ సేవ... మానవ సేవే ధ్యేయంగా.....
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆధ్యాత్మిక బోధలు చేసి, ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తిభావాలను పెంపొందింప జేశారు. అనేక ఆసుపత్రులు, వేదపాఠశాలలు, విద్యాలయాలు, వృద్ధాశ్రమాలు, చిన్నారులకు వైద్యాలయాలు నెలకొల్పి మానవాళికి, సమాజానికి నిర్విరామ సేవలందించారు. గోశాలలు నెలకొల్పి మూగజీవాలకు ఆశ్రయం కల్పించారు. అంతేకాదు, 1993లో కాంచీపురంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయాన్ని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీవారు ఏర్పాటు చేశారు. సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ తదితర కోర్సులన్నీ అభ్యసించేందుకు వీలుగా ఈ విద్యాలయాన్ని రూపుదిద్దారు. ఇలా ఎన్నో మహత్కార్యాలను నిర్వహించి శ్రీ జయేంద్ర సరస్వతిస్వామీజీ జగద్గురువుగా అందరి పూజలందుకున్నారు. జగద్గురువు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ నిర్యాణంతో అశేష భక్తజనులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు.
దేశం ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్తను కోల్పోయింది - రాష్ట్రపతి
శ్రీ జయేంద్ర సరస్వతి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప ఆధ్యాత్మికవేత్తను, సమాజ సంస్కర్తను కోల్పోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జయేంద్ర సరస్వతి లక్షలాది భక్తుల మనసుల్లో జీవించే వుంటారని ప్రధాని తన సంతాపంలో తెలిపారు. గవర్నర్ ఇఎస్‌ఎల్‌ఎన్ నరసింహంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కెసీఆర్‌లు జయేంద్ర సరస్వతి మృతికి విచారం ప్రకటించారు. ఆయన మరణం మానవాళికి తీరని నష్టమన్నారు. ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ కంచి పీఠాన్ని బలమైన సంస్థగా తీర్చిదిద్దారని, పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు, కంటి ఆసుపత్రులు, చిన్నపిల్లలకు ఆసుపత్రులు నిర్వహింపజేస్తూ మానవసేవలో తరించారని వారు కొనియాడారు. వైకాపా అధ్యక్షుడు జగన్ తన సంతాపం ప్రకటిస్తూ, ధార్మికత, అత్యున్నత మానవతా విలువలను జీవితమంతా ఆచరించి ప్రబో ధించిన గురువుగా, జగద్గురువుగా జయేంద్ర సరస్వతి ఖ్యాతిగారచారని కొనియాడారు.