dummurఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది?..ఈ దౌర్భాగ్యానికి కారకులెవరు?..నెల్లూరు నగరాన్ని ఊపిరితిత్తుల జబ్బు పీడిస్తున్నా, దుమ్మురోడ్లతో జనం నిత్యం వ్యాధుల బారిన పడి ఛస్తున్నా అటు కార్పొరేషన్‌వారికిగానీ, ప్రజారోగ్య అధికారులకు గానీ, సంబంధిత కాంట్రాక్టర్లు..వారి సిబ్బందికి గానీ, వీటినన్నిటినీ ఏసీగదుల్లో కూర్చొని పర్యవేక్షిస్తున్న మంత్రులకు గానీ, నాయకులకు గానీ కనీసం దోమకుట్టినట్లు కూడా లేపోవడం నెల్లూరు ప్రజల దౌర్భాగ్యమనే అందామా?...నెల్లూరు జనం ఎప్పుడు చేసుకున్న పాప ఖర్మో అని సరిపెట్టుకుందామా?..

దుమ్ము... ధూళి అనేవి ప్రకృతిసిద్ధంగా వస్తుం టాయి. అవి ఎప్పుడో గాలి వీస్తేనో లేదా, పెనుగాలి రేగితోనో దుమ్ము పెద్దఎత్తున పైకిలేస్తుంది. కానీ, అది కొద్దిసేపే. ఇంతలో ఏ చిన్న వానజల్లు కురిస్తే చాలు.. ఆ దుమ్మంతా మాయమైపోతుంటుంది. అయితే, నెల్లూర్లో అలా కాదు. ఇక్కడ దుమ్ము ప్రత్యే కించి తయారయ్యింది. భూగర్భడ్రైనేజీ కోసం రోడ్లన్నీ తవ్వి, అక్కడక్కడా గుంతలు వదిలేయడం, రోడ్లపై క్వారీ డస్ట్‌ను పోసి దుమ్ముధూళితో నగరవాసులు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నా రోజుల తరబడి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము ప్రతిరోజూ ప్రజలకి నరకాన్ని చూపిస్తోంది. నోళ్ళకి, ముక్కులకి గుడ్డలు చుట్టుకున్నా లాభం లేదు. ఎంతసేపని అలా ఉండగలం?.. ఒక్క నిమిషం ఏమారితే చాలు, ఆ దుమ్మంతా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతుంది. దీంతో ఇక ఊపిరి తీయలేక జనం పడే అవస్తలు వర్ణనా తీతం. అయినా, అధికారులు కానీ, సంబంధిత కాంట్రాక్టర్లు కానీ ఇవేమీ పట్టించుకోరు. ఎంత దుమ్ము.. ఎంత కాలుష్యం నగరాన్ని చుట్టుముట్టేసి జనాన్ని ఆసుపత్రులు పాలుచేస్తున్నా ఎవరికీ ఏమీ పట్టదు. అమాయకపు జనం ఉంటేనేం.. పోతేనేం అన్నట్లుంటారు మన నాయకులు. ఎన్నిసార్లు ఈ బాధలు పేజీలకు పేజీలు రాసినా ఎవరికీ దోమ కుట్టినట్లు కూడా ఉండదు. అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు అంతా ఏసీ కార్లలో తలుపులు మూసుకుని హాయిగా, చల్లగా తిరుగుతుంటారు కనుక బయట జనం పడే అవస్తలు వారికి నల్ల అద్దాల్లోంచి కన పడవు. ఈ దుమ్ము, ధూళి ప్రజల ఆరోగ్యాలనెంత కలుషితం చేస్తోందో, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, గృహిణులు ఎంతమంది ఆ దుమ్ము వల్ల శ్వాసకోశ వ్యాధులకు గురై నెత్తీనోరు బాదుకుంటూ ఆసుపత్రుల్లో పడి అల్లాడుతున్నారో వారికి తెలియదు. తెలిసినా తెలియనట్లుండడమే వారి నైజం. మంచిరోడ్లు వేస్తారని జనం ఎంతో ఆశపడి సహకరిస్తున్నా, రోజులు గడిచిపోతూనే ఉన్నా, జనాన్ని దుమ్ములో వేయిస్తున్నారే తప్ప, ఈ దుమ్మురోడ్లను బాగుచేయక పోవడం ఏమిటని నగరప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రోజంతా ఆ దుమ్మే పీలుస్తుండడంతో ఊపిరితిత్తులు ఊపిరి పీల్చలేక డస్సిపోతున్నాయని వృద్ధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాధలతో ఎంతోమంది ఆసుపత్రుల చుట్టూ తిరుగు తున్నారు. కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ, కార్పొరేషన్‌ అధికారులు, నాయకులు కానీ పట్టించు కోవడం లేదు. రోడ్లమీద క్వారీడస్ట్‌ను తాత్కాలికంగా వేసి, ఆ తర్వాత మంచిరోడ్లు వేస్తారేమోనని జనం ఉగ్గబట్టి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, అలాంటి ఛాయలేమీ కనిపించడం లేదు. సరికదా, దుమ్ము రోడ్లపై దుమ్ము లేవకుండా నిర్ణీతసమయాల్లో నీరు చల్లడం వంటి కనీస కంటితుడుపు చర్యలు కూడా నామమాత్రంగానే చేపడుతున్నారు. దీంతో, ఆ రోడ్ల పక్కనే ఉన్న ఇళ్ళు, షాపుల్లో దుమ్ము పేరుకుపోతోంది. వంటినిండా దుమ్ము..ఇంటినిండా దుమ్మే అన్నట్లుగా ఈ దుమ్ముతో రోజూ చస్తున్నా కార్పొరేషన్‌ వాళ్ళు కార్లల్లో ఇదే దారిన వెళ్తూ చోద్యం చూస్తున్నారే తప్ప సత్వర చర్యలు తీసుకునేందుకు చొరవ చూపడం లేదని జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకవేళ ఈ బాధలు తాత్కాలికమే అనుకున్నా, ఎన్నిరోజులు ఇలా గడపాలో తెలియడం లేదని, ఈలోగా ఊపిరితిత్తులు కాస్తా పాడైపోతే పరిస్థితి ఏమిటని జనం ఆవేదన.

నగరంలోని ప్రధానరోడ్లలో ఒకటైన మాగుంట లే-అవుట్‌ రోడ్డు, మినీబైపాస్‌ రోడ్డు, పొదలకూరు రోడ్డు, ఏసినగర్‌, బాలాజీనగర్‌, దర్గామిట్ట ఇలా కనీసం ప్రధాన రోడ్లనైనా అధికారులు ఒక బృందంగా ఏర్పడి వెంటనే పరిశీలించి, ఎక్కడ వాటిని బాగు చేయాలో తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఈ దుస్థితి మారదని ప్రజలు సూచిస్తున్నారు. దుమ్మురోడ్లను వెంటనే బాగుచేసి, త్వరగా మంచిరోడ్లు వేయాలని, కార్పొరేషన్‌ అధికారులకు, సంబంధిత నాయకులకు ఇకనైనా అలాంటి మంచిబుద్ధి కలిగించాలని నగర ప్రజలు నిత్యం వేయిదేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.

rottela pandugaమత సమైక్యతకు, సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభమైంది. కోరిన కోర్కెలు తీర్చే వరాల వేడుకగా ఈ పండుగకు పేరు. ఏ కోరికతో రొట్టె వదిలితే ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకమే లక్షలాది మంది భక్తులను దేశ విదేశాల నుండి ఇక్కడకు నడిపిస్తుంటుంది. 12వ తేదీ నుండే దర్గాకు భక్తులు పోటెత్తినట్లు వస్తున్నారు. నెల్లూరులో ఏ.సి స్టేడియం, పోలీసు గ్రౌండ్‌లను ఆధునీకరిస్తుండడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనా లకు ప్రత్యామ్నాయ స్థలాలలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్త కుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. దర్గా ఆవరణలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా పోలీసులు అనుక్షణం డ్రోన్‌లు, సి.సి. కెమెరాలతో పహారా కాస్తున్నారు. 13వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రొట్టెల పండుగకు వచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ ఆయన రొట్టెను వదిలారు. అలాగే బారాషహీద్‌లను దర్శించుకుని ప్రార్ధన చేశారు. మంత్రులు శిద్ధా రాఘవరావు, పి.నారాయణలు కూడా రొట్టెలు వది లారు. 14వ తేదీ ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షులు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి రొట్టెల పండక్కి వస్తున్నారు. రొట్టెల పండుగ ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. ఈ అయిదు రోజుల్లో దాదాపు 10లక్షల మంది భక్తులు ఈ రొట్టెల పండక్కి రావచ్చని అంచనా! ఇరు తెలుగు రాష్ట్రాలనుండే కాక తమిళనాడు, కర్నాటక, కేరళ, ఒడిసా తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పోటెత్తుతున్నారు.

కృష్ణపట్నం పోర్టు కంపెనీ, సిఎంఆర్‌ షాపింగ్‌మాల్‌, మాగుంట శరత్‌చంద్రారెడ్డి యువజన సేవాసమితి, లయన్స్‌ క్లబ్‌, రోటరీ క్లబ్‌, వివిధ స్వచ్ఛంధ సంస్థలు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లు వంటివి అందిస్తున్నాయి. పలువురు వైద్యులు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter