tdp leadersఏ జిల్లా కూడా ఈ పార్టీకి కంచుకోట అని చెప్పలేనటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో వున్నాయి. తెలుగుదేశం క్లీన్‌స్వీప్‌ చేసిన గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి ఇప్పుడంత గ్యారంటీ లేదు. వైసిపి విజయఢంకా మోగించిన కడప, కర్నూలు జిల్లాల్లో ఆ పార్టీ ఇప్పుడు అంతే బలంగా వుందని చెప్పే పరిస్థితి లేదు. అన్ని జిల్లాల్లోనూ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.

ఒక్క నెల్లూరుజిల్లాలో మాత్రం 2014 ఎన్నికల నాటి వాతావరణం మారలేదు. ఈ జిల్లాలో వైసిపి బలహీనపడ్డ దాఖలాలు గాని, టీడీపీ బలం పుంజుకున్న ఆనవాళ్ళు గాని లేవు. జిల్లాలో నెల్లూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలుంటే ఏ ఒక్క స్థానంలో కూడా తెలుగుదేశం గెలుస్తుందనే గ్యారంటీ లేదు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి కేవలం 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రేపు ఎన్నికల్లో కూడా తిరిగి ఆయనే పార్లమెంటు అభ్యర్థి అయినా గెలుస్తాడన్న ధీమా లేదు. 2014 ఎన్నికల్లో ఆయనకు క్రాస్‌ ఓటింగ్‌ బాగా జరిగింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఓటింగ్‌ జరగొచ్చు. కాబట్టి క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశం వుండదు. ఇదే ఆదాల వైసిపి లోక్‌సభ అభ్యర్థి అయితే సునాయాసంగా గెలుస్తాడని రాజకీయ విజ్ఞులు భావిస్తున్నారు. నెల్లూరురూరల్‌ టీడీపీ అభ్యర్థిగా కూడా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే ఇక్కడ నుండి కూడా ఆయన గెలుస్తాడని చెప్పే అవకాశం లేదు. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రజల్లోకి దూసుకుపోయాడు. ప్రజల మధ్యే ఉంటున్నాడు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుపోతున్నాడు. ఇక్కడ శ్రీధర్‌రెడ్డిని వెనక్కు నెట్టి గెలవడానికి తపస్సు చేయాల్సిందే! అదే ఆదాల వైసిపి అభ్యర్థిగా లోక్‌సభకైనా, అసెంబ్లీకైనా ఎక్కడైనా గెలవగలడనే ప్రచారం వుంది. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అతనిపై వ్యతిరేకత లేదు. ప్రజల మధ్యే ఉంటున్నాడు. ప్రభుత్వంతో పోరాడుతున్నాడు. అందరినీ కలుపుకుపోతున్నాడు. ఇతనిపై కూడా ఎవరిని పోటీ పెట్టాలి అనే అంతర్మధనం జిల్లా తెలుగుదేశంపార్టీలో సాగుతోంది. ఒక దశలో మంత్రి నారాయణ పేరు కూడా తెరమీదకొచ్చింది. నారాయణ పోటీ చేస్తే గట్టి ఫైటే ఉండొచ్చు. కాని, గెలుపుకు గ్యారంటీ లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నారాయణకు అవసరం లేదు. ఆయన కావాలనుకుంటే తెలుగుదేశంలో ఏ పదవైనా వస్తుంది. అదీగాక నారాయణ రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్‌ పర్యవేక్షించాలి. ఆర్ధిక వ్యవహారాలు పరిశీలించాలి. నారాయణ లాంటి సమన్వయకర్తను ఒక నియోజకవర్గంలో ఇరికించలేరు. అలా ఇరికిస్తే పార్టీకే నష్టం. కాబట్టి అనిల్‌కు ధీటైన అభ్యర్థి ఎవరన్నదానిపై పార్టీలో సందిగ్ధత నెలకొంది. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మించిన అభ్యర్థి లేడు. ఆయనకు కూడా గెలుపు కోసం యుద్ధం తప్పదు. ఆత్మకూరు వరకు ఆనం రామనారాయణరెడ్డి అభ్యర్థి అయితే ఇక్కడ ఉత్కంఠ పోరే నడుస్తుంది. అలాగని ఆనం రామనారాయణరెడ్డి గెలుపు నల్లేరుపై నడక అని చెప్పలేం. ఆయనకు గట్టిపోటీ తప్పదు. అదే ఆనం రామనారాయణరెడ్డి ఇక్కడ వైసిపి అభ్యర్థి అయితే వార్‌ వన్‌సైడే అన్నట్లుగా ఉంటుంది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు సరైన అభ్యర్థి తెలుగుదేశం వాళ్ళకు ఇంకా దొరకలేదు. ఆ దిశగా అన్వేషణ సాగుతున్నట్లు తెలుస్తోంది. వైసిపి నుండి తెలుగుదేశంలో చేరిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కే సీటిస్తే గెలుపు గ్యారంటీ లేదు. కాని, సీటు ఇవ్వక తప్పని పరిస్థితి. కోవూరులోనూ పార్టీ అయోమయస్థితిలో వుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి వ్యతిరేకంగా పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి వర్గం పని చేస్తోంది. ఈసారి సీటు విషయమై వచ్చే గొడవలే ఇక్కడ పార్టీని దెబ్బతీసేటట్లున్నాయి. కావలిలో ఈసారి బీద మస్తాన్‌రావు లేదా బీద రవిచంద్ర పోటీ చేస్తే సరేసరి... మంచిపోటీ వుంటుంది. వాళ్ళు కాకుండా కొత్త అభ్యర్థి తెరమీదకు వస్తే వైకాపాకు పండుగే! వెంకటగిరిలోనూ దేశం అయోమయంలో వుంది. సిటింగ్‌ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై తీవ్ర వ్యతిరేకత వుంది. కాకపోతే ఆయనను తప్పిస్తే ఎవరిని పెట్టాలో అర్ధం కావడంలేదు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై వ్యతిరేకత వున్నా, ఆయనకంటే మెరుగైన అభ్యర్థి కనిపించడం లేదు నియోజకవర్గంలో.

ఇలా జిల్లా అంతటా తెలుగుదేశంకు ఉత్సాహవంతమైన వాతావరణం లేదు. సగం నియోకవర్గాల్లో సరైన అభ్యర్థులే లేరు. 2014 ఎన్నికల్లో మంచి ఫలితాలు రానందుకే జిల్లా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు చేత ఇప్పటికి కూడా తిట్లు తింటున్నారు. జిల్లాలో మునుపటి పరిస్థితికి నేటికి పెద్దగా మార్పులేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో ఎవరుంటారో, ఎవరు వెళతారో చెప్పలేని పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు కడప, కర్నూలులలో తన హవాను సాగించినా, నెల్లూరుజిల్లా మాత్రం ఆయనకు కొరుకుడుపడని కొయ్యగానే వుంది.

seatsనెల్లూరుజిల్లాలో ఉండేది ఒక లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు. వీటిలో రెండు ఎస్సీ రిజర్వుడ్‌. ఇక ఎవరు ఎంత తన్నుకున్నా మిగిలిన 8సీట్ల కోసమే తన్నుకోవాలి. అందులోనూ గత రెండు ఎలక్షన్‌ల నుండి వీటిలో ఒక సీటును బీసీలకు ఇవ్వడం సాంప్రదాయంగా వుంది. అలాగే బీజేపీతో పొత్తుంటే ఇంకో సీటు తగ్గుతుంది. కాబట్టి సీటుకు ఫైటు టైట్‌గానే వుండబోతోంది.

మొన్న నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన ఎఫెక్ట్‌ బాగానే వుంది. జిల్లాలో ఆ పార్టీ సీట్లకు బాగానే పోటీ వుంది. నెల్లూరు నగరం, రూరల్‌ నుండే మంత్రి నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కిలారి వెంకట స్వామినాయుడు, మాజీఎమ్మెల్యే ఆనం వివేకా తనయుడు ఏ.సి.సుబ్బారెడ్డి రంగంలో వున్నారు. ఇక నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా వున్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అటు పార్లమెంటుకు వెళతాడా లేక నెల్లూరు రూరల్‌ అడుగుతాడా? అన్నది అప్పటికిగాని తేలదు. ప్రస్తుతానికి ఆయన రూరల్‌లో తన పట్టును పెంచుకునే ప్రయత్నా లలో వున్నాడు. సర్వేపల్లి సీటుకు సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డా లేక ఆయన కొడుకు రాజగోపాలరెడ్డా అన్నది అప్పటికి తేలే విషయమే! కోవూరు సీటుకు మాత్రం సిటింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు స్థానిక నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి కూడా పోటీ పడుతున్నాడు. 2014 ఎన్నికల్లో సీటు కోసం బలంగా ప్రయత్నించిన పెళ్ళకూరు ఈసారి ఆరునూరైనా పోటీ చేయాలనే పంతంతో వున్నాడు. వీళ్ళిద్దరు కాకుండా కోవూరుకు బి.సి వర్గాల నుండి ఏపిఐఐసి ఛైర్మెన్‌గా వ్యవహరి స్తున్న కృష్ణయ్య పేరు కూడా వినిపిస్తోంది. కావలి నుండి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వున్నాడు. ఆయన పేరు లోక్‌సభకు కూడా ప్రతిపాదనలో వుంది. ఆయన కాకుంటే బీద రవిచంద్ర పేరు కూడా పరిశీలనలో వుంది. ఉదయగిరిలో సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు వ్యతిరేకత వుందని, ఈసారి ఆయనను మార్చాల్సిందేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నుండి మాజీఎమ్మెల్యే, బలమైన వర్గం వున్న కంభం విజయరామిరెడ్డి టిక్కెట్‌ ఆశిస్తున్నాడు. ఇక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బొల్లినేని హజరత్తయ్య నాయుడు పేరు కూడా పరిశీలనలో వుంది. ఆత్మకూరు నుండి ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. వెంకటగిరి నుండి మాత్రం సిటింగ్‌ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఈసారి సీటు ఇవ్వకపోవచ్చు ననే ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి వెంకటగిరి సీటు రేసులో వున్నట్లు తెలుస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యే రామకృష్ణ పట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత వుంది. వెంకటగిరిలో ఈసారి రెడ్డి సామాజికవర్గం నుండి అభ్యర్థి అయితేనే గట్టిపోటీలో నిలవగలడు. నియో జకవర్గంలో రాపూరు, కలువాయి, డక్కిలి, బాలాయపల్లి మండలాలలో 'రెడ్ల' ఆధిపత్యం వుంది. ఈ వర్గంలో చీలిక తేవాలంటే టీడీపీ అభ్యర్థి కూడా ఆ వర్గానికి చెందిన వాడై వుండాలనే అభిప్రాయం పార్టీలో వుంది. ఈ దృష్ట్యానే ఈసారి ఇక్కడ 'రెడ్ల'కే ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది. సూళ్లూరుపేటలో ఈసారి కూడా పరసా రత్నం సీటును ఆశిస్తున్నప్పటికీ ఈ నియోజక వర్గంలో మొదటి నుండి పార్టీ మంచి చెడ్డలు చూస్తున్న వేనాటి రామచంద్రారెడ్డి మాత్రం కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చే ప్రయత్నాలలో వున్నాడు. ఇక గూడూరు నుండి మాత్రం వైకాపా నుండి జంప్‌ చేసి వచ్చిన సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌రావు, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జ్యోత్స్నలతలు కడా పోటీపడే అవకాశముంది.

loksabhaఏపిలో ఎక్కడైనా తెలుగుదేశంపార్టీకి తిరుగుండదేమో... ఒకసారి ఓడిన చోట మరోసారైనా గెలుస్తుందేమో... కాని రాష్ట్రంలో కడప తర్వాత తెలుగుదేశంకు మింగుడుపడని నియో జకవర్గం నెల్లూరే! అది లోక్‌సభ అయినా శాసనసభ అయినా?

తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటివరకు 7సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ గెలిచింది రెండే రెండుసార్లు. 1983లో ఆనం రామనారాయణరెడ్డి, 1994లో టి.రమేష్‌రెడ్డిలు మాత్రమే తెలుగుదేశం అభ్యర్థులుగా ఇక్కడ గెలవగలిగారు. ఇక తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించాక 9సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. 2012లో జరిగిన ఉపఎన్నికను కలిపితే నెల్లూరు పార్లమెంటుకు పదిసార్లు ఎన్నికలు జరిగాయి. కేవలం రెండంటే రెండుసార్లు మాత్రమే నెల్లూరు పార్లమెంటులో తెలుగుదేశం గెలిచింది. 1985ఎన్నికల్లో పుచ్చలపల్లి పెంచ లయ్య, 1999ఎన్నికల్లో ఉక్కాల రాజేశ్వరమ్మలు తెలుగుదేశం అభ్యర్థులుగా విజయం సాధించగలిగారు. ఈ పదింటిలో 6సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు, 2సార్లు వైకాపా అభ్యర్థి విజయం సాధించ గలిగారు. 2009లో నెల్లూరు లోక్‌సభ రిజర్వ్‌డ్‌ కేటగిరిలో నుండి జనరల్‌లోకి మారింది. అయినా కూడా తెలుగుదేశం పరిస్థితి మారలేదు. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు లోక్‌సభలోనూ తెలుగుదేశం బలహీనంగానే వుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం నెల్లూరు లోక్‌సభ అభ్య ర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని దించింది. ఆయన గట్టి పోటీయే ఇచ్చాడు. గెలుపుకు కొద్ది తేడాతో మిస్సయ్యాడు.

కేంద్రంలో పట్టు నిలుపుకోవాలంటే అసెంబ్లీలో మెజార్టీని సాధించడంతో పాటు అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసు కోవాలి. 2014 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రావడంతో చంద్రబాబును మోడీ వేలిమీద వెంట్రుకతో సమానంగా చూసాడు. కాని, వచ్చే ఎన్నికల్లో అంత స్వీప్‌ పరిస్థితి వుండదు. మిత్రపక్షాల ఎంపీ స్థానాలపై ఆధారపడాల్సి వుంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలను సాధించడం ముఖ్యమే! ఈ దృష్టిలోనే తెలుగుదేశంకు మింగడుపడకుండా వున్న నెల్లూరు లోక్‌సభపై చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వైకాపాను ఎదుర్కొనే ధీటైన అభ్యర్థికై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Page 1 of 8

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter