corporationనెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉప యోగించుకోవడంలోనూ, తడి, పొడి చెత్త సేకరణలోనూ నెల్లూరు కార్పొరేషన్‌ విఫల మైందంటూ 'కాగ్‌' దుయ్యబట్టింది. కార్పొరేషన్‌ పరిధిలో పెండింగ్‌లో వున్న 5.10కోట్ల కరెంట్‌ బిల్లుల విషయాన్ని కూడా 'కాగ్‌' ప్రస్తావించింది. అయితే 'కాగ్‌' నెల్లూరు కార్పొరేషన్‌ను ఒక వైపే చూసింది. రెండో వైపు చూసుంటే దండకాలను ఎన్ని రూపా లలో చేయొచ్చో, దందాలను ఏ విధంగా చేయవచ్చో తెలిసుండేది. ఆ ప్రతిభను గుర్తించి వుంటే 'కాగ్‌' ఖచ్చితంగా అవి నీతి వసూళ్లలో నెల్లూరు కార్పొరేషన్‌ అభివృద్ధిని మెచ్చుకుని ఉండేది.

ada mun mayనెల్లూరు నగరపాలక సంస్థ కేంద్రంగా తెలుగుదేశం పార్టీలోనే నాలుగుస్థంభాలాట నడుస్తోంది. మేయర్‌ అజీజ్‌ ఒక స్థంభం కాగా, ఆనం, ఆదాల, ముంగమూరులు మరో మూడుస్థంభాలుగా మారి ఆడుకుంటున్నారు. మిగిలిన ముగ్గురికి కూడా మేయర్‌ అజీజ్‌ చిక్కడం లేదు. ఇప్పటికే ఎస్సీ సబ్‌ప్లాన్‌ పనుల విషయంలో మంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగరం, రూరల్‌ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలతోనూ అజీజ్‌ విభేదించాడు. ఈ విషయంలో ఆయన మంత్రిని కూడా లెక్కచేయలేదు. ఇప్పుడు పింఛన్‌ల వ్యవహారం మరింతగా నిప్పు రాజేసింది. కార్పొరేషన్‌ పరిధిలో ఆనం, ఆదాల, ముంగమూరులు అందజేసిన పింఛన్‌ల దరఖాస్తులను అజీజ్‌ పక్కనపెట్టేసాడు. అలాగే తనకు పడని కార్పొరేటర్‌ల దరఖాస్తులను కూడా ఆయన పట్టించుకోలేదు. ప్రతి డివిజన్‌లోనూ తనకు నచ్చినవారికే పింఛన్‌లు ఇచ్చాడు. తన అనుచర కార్పొరేటర్లు ఇచ్చిన హింఛన్‌ దరఖాస్తులకే ఓకే చెప్పాడు. ఈ పరిణామంతో ఆనం, ఆదాల, ముంగమూరులు ఉడికిపోతున్నారు. మేయర్‌ మీద మంత్రికి కూడా ఫిర్యాదు చేసారు. కాని, అజీజ్‌ మాత్రం వీరిని ఖాతరు చేయకుండా చంద్రబాబుతో, లోకేష్‌తో టచ్‌లో ఉంటున్నాడు. ఇంత బ్రతుకు బతికి ఇంటెనక చచ్చినట్లు... రాజకీయాల్లో మహామహులనే ఢీకొట్టిన ఆనం, ఆదాలలకు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని అజీజ్‌ రూపంలో తలనొప్పి తయారైంది.

kaluvaస్వాతంత్య్ర సమరం నుంచి సారా వ్యతిరేకోద్యమం దాకా ఉద్యమాలకు ఊపిరిపోసిన జిల్లా నెల్లూరుజిల్లా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎందరో చరిత్రాత్మక నాయకులకు, ఉద్ధండ రాజకీయ నేతలకు జన్మనిచ్చిన జిల్లా నెల్లూరుజిల్లా. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగంలో సంచలనాలకు మారుపేరుగా పిలవబడుతున్న జిల్లా నెల్లూరుజిల్లా. దాన కర్ణులకు - దాన ధౌరేయులకు పేరు గాంచిన జిల్లా నెల్లూరుజిల్లా. అలాంటి జిల్లా కేంద్రమైన నెల్లూరు పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. నెల్లూరు నగరం ఏం పాపం చేసుకుందో, నగరవాసులకు ఏ శాపం తగిలిందో తెలియదుగాని అత్యంత దయనీయంగా నెల్లూరు స్థితి మారి పోయింది. దీనావస్థలతో నగరం నలిగిపోతోంది.

ఈ నెల్లూరుకు గ్రహణం పట్టింది. నెల్లూరు నగర కార్పొరేషన్‌ బాగుచేయలేని ఎయిడ్స్‌ వ్యాధి కంటే దారుణమైన వ్యాధితో బాధపడుతోంది. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా అధికారులు, సిబ్బంది కుమ్మక్కై పందికొక్కుల్లా దోచుకుంటూ పట్టణాన్ని అధోగతిపాలు చేస్తున్నారు.

''ఈ నగరానికి ఏమైంది'' అంటూ గతంలోనూ ''నగరమా నరకమా'' అంటూ ఇటీవల కాలంలోనూ 'లాయర్‌'తో పాటు అన్ని దినపత్రికల్లో సైతం మునిసిపల్‌ కార్పొరేషన్‌ నిర్లక్ష్యాన్ని, అవినీతిని, అక్రమాలని ఎండగడు తున్నా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇద్దరు... పట్టణాభివృద్ధి శాఖ మంత్రులూ నెల్లూరోళ్లైనా ఈ వార్తలకు చీమ కుట్టినట్లైనా చలించక పోవడం అటు ప్రజలను ఇటు రాజకీయ మేధావులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న పాపమేమిటని అర్ధంకాక తలపట్టుకుంటున్నారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి నగరంపై అసలు ఆసక్తి లేదు. నెల్లూరు నెక్ట్స్‌ ద్వారా ఆయన చేసిన ప్రయత్నాలకు పెద్దగా స్పందన రాకపోవడంతో నగరాన్ని ఆయన గాలికి వదిలేశాడు. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్‌ ప్రక్షాళన విషయంలో తమకేమీ పట్టనట్లుగానే వెంకయ్య వ్యవహరించడం విడ్డూరమైన విషయం.

ఇక మరో మంత్రి నారాయణ ఆయన ఆత్తవారింటికి అల్లుడొచ్చినట్లు ఏ పండగకో పబ్బానికో వస్తాడు. రొట్టెల పండుగ, పెద్దల పండుగ లేదా ప్రభుత్వ పథకాల పండుగ అంటూ పండగ వేళల్లోనే కనపడతాడు. ఇక మధ్యలో ఎప్పుడో రాత్రివేళల్లో వచ్చి వెళ్తాడు.

నగరాభివృద్ధికి చెందిన ఇద్దరు మంత్రులూ నెల్లూరోళ్లే అయ్యుండి కూడా కనీసం కార్పొరేషన్‌కి ఒక నిఖార్సయిన ఐ.ఏ.ఎస్‌ అధికారిని కమిషనర్‌గా నియమించడానికి సంకోచిస్తున్నారంటే నగరం పట్ల వీరికున్న శ్రద్ధ, ఆసక్తి స్పష్టమైపోతోంది.

చివరికి నగరంలో దోమలు, పందులు వీరవిహారం చేస్తున్నాయి. నెల్లూరులో 5లక్షల మంది ప్రజలుంటే ఏ 5వేలకోట్లకు పైగానే దోమలుంటాయి. నగరంలోని ఏ ప్రాంతం చూసినా ముక్కులదరగొట్టే మురుగుతో మురికి గుంటలతో గబ్బుకొట్టిపోతోంది.

సమర్ధత వున్నా... సహకారం లేదు

శ్రీ ఎమ్మెల్యేలిద్దరూ డమ్మీలే

ఇక నెల్లూరు నగరంతో పాటు రూరల్‌లో సైతం వై.సి.పి ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ప్రజలకు పెద్ద శాపంగా మారినట్లే అనిపిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలూ యువకులు, ఉత్సాహవంతులు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో పాటు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తుకు ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలన్న ఆలోచన, దృక్పథం కలిగిన వాళ్లు. అయితే వాళ్లకు 'పవర్‌' లేదు, ఇద్దరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలే కావడంతో వాళ్ల ఆదేశాలు ఆలోచనలు ఆచరణలో సాధ్యం కావడం లేదు. అధికారులు వీళ్లనసలు లెఖ్ఖపెట్టడం లేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రే ఆదేశించినా తమ స్టైల్‌లో సమాధానం చెప్పి పని ఎగ్గొట్టడంలో ఆరితేరిన నెల్లూరు నగర కార్పొరేషన్‌ సిబ్బంది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలనూ అసలు ప్రజా ప్రతినిధులుగా చూస్తున్నట్లు కూడా లేదు.

అటు రూరల్‌ ఇటు నగరంలో సమస్యలను వీళ్ళ దృష్టికి తీసుకెళ్లినా ఆ సమస్యను పరిష్కరించడానికి ఇద్దరు ఎమ్మెల్యేలూ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం మాత్రం సున్నానే! ఉదాహరణకు మాగుంట లే అవుట్‌ ఎస్‌.ఆర్‌.కె స్కూల్‌ నుండి సిపిఆర్‌ కళ్యాణ మండపం వరకూ మంజూరు కాబడిన డ్రైన్‌ నిర్మాణాన్ని తీసుకుంటే 15రోజుల క్రితం 'లాయర్‌'లో ఇక్కడ కాంట్రాక్టర్‌ అహంకార పోకడ అధికారుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉటంకిస్తూ వార్త ప్రచురితమైంది. సదరు వార్తకు వెంటనే స్పందించిన రూరల్‌ శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి విషయాన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకున్నాడు. వెంటనే మునిసిపల్‌ అధికారులతో మాట్లాడడంతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాడు. లాయర్‌లో వార్త వచ్చిన మూడురోజుల తర్వాత మళ్ళీ ఓ ప్రముఖ దినపత్రికలో సైతం ఈ డ్రైన్‌కి సంబంధించిన వార్త ప్రచురితమైంది. అప్పుడు కూడా శ్రీధర్‌రెడ్డి మళ్ళీ స్పందించి జె.సి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కానీ ఫలితం శూన్యం. కార్పొరేషన్‌ అధికారులు సమస్య వున్న ప్రాంతాన్ని సందర్శించి తమదైన తరహాలో చూస్తాం... చేస్తాం... చించేస్తాం... పొడిచేస్తాం అంటూ వెళ్లి పోయారు. అంతా ఎక్కడ గొంగళి అక్కడే. కంకర, ఇసుకతో పాటు కాంట్రాక్టర్‌ తీసిన గొయ్యి, అందులో లక్షల్లో దోమలు, వందల్లో పందులు, బిక్కుబిక్కు మంటూ ఎస్‌.ఆర్‌.కె స్కూల్‌లో చదివే పిల్లల ప్రాణాలు. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే.

నగరమంతా పోస్టర్లు, ఫ్లెక్సీలు

ఎక్కడపడితే అక్కడ పోస్టర్లు, ఫ్లెక్సీలు వుండకూడదని, ఇష్టానుసారం పోస్టర్లు అంటించడం ఫ్లెక్సీలు కట్టడం వంటివి అనుమతించరాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఆదేశాలు జారీ చేసి నప్పటికీ ఆ ఆదేశాలను సైతం ఖాతరుచేసే నాయకుడూ లేడు, నాథుడూ లేడు. ఇక నెల్లూరులో విగ్రహాలకు కొదవలేదు. ఆ విగ్రహాల ఐలాండ్లకు వేసే ప్రచార పోస్టర్లకూ అసలు కొదవ లేదు. గౌరవ మంత్రిగారి ఆశీస్సులతో ఎంఎల్‌సి పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన కుడి భుజం అనుచరులు ఓ అడుగు ముందుకేసి ఎక్కడా ఐలాండ్లు అన్నవే కనపడకుండా మొత్తం అన్నింటినీ అభ్యర్థి పోస్టర్లతో ముంచేశారు. ఎలక్షన్ల పోస్టర్లు సైతం ఎక్కడపడితే అక్కడ అంటించకూడదన్న నిబంధన కూడా మంత్రికి ఆయన అనుచర గణానికి వర్తించేటట్లు లేదు. టౌనంతా పోస్టర్లు, ఫ్లెక్సీలతో గలీజుగా తయారైనా ఒక్క అధికారి కూడా దీనిపై స్పందించకపోవడం వింతే కాదు విడ్డూరం కూడా!

కరువైన శాంతిభద్రతలు

గత యేడాదికాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపో యాయి. చైన్‌ స్నాచింగ్‌ కేసులతో పాటు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలకు నెల్లూరు నగరం నిలయమైపోయింది. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడానికీ నేరాలను నియంత్రించడానికి దొంగలను దుర్మార్గులను గుర్తించడానికి నగరమంతా సి.సి కెమెరాలు పెట్టామని ఓ వైపు చెప్తూనే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సీటు బెల్టు పెట్టుకోలేదని, సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నారని రాంగ్‌ పార్కింగ్‌లో వాహనం నిలిపారంటూ సి.సి.కెమెరాలు తీసిన ఫోటోల ఆధారంగా ఫైన్‌ కట్టండంటూ నోటీసులు పంపిస్తోంది పోలీసుశాఖ. తమ డిపార్ట్‌మెంట్‌కు ఆదాయం రాబట్టడంలో చూపిస్తోన్న చొరవ, నేర నియంత్రణలో లేదనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది.

ఆర్‌.టి.సితో సహా నగరమంతా...

బహిరంగ మూత్ర విసర్జన

ఇక ఆర్‌.టి.సి బస్టాండ్‌తో సహా నగరంలో ఎక్కడపడితే అక్కడ బహిరంగ మూత్రవిసర్జనతో అంతా ఉచ్చగబ్బుగా తయారైంది. కార్పొరేషన్‌కి ప్రత్యేక అధికారిగా వున్న జిల్లా కలెక్టర్‌ సైతం కార్పొరేషన్‌తో ఎందుకొచ్చిన పరేషాన్‌ అన్నట్లుగా వుండి పోతున్నారు. నగరంలోని అన్ని విభాగాలు కార్పొరేషన్‌ విధుల తోనే ముడిపడి ఉంటాయి. చివరకు ట్రాఫిక్‌ నియంత్రణ సక్రమంగా జరగాలన్నా కార్పొరేషన్‌ సహకారం అవసరం. అటు పారిశుద్ధ్యం, పట్టణ సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థ, అక్రమ కట్టడాల నియంత్రణ, నిర్ణీత ప్రదేశాలలో పెయిడ్‌ పార్కింగ్‌... ఇవన్నీ కార్పొరేషన్‌ బాధ్యతలే. అయితే నెల్లూరు కార్పొరేషన్‌కి సరైన అధికారిని నియమించే ఆలోచనే లేని ఇద్దరు పట్టణాభి వృద్ధి శాఖల మంత్రుల పుణ్యమా అని నగరం అధోగతి పాలై పోయింది.

బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు కదా, నాకెందుకొచ్చింది అని వెంకయ్యనాయుడు, ప్రజల ఓట్లతో నేను మంత్రిని కాలేదు కదా నాకేం సంబంధం అని నారాయణ... ఇద్దరూ నెల్లూరు కార్పొరేషన్‌ని కార్పొరేషన్‌ అధికారులని ఊరి మీదకి వదిలేయ డంతో ఇక్కడ వారిదే ఇష్టారాజ్యమైపోయింది. ప్రభుత్వాలు మారి 3సంవత్సరాలు పూర్తి కానున్నా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ దోస్తులే అధికారంలో వున్నా నెల్లూరు నగరం నరక కూపంగానే మిగిలిపోయి వుందంటే నిజంగా నెల్లూరుకు శనిపట్టింది అనిపిస్తోంది. శని ఒక్కో దశలో నిర్ణీత కాలం పాటు ఉంటుందంటారు. మరి నెల్లూరుకు పట్టిన శనికి ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది. మరి ఇంకైనా వీడుతుందో లేక మరి కొన్నేళ్లు పట్టిపీడిస్తుందో... వేచిచూడాల్సిందే!

Page 1 of 6

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter