anilనెల్లూరు నగర ప్రజల ఆశీస్సుల కోసం ఈ నెల 26వ తేదీ నుండి ప్రజా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఈనెల 17వతేదీన నెల్లూరు లోని ఎం.సి.ఎస్‌ కళ్యాణ మండపంలో వైయస్సార్‌ కుటుంబం ముగింపు సభ మరియు నియోజకవర్గ వైసిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 21వ తేదీన చేపట్టాల్సిన ప్రజాదీవెన కార్య క్రమాన్ని 'వై.యస్‌.ఆర్‌ కుటుంబం' కార్య క్రమం కారణంగా ఈనెల 26కు వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రజాదీవెనలో నగరం లోని ప్రతి ఇంటికొస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. జగనన్న చెప్పిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తామని, ప్రజల దీవెనలతో జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. నెల్లూరు నగరంలో 'వైయస్‌ఆర్‌ కుటుంబం' ఎంతో విజయవంతమైందని, 40వేల కుటుంబాలు పార్టీకి చేరువయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ ఎం.ద్వారకానాథ్‌, కార్పొరేషన్‌ వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

seatsనెల్లూరుజిల్లాలో ఉండేది ఒక లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు. వీటిలో రెండు ఎస్సీ రిజర్వుడ్‌. ఇక ఎవరు ఎంత తన్నుకున్నా మిగిలిన 8సీట్ల కోసమే తన్నుకోవాలి. అందులోనూ గత రెండు ఎలక్షన్‌ల నుండి వీటిలో ఒక సీటును బీసీలకు ఇవ్వడం సాంప్రదాయంగా వుంది. అలాగే బీజేపీతో పొత్తుంటే ఇంకో సీటు తగ్గుతుంది. కాబట్టి సీటుకు ఫైటు టైట్‌గానే వుండబోతోంది.

మొన్న నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన ఎఫెక్ట్‌ బాగానే వుంది. జిల్లాలో ఆ పార్టీ సీట్లకు బాగానే పోటీ వుంది. నెల్లూరు నగరం, రూరల్‌ నుండే మంత్రి నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కిలారి వెంకట స్వామినాయుడు, మాజీఎమ్మెల్యే ఆనం వివేకా తనయుడు ఏ.సి.సుబ్బారెడ్డి రంగంలో వున్నారు. ఇక నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా వున్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అటు పార్లమెంటుకు వెళతాడా లేక నెల్లూరు రూరల్‌ అడుగుతాడా? అన్నది అప్పటికిగాని తేలదు. ప్రస్తుతానికి ఆయన రూరల్‌లో తన పట్టును పెంచుకునే ప్రయత్నా లలో వున్నాడు. సర్వేపల్లి సీటుకు సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డా లేక ఆయన కొడుకు రాజగోపాలరెడ్డా అన్నది అప్పటికి తేలే విషయమే! కోవూరు సీటుకు మాత్రం సిటింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు స్థానిక నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి కూడా పోటీ పడుతున్నాడు. 2014 ఎన్నికల్లో సీటు కోసం బలంగా ప్రయత్నించిన పెళ్ళకూరు ఈసారి ఆరునూరైనా పోటీ చేయాలనే పంతంతో వున్నాడు. వీళ్ళిద్దరు కాకుండా కోవూరుకు బి.సి వర్గాల నుండి ఏపిఐఐసి ఛైర్మెన్‌గా వ్యవహరి స్తున్న కృష్ణయ్య పేరు కూడా వినిపిస్తోంది. కావలి నుండి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వున్నాడు. ఆయన పేరు లోక్‌సభకు కూడా ప్రతిపాదనలో వుంది. ఆయన కాకుంటే బీద రవిచంద్ర పేరు కూడా పరిశీలనలో వుంది. ఉదయగిరిలో సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు వ్యతిరేకత వుందని, ఈసారి ఆయనను మార్చాల్సిందేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నుండి మాజీఎమ్మెల్యే, బలమైన వర్గం వున్న కంభం విజయరామిరెడ్డి టిక్కెట్‌ ఆశిస్తున్నాడు. ఇక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బొల్లినేని హజరత్తయ్య నాయుడు పేరు కూడా పరిశీలనలో వుంది. ఆత్మకూరు నుండి ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. వెంకటగిరి నుండి మాత్రం సిటింగ్‌ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఈసారి సీటు ఇవ్వకపోవచ్చు ననే ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి వెంకటగిరి సీటు రేసులో వున్నట్లు తెలుస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యే రామకృష్ణ పట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత వుంది. వెంకటగిరిలో ఈసారి రెడ్డి సామాజికవర్గం నుండి అభ్యర్థి అయితేనే గట్టిపోటీలో నిలవగలడు. నియో జకవర్గంలో రాపూరు, కలువాయి, డక్కిలి, బాలాయపల్లి మండలాలలో 'రెడ్ల' ఆధిపత్యం వుంది. ఈ వర్గంలో చీలిక తేవాలంటే టీడీపీ అభ్యర్థి కూడా ఆ వర్గానికి చెందిన వాడై వుండాలనే అభిప్రాయం పార్టీలో వుంది. ఈ దృష్ట్యానే ఈసారి ఇక్కడ 'రెడ్ల'కే ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది. సూళ్లూరుపేటలో ఈసారి కూడా పరసా రత్నం సీటును ఆశిస్తున్నప్పటికీ ఈ నియోజక వర్గంలో మొదటి నుండి పార్టీ మంచి చెడ్డలు చూస్తున్న వేనాటి రామచంద్రారెడ్డి మాత్రం కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చే ప్రయత్నాలలో వున్నాడు. ఇక గూడూరు నుండి మాత్రం వైకాపా నుండి జంప్‌ చేసి వచ్చిన సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌రావు, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జ్యోత్స్నలతలు కడా పోటీపడే అవకాశముంది.

phoneమునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది ఎవరికీ మింగుడుపడడం లేదు. మున్సిపల్‌ శాఖామాత్యులు పొంగూరు నారాయణ ఎవరి ఫోన్లూ ఎత్తుకోరు. ముఖ్యమంత్రి లేదా ఆయన తనయుడు లోకేష్‌ మినహా తన కుటుంబసభ్యులెవరైనా ఫోన్‌ చేస్తే తప్ప ఇంకెవ్వరికీ బదులివ్వరనీ, తన సహచర మంత్రులు ఫోన్‌ చేసినా ఆయన ఫోన్‌ సమాధానమివ్వడని సాక్షాత్తూ మన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తే ఓ సందర్భంలో నారాయణ గురించి కామెంట్‌ చేయడం మనకు తెలిసిందే! ప్రజలకు అభివృద్ధి కావాలంటే తాను ''సార్‌'' ఫోన్‌ ఎత్తుకుంటే చాలు ప్రజలతో తనకేం పని అనుకునే తత్వం నారాయణది. అయితే ఆయన నేను ఎన్నికల బరిలో దిగబోతున్నాను, పోటీకి సిద్ధమౌతున్నాను అని ప్రకటించిన తరువాతన్నా కనీసం ఫోన్లకు జవాబిస్తాడనుకున్న వారి ఆశ నిరాశే అయిందని తెలుస్తోంది. ఆయన వ్యవహారశైలిలో ఏ మార్పూ రాలేదని తెలుస్తోంది. ఆయన ఫోనెత్తే ప్రసక్తే లేదని ఆయన పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలే బహిరంగంగా విమర్శించడం విడ్డూరం.

అయితే స్టేట్‌ బాస్‌ని, లోకల్‌ బాస్‌ ఫాలో అవుతున్నట్లుంది. నగర కమిషనర్‌ ఢిల్లీ రావు కూడా రాష్ట్ర స్థాయి అధికారులు లేదా తన ''బాస్‌'' చేస్తే తప్ప ఫోన్‌ జవాబివ్వడం లేదని సామాన్యుడు సైతం విమర్శిస్తున్నాడు. ప్రజలకు అందుబాటులో వుంటూ ప్రజా సమస్యలను తీర్చే నిఖార్సైన అధికారి వచ్చాడని అందరూ భావిస్తున్న తరుణంలో మన మునిసిపల్‌ కమిషనర్‌ ఈ అపవాదును మూటకట్టుకోవడం బాధాకరం.

జిల్లాకొచ్చిన ప్రతిభావంతులైన అధికారులెవరైనా ముందుగా ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి ప్రజలకు ఏ సమస్య వున్నా తన దృష్టికి తేవాలని అవసరమైతే అర్థరాత్రైనా తన ఫోన్‌ నెంబర్‌కి కాల్‌ చేయాలని చెప్తారు. ప్రజలు ఇచ్చే పన్నులతో జీతాలు తీసుకునే వీరు, ప్రజల సేవకు తమ సమయాన్ని కేటాయించాలి. కాని ప్రస్తుతం ఈ అధికారి వింత పోకడ చూస్తే విచిత్రంగా వుంది. ఇటీవల జిల్లాలో చాలా మంచిపేరున్న ఓ మాజీశాసనసభ్యుడు పదేపదే ఫోన్‌ చేస్తే కూడా ఈ కమిషనర్‌ స్పందించలేదని తెలి సింది. చివరకు ఆ మాజీశాసనసభ్యుడు తనకున్న సమస్యను లేఖ ద్వారా తెలిపినా, ఆ లేఖకు కూడా కనీస సమాధానం ఇవ్వలేనంత బిజీగా ఈ కమిషనర్‌ వున్నట్లుందని ఆయన బాధపడ్డాడు. పన్నులు చెల్లించే సామాన్య ప్రజలంటే లెక్క లేకపోయినా కనీసం ప్రజల సమస్యలకు నాయకత్వం వహించి ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా నిలిచే ప్రజాప్రతినిధుల ఫోన్లన్నా ఈ సారు గారు ఎత్తుకుని స్పందిస్తే బాగుంటుందని అధికార పార్టీ నేతలే గొణుక్కోవడం చూస్తే ఈయనపై ఎంత అసంతృప్తి వుందో అర్ధమౌతుంది. నగర కమిషనర్‌గా నెల్లూరుకు వచ్చిన రోజు నుండి బాగా పని చేస్తున్నాడన్న పేరును ఈయన సంపాదించుకున్నాడు. ముఖ్యంగా క్లీన్‌ & గ్రీన్‌కి ప్రాధాన్యతనిచ్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో ఫలితం సాధిస్తున్నాడన్న పేరు కూడా వుంది. మరి ఈ ఫోన్లెత్తుకోవడం లేదన్న అపవాదును ఎందుకు మూటకట్టుకున్నాడో ఆయనకే అర్ధం కావాలి. కమిషనర్‌ గారూ! మీకు మంచి పేరుంది సార్‌... ఈ ఒక్క విషయంలో మారితే ఇంకా మంచి పేరొస్తుందని ప్రజాభిప్రాయం.

Page 1 of 157

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • కావలి నాకే కావాలి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • అవును... వాళ్ళిద్దరూ ఫోన్లు ఎత్తరు!
  మునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది…

Newsletter