vivekaనెల్లూరు నేల పొరల్లోనుండి ఏంటి ఏడుపు వినిపిస్తోంది... నెల్లూరు వీధుల్లో ఎందుకీ రోదనలు... స్వర్ణాల చెరువు ఎందుకో విషాదంతో కనిపిస్తుంది... తల్పగిరి రంగనాథస్వామి కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి... ఇరుకళలమ్మ ఎందుకని అంతగా గుక్కపెట్టి ఏడుస్తోంది... సంతపేట చర్చిలోని ఏసుప్రభువు ఎందుకు విలపిస్తున్నాడు... దేవుళ్ళంటే సరే... మరి ఈ అవ్వలూ, తాతలేంటి అలా దిగులుగా వున్నారు, ఈ చిన్నారులేంటి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.. అసలు నెల్లూరే శోకవనంగా మారింది... ఏమైంది, ఎందుకిలా జరిగింది.

2018 ఏప్రిల్‌ 25వ తేదీ... ఒక చరిత్ర కన్ను మూసిన రోజు... నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసినరోజు. రాష్ట్ర రాజకీయ వినీలాకాశంలో నుండి ఒక ధృవతార నేలరాలిన రోజు. వేలాదిమంది పేదల ఆశలు అవిరైన రోజు. అభిమానుల ఆక్రందనలు మిన్నంటిన రోజు. బడుగు వర్గాల ప్రజల గుండెలు పగిలినరోజు. స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీశాసనసభ్యులు ఆనం వివేకా ఈ నేలను, ఈ నెల్లూరును, ఈ పెన్న నీళ్ళను, ఈ రంగడి గుడిని, బారాషహీద్‌ దర్గాను, తనను అభిమానించే పేదలను, బడుగులను, మైనార్టీలను, దళితులను, పిల్లలను, పెద్దలను వదిలి తనకిష్టమైన సర్వేశ్వరుని సన్నిధికి పయనమైనరోజు. అందుకే నెల్లూరంతా ఈ విషాదం... నెల్లూరీయులందరిలోనూ విచారం. సింహపురి గడ్డ ముద్దుబిడ్డ, నెల్లూరు లెజండ్‌ ఆనం వివేకానందరెడ్డి ఇక లేడనే వార్తతోనే నెల్లూరంతా ఈ విషాదం... నగరమంతా శోకమయం.

తన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎందరో యోధానుయోధులను ఢీకొట్టి మట్టి కరిపించిన ఆనం వివేకా వ్యక్తిగత జీవితంలో మాత్రం తనపై యుద్ధానికి వచ్చిన మృత్యువును మాత్రం ప్రేమతో కౌగిలించుకున్నాడు. దాని వశమయ్యాడు. దానితో కలిసే కైలాసానికి పయనించాడు.

గత కొన్నేళ్ళుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడు తున్న ఆయన ఏప్రిల్‌ 25వ తేదీ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. ఆయన వయసు 67సంవత్స రాలు. రాజకీయాలలో ఉపరాష్ట్రపతి యం.వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీముఖ్యమంత్రి దివంగత నేత వై.యస్‌.రాజ శేఖరరెడ్డిలకు సమకాలీకుడైన వివేకా 1950 డిసెంబర్‌ 23వ తేదీన మాజీమంత్రి ఆనం వెంకట రెడ్డి, వెంకట రమణమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. విద్యాభ్యాసం అంతా నెల్లూరులోనే జరిగింది. విఆర్‌ కళాశాలలో బి.కాం పూర్తి చేసాడు. తన పెద్దనాన్న స్వర్గీయ ఏ.సి.సుబ్బా రెడ్డి, తండ్రి ఆనం వెంకటరెడ్డిల శిక్షణలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు.

ఇదీ ఆయన రాజకీయ ప్రస్థానం

1980లో జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజకీయంగా తొలిఅడుగులు వేసాడు. 1982లో జిల్లా ల్యాండ్‌ మర్కెంటైల్‌ బ్యాంక్‌ ఛైర్మెన్‌గా పని చేశాడు. 1987లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలి చాడు. అప్పుడే మున్సిపల్‌ వైస్‌ఛైర్మెన్‌ అయ్యాడు. 1988లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా కొంత కాలం పనిచేశాడు. 1992లో శ్రీ వేణు గోపాలస్వామి కాలేజీ కరస్పాండెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1993లో విఆర్‌ కళాశాల కమిటీకి జరిగిన ఎన్నికల్లో కరస్పాండెంట్‌గా ఎన్నికై ఇటీవల వరకు ఆ పదవిలోనే కొనసాగారు. 1994 నుండి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డులో సభ్యుడిగాను, పలుసార్లు ఛైర్మెన్‌గానూ స్వామి సేవలో పనిచేసాడు. 1995లో జరిగిన నెల్లూరు మున్సిపల్‌ ఛైర్మెన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 36ఓట్లతో నెగ్గిన వివేకా రాజకీయ యాత్ర అక్కడ నుండే ఊపందుకుంది. 1983 నుండి తెలుగుదేశంలో వుండి 1985లో కొంతకాలం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా కూడా పనిచేసిన వివేకాకు ఆ పార్టీలో వున్నంతకాలం అంతకుమించిన అవకాశాలు రాలేదు. 1985ఎన్నికల్లో నెల్లూరు సీటును ఆశిం చినా ఇవ్వలేదు. 1989ఎన్నికల్లోనూ ఆయనకు మొండిచేయే చూపారు. దీంతో 1992లో కాంగ్రెస్‌ లోకి వెళ్ళిన ఆయనకు 1995లో నెల్లూరు మున్సిపల్‌ ఛైర్మెన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న ఆ కాలంలో వివేకా 36ఓట్లతేడాతో వై.టి.నాయుడుపై సంచలన విజయం సాధించాడు. నాలుగేళ్ళపాటు మున్సి పాల్టీలో చక్రం తిప్పాడు. అప్పుడే మున్సిపల్‌ ఛైర్మెన్‌ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరిం చాడు. 1999ఎన్నికల ద్వారా ఎమ్మెల్యేను కావాలను కున్న తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని సైతం ఢీకొట్టి వై.యస్‌ ఆశీస్సులతో టిక్కెట్‌ తెచ్చుకు న్నాడు. బీజేపీ అభ్యర్థి డేగా నరసింహారెడ్డిపై గెలుపు సాధించారు. ఐదేళ్ళ పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా విలక్షణ పాత్ర పోషించారు. అధికారపక్షానికి చుక్కలు చూపించారు. 2004 ఎన్నికల్లో మళ్ళీ నెల్లూరు నుండే రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. సరిగ్గా అప్పుడే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం, వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా రాజకీయాల్లో ఆనం హవా మరోసారి మొదలైనట్లయ్యింది. ఆనం సోద రులు నెల్లూరుజిల్లాలో వై.యస్‌.కు ముఖ్యఅనుచరు లుగా ముద్రపడ్డారు. వై.యస్‌. అండతో పార్టీలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వర్గాధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ తమ వర్గాన్ని పెంచుకున్నారు. ప్రతి నియోజక వర్గంలో ఆనం వర్గం ఏర్పడింది. 2007లో వై.యస్‌. క్యాబినెట్‌లో ఆనం రామనారాయణరెడ్డి మంత్రయ్యాడు. పెద్దవాడిగా వివేకా అడిగితే మంత్రి పదవి వచ్చే అవకాశమున్నా ఆయన ఆనాడు తనకు కాకుండా తన తమ్ముడి కోసమే మంత్రి పదవి అడిగి సోదరుల పట్ల తన వాత్సల్యం చాటుకున్నారు. వై.యస్‌. కొలువులో రామనారాయణరెడ్డి మంత్రి అయ్యాక ఆనం జోరు మరింత పెరిగింది. 2009 ఎన్నికల నాటికి నేదురు మల్లిపై పైచేయి సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో కొత్తగా ఏర్పడ్డ నెల్లూరురూరల్‌ నుండి పోటీ చేసిన వివేకా ప్రజారాజ్యం అభ్యర్థి తన సమీప బంధువు ఆనం వెంకటరమణారెడ్డితో గట్టిపోటీనెదుర్కొని 3131ఓట్లతో అతి కష్టం మీద గట్టెక్కారు. 2009 సెప్టెంబర్‌లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం చాలా మంది కాంగ్రెస్‌ నాయకుల జీవితాలలో పెను మార్పులు తెచ్చింది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్య మంత్రులయ్యారు. కాని, చాలామంది కాంగ్రెస్‌ నాయకులు రాజకీయంగా తెరమరుగ య్యారు. కొందరు గత వైభవాన్ని కోల్పోయారు. వారిలో ఆనం వివేకా కూడా వున్నారు. వై.యస్‌. మరణానంతరం తొలిరోజుల్లో జగన్‌కు అండగా నిలిచి ఆయన తరపున గట్టిగా పోరాడిన వివేకా ఆ తర్వాత కొద్దిరోజులకే తన వాణిని మార్చారు. జగన్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. జగన్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ధిక్కరించడం, 2012లో కాంగ్రెస్‌ పార్టీ నుండి బయటకొచ్చి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని స్థాపించడం జరిగింది. ఈ దశలో జగన్‌పై వివేకా విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. తెలుగుదేశం నాయకులు కూడా జగన్‌పై ఆరోపణలు చేయనంతగా వివేకా ఆరోపణలు చేసారు. జగన్‌పై వివేకా చేసిన ఆరోపణలను ఆయన అనుచరులు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. వై.యస్‌. మరణంతో ఆనంకు ఓ రకంగా రాజకీయ గ్రహణం పడితే, 2014లో జరిగిన రాష్ట్ర విభ జనతో మరోరకంగా నష్టం కలిగింది. విభజనతో ఏపిలో కాంగ్రెస్‌ పతనమైంది. 2014 ఎన్నికల చివరి వరకు సీఎం కుర్చీ మీద ఆశతో ఆనం సోదరులు కాంగ్రెస్‌లోనే వుండిపోయారు. 2014 ఎన్నికల్లో వివేకా పోటీ చేయకుండా నెల్లూరు నగరం నుండి తన కొడుకు ఏ.సి.సుబ్బారెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్ధిగా దించాడు. ఆ ఎన్నికల్లో ఆయనకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది. 2015లో ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డిలు తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరేటప్పుడు ఆనం వివేకాకు ఎమ్మెల్సీని, ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ హామీ ఇచ్చారు. అయితే రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ అయితే ఇచ్చారు గాని ఎమ్మెల్సీ విషయంలో వివేకాకు మొండిచేయి చూపారు. దీనికితోడు పార్టీలో ఆనం బ్రదర్స్‌కు అవమానాలే మిగిలాయి. కాంగ్రెస్‌లో నెల్లూరు జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆనం సోదరులకు టీడీపీలో కనీసం పార్టీ సమావేశాలకు కూడా ఆహ్వానం కరువైంది. ఇలా రాజకీయ శూన్యం ఆవహించిన సమయంలోనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. నిర్జీవంగా నిన్న నెల్లూరుకు తిరిగివచ్చారు.

నెల్లూరుజిల్లా రాజకీయాలంటే ఈ తరానికి గుర్తొచ్చే నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాలరెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఏ.సి.సుబ్బారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వెంకయ్య నాయుడు... రాజకీయ చరిత్రలో వీరందరిదీ ఓ శైలి. కాని, ఆనం వివేకానందరెడ్డి... విలక్షణ రాజ కీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌. 20ఏళ్ళ పాటు నెల్లూరు నగరాన్ని శాసించిన లీడర్‌. కుర్రాడు, వృద్ధుడు అనే తేడా లేకుండా నెల్లూరీయుల మన సుల్లో వివేకాగా ముద్రపడ్డ నాయకుడు.

మాజీమంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి నలుగురి కుమారులలో పెద్దోడు. పెద్దనాన్న ఏ.సి. సుబ్బారెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నాయకుడు. ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డిల తరం తర్వాత ఆనం వంశ రాజకీయాలను నడి పించిన దమ్మున్న నేత. అలాంటి నాయకుడిని కోల్పోయింది నెల్లూరు. ఇలాంటి నాయకుడు మళ్ళీ జన్మించడానికి ఎన్నేళ్ళు పడుతుందో?

తాను నమ్మిన సిద్ధాంతమే వేదంగా, తనను నమ్మిన అనుచరగణమే ఆయుధంగా సుదీర్ఘ రాజ కీయ ప్రస్థానాన్ని కొనసాగించి అదే రాజకీయంతోనే కొనఊపిరి వొదిలిన ఆనం వివేకానందరెడ్డికి నివాళులర్పిస్తూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది 'లాయర్‌'.

vivekaసింహపురి సోగ్గాడా... స్టైల్‌ ఆఫ్‌ సింహపురీ... ఓ వివేకా... ఎన్నిరోజు లైందయ్యా నిన్ను చూసి... నిన్ను చూడక, చిరునవ్వుల లొలికే నీ ఫేసు చూడక మా వాళ్ళ ముఖం వాచిపోయిం దనుకో... నాలుగేళ్ళు మున్సిపల్‌ ఛైర్మెన్‌గా, పదిహేనేళ్ళు ఎమ్మె ల్యేగా వుంటే ఏరోజూ నెల్లూరొదిలి పోయి నోడివి కాదు... ఒకవేళ పోయినా పక్కరోజు తెల్లారు జాముకల్లా వచ్చి సండే మార్కెట్‌ టీకొట్టు కాడ కనిపించే వాడివి. ఏ రోజు ఏ డ్రస్‌ వేస్తావో, ఏ రోజు ఏ వేషం కడతావోనని నెల్లూరు జనమంతా నీ కోసం ఎదురుచూసే వాళ్ళు కదా...

నెల్లూరులో నువ్వుంటే ఎంత సందడి... ఏసి సెంటర్‌ ఎంత కళగా వుండేది. అక్కడ ఎంత బిజినెస్సు... నీ పుణ్యాన అక్కడ సోడాబండోడు, వేరుశెనక్కాయల బండోడు, మజ్జిగ బండోడు... ఇలా ఎంతమంది బ్రతుకుతుండిరి... ఆ సెంటర్‌లో నువ్వు లేకపోయేసరికి పాపం వాళ్ళ బిజినెస్సులన్నీ పడిపోయే... నీ స్టేట్‌మెంట్‌ లేకుండా పేపర్‌, నీ విజువల్‌ లేకుండా ఏసిఎన్‌లో న్యూస్‌ ఎప్పుడన్నా వచ్చాయా అబ్బయ్యా... నువ్వు ప్రెస్‌మీట్‌ పెడితే అదే పెద్ద కామెడీ షోగా వుండేది. ఆ ప్రెస్‌మీట్లలో నీ హావభావాలు చూస్తే మనసుకు ఎంత ఉల్లాసంగా వుండేది. మీటింగుల్లో నీ వ్యంగోక్తులు, ప్రత్యర్థులపై నువ్వు విసిరే విమర్శలు ఎంత నవ్వు తెప్పించేవి. ప్రత్యర్థులను కిండల్‌ చేయడంలో నువ్వు పెద్ద ముదురువు కదా!

ప్రతి ఏటా టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రాసే పిల్లకాయలకు శుభాకాంక్షలు చెబుతూ గ్రీటింగ్‌ కార్డులు పంపే వాడివి. వాటిని అందుకుని పిల్లకాయలు ఎంత ఆనందపడే వాళ్ళో... ఆ ఆనందంతోనే పరీక్షలు రాసేవాళ్ళనుకో... కాని మూడేళ్ళ నుండి వాళ్ళను మర్చిపోయావా ఏంటి. గ్రీటింగ్‌ కార్డులు కూడా పంపడం లేదు వివేకా... వాళ్ళ దృష్టిలో నవ్వు నెల్లూరు నెహ్రూవు. మా చాచా ఎప్పుడు నెల్లూరొస్తాడా... మమ్మల్ని చిరునవ్వుతో ఎప్పుడు పలుకరిస్తాడా అని వారంతా ఎదురుచూస్తున్నారబ్బా! సంతపేటలో దోశెల బండి కాడ నువ్వు దోశెలు పోస్తుంటే చూసి ఎంతకాలమైందో... ఆ దోశల పెద్దామె కూడా మా వివేకా ఎక్కడికిపోయాడు నాయనా, కనిపిస్తే ఒక్కసారి వచ్చి తన చేతి దోశలు, బోండాలు తనిపొమ్మని చెప్పండని టిఫిన్‌ కోసం వచ్చే వాళ్ళకు చెబుతుందంట... నెల్లూరు రిక్షావాళ్ళు, ఆటోవాలాలు, తోపుడు బండ్లోళ్ళు, మెకానిక్‌లు, కార్పెంటర్‌లు, తాపీ పనోళ్ళు, చెత్త ఎత్తేవాళ్ళు... అందరూ నీ ఫ్రెండ్సే కదా! మా ఫ్రెండ్‌ ఎక్కడకు పోయాడయ్యా... ఆయనను చూసి ఎన్ని రోజులైందయ్యా అని వాళ్ళు నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నీ ఫ్యాన్స్‌ హిజ్రాలైతే దిగులు పెట్టుకుని వున్నారు. వాళ్ళను మనుషులుగా చూసింది నువ్వే కదా... వారితో ఆడి పాడింది నువ్వే కదా నాయనా... ఈమధ్య నెల్లూరులో వ్యాపార దుకాణాల ప్రారంభోత్సవాలకు భారీగా ఖర్చవుతుందంట... ఎందుకురా అని ఆరాతీస్తే, ఓపెనింగ్‌లకు సినిమా యాక్టర్‌లను తీసుకురావాల్సి వస్తుంది, వాళ్ళు వచ్చారంటే 5 నుండి 10లక్షల దాకా ఇచ్చుకోవాలి... అదే నెల్లూరులో మా వివేకన్న ఉండుంటే మాకింత ఖర్చెందుకవ్వుద్ది... ఆయనొక్కడే వందమంది హీరోలతో సమానం... ఆయనను పిలిచి లక్షలు ఇవ్వబల్లేదు... లక్షణంగా ఒక కేకు, సమోసా పెడితే తినిపోతాడు. అంతేనా, ఆయనది లక్కీ హ్యాండ్‌. మంచి మనసుతో ప్రారంభిస్తాడు కాబట్టి వ్యాపారాలు కూడా అలాగే జరిగేవి. ఇప్పుడేమో ఆయన నెల్లూరులో ఉండకపోతుండె.... ప్రారంభోత్సవాల ఖర్చే కాదు, బిజినెస్‌లకు గ్యారంటీ లేకుండా

పోయిందంటున్నారు. ఇదయ్యా నెల్లూరులో టాక్‌! చీరల కొట్టోళ్ళు, నగల షాపులోళ్ళు, హోటల్‌ వాళ్ళు, ఆఖరకు బార్బర్‌షాపుల వాళ్ళు కూడా నువ్వు నెల్లూరుకు ఎప్పుడొస్తావా, తమ షాపులలో ఎప్పుడు అడుగుపెడతావా అని ఎదురుచూస్తున్నారయ్యా... ఏం సుబ్బక్కా... ఏం మాధవా... ఒరే నాగా... అంటూ ఎంతో ఆత్మీయంగా వుండే ఈ పిలుపులు విని ఎన్నిరోజులైందయ్యా... నువ్వు సిగరెట్‌ మడుస్తుంటే, గాలిలోకి పొగ వదుల్తుంటే ఆ తీరే వేరుకదయ్యా.

ఒక్క నెల్లూరు జనానికే కాదయ్యో నువ్వంటే ప్రేమ... నెల్లూరు దేవుళ్ళు కూడా నీ ఫ్యాన్సే! పోయిన ముక్కోటికి లేకపోతివి, మొన్న రంగనాథస్వామి తిరునాళ్ళకు లేకపోతివి. ముక్కోటినాడు నువ్వు దేవుడి పల్లకీ మోస్తుంటే, చూడడానికి ఎంత అందంగా ఉండేదో... ఆ స్వామికి కూడా నువ్వు పల్లకీ మోయని కొరత కనిపిస్తున్నట్లుంది. రంగని తేరు ముందు నువ్వు కనిపించకుంటే ఎంత లోటనిపిస్తుందో... ఒక్క రంగడే కాదు, మూలాపేట శివుడు, వేణుగోపాలుడు, దుర్గామిట్ట రాజేశ్వరమ్మ, గ్రామదేవత ఇరుకళలమ్మ... వీళ్ళందరూ కూడా మా బిడ్డ మామీదేమన్నా అలిగిపోయాడా అని నీ కోసం ఎదురుచూస్తున్నారయ్యా... దర్గా దగ్గర రొట్టెల పండుగ జరుగుతుంటే... నువ్వు అక్కడ లేనిలోటు చాలా ఉందయ్యా... దేశవిదేశాల నుండి వచ్చినవాళ్ళు కూడా ఇక్కడ ఒక ఫకీర్‌ బాబా వుండాలే అని నీ కోసం వెదుకుతున్నారయ్యా... రొట్టెల పండుగలో నువ్వు చేసే సందడి అంతా ఇంతా కాదు కదా... ముస్లింలకు తగ్గట్లుగా నువ్వు వేసే గెటప్‌ ముందు అరబ్‌ షేక్‌లు కూడా పనికిరారుగా!

గంభీరమైన నీ గొంతు వినపడక, నిండు చంద్రుడిలా వెలిగే నీ ముఖం కనపడక నెల్లూరీయులందరూ ఏదో పోగొట్టుకున్నామనే దిగులుతో వున్నారు. మనోళ్ళకు నిన్ను చూస్తే ఆనందం... నీ మాటలు వింటుంటే పరమానందం... నీ హావభావాలు చూస్తుంటే బ్రహ్మానందం. వొళ్ళు బాగలేక హైదరాబాద్‌లో వున్నావని తెలిసింది... నువ్వు కొలిచే దేవుళ్ళే నిన్ను చల్లగా చూస్తారు. త్వరగా కోలుకుని నల్ల ఫ్యాంటు, నల్ల చొక్కా, నల్ల బూట్లు వేసుకుని, నల్లకళ్ళద్దాలు పెట్టి, నల్లకారులో నీ నెల్లూరీయుల కోసం దిగవయ్యా...

రాజకీయాలు వేరు, వ్యక్తిత్వం వేరు, పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు వదిలేస్తే అందరూ మనుషులే, అందరిదీ మానవజన్మే. రాజకీయంగా నువ్వెవరైనా కావచ్చు, వ్యక్తిగా నాకు నువ్వంటే ఇష్టం, నీ నవ్వంటే ఇష్టం, నీ నడకంటే ఇష్టం, నీ మాటంటే ఇష్టం, నీ స్టైలంటే ఇష్టం... అందుకేనయ్యా వివేకయ్యా నీ రాక కోసం నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్నాను.

ఇట్లు

నీ... నెల్లూరు.

nippoనెల్లూరుజిల్లాలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌ నిప్పో ఫ్యాక్టరీ స్థలం. ఈ జిల్లాలో ఎటువంటి పారిశ్రామిక ప్రగతి లేని 1970 దశకంలోనే జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ భాగస్వామ్యంతో నెల్లూరు మరియు తడలలో ఇండోనేషనల్‌ లిమిటెడ్‌ పేరుతో నిప్పో బ్యాటరీ తయారీ పరిశ్రమలను స్థాపించి వేలాదిమంది కార్మికులకు ఆ పరిశ్రమలలో

ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ పొట్టేపాటి ఓబులరెడ్డి. ఆ కాలంలోనే ఆయన ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. 'నిప్పో' ఫ్యాక్టరీని నెల్లూరు నగరానికి ఒక ల్యాండ్‌మార్క్‌గా మార్చారు.

నెల్లూరులో పరిశ్రమలను స్థాపించడానికి ఆయన భూమి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా 1972నవంబర్‌ 27వ తేదీన జిఓఎంఎస్‌ నెంబర్‌ 1230 ద్వారా 11.74 ఎకరాలు, 1973 మే 25వ తేదీన 2.16 ఎకరాల భూమిని కేటాయించారు. అప్పట్లో అక్కడున్న మార్కెట్‌ రేటు ప్రకారమే ఎకరా 4,200రూపాయల లెక్కన కొన్నారు. 1970 ప్రాంతంలో ఇప్పుడు నిప్పో స్థలం వున్న ప్రాంతం నెల్లూరుకు చాలా దూరంలో ఉండేది. ఆ రోజు చుట్టుపక్కల పట్టా భూములు కూడా అంతకంటే ఎక్కువ ధర వుండేది కావు. ఆరోజు నిప్పో ఓబుళరెడ్డి పరిశ్రమను పెడతానని చెప్పి ప్రభుత్వం నుండి ఉచితంగా భూమిని తీసుకోలేదు. కనీసం రిజిష్టర్‌ రేటుకు కూడా తీసుకోలేదు. మార్కెట్‌ రేటుకే కొన్నాడు. ఆరోజు చుట్టుపక్కల వున్న భూముల ధరలు కూడా అంతే! కాలక్రమేణా నగరం విస్తరించింది. ప్రస్తుతం నగరం నిప్పో ఫ్యాక్టరీని కూడా దాటిపోయింది. నగరం విస్తరించడం, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ వంటి పరిణామాల వల్ల 'నిప్పో' ప్రాంతంలో స్థలాలకు విపరీత మైన రేట్లొచ్చాయి. నిప్పో స్థలం అప్పటి నుండి ఒకే యాజమాన్యం క్రింద వుంది. ఆ చుట్టుపక్కల అంటే వేదాయపాలెం, చంద్రమౌళినగర్‌, ఏ.కె.నగర్‌, కరెంట్‌ ఆఫీస్‌ సెంటర్‌ ప్రాంతాలలో ప్రైవేట్‌ వ్యక్తులు తమ భూములను 1970 నుండి అమ్ముకుంటూ వచ్చారు. ఇలా ఎకరాలు పోయి అంకణాలలోకి వచ్చేసరికి ఈ కాలానికి అంకణం 2లక్షల నుండి 7లక్షల దాకా అయ్యింది. ఎకరా లెక్క అయితే 8కోట్ల పైమాటే! 'నిప్పో' యాజమాన్యానికి చెందిన 13.90 ఎకరాలకు ఖరీదు కడితే దాని విలువ వంద కోట్లకుపైనే వుంటుంది.

ఇప్పుడు నిప్పో స్థలంపై వివాదం జరగడం చూస్తూనే వున్నాం. చుట్టుపక్కల నగరం విస్తరించిన నేపథ్యంలోనైతేనేమీ, బ్యాటరీల మార్కెట్‌లో వచ్చిన ఒడిదుడుకుల వల్లనైతేనేమీ, పెరిగిన కాలుష్యం వల్లనైతేనేమీ ఫ్యాక్టరీని తీసేయాలనుకుంటున్నారు. ఈ స్థలాన్ని పారి శ్రామిక జోన్‌ నుండి గృహ, వాణిజ్య వినియోగజోన్‌గా మార్చమని నిప్పో యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఒకటికి రెండుసార్లు కౌన్సిల్‌ చర్చ జరిగింది. అయితే కొందరు నాయకులు దీనిపై వివాదం చేస్తున్నారు. 'నిప్పో' ఫ్యాక్టరీ భూములు ప్రభుత్వానివని, అక్కడ ఫ్యాక్టరీని తీసేస్తే స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ స్థలంలో పేదలకు ఇళ్ళు, గుళ్ళు, మసీదులు, చర్చిలు, కమ్యూనిటి హాళ్ళు కట్టించాలని కొందరు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిప్పో స్థలం ఏ నిబంధనల క్రింద ప్రభుత్వం ఇచ్చిందన్నది ఇక్కడ ప్రధాన అంశం! ప్రభుత్వం మార్కెట్‌ రేటుకు భూములను అమ్మినప్పుడు కొనుగోలుదారులకు పూర్తి హక్కు వస్తుంది. ఆరోజు ప్రభుత్వం నుండి కాకుండా ఓబుళరెడ్డి ప్రైవేట్‌ వ్యక్తుల నుండి పట్టాభూములు కొనివున్నా అదే రేటు... ఈరోజు అసలు గొడవే వుండేది కాదు. పరిశ్రమ పెడుతున్నాడు కాబట్టి ప్రభుత్వం తక్కువ ధరకు ఆ భూమిని ఇచ్చివున్నా లేదా ఇన్ని సంవత్సరాలు అని లీజును నిర్ణయించివున్నా దానిపై నిప్పో యాజమాన్యానికంటే ప్రభుత్వానికే ఎక్కువ హక్కుంటుంది.

రాష్ట్రంలో ఎన్నో ప్రైవేట్‌ కంపెనీలకు, విద్యాసంస్థలకు, అంతెందుకు పత్రికా కార్యాలయాలకు కూడా మార్కెట్‌ రేటు ప్రకారమే ప్రభుత్వం భూములు కేటాయించి వుంది. ఎన్ని వార్తా సంస్థలు, ఎన్ని విద్యా, వ్యాపార సంస్థలు తమ సంస్థలను మూసేయలేదు. అవన్నీ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాయా? అందరూ శుభ్రంగా అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయంలో వాళ్ళకొక న్యాయం, నిప్పో యాజమాన్యానికి ఒక న్యాయమా? నిప్పో స్థలం ఇండస్ట్రియల్‌ జోన్‌లో వుంది. దానిని కన్వర్షన్‌ చేయడం, చేయకపోవడం అనేది ప్రభుత్వ ఇష్టం. కాని, మార్కెట్‌ రేటుపై కొన్న ఆ భూమిపై నిప్పో యాజమాన్యానికి హక్కు వుంటుంది. ఆరోజు ఎకరాకు 4,200 రూపాయలు మంచి రేటు. ఈరోజు కోట్లు పలుకుతుండబట్టే ఇన్ని వివాదాలొస్తున్నాయి. ఏ పదివేలో పాతికవేలో అయ్యుంటే దాని గురించి ఇంత రాద్ధాంతం వుండేది కాదు. రాష్ట్రంలో ఇలా కేటాయించిన భూములను ఎందరో అమ్ముకున్నారు. నెల్లూరులో ఒకప్పుడు స్పిన్నింగ్‌ మిల్లు వున్నటువంటి ప్రస్తుత రిత్విక్‌ లేఅవుట్‌ను ప్రభుత్వమే వేలం వేసి అమ్మగా ప్రస్తుతం టీడీపీ ఎంపీగా వున్న సీఎం రమేష్‌ కొని లేఅవుట్‌ చేయడం తెలిసిందే! ఆ లేఅవుట్‌లోనే ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి గారి నివాసం కూడా వుంది. ఇలా ఎన్నో ప్రభుత్వ భూములను ప్రభుత్వమే అమ్మేసుకుంది.

ప్రభుత్వం ఎవరికి భూములు కేటాయించినా నిబంధనలలో ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఆ భూమిని తిరిగి తీసుకునే విధంగా వ్రాసి వుంటారు. ప్రభుత్వానికి అవసరమంటే కొత్తరోడ్డు వేస్తుంటేనో, రైలు మార్గం వేస్తుంటేనో ప్రభుత్వ అవసరాలకు ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం నుండి నష్ట పరిహారం కూడా ఇవ్వాల్సి వుంటుంది. ఎందు కంటే ఉచితంగా ఇచ్చిన అసైన్డ్‌, సిజెఎఫ్‌ఎస్‌ భూములను ప్రభుత్వం అవసరంకొద్ది తీసుకుంటున్నప్పుడు ఆ భూములు సాగుచేస్తున్న రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారు. అలాంటిది మార్కెట్‌ రేటు ప్రకారం కొన్న భూములకు నష్టపరిహారం వుండదా?

ప్రభుత్వ అవసరాల కోసం ఇప్పుడు నిప్పో భూములు తీసుకోవా లనుకోవడం లేదు. వాటి విలువ పెరిగింది కాబట్టే వివాదం చేస్తున్నారు. మరి ఈ భూమిపై నిప్పో యాజమానికి హక్కు లేనప్పుడు, వాళ్ళు ఫ్యాక్టరీ ప్రాంగణంలో సాయిబాబా గుడికి స్థలం ఇస్తే ఇప్పుడు వివాదం చేస్తున్న వాళ్ళందరూ ఎందుకు మౌనంగా వున్నారు.

నిప్పో ఫ్యాక్టరీ స్థలం ఎవరికి చెందుతుందన్నది నాయకులు నిర్ణయించేది కాదు, దీనిపై లోతుగా పరిశీలన జరిపితేనే పరిష్కారం దొరుకుతుంది. రాష్ట్రంలో భూములను తీసుకుని ఎత్తేసిన పరిశ్రమలు చాలావున్నాయి. వాళ్ళందరి నుండి ప్రభుత్వం భూములను తిరిగి తీసుకుందో, లేక వాళ్ళు అమ్ముకుని వెళ్ళారో... వివరాలు పూర్తిగా రాబడితే నిప్పో సమస్యకు కూడా అదే మార్గం వర్తిస్తుంది.

Page 1 of 7

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • కృష్ణ పోటెత్తింది
  కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వై.యస్‌.జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్రకు విశేషస్పందన లభించింది. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఈ జిల్లాల్లో కొన్ని వైకాపాకు కంచుకోటలు కాగా, ఇంకో రెండు జిల్లాల్లోనూ బలంగానే వుంది. కాని, అసలు…
 • వేమాలశెట్టి బావిలో... వేలుపెట్టిన వేమిరెడ్డి పట్టాభి
  నెల్లూరు, దర్గామిట్టలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా వున్న వేమాలశెట్టి బావి సత్రం స్థలం మరోసారి వివాదంలో కెక్కింది. మంగళవారం రాత్రి ఈ స్థలంలో మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ముఖ్య అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించడం వివాదానికి…

Newsletter