sasikగత కొన్ని రోజులుగా తమిళనాడులో ఉత్కంఠభరితంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. రెండురోజుల గడువులో రెండు ఊహిం చని పరిణామాలతో తమిళనాడు రాజకీ యాలు అనూహ్య మలుపులు తిరిగాయి. సీఎం కుర్చీ కోసం ఆరాటపడి, తమిళ నాడులో రాజకీయ సంక్షోభానికి కారణ మైన శశికళ చివరికి అక్రమాస్తుల కేసులో జైలుకుపోగా, ఆ పక్కరోజే 16వ తేదీ ఎన్నో రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికు తెరదించుతూ గవర్నర్‌ విద్యా సాగర్‌రావుప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడిఎంకె శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళని స్వామిని ఆహ్వానించడం, ఆరోజే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిపోయాయి. ఇక 15రోజుల్లో ఆయన బల నిరూపణ చేసుకోవడమే మిగిలివుంది. అయితే ఇప్పుడున్న పరి స్థితుల్లో పన్నీర్‌ సెల్వం వైపు వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా తిరిగి అన్నాడిఎంకె పక్కకే చేరే అవకాశాలుండడంతో ఆయన మెజార్టీ పరంగా గట్టెక్కడం పెద్ద సమస్య కాదు. కాకపోతే శశికళపై తిరుగుబాటు జెండా ఎగురవేసి డిఎంకె మద్దతుతో సీఎం పీఠ మెక్కాలనుకున్న పన్నీర్‌సెల్వంకి చివరికి కన్నీరే మిగిలింది. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

తమిళనాట కొనసాగుతున్న రాజకీయ సన్నివేశాలు ఒక్కోదానికి తెరపడుతూ వస్తోంది. గత ఐదు నెలలుగా తమిళ రాజకీయ నాటకాలు మంచి సస్పెన్స్‌ మధ్య కొనసాగుతుండడం చూస్తున్నాం. ప్రతి అంశంలోనూ టెన్షన్‌! ఆ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు, జాతీయ, అంతర్జాతీయ మీడియా అంతా కూడా అయిదారు నెలలుగా తమిళనాడు పరిణామాలనే ఆసక్తిగా పరిశీలిస్తోంది.

తమిళనాట జరుగుతున్న సరికొత్త నాటకంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలు ముగిసాయి. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత ఆరోగ్యంపై దాదాపు రెండున్నర నెలలపాటు ఉత్కంఠ కొనసాగింది. ఆమె ఆరోగ్యవంతురాలిగా బయటకు రావాలని అభిమానులు చేసిన పూజలు నిష్ఫలమై, ఆమె ఈ లోకాన్ని విడిచివెళ్ళారు. ఆమె మరణంతో తమిళనాట ఒక సంచలన ఘట్టం ముగిసింది. ఆమెకు ఆంజనేయ భక్తుడిలాంటి పన్నీరు సెల్వంనే ఆమె స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది.

అయితే జయలలిత మరణించిన రెండు నెలలకే తమిళ రాజకీయాలలో మరో సంచలన సన్నివేశానికి తెరలేచింది. జయలలిత నెచ్చెలి, వివాదాస్పదురాలైన శశికళ సీఎం పీఠంపై కన్నేసింది. ఇప్పటికిప్పుడు పన్నీరుసెల్వంను ముఖ్యమంత్రి పీఠం నుండి దించాల్సిన అవసరం ఏమీ లేకపోయినా, వేగంగా పావులు కదిపింది. పన్నీరును దించి తాను సీఎం కుర్చీ ఎక్కబోతున్నానన్న సంకేతాలు పంపింది. తదనుగుణంగానే తన ఎమ్మెల్యేలను సమావేశపరచి తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేలా చేసింది. పన్నీరు చేత రాజీనామా చేయించింది. ఆయన చేతనే తాను సీఎంగా ప్రతిపాదించుకుంది. కథంతా సాఫీగా సాగిపోతుందిలే అనుకున్న తరుణంలో నాటకంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. వీరవిధేయుడు అడ్డం చెప్పాడు. చెప్పినట్లు బుద్ధిగా నడుచుకుంటాడనుకున్న పన్నీరుసెల్వం అడ్డం తిరిగాడు. 'అమ్మ' సమాధి సాక్షిగా శశికళపై తిరుగుబాటు చేసాడు. తనను బెదిరించి రాజీనామా లేఖ తీసుకున్నారని ఆరోపించారు. వేరు కుంపటి పెట్టాడు. దీంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి అనుకుంటున్న శశికళ గుండెల్లో రాయి పడింది. పన్నీర్‌సెల్వం తిరుగుబాటుతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కూడా ఆచితూచి వ్యవహరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే ఎవర్నీ ఆహ్వానించలేదు. ముఖ్యంగా ఫిబ్రవరి 15వ తేదీన శశికళ అక్రమాస్తుల కేసులో తీర్పు వచ్చే అవకాశముండడంతో ఆ దృష్ట్యా కూడా తొందరపడలేదు. ఈలోపు శశికళ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వారందరిని గోల్డెన్‌ బే రిసార్ట్స్‌కు తరలించి క్యాంప్‌ పెట్టింది. ఒక్కో ఎమ్మెల్యేకు భారీ మొత్తంలోనే డబ్బు ఆశ చూపిందని, కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కువమంది ఆమె వద్దే వున్నారని తెలిసింది.

తలరాతలు మార్చిన తీర్పు!

ఏ సుప్రీం కోర్టు తీర్పు కోసం అయితే గవర్నర్‌ ఎదురు చూసాడో 15వ తేదీ ఆ తీర్పు రానే వచ్చింది. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ళ శిక్ష పడింది. ఇంకేముంది మొత్తం అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ముఖ్యమంత్రి పీఠమెక్కి సచివాలయానికి పోవాలనుకున్న శశికళ జైలుకుపోవాల్సి వచ్చింది. ఆమె కలలు చెదిరిపోయాయి. ఓ పక్క జైలు జీవితం కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఆ మనిషి ఆ రోజంతా కూడా రాజకీయ వ్యూహాల్లోనే గడిపింది. శాసనసభాపపక్ష నేతగా తన స్థానంలో పళనిస్వామిని నియమించింది. తన మేనల్లుడు దినకర్‌ను పార్టీ ఉపకార్యదర్శిగా నియమించింది. జయలలిత సమాధి వద్దకెళ్లి అంజలి ఘటించి ప్రత్యర్థుల పట్ల ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసి జైలుకు బయల్దేరింది. ఇక్కడితో శశికళ సీఎం కలల ఎపిసోడ్‌ ముగిసినట్లయ్యింది.

ఫస్ట్‌క్లాస్‌ సౌకర్యాల కోసమేనా!

తమిళ ప్రజలెవరూ శశికళను సీఎంగా కోరుకోలేదు. ఆమె సీఎం అనే భావం వచ్చేసరికి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది. ఆమెకు రాజకీయ నేపధ్యం లేదు. ప్రజల కోసం పోరా డింది లేదు. జయలలితకు స్నేహితురాలిగా మాత్రమే ఆమె ప్రజలకు తెలుసు. అంతమాత్రాన ప్రజలు జయలలిత స్థానంలో ఆమెను చూడలేరుగా! అయితే ఎమ్మెల్యేల బిర్రుతో ఆమె సీఎం కావడానికి తొందరపడింది. పన్నీరుసెల్వం సీఎం అయ్యిందే రెండునెలల క్రితం. ఇంతలోనే ఆయనను దించేసి శశికళ సీఎం పీఠం ఎక్కా లనుకోవడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. పన్నీర్‌సెల్వం పరిపాలనలో వైఫల్యాలు కూడా ఏమీ లేనప్పుడు ఆయనను తప్పించాల్సిన అవసరం ఏముందనే ఆరోపణలొచ్చాయి. కాని శశికళ సీఎం కావాలను కోవడం వెనుక ఒక బలమైన కారణం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీన అక్రమాస్తుల కేసులో తీర్పు రాబోతుందని ఆమెకు తెలుసు. తీర్పు అనుకూలంగా వస్తే ఇబ్బంది లేదు. అంతా హ్యాపీనే! అదే వ్యతిరేకంగా వస్తే... జైలులోనూ సాధారణ ఖైదీ జీవితమే! అదే సీఎం హోదాలో వుండి జైలు శిక్ష పడితే జైలులో ఆమెను ప్రత్యేకఖైదీగా పరిగణిస్తారు. ఫస్ట్‌క్లాస్‌ వసతులన్నీ ఉంటాయి. ఈ దృష్టితో ఆలోచించే కోర్టు తీర్పుకు ముందే ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలనుకుంది. ప్రమాణస్వీకారం తర్వాత ఒక గంట సీఎంగా వున్నాచాలు... సీఎం సీఎమ్మే... అప్పుడు ఆమెకు జైలులో రాజభోగాలుండేవి. కాని పన్నీరు సెల్వం తిరుగు బాటు, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు వేచిచూసే ధోరణితో శశికళ సాధారణ ఖైదీగా మారిపోయింది.

పన్నీర్‌కే ఛాన్సుండేదా?

ఒకవేళ పన్నీరుసెల్వం తిరుగుబాటు చేయకుండా జయలలిత పట్ల చూపినట్లే శశికళ పట్ల కూడా విధేయత చూపుంటే తిరిగి మళ్ళీ ఆయనకే సీఎం పదవి దక్కి ఉండేది. ఎందుకంటే శశికళకు కూడా ఆయనపై నమ్మకం కుదిరేది. ఓ వారంరోజులు ఆయన సీఎం సీటుకు దూరమై ఉండేవాడంతే! వచ్చే ఎన్నికల దాకా తిరుగులేకుండా సీఎం సీట్లో ఉండేవాడు.

విఫలమైన వ్యూహం

శశికళపై తిరుగుబాటు చేసిన తర్వాత తన వద్దకు కొంతమందైనా ఎమ్మెల్యేలు వస్తారని పన్నీరు భావించారు. అయితే 9మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన శిబిరంలో చేరారు. కనీసం 20మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు వచ్చున్నా డిఎంకె మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశముండేది. తగిన సంఖ్యలో పన్నీరు వెంట ఎమ్మెల్యేలు రాకపోవడం కూడా రాజకీయ అనిశ్చితిలో ఓ భాగమైంది.

సీన్‌ మార్చిన గవర్నర్‌

శశికళ సీఎం కాకూడదన్నది ప్రధాని మోడీ నుండి చాలా మంది టార్గెట్‌! అది నెరవేరింది. ఇప్పుడు తమిళనాడులో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడడం కేంద్రంలోని ఎన్డీఏకు అవసరం. ఇందుకు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది ప్రశ్న? అన్నాడిఎంకె శాసనసభాపక్షనేతగా ఎన్నికైన పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం తప్ప మరోమార్గం లేకుండా పోయింది. తమకు అనుకూలుడైన పన్నీరుసెల్వంను అధికార పీఠంపై కూర్చోబెట్టాలనుకున్నా కూడా, బీజేపీ నాయకులకు అది అసాధ్యంగానే కనిపించింది. పన్నీరు పక్కన 10మందికంటే ఎక్కువ ఎమ్మెల్యేలు లేరు. ఇంకో పక్క డిఎంకె అధినేత స్టాలిన్‌ మాట మార్చాడు. అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో తమ నిర్ణయం ప్రకటిస్తామన్నాడు. అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమిస్తే అటు పళనిస్వామి, ఇటు పన్నీరుల పక్కన మెజార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది. అప్పుడు ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. డిఎంకెకి కావాల్సింది ఇటువంటి వాతావరణమే. ఈసారి ఎన్నికలంటూ జరిగితే జయలలిత లేదు కాబట్టి ఖచ్చి తంగా డిఎంకె లాభపడుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏకు డిఎంకె మద్దతు ఇవ్వదు. కాంగ్రెస్‌కి మద్దతుదారుగా వున్న డిఎంకె అధికా రంలోకి రావడం వల్ల తమకు ఎటువంటి లాభంలేదని భావించిన బీజేపీ నాయకులు తమిళనాడులో అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని నిలబెట్టడానికే నిర్ణయించుకున్నారు. ఈ దిశలోనే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు వున్న పళనిస్వామికి అవకాశం కల్పించారు.

మొత్తం ఎపిసోడ్‌లో బలైపోయింది ఇద్దరు వ్యక్తులే! మొదట గతంలోవున్న కేసుల కారణంగా శశికళ జైలుకుపోగా, ఎవరో చెప్పిన మాటల భరోసాతో శశికళపై తిరుగుబాటు చేసి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన పన్నీర్‌సెల్వం ఈ రాజకీయ డ్రామాలో బలైపోయారని చెప్పవచ్చు. ఒకవేళ శశికళపై ఆయన తిరుగుబాటు చేయకుండుంటే, కొద్దిరోజుల క్రితం వదిలిన సీఎం కుర్చీ తిరిగి ఆయన క్రిందకే వచ్చుండేది!

tamilసమర్ధులైన నాయకులు ఉన్నట్లుండి చనిపోతే ఆయా రాష్ట్రాల పరిస్థితులు ఎంత ఘోరంగా తయారవుతాయన్నదానికి మొన్న ఆంధ్రప్రదేశ్‌ ఒక ఉదాహరణ కాగా, నేడు తమిళనాడు ఇంకో ఉదా హరణగా నిలుస్తోంది. డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి దుర్మరణంతో ఆంధ్రప్రదేశ్‌ స్వరూపమే మారిపోతే, నేడు జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయమే అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.

2009లో సెప్టెంబర్‌ 2న హెలికాఫ్టర్‌ ప్రమాదంలో వై.యస్‌. మరణించకపోయి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉండేది? రాష్ట్ర విభజన జరిగేది కాదు. హైదరాబాద్‌ మన రాజధానిగానే ఉండేది. హైదరాబాద్‌లో మనకు అన్ని అవకాశాలుండేవి. రాష్ట్ర రాజకీయాలు కూడా ఎంతో సాఫీగా నడిచేవి. చంద్రబాబు, కేసీఆర్‌లు ముఖ్యమంత్రులై ఉండేవాళ్లు కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పటిష్టంగానే ఉండేది. జగన్‌ జైలుపాలయ్యేవాడు కాదు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ అనే పార్టీ పుట్టుకొచ్చేది కాదు. కేవలం వై.యస్‌. మరణం వల్లే రాష్ట్రంలో ఇన్ని మార్పులు సంభవిం చాయి. రాష్ట్రం ఇన్ని కష్టనష్టాలకు లోనైంది.

నిన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎదురైన పరిస్థితే ఇప్పుడు తమిళనాడు ఎదుర్కొంటోంది. జయలలిత మరణంతో ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. జయలలిత ఉన్నంతకాలం ఆమె కనుసన్నల్లో నడిచిన అన్నాడిఎంకె పార్టీలో ఇప్పుడు ఆమె లేని లోటు కనిపిస్తోంది. ఆ పార్టీలో సంక్షోభం నెలకొంది. జయలలిత మృతి తర్వాత ఆమె నమ్మినబంటు పన్నీరుసెల్వంను ముఖ్య మంత్రిని చేయడం తెలిసిందే! అయితే పన్నీర్‌ను సీఎంను చేయడంలో కేంద్రప్రభుత్వం కీలకపాత్ర పోషించింది. జయలలిత ప్రభుత్వంలో అవినీతి జమానా నడిపిన శశికళ సీఎం కావడం ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఆరోజు పన్నీర్‌కు పట్టం కట్టించారు. కాని పన్నీర్‌ సీఎం కావడాన్ని శశికళ ఓ పట్టాన జీర్ణించుకోలేకపోయింది. అన్నాడిఎంకెలో జయలలిత తర్వాత స్థానం శశికళదే! ఆ విధంగా ఆమె పట్టు సాధించుకుంది. అన్నాడిఎంకె ఎమ్మెల్యేలను ఆ విధంగా తన గుప్పిట్లో ఉంచుకొంది. పన్నీర్‌ సెల్వంను ఎక్కువకాలం కొనసాగనిస్తే పార్టీపై అతను పట్టు పెంచుకుంటాడన్న అనుమానంతో శశికళ వ్యూహం మార్చింది. కొందరు సీనియర్‌ మంత్రుల చేత శశికళ సీఎం పదవిని చేపట్టాలంటూ ప్రకటన లిప్పించింది. వ్యూహాత్మకంగా పన్నీర్‌సెల్వంను పొయెస్‌గార్డెన్‌కు పిలిపించి అతని చేత రాజీనామా చేయించింది. ఆ తర్వాత ఎమ్మెల్యేల చేత తాను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికైనట్లు ప్రకటించుకుంది. మద్రాసు యూనివర్శిటీ వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఏర్పాట్లు కూడా చేసుకుంది.

అయితే ఇక్కడే రాజకీయం రంగులు మారింది. సీఎం పదవికి సైలంట్‌గా రాజీనామా చేసాడనుకున్న పన్నీర్‌ సెల్వం బాంబు పేల్చాడు. మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి వద్ద ముప్పావుగంట మౌనదీక్ష చేసి, ఆ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని, అమ్మ మృతిపై అనుమా నాలున్నాయని, సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు కోరితే తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని ప్రకటన చేయ డంతో తమిళనాడు రాజకీయాలు వ్యూహాత్మకంగా మలుపు తిరిగాయి. ఈ దశలోనే జయలలిత, శశికళ దోషులుగా వున్న అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు మరో వారంలోపే తీర్పు ఇవ్వబోతోంది. ఈ తీర్పులో శశికళను దోషిగే తేలిస్తే ఇక ఆమె సీఎం పీఠంపై ఆశలు వదులుకోక తప్పదు. ఈ పరిణామాలను ఊహించే శశికళ ముందుగానే ప్రమాణస్వీకారానికి సిద్ధమైంది. అయితే ప్రధాని నరేంద్రమోడీతో పాటు డిఎంకె అధినేత స్టాలిన్‌కు, తమిళనాడులో మెజార్టీ శాతం ప్రజలకు శశికళ సీఎం కావడం ఇష్టంలేదు. వీరంతా కూడా పన్నీర్‌సెల్వంనే సమర్ధించసాగారు. తమిళ సినీ ప్రముఖులు కూడా పన్నీర్‌కే ఎక్కువుగా మద్దతు పలికారు. కాని అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువ మంది శశికళవైపే ఉన్నారు. ఎమ్మెల్యేలు తన చేజారిపోకుండా ఆమె క్యాంపు రాజకీయాలకు తెరతీసారు. ఎమ్మెల్యేలను హోటల్స్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించారు. మరో పక్క పన్నీర్‌సెల్వం చీలిక వర్గానికి డిఎంకె మద్దతు తెలుపు తోంది. పన్నీర్‌సెల్వం శిబిరంలోకి పది నుండి పదిహేనుమంది ఎమ్మెల్యేలు వస్తే చాలు... ఆయన సీఎంగా కొనసాగడం పెద్ద కష్టమేమీ కాదు.

ఈ నెల 9వ తేదీ వరకు పన్నీర్‌సెల్వం, శశికళలలో పీఠం ఎవరికనేదానిపై క్లారిటీ లేదు. ఇక్కడ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు నిర్వహించే పాత్ర కీలకం కాబోతోంది. రాజ్యాంగ ప్రకారం వెళితే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతువున్న శశికళకు రూటు క్లియర్‌ చేయక తప్పదు. అలాకాకుండా కేంద్రం ఆడించినట్లు ఆడితే తమిళ రాజకీయాలు ఇంకొంత కాలం గందరగోళంగానే వుంటాయి. పన్నీర్‌ సెల్వంకే పీఠం అప్పగించాలనుకుంటే గవర్నర్‌ రాజ్యాంగపరమైన విమర్శలను ఎదుర్కోక తప్పదు. ఏదేమైనా ఒకట్రెండు రోజుల్లో తమిళనాట జరుగుతున్న కుర్చీ ఆటకు తెర పడే అవకాశముంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter