pawanజనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యవహారశైలే కాదు, మాటల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు మూలంగా రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబుతో సఖ్యతగా వున్నంతకాలం కూడా పవన్‌కళ్యాణ్‌ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే బలం తమకు లేదని, సత్తా వున్నచోటే పోటీ చేస్తామని చెప్పుకుంటూ వచ్చాడు. అదీగాక, ముఖ్యమంత్రి అయ్యే అనుభవం తనకు లేదని కూడా చెప్పాడు. ఈ లెక్కన చూస్తే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను వైకాపాకు పోకుండా డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు సూచించిన నియోజక వర్గాలలోనే తన పార్టీ అభ్యర్థులను పోటీలోకి దింపుతాడనే ప్రచారం జరిగింది.

ఇటీవలకాలంలో డామిట్‌ కథ అడ్డం తిరిగింది. మనోడే అనుకున్న పవన్‌ కళ్యాణే చంద్రబాబు మీద కావాల్సినంత బురద చల్లాడు. జగన్‌ కంటే పవనే ఇప్పుడు చంద్ర బాబుకు అపాయంగా మారాడు. జగన్‌ తెలిసిన ప్రమాదం. పవన్‌ ఊహించకుండా వచ్చిన ప్రమాదం. చంద్రబాబు మీద జగన్‌ అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కాని నిన్నటిదాకా చంద్రబాబును మోసిన పవన్‌కళ్యాణ్‌ అవినీతి ఆరో పణలు చేస్తే మాత్రం జనం నమ్ముతారు. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని విషయం.

మొన్నటిదాకా బలమున్న చోటే పోటీ చేస్తానన్న పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తానంటున్నాడు. 2009 ఎన్నికల్లో తన అన్న చిరంజీవి పోషించిన పాత్రనే ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ పోషించబోతున్నాడు. చిరంజీవి ప్రజారాజ్యం ఆనాడు ఉమ్మడి ఏపిలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి 18సీట్లను గెలుచుకుంది. ఆరోజు ప్రజారాజ్యం పోటీ వల్ల అసెంబ్లీలో కాంగ్రెస్‌కే నష్టం వాటిల్లింది. అప్పుడు వై.యస్‌. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. కాని కాంగ్రెస్‌ ప్రభుత్వ సానుకూల ఓట్లను ప్రజారాజ్యం కొంతవరకు చీల్చింది. కాబట్టే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ 34లోక్‌సభ సీట్లను గెలిచినా అసెంబ్లీలకొచ్చేసరికి 154స్థానాలకే పరిమితమైంది. లోక్‌సభ స్థానాలతో పోల్చి చూస్తే కనీసం 180 స్థానాలకు తగ్గకూడదు. కాని, కృష్ణా నుండి శ్రీకాకుళం దాకా కాంగ్రెస్‌ అండగా నిలిచే కాపు సామాజికవర్గం ఓట్లు ఆనాడు చిరంజీవి చీల్చాడు.

మరి రేపు పవన్‌ ఎవరి ఓట్లను చీల్చబోతున్నాడన్నది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. 2014 ఎన్నికల్లో పవన్‌ ఓట్లన్నీ తెలుగుదేశంకు పడ్డాయి. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆ ఓట్లే కారణమయ్యాయి. ఈ ఓట్లే రేపు పవన్‌కు పడతాయి. పవన్‌ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆయన ఓట్లు ఈసారి టీడీపీకి పడతాయో లేక వైసిపికి డైవర్ట్‌ అవుతాయో, అదీగాకుంటే రెండు పార్టీల మధ్య చీలుతాయో చెప్పలేని పరిస్థితి. కాని పవన్‌ పోటీ చేస్తే మాత్రం 2014 ఎన్నికల్లో టీడీపీకి పడ్డ పవన్‌ మద్దతుదారుల ఓట్లు ఆయన పార్టీకి డైవర్ట్‌ అవుతాయి. పవన్‌ వల్ల వైసిపి ఓటు చీలడం వుండదు. ఏ విధంగా నష్టం జరిగినా అది తెలుగుదేశంకే!

pkరాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ జేఏసీ నాయకుడు కోదండరామ్‌ రాష్ట్రసాధన లక్ష్యంగా పోరాడితే సమై క్యాంధ్ర జేఏసీ నాయకుడు అశోక్‌బాబు ఉద్యమాన్నే తాకట్టుపెట్టడం చూసాం.

ప్రత్యేకహోదా కోసం, విభజన హామీల అమలు కోసం జేఏసీని ఏర్పాటు చేసినట్లు పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు. జేఏసీ కోసం పార్టీనిపెట్టి ఇక రాజకీయా లలో పోరాడలేనని చేతులెత్తేసిన జయ ప్రకాశ్‌ నారాయణను, మాజీఎంపీ, రాష్ట్రంలోని అన్ని సమస్యలపై మంచి అవగాహన వున్న నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌లను సంప్రదించాడు. ఇద్దరూ మేధావులే! ప్రజాసమస్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించాలన్న తపన ఉన్నవాళ్లే! అయితే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడడానికంటూ పవన్‌కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన జేఏసీలో వీరు భాగస్వాములు కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

పవన్‌కళ్యాణ్‌కు సినిమాలలో వేర్వేరు డైరక్టర్లు వుంటారు. కాని, రాజకీయాల వద్దకొచ్చేసరికి ఆయనకున్న ఏకైక డైరక్టర్‌ చంద్రబాబే! 2014 ఎన్నికల నుండి ఇప్పటిదాకా కూడా చంద్రబాబు చెప్పినట్లే ఆయన వింటూ వచ్చాడు. చంద్రబాబు రమ్మన్నప్పుడల్లా పవన్‌ బయటకొచ్చాడు. ఆయన చెప్పిన చోటల్లా సభలు, రాజకీయ యాత్రలు చేశాడు.

పవన్‌ జేఏసీని పెట్టి ఇప్పుడు చించేస్తాను, ఆరేస్తాను అంటున్నాడు. నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రజలకు అటు కేంద్రం, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయాల మీద అన్యాయాలు చేస్తుంటే ఈ పవన్‌ ఏం పీకాడు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటుంటే, దళితులపై దాడులు జరుగుతుంటే, ప్రభుత్వ ఉద్యోగులనే అధికార పార్టీ నాయకులు జుట్టుపట్టి ఊడ్చి కొడుతుంటే ఈ పవన్‌కళ్యాణ్‌ ఎక్కడికి పోయాడు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కసారైనా ప్రశ్నించాడా? పోనీ ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో నైనా గట్టిగా పోరాడాడా?

ఇతను చంద్రబాబు స్క్రిప్ట్‌ తయారుచేస్తే స్క్రీన్‌ మీదకొస్తాడు. ఆయన డైరక్షన్‌లోనే యాక్షన్‌ చేస్తాడు. ఇక నీ యాక్షన్‌ చాలు అనగానే వెళ్ళిపోతాడు. ఇంతవరకు కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అని పెట్టి ఏం పీకాడు... ఆ తర్వాత జనసేనను స్థాపించి ఏం వెలగబెట్టాడు. రేపు జేఏసీ కూడా అంతే! జేఏసీ అతని బుర్రలో నుండి వచ్చిన ఆలోచనకాదు. ప్రత్యేకహోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే వారందరినీ పవన్‌ వైపు డైవర్ట్‌ చేయడం కోసం చంద్రబాబు వ్రాసిన నాటకమే జేఏసీ. పవన్‌ను నమ్ముకుని జేఏసీ పేరుతో రోడ్ల మీదకు రావడమంటే దేనినో పట్టుకుని గోదారిని ఈదడమే. మేధావులు కూడా ఆలోచించుకోవాలి.

pkరాజకీయాలలో నెగ్గుకు రావాలంటే ముందు నాయకుడికి సొంత వ్యూహం, సొంత అంచనా వుండాలి. ప్రజల నాడి తెలిసి వుండాలి. ప్రజల ఆలోచనలకు తగ్గట్లుగా హామీలు, మేనిఫెస్టోలు తయారు కావాలి. ప్రజల ఆలోచనలను, ఆశలను పసిగట్టలేకపోయాడు కాబట్టే 2014 ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి రాలేకపోయాడు.

ఆనాటి వైఫల్యాలను పునరావృతం కానీయకూడదనే ఉద్దేశ్యంతో రేపటి ఎన్నికల దిశగా ఆయన జాగ్రత్తగా అడుగులు వేయాలనుకుంటున్నాడు. ఆ క్రమంలో తప్పటడుగులు కూడా పడుతున్నాయి. వీటిలో ఒకటే రాజకీయ సలహాదారుగా పెట్టుకున్న ప్రశాంత్‌ కిషోర్‌ను పార్టీ వేదికలెక్కించడం. అతని సలహాలు, సూచనలు, వ్యూహాలు తెరవెనుకకు మాత్రమే పరిమితం కావాలి. అంతేగాని, అతని పనితనం లైవ్‌షో కాకూడదు.

ప్రశాంత్‌కిషోర్‌ మూలంగా ఈసారి ఎన్నికలకు పార్టీకైతే ఒక ఉపయోగముంది. 2014 ఎన్నికల్లో వైకాపా పరాభవానికి ప్రధానకారణాలలో ఒకటి అభ్యర్థుల ఎంపిక. మాట తప్పను, మడమ తిప్పను అంటూ జగన్‌ అప్పట్లో పార్టీలోకి వచ్చిన ద్వితీయశ్రేణి నాయకులందరికీ టిక్కెట్లు ఇచ్చాడు. ఆయా నియోజకవర్గాల్లో సొం తంగా బలముండి, టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తామన్న నాయకులను జగన్‌ పార్టీలోకి తీసుకోలేదు. ఇలాంటి వాళ్ళంతా తెలుగు దేశంలో చేరిపోయారు. నియోజకవర్గా లలో సత్తావున్న నాయకులు టీడీపీ టిక్కెట్లు తెచ్చుకుని గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసిపి నుండి 70మంది గెలిస్తే వారిలో ఎక్కువమంది గెలుపుకు వై.యస్‌. సాను భూతే కారణం. అదే తెలుగుదేశం నుండి వందమంది గెలిస్తే... ఎక్కువ మంది గెలుపుకు వారి వ్యక్తిగత సామర్ధ్యమే కారణం. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్‌ గతంలోలాగే ఎవరికి పడితే వాళ్ళకు టిక్కెట్లిస్తే పరిస్థితిలో పెద్ద మార్పుండదు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి శాశ్వత ఓట్లుంటాయి. సొంతంగా ఓ పదివేల ఓట్లన్నా తెచ్చుకోగల నాయకులను అభ్య ర్థులుగా ఎంపిక చేయాలి. ఇలా చేయా లంటే 175 నియోజకవర్గాలలోనూ వడ పోత మొదలుపెట్టాలి. ఇప్పుడున్న సిటింగ్‌ ఎమ్మెల్యేలలోనూ కొందరిపై వ్యతిరేకత వుంది. అలాంటి వారిని పక్కనపెట్టాలి. ఆయా నియోజకవర్గాలకు ఏ నాయకుడైతే కరెక్టో చూడాలి. అలాగే 2014 ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలు వందకుపైనే వున్నాయి. అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యేల మీద అంతో ఇంతో వ్యతిరేకత వుంటుంది. అక్కడ వైకాపా టిక్కెట్లను ఆశిస్తున్న అభ్య ర్థుల శక్తిసామర్ధ్యాలను అంచనా వేయాలి. కరెక్ట్‌గా ప్రతి నియోజకవర్గానికి గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలి. ఇక్కడ మొహ మాటానికి తావులేదు. ఆయన మనల్ని నమ్ముకుని ముందే పార్టీలోకి వచ్చాడు... ఈయనకు మనం సీటివ్వకపోతే ఇంకెవ రిస్తారనే ఆలోచనలకు తావుండకూడదు. గత ఎన్నికల్లో ఇలాంటి ఆలోచనలు పెట్టు కోబట్టే గెలవాల్సిన సీట్లను కూడా ఓడిపో వాల్సి వచ్చింది. ఎన్నికలంటేనే యుద్ధం. ఇక్కడ గెలవడమే ముఖ్యం. మొహమాటా లకు పోతే అసలుకే ఎసరొస్తుంది. ఇలాంటి మొహమాటాలకు పోతాననే జగన్‌ ఈసారి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా ప్రశాంత్‌కిషోర్‌కు అప్పగించినట్లున్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రశాంత్‌కిషోర్‌ బృందం అభ్యర్థుల ఎంపికపై సర్వే నిర్వహి స్తోంది. ఎన్నికల్లో గెలవలేడు అని రిపోర్ట్‌ వచ్చినవాళ్ళను, జగన్‌కు ఎంత ముఖ్యమైనా సరే ఈసారి మాత్రం పీకి పక్కనపెట్ట డానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter