modiభారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఛాయ్‌వాలా సాధించిన తన అద్భుతాలను చరిత్రగా చదువుకోబోతుంది. ఇది నిజం.

స్వాతంత్య్రానంతరం భారత ప్రజాస్వామ్య దేశంలో మనకు అత్యంత శక్తివంతమైన నాయకులుగా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, స్వర్గీయ ఇందిరాగాంధీలు కనిపిస్తారు. భారత రాజకీయ వ్యవస్థలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసింది, ప్రభంజ నాలు సృష్టించింది వాళ్ళు మాత్రమే! అయితే వీరికి ఒక బేస్‌మెంట్‌ వుంది. నెహ్రూది సంపన్న కుటుంబం. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ఆర్ధిక తోడ్పాటునందించారు. మహాత్మాగాంధీ పోరాటానికి అండగా నిలిచారు. కాబట్టే స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ కాంగ్రెస్‌పార్టీని, భారతదేశాన్ని నెహ్రూ చేతిలో పెట్టాడు. దాంతోపాటే 'గాంధీ' అన్న బ్రాండ్‌ ఇమేజ్‌ను కూడా నెహ్రూ కుటుంబానికి ధారాదత్తం చేశారు. కాంగ్రెస్సే దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందన్న ఓ భావన, అలాగే గాంధీ బ్రాండ్‌ ఇమేజ్‌ నెహ్రూను దేశ రాజకీయాలలో శక్తివంతునిగా నిలిపాయి. ఆయన తర్వాత రాజకీయ వారసురాలిగా వచ్చిన ఇందిరాగాంధీ కూడా అత్యంత శక్తివంతురాలైన నాయకురాలిగా ఎదిగారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అయితే ఇందిరమ్మకు నెహ్రూ రాజకీయ వారసత్వమనే ఒక పునాది వుంది. అందుకు చివరన వున్న 'గాంధీ' అన్న పేరు కూడా వుంది. వీళ్ళిద్దరు కూడా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని శక్తివంతమైన నేతలు కాగలిగారు. అయితే భారత రాజకీయాలలో అవకాశాలను ఉప యోగించుకుని కాదు, అవకాశాలను సృష్టించుకుని దేశమంతా ప్రభంజనం సృష్టించిన అత్యంత శక్తివంతమైన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు ప్రధాని నరేంద్ర మోడీ! నిజంగా ఆయనొక చరిత్ర. ఆయన రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతం. ఆయన వెనుక సంపన్న కుటుంబం లేదు, తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులు కారు, గాంధీజీ వంటి మార్గదర్శకులు లేరు. అయినా ఈరోజు దేశ రాజకీయాలను శాసిస్తున్నాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. ఆయన కుటుంబసభ్యులు ఇప్పటికీ సాదాసీదా పనులే చేసి బ్రతుకుతున్నారు. ఆయనకు బడైనా గుడైనా ఆరెస్సెస్‌ కార్యాలయమే! క్రమశిక్షణతో కష్టపడడం, పోరాడడం, నిజాయితీగా నిలబడడం, సమస్యలను ఎదుర్కోవడం అక్కడ నుండే నేర్చుకున్నాడు. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పార్టీలో వివిధ హోదాలలో పని చేశారు. గుజరాత్‌లో కచ్‌, భుజ్‌ ప్రాంతాలలో భూకంపాలు వచ్చినప్పుడు, సంక్షోభంలో వున్న ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి బీజేపీ అధిష్టానం ఆయనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపింది.

అంతే... అక్కడ నుండి ఆయన వెనుతిరిగి చూసింది లేదు. ముఖ్యమంత్రిగా తన నాయకత్వంలో మూడుసార్లు గుజరాత్‌లో బీజేపీని గెలిపించాడు. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశమంతా తానే అయ్యి ప్రచారం చేశాడు. భారత దేశంలోనే కాదు, ప్రపంచమంతటా కూడా మోడీ మానియాను సృష్టించాడు. 2014 ఎన్నికల్లో మోడీది ప్రభంజనమే! 337 సీట్లతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆమె సానుభూతి పవనాలతో కాంగ్రెస్‌ 400కుపైగా సీట్లు గెలిచింది. అది కేవలం గాలివాటం గెలుపు. కాని 2014లో మాత్రం దేశ ప్రజలు కేవలం మోడీ అనే ఓ శక్తి మీద నమ్మకంతోనే అన్ని సీట్లిచ్చారు.

ఆ ఎన్నికల ద్వారానే మోడీ అంటే ఏమిటో అర్ధమైపోయింది. ఆ తర్వాత ఢిల్లీ, బీహార్‌ ఎన్నికల ద్వారా ఎదురుదెబ్బలు తగిలినా వాటి నుండి తేరుకోవడానికి మోడీకి ఎక్కువ సమయం పట్టలేదు. నిన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదా హరణ. ముఖ్యంగా దేశానికి పెద్దదిక్కులాంటి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 325సీట్లు వస్తాయని ఆ పార్టీ వాళ్ళే అంచనా వేయలేకపోయారు. యూపీలో ఏ పార్టీకీ మెజార్టీ రాదన్న మీడియా సర్వేలన్నీ కూడా పటాపంచలయ్యాయి. 403 సీట్లున్న యూపీలో 325సీట్లు బీజేపీకి దక్కడం ఒక చరిత్ర. అంతకుముందు నెహ్రూ, ఇందిరల హయాంలోనే కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు వచ్చాయి. అది కూడా అప్పుడు ఉత్తరప్రదేశ్‌ విభజన జరగలేదు. 525 అసెంబ్లీ సీట్లుండేవి. ఆ విజయాలతో పోలిస్తే, నేటి మోడీ విజయం చాలా గొప్పది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దనోట్లు రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికలివి. దేశంలోని మిగతా పక్షాలన్నీ పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించాయి. మోడీ చర్యపై విమర్శలు గుప్పించాయి. ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం చేసాయి. కాబట్టి మోడీ నాయకత్వ సమర్ధతకు ఈ ఎన్నికలు ఒక పరీక్షగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీలో మోడీ మీదే వ్యతిరేకత, మోడీ పీఎం సీటుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఎన్నికల్లో మోడీ తన సత్తా చాటాడు. ఒక ప్రధానిగా కాదు, పార్టీ ప్రచారక్‌లా పనిచేశారు. యూపీ మొత్తం తానే అన్నట్లు పని చేశాడు. ఓ పక్క మోడీని నిలువరించడానికి సమాజ్‌వాదీ కాంగ్రెస్‌తో జతకట్టింది. ఇంకో పక్క బీఎస్పీ దళిత ఓటు బ్యాంకు ప్రయోగాలు చేసింది. కుల రాజకీయాలకు కేంద్రబిందువైన యూపిలో మిగతా పార్టీలన్నీ కులం కార్డులను బాగానే ప్రయోగించాయి. మోడీ మాత్రం అభివృద్ధి కార్డును ప్రయోగించారు. పరోక్షంగా 'హిందుత్వ'కార్డును కూడా బయటకు తీసారు. దాని ఫలితంగానే యూపీలో చారిత్రాత్మక విజయం సొంతమైంది. ఒక్క యూపీలోనే కాదు, ఉత్తరాఖండ్‌లో అఖండ విజయం కూడా మోడీ ఇమేజ్‌ను పెంచాయి. అదే సమయంలో మణిపూర్‌, గోవాలలో ప్రభుత్వం ఏర్పాటుకు చాలినన్ని సీట్లు లేకున్నా అప్పటికప్పుడు లౌక్యంగా వ్యవహరించి ఇతర పక్షాల మద్దతుతో అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయించిన మోడీ చాణక్యం కూడా ఆయన తిరుగులేని నాయకత్వ పటిమకు నిదర్శనం. కష్టపడి ఎదగాలనుకునే వారికి, నిజాయితీగా వుంటూ దేశ రాజకీయాలను శాసించాలనుకునే వారికి, నిబద్ధతతో వున్నా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత స్థానం అందుకోవాలనుకునే వారికి 'మోడీ' చరిత్ర ఒక అధ్యయన గ్రంథమే! ఆచరించదగ్గ మార్గమే!

modiదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వస్తే అద్భుతాలు చోటుచేసుకుంటా యని ప్రజలు ఆశించారు. అందుకే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీకి జై కొట్టారు. బీజేపీ శ్రేణులు కూడా మోడీ ప్రచార మాయలో పడ్డాయి. బీజేపీని రెండు సీట్ల నుండి రెండొందల సీట్లకు చేర్చిన అగ్రనేత లాల్‌కిషన్‌ అద్వానీని ప్రధాని రేస్‌ నుండి పక్కనపెట్టాయి. అద్వానీ పట్ల దళ్‌(యు) నేత, బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌కున్న గురుభక్తి ఆయన పెంచి పెద్దచేసిన బీజేపీ నేతలకు లేకుండా పోయింది. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు వేలకోట్లు ఖర్చుపెట్టి సృష్టించిన మోడీ మాయా ప్రపంచంలో బీజేపీ పార్టీ చేరి పోయింది. కాబట్టే 2014 ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థి కాగలిగారు. ఎన్నికల తర్వాత ప్రధాని అయ్యారు. 2014 ఎన్ని కల్లో మోడీ మాయాజాలం లేకున్నా, ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయి వున్నా అధికారం ఎన్డీఏదే! కాకపోతే బీజేపీకి ఒక్క దానికే పూర్తి మెజార్టీ వచ్చి ఉండేది కాదు. మోడీ మార్క్‌ వల్ల బీజేపీకి కొన్ని సీట్లు పెరిగాయంతే! యూపిఏను ఇంటికి పంపించాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్న తరుణంలో ముం దుగా ప్రధాని అభ్యర్థిని ప్రకటిం చకపోయి వున్నా అధికారం ఎన్డీఏ దేననడంలో ఎలాంటి సందేహం లేదు.

మోడీని ప్రధానిని చేస్తే దేశంలో అద్భుతాలు జరుగుతాయనుకున్నారు. నిజంగానే అద్భుతాలు జరుగుతున్నాయి. పెద్దనోట్ల రద్దు వంటి అద్భుతంతో దేశ ఆర్ధిక వ్యవస్థే తలక్రిందులైంది. ఎన్నో వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. మరెన్నో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఈ అద్భుతాలు చూడడానికేనా ఆయనను ప్రధానిని చేసింది.

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశాన్ని స్వర్గధామంలా మారుస్తామని మోడీ చెప్పారు. మోడీ మాటను నమ్మి ప్రజలు నగదు కష్టాలను భరించారు. జనవరి 1వ తేదీన ప్రజలకు ప్రధాని కొత్త సంవత్సర కానుక ఇవ్వబోతున్నారంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఊరించారు. తీరాచూస్తే ఆరోజు తుస్‌మనిపించారు. కనీసం ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లోనైనా పెద్దనోట్ల రద్దుతో స్థంభించిపోయిన ఆర్ధిక వ్యవస్థను తట్టి లేపుతారనుకుంటే, ఆ ఆశ కూడా లేకుండా పోయింది. 1వ తేదీ పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ వ్రేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ పూర్తి నిరాశాజనకంగా వుంది. ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితులు, మినహాయింపులు, తగ్గింపులను ప్రజలు ఆశించారు. అలాగే గృహనిర్మాణ వడ్డీ రేట్లు తగ్గుతాయనుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చే స్టీలు, సిమెంట్‌ ధరలు తగ్గుతాయని ఆశించారు. కాని వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. పెద్దనోట్ల రద్దు తర్వాత దెబ్బతిన్న ఏ వ్యవస్థల్లోనూ తిరిగి ఉత్సాహాన్నిచ్చే రీతిలో ఈ బడ్జెట్‌ లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విభజన సమయంలో యూపిఏ ప్రభుత్వం చేసిన ద్రోహం కంటే కూడా నేటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న మోసమే చరిత్రలో నిలిచిపోయేటట్లుంది. రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ చేసిన ద్రోహాన్ని మరచిపోయారు. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ చేస్తున్న ద్రోహమే రాష్ట్ర ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. ఏపికి ప్రత్యేకహోదా లేదు, విశాఖకు రైల్వేజోన్‌ లేదు, పోలవరంకు ప్రత్యేక కేటాయింపులు లేవు, దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల ఊసే లేదు. ఇక కేంద్రం ఏ విధంగా ఏపిని ఆదుకున్నట్లు? మోడీ బదులు అద్వానీ లాంటి జాతీయ దృక్పథం వున్న నేత ప్రధాని అయ్యుంటే ఏపికి ఈ పరిస్థితి దాపురించేదా? అన్యాయమైన రాష్ట్ర విభజనను ఆరోజే పార్లమెంటులో వ్యతిరేకించాడాయన! బీజేపీ వాళ్లంతా ఆరోజు ఆ పెద్దాయన మాటలు వినుంటే ఈరోజు ఏపికి ఈ గతి పట్టి ఉండేది కాదు. మన రాష్ట్రానికే చెందిన వెంకయ్యనాయుడు లాంటి నేతలు కూడా అద్వానీ మాటలను చెవికెక్కించుకోలేదు. ఏకపక్షంగా విభజన బిల్లుకు ఆమోదం తెలిపి అన్యాయం చేశారు. ఇప్పుడు విభజన బిల్లులోని అంశాలను అమలు చేయకుండా ఇంకోసారి ద్రోహం చేస్తున్నారు. దేశం గురించి, దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆలోచనలు, ఆర్ధిక స్థితిగతులు తెలిసిన అద్వానీయే ప్రధాని అయ్యుంటే పెద్దనోట్ల రద్దు వంటి చర్యలుండేవి కావు. ఇలాంటి నిస్సారమైన బడ్జెట్‌లు ఉండేవి కావు. ఏపికి ఇంత అన్యాయం జరిగేదే కాదు. మోడీ మోడీ అని నెత్తికెక్కించుకున్నదానికి దేశ ప్రజలకు తగిన శాస్తే జరుగుతోంది!

modi blckఏమిటిది?

దేశంలో ఏం జరుగుతోంది? బ్లాక్‌మనీపై అనుకున్నదేమిటి?

ఇక్కడ జరుగుతున్నదేమిటి?

నల్లధనంపై మన అంచనాలేమయ్యాయి?

అసలు నల్లకుబేరులు ఎక్కడికిపోయారు?

కేంద్రప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైంది. నల్లధనం, అవినీతిపై యుద్ధమంటూ పెద్దనోట్లు రద్దు చేసిన కేంద్రంలో నిస్సత్తువ ఆవహించింది. రోజురోజుకూ బ్యాంకుల్లో జమపడుతున్న నోట్ల కట్టలు... సారీ... కరెన్సీ గుట్టలు చూసి కేంద్ర పెద్దలే కళ్ళు తేలేస్తున్నారు. వాళ్లు అనుకున్నదొకటైతే ఇక్కడ జరుగుతున్నదొకటి. పెద్దనోట్ల రద్దు తర్వాత ఫలితాలపై పెట్టుకున్న కలలు కరిగిపోతున్నాయి. డిసెంబర్‌ 30 తర్వాత ప్రజలకు ఏం చేయాలో, వారిలోని ఆవేశాన్ని ఏ విధంగా తగ్గించాలో తెలియని అయోమయ స్థితికి కేంద్రంలోనవుతోంది.

డిసెంబర్‌ 10వ తేదీ నాటికే 12.44లక్షల కోట్ల పాత నోట్లు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో జమపడినట్లు ఆర్‌బిఐ పేర్కొంది. దేశంలో మొత్తం చెలామణిలో వున్న పెద్దనోట్లే 14.60లక్షల కోట్లు. బ్యాంకుల్లో పెద్దనోట్ల జమకు ఇంకా రెండువారాల గడువుంది. టైం దగ్గరపడే కొద్ది మార్కెట్‌లో వున్న మిగతా పెద్దనోట్లు కూడా బ్యాంకులకు చేరడం ఖాయం. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వం అంచనా తప్పడం

ఖాయమనిపిస్తోంది. ప్రభుత్వం మూడు నుండి నాలుగు లక్షల కోట్ల మధ్య నల్లధనం బ్యాంకులకు రాకపోవచ్చునని, బ్యాంకుకు రాని నల్లధనమంతా ప్రభుత్వందే అవుతుందని, అప్పుడు ఆ డబ్బుతో ఎన్నో ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నోట్ల రద్దు ఫలితాలను సగర్వంగా చాటుకోవచ్చని ప్రధాని మోడీ ఆశపడ్డారు. కాని, పరిస్థితి చూస్తుంటే ముడు నాలుగు లక్షల కోట్లు కాదు కదా, మూడు నాలుగు వేల కోట్లు కూడా బయట నిలబడిపోయే అవకాశం లేదు. ఇదే జరిగితే భారత చరిత్రలోనే పెద్దనోట్ల రద్దు ప్రక్రియ పెద్ద అట్టర్‌ఫ్లాప్‌ షో అవుతుంది. భారత ఆర్ధిక వ్యవస్థకు దాదాపు 2లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశముంది. కొత్త కరెన్సీ ముద్రణ, రవాణా ఖర్చులతో పాటు బ్యాంకుల్లో అధిక డిపాజిట్ల మూలంగా వడ్డీల భారం పడనుంది. అలాగే ఈ నవంబర్‌ 8 నుండి డిసెంబర్‌ 30 దాకా పెద్దనోట్ల రద్దు వల్ల సంభవించిన వ్యాపార నష్టాలను, భవిష్యత్‌లో చోటుచేసుకోబోయే నష్టాలను లెక్కలోకి తీసుకుంటే లక్షల కోట్లలోనే ఉంటుంది. వివిధ రంగాల అభివృద్ధి అయితే ఎన్నో ఏళ్లు వెనక్కిపోయినట్లే! ఆర్‌బిఐ ఇప్పటికే జిడిపి రేటును తగ్గించేసింది.

బ్లాక్‌లోకి మళ్ళీ వైట్‌

నల్లధనం బయటకు తేవాలని పెద్దనోట్లు రద్దు చేసి కొత్తగా 2వేల నోట్లు విడుదల చేశారు. కాని ఈ 2వేల కొత్తనోట్లు తిరిగి బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లాయి. దాదాపు 2లక్షల కోట్ల విలువ మేర 2వేల కొత్త నోట్లను ఆర్‌బిఐ విడుదల చేస్తే అందులో లక్షకోట్లకు పైగా కమిషన్‌ పద్ధతి మీద బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఐటి, సిబిఐ దాడుల్లో భారీగా బయటపడుతున్న 2వేల కొత్త నోట్ల కట్టలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అక్రమాలపై కేంద్రం అంచనా వేయలేకపోయింది. బ్యాంకులను పూర్తిగా నమ్మింది. కొత్త నోట్ల పంపిణీకి సంబంధించి ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలంటూ హెచ్చరికలు లేకపోవ డంతో కొత్త నోట్లను బ్లాక్‌లోకి పంపించడంలో బ్యాంకులు ప్రధాన పాత్ర పోషించాయి.

బ్లాక్‌ ఎటుపోయినట్లు?

దేశంలో వున్న పెద్దనోట్లన్నీ బ్యాంకుల్లో జమపడితే మరి దేశంలో నల్లధనం ఎటుపోయినట్లు? అసలు నల్లధనమే లేదా? అన్న ప్రశ్నలు రాకమానవు. దేశంలో నల్లధనం లేకుండాపోలేదు. అయితే దానిని బ్యాంకుల్లో జమ చేయకుండా తగులబెట్టే స్థాయిలో లేదు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ఈ దేశంలో చాలా అవకాశాలున్నాయి. ప్రధాని పెద్దనోట్ల రద్దు ప్రకటించాక, ఈ దేశంలో బంగారం అమ్మకాలు, కొనుగోళ్లు భారీ ఎత్తున జరిగాయి. చాలా నల్లధనం ఇక్కడ మారిపోయింది. అలాగే స్థిరాస్థి లావాదేవీలు జరిగిపోయాయి. ఇంకొంత నల్లధనం ఇక్కడ అడ్జస్ట్‌ అయ్యింది. నోట్ల రద్దుకు ముందు 27కోట్ల జన్‌ధన్‌ ఖాతాలలో గట్టిగా వెయ్యికోట్లు కూడా లేవు. కాని నోట్ల రద్దు తర్వాత ఈ ఖాతాలలో ఇప్పటికే 75వేల కోట్లు చేరాయి. ఇదంతా కూడా బ్లాక్‌మనీనే! ఇక దేశంలో సాలీనా వెయ్యిమందిని తీసు కుంటే వీరిలో ఒక్కరికి బ్లాక్‌మనీ వున్నా ఎక్కువ. ఈ ఒక్కరి వద్ద వున్న నల్లధనాన్ని మిగిలిన 999మందితో అడ్జస్ట్‌ చేసుకోవడం పెద్ద సమస్య కాదు. అంతెందుకు నోట్ల రద్దుకు ముందు దేశంలో వున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో నగదు నిల్వను చూడండి, నోట్ల రద్దు తర్వాత బ్యాంకు బ్యాలెన్స్‌ను చూడమనండి. అంతకుముందు కనీస నగదును ఉంచని ఖాతాల్లో కూడా ఇప్పుడు వేలు, లక్షల రూపాయలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో పేదోళ్లు 90శాతం, ధనికులు 10శాతం మాత్రమే కాబట్టి, ఈ రెండు వర్గాల వారి మధ్య అడ్జస్ట్‌మెంట్‌ కుదిరితే ఈ దేశంలో బ్లాక్‌మనీని వెదికి పట్టడం కష్టమే! ఇప్పుడు అదే జరిగినట్లుగా కనపడుతోంది.

ప్రభుత్వం కింకర్తవ్యం

ప్రధాని ఆశించిన విధంగా నల్లధనం నిలబడకపోతే వెంటనే ఆర్ధిక వ్యవస్థ దిద్దుబాటు చర్యలు తప్పవు. అవినీతి, నల్లధనం నిరోధానికి నగదు రహిత లావాదేవీలు జరపాలన్నా ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. కేవలం డిజిటల్‌, ఆన్‌లైన్‌ లావా దేవీలు నడిపితే కార్పొరేట్‌ వ్యవస్థలు బలపడి దేశంలో సన్న, మధ్య తరగతి వ్యాపారులు దిక్కులేనివాళ్లైపోతారు. కేవలం రిలయన్స్‌, బిగ్‌బజార్‌ వంటి సంస్థలు మాత్రమే బాగుపడతాయి. అందుకని జనవరి నుండైనా విత్‌డ్రా నగదు పెంచక తప్పదు. ఒక స్థాయి నగదు లావాదేవీల వరకు చెక్‌, కార్డులను ప్రవేశపెట్టి, చిన్నచిన్న లావాదేవీలకు కరెన్సీని అనుమతించక తప్పదు.

రియాల్టీకి ఊతమివ్వాల్సిందే!

దేశంలో రియల్‌ఎస్టేట్‌ రంగం పుంజుకున్నాకే దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడింది. ఉపాధి అవకాశాలతో పాటు, దాని అనుబంధ వ్యాపార రంగాలు వృద్ధి చెందాయి. ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది రియల్‌ఎస్టేట్‌ రంగమే! ఇది దెబ్బతింటే దేశ ఆర్ధిక వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. పెద్దనోట్ల రద్దు వల్ల దేశంలో మొదట కుప్పకూలింది రియల్‌ ఎస్టేటే! తిరిగి రియల్‌ఎస్టేట్‌ పట్టాలెక్కకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థకే అది తీరని నష్టం కలిగిస్తుంది. వెనువెంటనే రియల్‌ ఎస్టేట్‌ రంగం కోలుకునే దిశగా కేంద్రం చర్యలు చేపట్టక తప్పదు.

బ్లాక్‌పై అంచనా తప్పింది

దేశంలో నల్లధనాన్ని రెండురకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అతిగా సంపాదించి, సంపాదించిన సొమ్ముకు పన్ను కట్టకుండా దాచుకునేది. రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఇలాంటి డబ్బును కలిగి వుంటారు. కాని ఈ దేశంలో ఎక్కువ మంది రైతులు, చిన్న వ్యాపారులు, కూలీలు వున్నారు. వీరంతా కూడా నెలవారీ సంపాదనలో ఎంతోకొంత కూడబెడు తుంటారు. తమ అవసరాలను త్యాగం చేసి బిడ్డల చదువులు, పెళ్లిళ్ళు, ఆసుపత్రుల ఖర్చులకని పొదుపు చేస్తుంటారు. అలా పొదుపు చేసిన డబ్బును బ్యాంకుల్లో వేయకుండా ప్రైవేట్‌గా వడ్డీలకివ్వడమో, లేదా స్థలాలు, పొలాల రూపంలో దాచుకోవ డమో చేస్తుంటారు. కుటుంబాలకు ఒక నెల ఆదాయం లేనప్పుడు కూడా ఈ పొదుపే వారిని ఆదుకుంటుంది. ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభాలు తలెత్తినప్పుడు కూడా భారతదేశం ఒడిదుడుకులకు లోనుకాకుండా నిలబడిందంటే కారణం భారతీయులలో వున్న పొదుపు మంత్రశక్తి వల్లే!

మొత్తానికి కేంద్రం వూహించిన దానికి భిన్నంగా నోట్ల ప్రయాణం సాగింది. బ్యాంకుల్లో జమపడ్డ భారీ నగదుపై ఆదాయ పన్ను తప్పితే కేంద్రానికి ఇంకే రూపంలోనూ దీని మూలంగా ఆదాయం ఉండేటట్లు లేదు. దేశీయ మార్కెట్‌ను ఫ్రీ చేయకుండా కేంద్రం ఇలాగే బిగించి పడితే ఆర్ధిక ఆటుపోట్లు తప్పవని నిపుణుల అంచనా!

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
  నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter