polavaramపోలవరం జాతీయ ప్రాజెక్టు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉంటే ఒక్క పోలవరంలోనే పనులు ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడేదో మహత్తరమైన అభివృద్ధి జరిగిపోతోందనే ప్రచారంతో అందరి దృష్టీ దానిమీదే పడి 'దిష్టి' తగిలిందే ఏమో!.. మళ్ళీ ఇప్పుడు లేనిపోని వాదవివాదాలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తికావాలని అందరూ ఆశిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్తగా వచ్చిన ఇబ్బందులు పరిస్థితిని మళ్ళీ మొదటికి తీసుకువస్తాయేమోననే ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ ప్రొజెక్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను ఆపాలని కేంద్రం తాజాగా ఆదేశించడంతో పోలవరం..మళ్ళీ 'గోల'వరంగా మారిందా అనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పుడు పోలవరంలో మిగిలిన పనులు యధాతథంగా సాగుతూనే ఉన్నాయి. అయితే, సంబంధిత కాంట్రాక్టర్‌ సరిగా పనిచేయకపోతే కొంత పని తొలగించి టెండర్లు పిలిచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. స్పిల్‌వే కాంట్రాక్ట్‌ పని ఇప్పటిదాకా కేవలం 11 శాతమే పూర్తయింది. పూర్తి కావాల్సిన పనులు చాలానే

ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడున్న కాంట్రాక్టర్‌ను తొలగించడం సరికాదని కేంద్రం భావిస్తూ, కొత్త కాంట్రాక్టర్‌ వస్తే అవసరమైన యంత్రసామగ్రి సమీక రించుకోవడానికి చాలా సమయం పడుతుంది కనుక, ఇప్పుడున్న కాంట్రాక్టర్‌ నుంచి కొత్త కాంట్రాక్టర్‌కు అవసరమైన యంత్రపరికరాల సహకారం అవసరం ఉంటుంది కనుక, ఆ మేరకు ఇప్పటి కాంట్రాక్ట్‌ స్పందన ఏమిటో అడిగితే ఇంతవరకు సమాధానం లేదని, ఒకవేళ కొత్త కాంట్రాక్టర్‌కు ప్రాజెక్టు పను లను అప్పగిస్తే వ్యయభారం ఎంత?.. ఎప్పటికి పూర్తి చేస్తారనే వివరాలను అడిగినా పంపలేదని కేంద్రం పేర్కొంటూ వీటినన్నిటినీ పరిష్కరించేదాకా టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని సూచించింది. ఇందులో అందోళన పడాల్సిందేమిటో అర్ధం కాదు.

పోలవరం అత్యంత భారీ ప్రాజెక్టు. వేలకోట్ల రూపాయలతో పని. కేవలం పునరావాసం భారతమే సుమారు 33వేల కోట్లదాకా ఉందంటే ఎంతటి వ్యయభారంతో కూడుకున్న వ్యవహారమో అర్ధమవుతుంది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. రాష్ట్రానికి ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు సామరస్యంగా పరిశీలించి కేంద్రంతో సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలేగానీ లేనిపోని రాద్ధాంతాలకు దిగినందువల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు.

ముఖ్యమంత్రి వంటివారు లేనిపోని ఉద్వేగాలకు గురైనంత మాత్రాన ఒరిగేదేమీ కూడా ఉండదు. మీదుమిక్కిలి గొడవ పడినందువల్ల అసలు సాధించేదేమీ ఉండదు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంపై తీసుకుంటున్న శ్రద్ధ అభినందించదగినదే కానీ, ప్రతి చిన్న విషయానికీ రాద్ధాంతం చేయడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందన్నది గ్రహించాలి. పోలవరం సాకారం కోసం రాజకీయనేతలందరూ సమిష్టిగా కృషిచేయాలే తప్ప, కేంద్రం పోలవరాన్ని నిలిపేసేందుకు ప్రయత్నిస్తోందన్న భావన కలిగేలా మాట్లాడడం సరికాదు. సంచలనాల కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో, వ్యక్తిగత ప్రచారాల కోసమో పోలవరాన్ని ఎవరూ వేదిక చేసుకోకూడదు. ఎందుకంటే ఇది వేలాదిమంది అన్నదాతలకు, లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టు.

కేంద్రం ఒకసారి దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత, అందుకు అవసరమైన వేలాదికోట్ల నిధులతో ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తుందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని ఆశించవచ్చు. రాజకీయనాయకుల మాటలు వదిలేసి, జలవనరులశాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఇటీవల అన్నమాటలను చూడండి. ''పోలవరం వెళ్ళి చూస్తే మన భావమే మారిపోతుంది. అక్కడ ఎంత వేగంగా పనులు సాగుతున్నాయో అర్ధమవు తుంది. ఈ వేగాన్ని ఎలాగే కొనసాగించేందుకు అందరూ సహకరించాలి' అన్నారాయన. వాస్తవం కూడా ఇదే. పోలవరానికి సంబంధించిన సాంకేతిక సమస్యలను సంబంధిత అధికారులు, నాయకులు పరిశీలించి కేంద్రంతో సామరస్యంగా పరిష్కరించు కుంటే అంతా మంచే జరుగుతుంది. ఏవో వివరాలు పంపమన్నంత మాత్రాన నానా ఆగిత్యం చేయడం ఈ దశలోనే కాదు, ఏ దశలోనూ మంచిది కాదు.

అసలే, అడ్డగోలుగా జరిగిన విభజనతో రాష్ట్రం తీవ్రంగా గాయపడింది. ఆ గాయం నుంచి కోలు కునేందుకు ఎన్నేళ్ళు పడుతుందో చెప్పలేం. విభజనతో రాష్ట్రం పరిస్థితి అంతా అస్తవ్యస్తమైపోయింది. చివరికి రాజధాని నగరం కూడా లేక గుండెకాయ లేని మొండెంలా ఆంధ్ర అల్లాడింది. అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధికర కార్యక్రమాలకు గండి పడింది. పాలనాపరంగా కూడా శతకోటి సమస్యలు. ముఖ్యంగా సాగునీటి కొరతతో రాష్ట్రం అల్లాడుతోంది. సేద్యం పూర్తిగా కుదేలైపోయింది. అలాంటి సమయంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమేరకు ఊరట లభించింది. విభజన గాయంతో

ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో స్వాంతన కలిగించే ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి మేలు చేసింది. ఆ మేరకు పనులు కూడా సాగుతున్నాయి. ఇదంతా శుభపరిణామం. ఈ దశలో పోలవరాన్ని గోలవరంగా చేయడం ఎవరికీ మంచిది కాదు. దేనికైనా తొందరపాటు పనికిరాదు. లేనిపోని విమర్శలు కూడదు. సంయమనం పాటించాలి. ఏదేమైనా సరే, కేంద్రప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయని, అంతా సవ్యంగా జరిగి..వచ్చే ఏడాది చివరినాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మన కళ్ళ ముందు.. ఆ కల సాకారమవుతుందని ఆశిద్దాం!....

polavaramఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు. చిక్కిందే తడవుగా వాళ్ళు ఆయన నెత్తిన పెట్టారు. ఈయన నెలకోసారి అంచనాలు పెంచుకుంటూ పోతుంటే వాళ్ళు సంవత్సరానికోసారి కూడా నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను నేను చేయలేనంటూ చేతులెత్తేసాడు.

గురువారం అసెంబ్లీ సాక్షిగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం తమవల్ల కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక టించి తన నిస్సహాయతను చాటుకున్నారు. ఉన్న నిధులన్నింటిని పుష్కరాలకి, పండుగలకి, సింగపూర్‌ రాజధాని అని తగలేసిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి అయిన పోలవరంను మాత్రం త్రిశంకుస్వర్గంలో పెట్టాడు.

పోలవరం రాష్ట్ర ప్రజానీకానికి వరమే. కాంగ్రెస్‌ ప్రభుత్వం లోని దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి అత్యంత అవసరమైన కాలువల తవ్వకాన్ని ముందుగానే చేయించారు. రెండో టర్మ్‌ కూడా వై.యస్‌. వుం డుంటే పోలవరంకు ఒక రూపం వచ్చివుండేది. ఆయన మర ణంతో ఈ ప్రాజెక్ట్‌ మరుగున పడగా, విభజన సమయంలో మళ్ళీ తెరమీదకొచ్చింది. రాష్ట్ర విభజన హామీలలో పోలవరం ప్రాజెక్ట్‌ ఒకటి. దీనిని పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని విభజన చట్టంలో స్పష్టంగా వుంది. 2014లో అధికారం లోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకహోదాను అటకెక్కించినా పోలవరంను మాత్రం చేస్తామంది. అయితే ప్రత్యేకహోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గుచూపిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతను కూడా తనకే అప్పగించాలని కేంద్రాన్ని కోరాడు. మా నొప్పి మీరు భరిస్తామంటే మాకేం ఇబ్బందని వాళ్ళు అలాగే ఇచ్చేసారు. పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనాలు ఆశించారు. యధేచ్ఛగా అంచనాలు పెంచుకోవచ్చని, అడిగినంత బిల్లులను కేంద్రం పంపిస్తుందని ఆశపడ్డారు. కాని అక్కడ వుండేది మోడీ... ఇసుకలో నూనె పిండే రకం. స్టీలు రేటెంత, సిమెంట్‌ రేటెంత... ఆ ప్రాజెక్ట్‌ కట్టడానికి ఎంత ఖర్చవుతుందన్నది వారికి తెలియకుండా వుం టుందా? ఈ మూడున్నరేళ్లలో పోలవరం అంచనా వ్యయాన్ని 16వేల కోట్ల నుండి 54వేల కోట్లకు తీసుకెళ్లారు. భారీగా అంచనా వ్యయం పెంచడంతో కేంద్రం నిధుల విడుదల విష యంలో ఆచితూచి అడుగులు వేయసాగింది. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం ముందుకు మూడడుగులు, వెనుకకు ముప్పై అడుగులు అన్నట్లుగా మారింది. ఈ మూడేళ్లలో కాపర్‌డ్యాం కూడా కాలేదు. 12వేల కోట్లు ఖర్చుపెట్టామని చంద్రబాబు చెబుతున్నాడు. ఇంకా 42వేల కోట్లు కావాలంటున్నాడు. కేంద్రం ఈయన అడిగినన్ని నిధులు ఇవ్వకపోతుండడంతో ఇప్పుడు నేను చేయలేనంటూ చేతులెత్తేసాడు.

పోలవరం విషయంలో బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేంద్రప్రభుత్వం సరిగా డబ్బులివ్వలేదని టీడీపీ నేతలు నిందను బీజేపీపై వేయాలని చూస్తున్నారు. కేంద్రం కడతానన్న ప్రాజెక్టును నువ్వెందుకు ఒప్పుకున్నావంటూ ప్రతిపక్షాలు చంద్రబాబును వాయిస్తున్నాయి. కేంద్రం నుండి వస్తున్న డబ్బులతో వైకాపా ఎమ్మెల్యేలను కొంటున్నావు... ఇక పోలవరం ఎక్కడ పూర్తి చేస్తావని బీజేపీ నాయకులు చంద్ర బాబుపై దాడి చేస్తున్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు అనవసర అత్యాశకుపోయి రాష్ట్రానికే చేటుతెచ్చాడు. పోలవరాన్ని ప్రజలకు వరంగా కాకుండా శాపంగా మారుస్తున్నాడు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter