tomatoనెల్లూరులో గతంలో ఎప్పుడూ లేనివిధంగా కూరగాయల ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కరువు కాలంలో కూడా ఇంత ధర లెప్పుడూ లేవు. ఏ కూరగాయలైనా సరే ముట్టుకుంటే మండిపో తున్నాయి. 'భలే కొన్నావులే పో'..అంటూ సామాన్యుల వైపు గుర్రు మంటూ క్రూరంగా చూస్తున్నాయి.

వంకాయల బుట్టలో వేలుపెడితే చాలు.. సర్రుమంటుంది ధర. వందరూపాయల కాయితం ఉంటే తప్ప కిలో వంకాయలు రావు. అయినా, ముక్కారు పండే నెల్లూరుసీమలో వంకాయలు వంద రూపాయలు అమ్మడం ఎప్పుడైనా విన్నామా?.. కిలో టమోటాలు 80 నుంచి 100 దాకా అమ్ముతారని కలలోనైనా అనుకున్నామా?... ఒక్క వంకాయలు, టమోటాలే కాదు అన్ని కూరగాయల ధరలూ ఇలాగే భగ్గుమంటున్నాయి. క్యారెట్‌, బీన్స్‌ వగైరాలన్నీ కూడా వందిస్తేనే సంచిలో పడేది. చివరికి బీరకాయలు కూడా కిలో 60 నుంచి 70దాకా ఉంది. 50 రూపాయలు తీసుకెళ్తే బోలెడన్ని కూరగాయలు వచ్చే రోజులు పోయి, 500 తీసుకెళ్ళినా చిన్న సంచీ కూడా నిండని దుస్థితి వచ్చేసింది. ఇది కలికాలమో.. ఆకలి కాలమో తెలియదు కానీ, అన్ని ధరలూ హాయిగా ఆకాశానికి అంటిపోతున్నా, సామాన్యుడు ఈ ధరలతో బతక లేక చస్తున్నా అటు ప్రభుత్వాలు కానీ, ఇటు పాలకులు కానీ పట్టించు కోకపోవడమే దారుణం. ఎప్పటికప్పుడు జనాన్ని ఉద్ధరించేటట్టు ఊక దంపుడు ఉపన్యాసాలే తప్ప, ప్రజలకు నిత్యావసరాలైన వస్తువుల ధరల నియంత్రణకు చేసిందేమీ ఉండడం లేదు. కొంటే కొనండి..లేకుంటే మానుకోండి..అన్నట్లుగా ఎవరికి వారు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. వర్షాల వల్ల తోటలు దెబ్బతిన్నాయని వ్యాపారులు చెప్తున్నప్పటికీ, మార్కెట్లో కొరత లేకుండా కూరగాయలు వస్తూనే ఉన్నాయి. కానీ ధరలు మాత్రమే బోలెడంత పెరుగుతున్నాయి. తూకమైనా సరిగ్గా ఉంటుందా అంటే..అదీ నమ్మకం లేదు. అదేమని అడిగితే లేనిపోని కసుర్లు..విసుర్లు.

కారణాలు ఏమైనా, వంకాయలు కిలో వంద, టమోటాలు కిలో వందరూపాయలు పెట్టి కొనాలంటే సామాన్యులు, పేదలకు సాధ్యమా?.. అని ఆలోచించేవారే లేరు. అంతంత ధరలు పెట్టి కొనాలంటే జరిగే పనేనా?.. మార్కెట్లలో ఉండే ధరలే మండిపోతుంటే, ఇక వీధుల్లో వాడల్లో వుండే చిన్న చిన్న కూరగాయల దుకాణాల్లో ఇదే అదనుగా ఆ ధరలు మరింతగా పెంచేస్తున్నారు. ధర బాగా పెరుగుతుందని తెలిసే కూరగాయలను ముందస్తుగా తెచ్చుకుని, అదనుచూసి ధరలు మరింతగా పెంచి అమ్ముకునే తెలివిగల వ్యాపారులు మరెంతో మంది. ధరెంతున్నా కొనే మారాజులు ఎలాగూ ఉంటారు కాబట్టి వారివారి వ్యాపారాలు జోరుగానే ఉంటున్నాయి కానీ, సామాన్య వినియోగదారులే రోజూ బిక్కముఖంతో దిగాలుపడిపోతున్నారు. కేవలం పది రూపాయలకే వచ్చే కూరగాయలు కూడా ఇప్పుడు 50 పైగానే ధరలు పలుకుతున్నాయి. పచ్చిమిరపకాయలు కిలో 60, ముల్లంగి కిలో 60, అల్లం కిలో 80. కొంటే కొనండి.లేకపోతే పొండి. ఇకపోతే, గోరుచిక్కుడు, మునక్కాయలు, కాకరకాయలు, బీట్రూట్‌ వంటివన్నీ కిలో 40పైమాటే. మొన్న మొన్నటి దాకా 10రూపాయలున్న కొత్తిమీర కట్ట కావాలంటే ఇప్పుడు 20 ఇవ్వాలి. పొదీనా కూడా అంతే. కరేపాకు గతంలో 5 రూపాయలిచ్చినా ఇచ్చేవారు. ఇప్పుడు పది రూపాయలు లేనిదే రావడం లేదు. ఆకుకూరలు, కూరగాయలు పోటాపోటీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలు కూడా నగరంలో ఒక్కో చోట ఒక్కో విధంగానూ, జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగానూ ఉంటాయి. అయితే, ఎక్కడైనా మరింత పెరిగే ధరలే తప్ప తరగడమన్నది ఉండడం లేదు. ఇలా అన్నిటి ధరలూ పెరిగిపోయి సామాన్య, మధ్యతరగతి ప్రజలు, పేదలు నిత్యం నానా అవస్తలు పడుతున్నా పట్టించుకునే నాధులే లేరు. కోట్లాది రూపాయల పథకాలంటూ ప్రజలను మభ్యపెట్టడమే తప్ప, రోజూ కనీసం మంచి కూరలు తినేందుకు కూడా మొహం వాచిపోతున్న పేదల, సామాన్యుల స్థితిగతులను పట్టించుకునేవారే లేరు. రైతుబజార్లంటూ అక్కడక్కడా నామకార్ధం ఉన్నాయే తప్ప వాటి వల్ల సామాన్య జనానికి ఒరిగిందేమీ లేదు. ధరలు ఆకాశానికి అంటిపోయి ప్రజలు విలవిలలాడిపోతున్నా ఒక్క అధికారికి కానీ, నాయకునికి కానీ పట్టడం లేదంటే, వారు ప్రజ లతో ఎంత మమేకం అవుతున్నారో అర్ధమవుతూనే ఉందని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే మా ధ్యేయం..అంటూ గొప్పలు చెప్పుకునే నాయకులు..ప్రజలకు నిత్యసమస్యగా మారిపోయిన కూరగాయల ధరలు ఇంతగా మండిపోతున్నా నిర్లిప్తంగానే ఉండడం ఏమిటని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్లలో ఈ ధరలను పరిశీలిస్తూ, అనూహ్యంగా పెరిగిపోతున్న కూరగాయల ధరలను నియంత్రిస్తూ, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారగణం ఎప్పుడో తనిఖీల పేరుతో హడావిడీ చేయడమే తప్ప ఈ బాధలు అసలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిఎస్టీ వస్తే సామాన్యులకు అవసరమైన వస్తువుల ధరలు పెరగవని, కూరగాయల ధరలు కూడా పెరగవని అనుకున్నవారంతా ఆచరణలో అవి మూడింతలు నాలుగింతలు పెరగడంతో గుండెలు బాదుకుంటు న్నారు. ఏదేమైనా, భగ్గుమని మండిపోతున్న కూరగాయలను కొనలేక పేద, మధ్యతరగతి గృహిణులు పడే వేదన వర్ణనాతీతం. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఈ మండే ధరలపై దృష్టి సారించి బాగా నియంత్రించి, ఈ ధరల బాదుడు నుంచి ప్రజలను వెంటనే ఆదుకోవాల్సి ఉంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…

Newsletter