bjpమీరు జెండాలు పట్టుకుని రావద్దు... మీ పార్టీ స్లోగన్‌లు చేయొద్దు... మీ పార్టీ చిహ్నాల్ని చూపొద్దు... ముస్లిం ఏరియాలలో అసలు తిరగొద్దు... మిత్రపక్షం కాబట్టి మా గెలుపు కోసం కామ్‌గా ప్రచారం చేసుకోండి... నంద్యాల ఉపఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ పట్ల తెలుగుదేశం వైఖరి ఇది.

మరి కాకినాడ కార్పొరేషన్‌ ఎలక్షన్‌కు వచ్చేసరికి... ఇక్కడ తెలుగుదేసం జెండాలతో సమానంగా బీజేపీ జెండాలు కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలతో సమానంగా బీజేపీ కార్యకర్తలు తిరుగుతున్నారు. నగరంలో కమలం చిహ్నాలు సైకిల్‌తో సమానంగా కని పిస్తున్నాయి. మరి మిత్రపక్షమైన బీజేపీ విషయంలో తెలుగుదేశం వాళ్ళు నంద్యాలలో ఒక న్యాయం, కాకినాడలో ఒక న్యాయం ఎందుకు పాటించినట్లు? ఎందుకంటే నంద్యాలలో ముస్లింల ఓట్లు ఎక్కువ. పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసేది కూడా ముస్లింల ఓట్లే! బీజేపీ జెండాలు కనిపిస్తే ముస్లింల ఓట్లు పోతాయేమోనన్న భయంతోనే నంద్యాలలో వాళ్లను జెండాలు పట్టుకోవద్దన్నారు. అదే కాకినాడలో అయితే ముస్లిం ఓట్ల ప్రభావం తక్కువ. అందుకే అక్కడ జెండాలు కనిపించినా ఫర్వాలేదన్నారు. పొత్తు కూడా కుదుర్చు కున్నారు. నంద్యాలలో మీ జెండాలు కనపడనీయొద్దని చంద్రబాబు అంటే సిగ్గు, అభిమానం వున్న మిత్రపక్ష నాయకులెవరైనా... మీరూ వద్దు, మీ పొత్తూ వద్దు అని తెగదెంపులు చేసుకుంటారు. ప్రచారానికి దూరంగా వుండిపోతారు. కాని, ఏపి బీజేపీలో సొంత పార్టీ మీద ంటే కూడా చంద్రబాబు పట్ల భక్తి, విశ్వాసం చూపించే నాయకులు ఎక్కువుగా వున్నారు. వీళ్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల కంటే కూడా చంద్రబాబు ఆదేశాలనే పాటిస్తుంటారు. తమను అందలం ఎక్కించిన బీజేపీ ఏమైపోయినా ఫర్వాలేదు, చంద్రబాబు బాగుంటే చాలు అనుకుంటారు. అందుకే సిగ్గూశరం లేకుండా తమ పార్టీ జెండాలను కనిపించనీయొద్దని చంద్రబాబు చెప్పిన మాటకు తలాడించి అలాగే చేశారు. తమ పార్టీనే చిన్నబుచ్చారు. బీజేపీలో వున్న ఇలాంటి టీడీపీ ఏజంట్ల వల్లే ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎదుగూ బొదుగూ లేకుండాపోయింది.

jagaరాజకీయాలకు ఓ భాష ఉంటుంది. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు ఓ పరిధి ఉంటుంది. నాయకులు మాట్లాడే మాటలు, చేసే విమర్శలు ప్రత్యర్థుల మనస్సులను తాకాలే గాని అవతలి వారి మనస్సులను నొప్పించకూడదు. ప్రజల హృదయాలను స్పందించేలా చేయాలి, ప్రత్యర్థుల అక్రమాలను సంధించాలి. అంతేగాని, మన మాట మనల్ని ఆత్మరక్షణలో పడేలా చేయకూడదు.

రాజకీయాలలో పార్టీలు, ప్రత్యర్థులు మాత్రమే వుండాలి గాని, నాయకుల మధ్య శత్రుత్వాలు ఉండకూడదు. రాజకీయంగా ప్రత్యర్థిని ఓడించాలనుకోవడంలో తప్పులేదు. కాని కక్షలూ కార్పణ్యాలు పెంచుకోవడమే తప్పు!

నాయకులకు విజ్ఞత, విధేయత చాలా ముఖ్యం. మాట తీరు, మంచి పలకరింపు తోనే నాయకులు ప్రజానాయకులుగా ఎదుగుతుంటారు. ఈ క్రమంలో చూస్తే ప్రతిపక్ష నేతగా వున్న వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఇంకా కొన్ని నేర్చుకోవాలనిపిస్తోంది. తనను తాను ఇంకా మార్చుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. మొన్న నంద్యా లలో జగన్‌ పాల్గొన్న బహిరంగ సభ బ్రహ్మాండంగా జరిగింది. ఈ సభలో జగన్‌ ప్రసంగం అద్భుతంగా సాగింది. ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన చేసిన విమర్శలు ప్రజల్లో మంచి స్పందనను కలిగించాయి. వైసిపి అధికారంలోకి వస్తే ఏమేం చేయాలనుకుంటున్నది చెప్పి భవిష్యత్‌పై ఆలోచన వున్న నేతగా తనను తాను నిరూపించుకున్నాడు. ఇక బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసైతే తెలుగు దేశం నాయకుల కళ్లు చెదిరివుంటాయి. అన్నింటికి మించి వైసిపిలో చేర్చుకునే ముందు శిల్పాచక్రపాణిరెడ్డి చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించిన విధానం జగన్‌ ఆచరిస్తున్న రాజకీయ విలువలకు అద్దం పట్టింది. నాలుగు దశాబ్దాల రాజ కీయ అనుభవమున్న చంద్రబాబునాయుడు విలువలకు తిలోదకాలిచ్చి 21మంది వైసిపి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండానే తన పార్టీలో చేర్చుకున్నాడు. వారిలో మళ్ళీ నలుగురికి మంత్రి పదవులిచ్చాడు కూడా! రాజకీయాల్లో కనీస విలువలను కూడా ఆయన పాటించలేదు. రాజకీయంగా ఎనిమిదేళ్ల అనుభవం మాత్రమే వున్న జగన్‌ నీతికి కట్టుబడి శిల్పాచక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించి, నైతికంగా చంద్ర బాబుపై పైచేయి సాధించాడు.

నంద్యాల ఎన్నికల నేపథ్యంలో జగన్‌ అనుసరించిన విధానాలు, ప్రసంగాలలో పేర్కొన్న అంశాలు ప్రత్యర్థులను సైతం ఆకర్షించాయి. అయితే అదే ఆవేశంలో 'నంద్యాల ఉపఎన్నికల్లో సానుభూతి కోసం కుయుక్తులు, కుతంత్రాలు పన్నుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు' అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు సభా కార్యక్రమాన్నంతా హైజాక్‌ చేసాయి. ఒక ముఖ్యమంత్రి గురించి ఒక ప్రతిపక్ష నేత ఇలా వ్యాఖ్యా నించకూడదు. విమర్శలకైనా ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. దానిని ఎవరూ అతిక్ర మించకూడదు. అదేమంటే అసెంబ్లీలో చంద్రబాబు మా అంతు చూస్తామని బెదిరించలేదా? దేవినేని ఉమా ఇలా అన్నాడు... అచ్చెన్నాయుడు అలా అన్నాడు అంటూ వైసిపి నాయకులు ప్రతి విమ ర్శలకు దిగుతున్నారు. వాళ్ళు సభ్యత సంస్కారం మరిచారని, మీరు కూడా వారి బాటపట్టాలా? దేవినేని ఉమ, అచ్చెన్నా యుడులు ఏం మాట్లాడినా జనం పట్టించు కోరు, ఎందుకంటే జనం వాళ్ళ గురించి ఆలోచించరు కూడా! కాని, జగన్‌ మాట్లా డింది జనం ఆలకిస్తారు, ఆలోచిస్తారు. కాబట్టి జనం ముందు మాట్లాడేటప్పుడు ఆచుతూచి మాట్లాడ్డం నేర్చుకోవాలి.

1999 ఎన్నికల వరకు కూడా దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఇదే ఆవేశంతో మాట్లాడేవాడు. చంద్రబాబు మీదకు ఒంటి కాలితో లేచేవాడు. అప్పుడు కూడా ఆయన ఆవేశపూరిత ప్రసంగాలపై విమర్శలు వచ్చాయి. 1999 ఎన్నికల తర్వాత ఆయన తనను తాను మార్చుకు న్నాడు. తనను తాను గొప్ప వక్తగా మలచు కున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక సంధర్భో చితమైన మాటలు, పదాలు, విమర్శలతోనే చంద్రబాబును ఆడుకున్నాడు. గతంతో పోలిస్తే జగన్‌లోనూ చాలా మార్పు కనిపి స్తోంది. ప్రసంగాల విషయంలో ఇం కొంచెం జాగ్రత్త పడడం మంచిది.

pkజగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీకి సిద్ధంగా వున్నారు. కదన రంగంలో ప్రాణాలొడ్డి పోరాడే సైనికుల్లా కార్యకర్తలుంటే వాళ్ళకి దశాదిశా నిర్ధేశించి ముందుకు నడిపించే మేజర్లలా నాయకులున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే. అందరి ధ్యేయం ఒక్కటే. అందరి ఆశ, ఆశయం, ఆకాంక్ష ఒక్కటే! 2019లో వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి. ''రాజన్న'' ఆత్మకు నిజమైన శాంతిని చేకూర్చాలి. మరి ఇలాంటి తరుణంలో ఎవరో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చి ఆయన మార్గదర్శకంలో పార్టీని గెలి పించుకుందాం అని పిలుపునివ్వడం సబబు కాదు.

1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావుకు ఎవరు వ్యూహకర్తలుగా పని చేశారు? ఎవరి సలహాలు లేకుండానే ఆయన ప్రజా ప్రభంజనం సృష్టించలేదా? 1989లో ఎటువంటి రాజకీయ వ్యూహకర్తలు లేకుండానే, కనీసం సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించకుండానే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాలేదా? 2004లో ఎవరి వ్యూహాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది? వ్యూహకర్తలతో విజయం లభించిందా? లేక వై.యస్‌. ఇమేజ్‌తో పార్టీ గెలిచిందా? అంతెం దుకు 2014 ఎన్నికల్లో తన సొంత వ్యూహాలతోనే చంద్రబాబు అధికారంలోకి రాలేదా?

గెలుపు అన్నది ఆ బ్రహ్మ వ్రాసి వుండాలి, లేదా ప్రజలు వ్రాయాలి. లేదంటే మన సొంత కృషితో మనమే తిరగరాయాలి. అంతేగాని, మన పార్టీ గెలుపు కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించడం కరెక్ట్‌ కాదు. ఇప్పుడు దేశమంతటా ఎన్నికలొస్తే ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్‌ కిషోర్‌(పీకే). 2014 ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి మోడీ ప్రధాని అయ్యారు. అలాగే ఆ తర్వాత బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నితీష్‌కుమార్‌కు ఆయన వ్యూహకర్తగా పనిచేశాడు. ఆ ఎన్నికలలోనూ దళ్‌(యూ) ఆర్జేడీ కూటమి ఘనవిజయం సాధించాయి. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌ పేరు మార్మోగిపోయింది. అయితే ఇక్కడ ఆలోచించా ల్సింది... ప్రశాంత్‌ కిషోర్‌ సహకారం లేకపోయి వుంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవదా? బీహార్‌లో దళ్‌(యూ) గెల వదా? ఎవరున్నా లేకున్నా లోక్‌సభలో బీజేపీ గెలుపును, బీహార్‌లో నితీష్‌ గెలుపును ఎవరూ ఆపగలిగేవారు కారు. ఎందుకంటే యూపిఏ ప్రభుత్వాన్ని దించేయాలని ప్రజలు డిసైడైపోయారు. ప్రశాంత్‌కిషోర్‌ లేకున్నా, ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించక పోయి వున్నా ఆ ఎన్నికల్లో అధికారం ఎన్డీఏదే! కాకపోతే మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంవల్ల అధికారం బీజేపీది అయ్యింది. బీహార్‌లోనూ అంతే! నితీష్‌కుమార్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆయన సమర్ధుడైన ముఖ్యమంత్రి. బీహార్‌ను అభివృద్ధి బాట పట్టించాడు. దానికితోడు బలమైన ఓటు బ్యాంకున్న ఆర్జేడీతో పొత్తు వుంది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థిగా వున్న బీజేపీ సమర్ధుడైన సీఎం అభ్యర్థిని చూపలేకపోయింది. మరి బీహార్‌ ప్రజలు నితీష్‌ను కాక ఇంకెవరిని గెలిపిస్తారు? మరి ప్రశాంత్‌కిషోర్‌ రాజకీయ వ్యూహాలు అంత బాగా పనిచేస్తే మొన్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అధికారంలో వున్న సమాజ్‌ వాది పార్టీ ఎందుకు చతికిలపడింది. ఏ పార్టీ వాళ్లయినా రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకోవడంలో తప్పులేదు. అయితే అది పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం కావాలి. ఒక పార్టీ విజయంలో పార్టీ అధినేత నుండి నియోజకవర్గ స్థాయి నాయకులు మొదలుకొని బూత్‌ స్థాయి కార్యకర్తల వరకు అందరికృషి ఉంటుంది. ఏ పార్టీ గెలుపులో అయినా మొదటి భాగస్వాములు కార్యకర్తలే! అంతేగాని, ప్రశాంత్‌ కిషోర్‌ లాంటి వ్యూహకర్తలు కాదు. వ్యూహకర్తలే పార్టీలను అధికారంలోకి తెచ్చే టట్లుంటే భారత రాజకీయ వ్యవస్థను ఇక వాళ్లే శాసించగలరు.

వైకాపా అధ్యక్షుడు జగన్‌, ప్రశాంత్‌కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకుని వుండొచ్చు. కాని అది పార్టీ అంతర్గత సమా వేశాలకే పరిమితమై వుండాలి. అంతేగాని ప్లీనరీ వంటి బహిరంగ వేదికలనెక్కించి, ఆయన పుణ్యాన ఇక మనం అధికారంలోకి రానున్నాం అన్నట్లు మాట్లాడకూడదు. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు ప్రశాంత్‌కిషోర్‌ కంటే జగన్‌కే ఎక్కువ తెలిసుండాలి. ప్రజాసమస్యలపై జగన్‌ స్పందించాలి. వైకాపాకు వేలసంఖ్యలో నాయకులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, కోట్ల సంఖ్యలో ప్రజలు మద్దతుగా వున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా వుంది. ఈ అవకాశాలను అనుకూలంగా మలచుకోవాలి. 2004లో ఎలాంటి ప్రశాంత్‌ కిషోర్‌లు లేకుండానే చంద్రబాబు ప్రభుత్వాన్ని మట్టికరిపించాడు వై.యస్‌.రాజశేఖరరెడ్డి. ఇప్పుడు కావలసింది వ్యూహకర్తలు కాదు, సమన్వయకర్తలు. రాజకీయాలతో సంబంధం లేని వై.యస్‌. కుటుంబ ఆప్తులను జగన్‌ 13జిల్లాల్లో సమన్వయకర్తలుగా పెట్టుకోవాలి. ఇతరులతో సంబంధం లేకుండా ఆ సమన్వయకర్తలతో నేరుగా జగన్‌ సంబంధాలు పెట్టుకోవాలి. గ్రామస్థాయి నుండి ఎక్కడ ఏ లోపాలున్నా వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి జిల్లాలోనూ మారుతున్న సమీకరణలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయగలిగే నిస్వార్ధ వ్యక్తిగత వ్యక్తులని ఆయన 13జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలి. గతంలో వై.యస్‌. చేసింది కూడా ఇదే. ఎక్కడ సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినా వెంటనే స్పందించేవాడు. ఇందుకు ఎన్నో ఉదా హరణలు ''లాయర్‌'' వద్దనే ఉన్నాయి.

''ప్రజలే దేవుళ్ళు... సమాజమే దేవాలయం'' అన్న రామా రావు సిద్ధాంతాన్నే వై.యస్‌. కూడా నమ్మాడు. అందుకే నేరుగా ప్రజల్లోనే మమేకమయ్యాడు. ఎక్కడేం జరుగుతుందో తన ఆంతరంగిక వ్యక్తుల ద్వారా తెలుసుకునేవాడు. ఎక్కడైనా సమస్య ఉంటే పరిష్కరించి పరిస్థితిని తనకు అనుకూలంగా మలచు కునేవాడు. మన రాష్ట్రం గురించి, మన ప్రజల సమస్యల గురించి మనకు అవగాహన వుంటే చాలు, వాటిని పరిష్కరిస్తామని మనం ప్రజలకు నమ్మకం ఇవ్వగలిగితే చాలు... ఎలాంటి ప్రశాంత్‌ కిషోర్‌ల అవసరం లేకుండానే విజయం సొంతమవుతుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మళ్ళీ చెడింది
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
 • యువతకు ఒప్పుకునేనా?
  తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
 • కొండమీద కొత్త రూటు...
  ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
 • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
  ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
 • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
  ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter