అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాలలోనే తమ పార్టీ జెండాను పాతిన బీజేపీ అంతో ఇంతో అనువుగా వుండే ఆంధ్రప్రదేశ్‌ను వదిలిపెడు తుందా? ఈ రాష్ట్రంలో పాతుకుపోవడానికి ప్రయత్నించకుండా వుంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రాను వదిలిపెట్టదు. ఇప్పుడు కాకపోతే రేపు... ఏపిలో పట్టు సాధిస్తామనే ధీమా ఆ పార్టీలో వుంది. రేపు పట్టు సాధించాలంటే ఈరోజే అడుగు వేయడం మొదలుపెట్టాలి.
ఆ దిశగానే బీజేపీ ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా వుండే రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ బలం పెంచుకోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. రెండు ప్రాంతీయపార్టీలలో ఒక పార్టీని తెరమరుగు చేస్తేనే ఆ స్థానంలో జాతీయపార్టీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రణాళికనే బీజేపీ ఏపిలోనూ అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే పొమ్మన కుండానే టీడీపీకి పొగబెట్టి ఎన్డీఏ నుండి ఆ పార్టీని బయటకు నెట్టింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఆశ బీజేపీకి లేదు, కాకపోతే తెలుగుదేశం ఓడిపోవాలనేది వాళ్ళ టార్గెట్! వైసిపి అధికారంలోకి వస్తే జగన్ రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతాడు. అదే చంద్రబాబు మళ్ళీ గెలిస్తే జాతీయ రాజకీయాలలో కూడా బీజేపీకి పుండు అవుతాడు.
టిడిపి ఓడిపోవాలన్నదే లక్ష్యం
రాష్ట్రంలో బీజేపీ బలపడాలి, టీడీపీ బలహీనపడాలి. ఇందుకోసం మొదట తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు అభి మానపాత్రుడిగా వున్న తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును అధ్యక్ష పదవి నుండి తప్పించడం... ఆ పనైపో యింది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా కాపు సామాజికవర్గానికి చెందిన వాళ్ళను పెట్టడం. ఇందులో భాగంగానే సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడి కొండల మాణిక్యాల రావుల పేర్లు తెరమీద కొచ్చాయి. అలాగే ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి పేరు కూడా ప్రధానంగా రేస్‌లో వున్నట్లు తెలుస్తోంది. టీడీపీని నిర్వీర్యం చేసి తాము బలపడాలనేది బీజేపీ అనుసరించనున్న వ్యూహం! ఇం దుకు ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుం టుందో? లేదా కాపు సామాజికవర్గాన్ని మార్గంగా ఎంచుకుంటుందో త్వరలోనే తేలబోతోంది!
నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న అసంతృప్తిని, వ్యతిరేకతను చాలావరకు తగ్గించుకోగలిగారు.
ప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా వైకాపాకు చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేయడం, వెనువెంటనే ఆంధ్రాభవన్ వద్ద నిరాహారదీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ ఐదుగురిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి వయసులో పెద్దోడు. 73ఏళ్ళు. ఆ వయసులో నిరాహారదీక్ష వంటివి ఆయన ఒంటికి పడవు. అయినా పట్టుదలగా కూర్చున్నాడు. రెండోరోజే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ వయసులో కూడా ఆయన నిరాహారదీక్షకు కూర్చోవడం, జగన్ మాటకు కట్టుబడి రాజీనామా చేయడం వంటివన్నీ ఆయనపై ప్రజల్లో వున్న వ్యతిరేకతను చాలావరకు తగ్గించాయని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో సిటింగ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుండింది. కాబట్టే భారీ క్రాస్‌ఓటింగ్ జరిగి, లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీలలో 5 నియోజకవర్గా లలో వైసిపి అభ్యర్థులు గెలిచినా ఈయన కేవలం 13వేల ఓట్లు మెజార్టీతో గెలిచాడు. వ్యతిరేకత లేకుంటే దాదాపు లక్ష ఓట్లు మెజార్టీ వుండాలి. రాబోయే ఎన్నికల్లో ఆయనపై అంతటి వ్యతిరేకత రాకపోవచ్చు. క్రాస్‌ఓటింగ్‌కు ఈసారి ఆస్కారం వుండదు.
తిరుపతి ఎంపీ వరప్రసాద్ మీద ఇటీవలకాలం వరకు ఆయన నియోజకవర్గ పరిధిలో వ్యతిరేకత వుండింది. వైసిపిలో కూడా కొంతమంది నాయకులు ఆయనపై అసంతృప్తితో వున్నారు. అయితే ఇటీవల ప్రత్యేకహోదా విషయంలో వరప్రసాద్ చురుకైన పాత్ర పోషించాడు. లోక్‌సభలో దీనిపై ప్రభుత్వాన్ని కదిలించేలా ప్రసంగిం చాడు. వైసిపి ఎంపీలలో మేకపాటి తర్వాత వయసులో ఆయనే పెద్దోడు. ఆ వయసు లోనూ దీక్షకు కూర్చుని పోరాడాడు. ఏదేమైనా ఈ ఇద్దరు ఎంపీలకు ప్రత్యేకహోదా ఉద్యమం ఒక ఆక్సిజన్‌లాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్. జగన్మోహన్రెడ్డి ముప్పతిప్పలు పెడుతున్నాడు.
వై.యస్.జగన్మోహన్రెడ్డి చంద్రబాబు చేత రోజుకో మాట మాట్లాడిస్తున్నాడు. వారానికో వేషం వేసేలా చేయిస్తున్నాడు. ఇన్నేళ్ళ తన రాజకీయ జీవితంలో చంద్రబాబు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.యస్.రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ప్రతిపక్ష ప్రత్యర్థులను చూసాడు. కాని, జగన్ లాంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎదురుకాలేదు. చంద్రబాబును అసమర్ధ నేతగా అవినీతిపరుడిగా, రోజుకో మాట మార్చే రాజకీయ ఊసరవెల్లిగా, మాట మీద నిలబడని వ్యక్తిగా, పచ్చి అవకాశవాదిగా ప్రజల ముందు నిరూపించడంలో జగన్ చాలావరకు సక్సెస్ అయ్యాడు.
చంద్రబాబుకున్నంత రాజకీయ అనుభవం లేకున్నా, కుట్రలు, వ్యూహాలు పన్నే తెలివితేటలు లేకున్నా... కేవలం ఒకే మాటకు కట్టుబడి ఒకే మార్గాన్ని ఎంచుకుని ఈరోజు ప్రజాక్షేత్రంలో వై.యస్.జగన్ హీరో అయ్యాడు. 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది పక్కనపెడదాం. ప్రస్తుతం ఏపిలో సెగలు రేపుతున్న అంశం ప్రత్యేకహోదా ఉద్యమం. ఈ సబ్జెక్ట్‌లో జగన్ ఏరోజూ మాట తప్పలేదు. నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నది జగనే! ఈ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది జగనే! కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఒకటికి నాలుగుసార్లు చెప్పినా పట్టు విడవకుండా హోదా కోసం పోరాట బాట పట్టింది వైకాపానే! తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఎప్పుడూ పట్టనంతగా గబ్బు పట్టింది ఈ ప్రత్యేకహోదా విషయంలోనే! గతంలో అవినీతి ఆరోపణలు, అక్రమాల సంఘటనలున్నా అవి బయటకు కనిపించేవి కావు. కాని హోదా విషయంలో ఆయన నిజస్వరూపం ప్రజల కళ్ళకు కట్టి నట్లయ్యింది. కేంద్రం ప్రత్యేకహోదా లేదు, ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు సంతోషంగా స్వాగతించింది ఆయనే! ప్రత్యేకప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పిందీ ఆయనే! ప్రత్యేకహోదాపై ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టించింది ఆయనే! నిండు సభలో ప్రత్యేకహోదా వస్తే ఏమొస్తాయయ్యా... హిమాచల్ ఏమయ్యింది... నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో ఏమొచ్చాయి, అక్కడ డెవలప్మెంట్ ఎక్కడుంది అని గద్దించింది ఆయనే! ఇన్ని అన్న ఆయనే ఈరోజు ప్రత్యేకహోదా కావాలంటున్నా, ప్రత్యేకహోదా కోసం సైకిల్‌యాత్రలు, బస్సు యాత్రలు, విమానం యాత్రలు చేయాలంటున్నా దానికి కారణం జగనే! ప్రత్యేకహోదా ఉద్యమం ఇప్పుడొక ఒలింపిక్ రేస్ మాదిరిగా మారింది. మొదటినుండి ఈ పోరాటం జెండా పట్టుకుని నడుస్తున్నది జగనే. తన లోక్సభసభ్యుల చేత రాజీనామాలు చేయించి దీక్షకు కూర్చో బెట్టాడు. ఏపి ప్రజలు జగన్ పోరాటాన్నే నమ్ముతున్నారు. చంద్రబాబు జగన్‌ను కాపీ కొడుతున్నాడనే ప్రచారం వచ్చేసింది. జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే ఈయన కూడా అవిశ్వాస తీర్మానం అన్నాడు. జగన్ నిరాహారదీక్షలు పెడితే ఈయన సైకిల్‌యాత్రలు పెట్టాడు. వైసిపి ఎంపీలు అక్కడ రాజీనామా చేస్తే, తన ఎంపీల చేత ప్రధాని ఇంటి వద్ద డ్రామాలేయించాడు. ఇదంతా చూస్తుంటే ప్రత్యేకహోదా పోరాటంలో జగన్ పాత్ర ఒరిజినల్ గాను, చంద్రబాబు పాత్ర డూప్గాను కనిపిస్తోంది. జగన్ పిల్లకాకి... నా అనుభవం ముందు బచ్చా అని భ్రమపడ్డ చంద్రబాబుకి ఈరోజు ఆ ఒక్కడే... చుక్కలు చూపిస్తున్నాడు.