నంద్యాల ఎన్నికల్లో...

somiముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాల ఉప ఎన్నిక భలే టెన్షన్‌ పెడుతోంది. ఇంతవరకు నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోయినా, చంద్రబాబు మాత్రం ఈ ఎన్నిక కోసం సర్వశక్తు లొడ్డుతున్నాడు. ప్రతిరోజూ రాష్ట్ర పరిపాలన కోసం కేటాయిస్తున్న సమయం కంటే కూడా నంద్యాల కోసం ఆయన కేటాయిస్తున్న సమయం ఎక్కువుగా వుంది. నంద్యాలలో గెలుపు కోసం ఆయన పడని తంటాలు లేవు. స్థానిక ముస్లిం నేత ఫరూక్‌కు ఎమ్మెల్సీ ప్రకటించాడు. కాపుల ఓట్ల కోసం కమ్యూనిటి హాల్‌కు శంకుస్థాపన చేసాడు. 13వేల ఎన్టీఆర్‌ ఇళ్ళు మొదలుపెట్టించాడు. ప్రజలపై వందలకోట్ల హామీలు కుమ్మరిస్తున్నాడు. నంద్యాల

ఉపఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకే గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని, ఆధారాన్ని కూడా ఆయన వదులుకోవడం లేదు. నంద్యాల నియోజకవర్గ పరిధిలో ముస్లింలు, రెడ్లు, వైశ్యులు, కాపులు గెలుపోట ములను శాసిస్తారు. ముస్లింలను కవర్‌ చేయడానికి ఫరూక్‌ను, వైశ్యుల కోసం టి.జి. వెంకటేష్‌ను చంద్రబాబు రంగంలోకి దించారు. ఈ నియోజకవర్గంలో 'రెడ్డి' సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం. పార్టీల పరంగా చూసుకుంటే ఈ సామాజికవర్గంలో దాదాపుగా 70శాతం ఓట్లు వైకాపాకే పోతాయి. అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి పోటాపోటీగా

ఉంటుంది. 'రెడ్డి' సామాజికవర్గం ఓట్ల కోసం మొదట మంత్రులు ఆకే అమర్‌నాథ్‌రెడ్డిని, దేవగుడి ఆదినారాయణరెడ్డిలను నంద్యాల పంపారు. అయితే ఇద్దరు కూడా వైసిపి నుండి వెళ్లిన వాళ్లే కావడంతో వీరి పట్ల వ్యతిరేకత ఏర్పడింది. వీళ్ల వల్ల పార్టీకి ప్రయోజనం కలగకపోగా నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిది ఈ ప్రాంతమే! ఈ ప్రాంతంలో కేశవరెడ్డి బాధితులు పెద్దఎత్తునే వున్నారు. ఆదినారాయణరెడ్డి ప్రచారంలో తిరిగితే కేశవరెడ్డి బాధితులలో తెలుగుదేశంపై వ్యతిరేకత వస్తుంది. ఈ దశలో చంద్రబాబు వీరిద్దరిని నంద్యాలకు దూరం పెట్టాడని తెలుస్తోంది. 'రెడ్డి' వర్గం నుండి భూమా అఖిలప్రియ మంత్రిగా వున్నప్పటికీ నంద్యాలలో రెడ్లపై ఆమె ప్రభావం తక్కువే! అదీగాక వైసిపిలో గెలిచి తెలుగుదేశంలో చేరిందని ప్రజల్లో వ్యతిరేకత వుంది. కాబట్టి 'రెడ్ల' ఓట్ల కోసం చంద్రబాబు ఆమెపై కూడా ఆధారపడలేడు.

తెలుగుదేశం ప్రభుత్వంలో నలుగురు మంత్రులు 'రెడ్లు' వుంటే ముగ్గురు వైసిపి నుండి తెలుగుదేశంలో దూరినోళ్లే! ఏమైనా నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డే ఒరిజినల్‌ తెలుగుదేశం 'రెడ్డి' నాయకుడు. సబ్జెక్ట్‌ వున్నోడు. అవతల వాళ్లకు చెప్పాల్సిన రీతిలో చెప్పి తనవైపు తిప్పుకోగలడు. మొన్న కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే సోమిరెడ్డి టాలెంట్‌పై చంద్రబాబుకు గురి ఏర్పడింది. నంద్యాలలో రెడ్లను ఆకర్షించడానికి సోమిరెడ్డి అయితేనే కరెక్ట్‌ అని చెప్పి చంద్రబాబు ఉపఎన్నికల్లో సోమిరెడ్డి టాలెంట్‌ను బాగానే పిండేస్తున్నాడు.

somiనెల్లూరు నాలుగో నగర సిఐగా వున్న సీతారామయ్యను ఇటీవల విఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్‌ ఐజి సంజయ్‌ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే! సిఐ సీతారామయ్య బదిలీకి సంబంధించి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీద కొందరు బురద చల్లుతున్నారు. జరగనిదానిని జరిగినట్లు, అననిదానిని అన్నట్లు చిత్రీకరిస్తూ సోమిరెడ్డిని వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు.

ఇటీవల నెల్లూరు కోనేరు స్థలంలో కట్టిన రోడ్డు మార్జిన్‌ వ్యాపారుల మార్కెట్‌ సముదాయం ప్రారంభోత్సవానికి ఇతర మంత్రులతో పాటు జిల్లా మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా హాజ రయ్యారు. అయితే మంత్రులు అక్కడకు వచ్చే సమయానికి నాలుగో నగర పరిధిలో ఎక్కడో గొడవ జరుగుతుందనే సమాచారం వచ్చేసరికి ఎస్‌ఐలను ఇక్కడ పెట్టి సిఐ సీతారామయ్య అక్కడకు వెళ్లిపోయాడు. కార్యక్రమానికి వచ్చిన మంత్రికి ప్రోటోకాల్‌ ప్రకారం ఉండాల్సిన సిఐ కనిపించలేదు. మంత్రులు కార్యక్రమం ముగించుకుని వెళ్లబోతుండగా సిఐ సీతారామయ్య అక్క డకు వచ్చాడు. ఏమయ్యా, మంత్రి వస్తే రావాలని తెలియదా అని సోమిరెడ్డి సిఐని నిలదీసాడు. ఫలానా చోట తన్నుకుంటు న్నారని ఫోన్‌ వస్తే వెళ్లాను సార్‌ అని సిఐ చెప్పాడు. అయినా రెండుగంటల సేపు తన్నుకుంటున్నారా... అని సోమిరెడ్డి నిల దీసి, ఆ తర్వాత ఆయన పాటికి ఆయన వెళ్లిపోయి ఐజికి సిఐ వ్యవహారశైలి మీద ఫిర్యాదు చేయడంతో ఆయన బదిలీ జరిగి పోయింది. దీంతో జరిగిన వాదనలకు కొందరు మసిపూసారు. రెండు గంటలు తన్నుకుంటున్నారా అని మంత్రి అన్న మాటను సిఐను తంతానన్నట్లుగా సృష్టించారు.

నెల్లూరుజిల్లా రాజకీయాల్లో అధికా రులను 'తంతాను' అనే సంస్కృతి ఎప్పుడూ లేదు. ఏ పార్టీ నాయకుడైనా సరే అధికా రులతో మర్యాదగానే మాట్లాడతారు. నాయ కులు రాజకీయంగా ఒకరిపై ఒకరు ఎన్ని విమర్శలు చేసుకున్నా అధికారులతో మాత్రం సభ్యతతో వ్యవహరిస్తారు. ఈ జిల్లాలో ఇద్దరు, మగ్గురు నాయకులు తప్ప అధికారుల పట్ల నోటి దురుసుతో వ్యవహ రించే వాళ్లెవరూ లేరు. మంత్రి సోమిరెడ్డి అధికారులపై ఆగ్రహం వచ్చినప్పుడు వారిని మందలించే విధానం సంస్కారవం తంగానే వుంటుందిగాని ఇంత నాటు మాటలతో తిట్టడు. ఈరోజు ఆయన కొత్తగా మంత్రి కాలేదు... అది చూసుకుని మిడిసి పడడానికి. గతంలో రెండు పర్యా యాలు మంత్రిగా పనిచేసినవాడే! మన్న నలు పొందినవాడే! ముఖ్యంగా పోలీసు శాఖలో చాలామంది అధికారులతో ఆయ నకు స్నేహసంబంధాలున్నాయి కూడా! అలాంటి నాయకుడు 'తంతాను' అంటూ ఒక సిఐ మీద నోరు జారడంటే ఆయన గురించి తెలిసిన వారెవరూ నమ్మరు.

ఇక సిఐ సీతారామయ్య గతంలో 5వ నగరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసి నప్పుడు ఎవరి మాటా వినడు ఈ సీతయ్య అన్నట్లు పేరు తెచ్చుకున్నాడు. ఆ స్టేషన్‌ పరిధిలో అరాచక శక్తుల ఆటకట్టించాడు. నాల్గో నగర సిఐగా వచ్చాకే కొద్దిపాటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల్లూరు నాలుగో నగర స్టేషన్‌ అంటే అంతేనేమో!ఎలాంటి ఆఫీసర్‌ అయినా ఇక్కడ ఆరోపణలు ఎదుర్కోక తప్పదు.

somi viveజిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి. వర్గ రాజకీయాల్లో బాగా రాటుదేలిన నాయకుడు. అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు, ఇటు సొంత పార్టీలోని ప్రత్యర్ధులకు ఒకే టైంలో ఒకే నోటితో ఒకే మాటతో సమాధానం చెప్పగలిగిన రాజకీయ ధీశాలి.

వర్గ రాజకీయాలలో ఆరి తేరిన అరివీర భయంకర యోధుడు సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డిలో మొన్న మంత్రి వర్గ విస్తరణ తర్వాత అనూహ్య మార్పువచ్చింది. వర్గ రాజకీ యాల మీద ఆయనకే విరక్తి వచ్చింది. మనలో మనం కొట్టు కుని ఏం సాధించగలమనే ప్రశ్న వచ్చింది. అందుకే మంత్రి కాగానే 'మిర్చి' సినిమాలో ప్రభాస్‌లాగా మారిపోయాడు. సొంత పార్టీలోని శత్రువులను మిత్రులుగా మలచుకునే పనిలో పడ్డాడు. మనిషిని మనిషి ప్రేమిస్తేపోయేదేమీ లేదు... మహా అయితే తిరిగి వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు అనే ప్రభాస్‌ సిద్ధాంతం బాటపట్టాడు. ఈ కోణంలో మొదట సహచర మంత్రి నారాయణనే అభిమానించాడు. మంత్రి కాగానే నారాయణతో ఇప్పటివరకు తనకున్న విభేదాలను తన మైండ్‌గ్యాలరీ నుండి డిలీట్‌చేశాడు. నారాయణను వెంటబెట్టుకుని మీటింగ్‌లలో పాల్గొన్నాడు. నారాయణతో కలిసే వూరేగింపులోనూ పాల్గొన్నాడు. ఈనాటి ఈ బంధమేనాటిదో అన్నట్లు నారాయణతో కలిసిపోయాడు. సోమిరెడ్డి చూపిన ప్రేమ, వాత్సల్యానికి గుండ్రాయిలాంటి నారాయణ గుండె కరిగిపోయింది. 'మిర్చి' సినిమా క్లైమాక్స్‌లో విలన్‌ మంచిమనిషిగా మారిపోయినట్లు నారాయణ కూడా సోమిరెడ్డి స్నేహం ధాటికి మానవత్వం పరిమళించిన మనిషిగా మారిపోయారు.

ఇక సోమిరెడ్డి అభిమానించిన రెండో నాయకుడు ఆనం వివేకానందరెడ్డి. సోమిరెడ్డి అభినందన సభకు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆనం సోదరులు రాలేదు. అయినా సోమిరెడ్డి వారికి దూరం కావాలనుకోలేదు. ఆనం సోదరులతో స్నేహం కావాలనుకున్నాడు. నేరుగా ఆనం వివేకా ఇంటి కెళ్లాడు. జిల్లా రాజకీయాలలో ఇద్దరూ ఇద్దరే! ఒకరికొకరు తీసిపోరు. రాజకీయ నటనలో ఒకరికి నట భీభత్స, ఇంకొకరికి నట విధ్వంస అవార్డులను ఇవ్వొచ్చు. ఎంతో ప్రేమతో తన ఇంటికొచ్చిన సోమిరెడ్డిపై వివేకా కూడా అంతే ప్రేమ చూపించాడు. ఇద్దరూ కలిసి జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అంతం చేద్దామని ప్రతిజ్ఞ చేశారు.

అలాగే సోమిరెడ్డి జిల్లాలో ఇంకా పలువురు తెలుగుదేశం నాయకుల ఇళ్లకు వెళ్లి స్నేహహస్తం అందించి వచ్చారు. త్వరలో ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డిల ఇళ్లకు కూడా వెళ్లి నాయకులు స్నేహంగా వుంటే వచ్చే ఉపయోగాలపై హితబోధ చేయనున్నారు. మొత్తంమీద జిల్లాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే జిల్లా తెలుగుదేశంలో ఎవరినీ ప్రత్యర్ధులుగా చేసుకోకుండా అందరినీ సమన్వయపరచుకుని ముందుకుసాగాలనే ఆలోచనలో సోమిరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
  నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter