నంద్యాల ఎన్నికల్లో...

somiముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాల ఉప ఎన్నిక భలే టెన్షన్‌ పెడుతోంది. ఇంతవరకు నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోయినా, చంద్రబాబు మాత్రం ఈ ఎన్నిక కోసం సర్వశక్తు లొడ్డుతున్నాడు. ప్రతిరోజూ రాష్ట్ర పరిపాలన కోసం కేటాయిస్తున్న సమయం కంటే కూడా నంద్యాల కోసం ఆయన కేటాయిస్తున్న సమయం ఎక్కువుగా వుంది. నంద్యాలలో గెలుపు కోసం ఆయన పడని తంటాలు లేవు. స్థానిక ముస్లిం నేత ఫరూక్‌కు ఎమ్మెల్సీ ప్రకటించాడు. కాపుల ఓట్ల కోసం కమ్యూనిటి హాల్‌కు శంకుస్థాపన చేసాడు. 13వేల ఎన్టీఆర్‌ ఇళ్ళు మొదలుపెట్టించాడు. ప్రజలపై వందలకోట్ల హామీలు కుమ్మరిస్తున్నాడు. నంద్యాల

ఉపఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకే గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని, ఆధారాన్ని కూడా ఆయన వదులుకోవడం లేదు. నంద్యాల నియోజకవర్గ పరిధిలో ముస్లింలు, రెడ్లు, వైశ్యులు, కాపులు గెలుపోట ములను శాసిస్తారు. ముస్లింలను కవర్‌ చేయడానికి ఫరూక్‌ను, వైశ్యుల కోసం టి.జి. వెంకటేష్‌ను చంద్రబాబు రంగంలోకి దించారు. ఈ నియోజకవర్గంలో 'రెడ్డి' సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం. పార్టీల పరంగా చూసుకుంటే ఈ సామాజికవర్గంలో దాదాపుగా 70శాతం ఓట్లు వైకాపాకే పోతాయి. అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి పోటాపోటీగా

ఉంటుంది. 'రెడ్డి' సామాజికవర్గం ఓట్ల కోసం మొదట మంత్రులు ఆకే అమర్‌నాథ్‌రెడ్డిని, దేవగుడి ఆదినారాయణరెడ్డిలను నంద్యాల పంపారు. అయితే ఇద్దరు కూడా వైసిపి నుండి వెళ్లిన వాళ్లే కావడంతో వీరి పట్ల వ్యతిరేకత ఏర్పడింది. వీళ్ల వల్ల పార్టీకి ప్రయోజనం కలగకపోగా నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిది ఈ ప్రాంతమే! ఈ ప్రాంతంలో కేశవరెడ్డి బాధితులు పెద్దఎత్తునే వున్నారు. ఆదినారాయణరెడ్డి ప్రచారంలో తిరిగితే కేశవరెడ్డి బాధితులలో తెలుగుదేశంపై వ్యతిరేకత వస్తుంది. ఈ దశలో చంద్రబాబు వీరిద్దరిని నంద్యాలకు దూరం పెట్టాడని తెలుస్తోంది. 'రెడ్డి' వర్గం నుండి భూమా అఖిలప్రియ మంత్రిగా వున్నప్పటికీ నంద్యాలలో రెడ్లపై ఆమె ప్రభావం తక్కువే! అదీగాక వైసిపిలో గెలిచి తెలుగుదేశంలో చేరిందని ప్రజల్లో వ్యతిరేకత వుంది. కాబట్టి 'రెడ్ల' ఓట్ల కోసం చంద్రబాబు ఆమెపై కూడా ఆధారపడలేడు.

తెలుగుదేశం ప్రభుత్వంలో నలుగురు మంత్రులు 'రెడ్లు' వుంటే ముగ్గురు వైసిపి నుండి తెలుగుదేశంలో దూరినోళ్లే! ఏమైనా నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డే ఒరిజినల్‌ తెలుగుదేశం 'రెడ్డి' నాయకుడు. సబ్జెక్ట్‌ వున్నోడు. అవతల వాళ్లకు చెప్పాల్సిన రీతిలో చెప్పి తనవైపు తిప్పుకోగలడు. మొన్న కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే సోమిరెడ్డి టాలెంట్‌పై చంద్రబాబుకు గురి ఏర్పడింది. నంద్యాలలో రెడ్లను ఆకర్షించడానికి సోమిరెడ్డి అయితేనే కరెక్ట్‌ అని చెప్పి చంద్రబాబు ఉపఎన్నికల్లో సోమిరెడ్డి టాలెంట్‌ను బాగానే పిండేస్తున్నాడు.

somi viveజిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి. వర్గ రాజకీయాల్లో బాగా రాటుదేలిన నాయకుడు. అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు, ఇటు సొంత పార్టీలోని ప్రత్యర్ధులకు ఒకే టైంలో ఒకే నోటితో ఒకే మాటతో సమాధానం చెప్పగలిగిన రాజకీయ ధీశాలి.

వర్గ రాజకీయాలలో ఆరి తేరిన అరివీర భయంకర యోధుడు సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డిలో మొన్న మంత్రి వర్గ విస్తరణ తర్వాత అనూహ్య మార్పువచ్చింది. వర్గ రాజకీ యాల మీద ఆయనకే విరక్తి వచ్చింది. మనలో మనం కొట్టు కుని ఏం సాధించగలమనే ప్రశ్న వచ్చింది. అందుకే మంత్రి కాగానే 'మిర్చి' సినిమాలో ప్రభాస్‌లాగా మారిపోయాడు. సొంత పార్టీలోని శత్రువులను మిత్రులుగా మలచుకునే పనిలో పడ్డాడు. మనిషిని మనిషి ప్రేమిస్తేపోయేదేమీ లేదు... మహా అయితే తిరిగి వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు అనే ప్రభాస్‌ సిద్ధాంతం బాటపట్టాడు. ఈ కోణంలో మొదట సహచర మంత్రి నారాయణనే అభిమానించాడు. మంత్రి కాగానే నారాయణతో ఇప్పటివరకు తనకున్న విభేదాలను తన మైండ్‌గ్యాలరీ నుండి డిలీట్‌చేశాడు. నారాయణను వెంటబెట్టుకుని మీటింగ్‌లలో పాల్గొన్నాడు. నారాయణతో కలిసే వూరేగింపులోనూ పాల్గొన్నాడు. ఈనాటి ఈ బంధమేనాటిదో అన్నట్లు నారాయణతో కలిసిపోయాడు. సోమిరెడ్డి చూపిన ప్రేమ, వాత్సల్యానికి గుండ్రాయిలాంటి నారాయణ గుండె కరిగిపోయింది. 'మిర్చి' సినిమా క్లైమాక్స్‌లో విలన్‌ మంచిమనిషిగా మారిపోయినట్లు నారాయణ కూడా సోమిరెడ్డి స్నేహం ధాటికి మానవత్వం పరిమళించిన మనిషిగా మారిపోయారు.

ఇక సోమిరెడ్డి అభిమానించిన రెండో నాయకుడు ఆనం వివేకానందరెడ్డి. సోమిరెడ్డి అభినందన సభకు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆనం సోదరులు రాలేదు. అయినా సోమిరెడ్డి వారికి దూరం కావాలనుకోలేదు. ఆనం సోదరులతో స్నేహం కావాలనుకున్నాడు. నేరుగా ఆనం వివేకా ఇంటి కెళ్లాడు. జిల్లా రాజకీయాలలో ఇద్దరూ ఇద్దరే! ఒకరికొకరు తీసిపోరు. రాజకీయ నటనలో ఒకరికి నట భీభత్స, ఇంకొకరికి నట విధ్వంస అవార్డులను ఇవ్వొచ్చు. ఎంతో ప్రేమతో తన ఇంటికొచ్చిన సోమిరెడ్డిపై వివేకా కూడా అంతే ప్రేమ చూపించాడు. ఇద్దరూ కలిసి జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అంతం చేద్దామని ప్రతిజ్ఞ చేశారు.

అలాగే సోమిరెడ్డి జిల్లాలో ఇంకా పలువురు తెలుగుదేశం నాయకుల ఇళ్లకు వెళ్లి స్నేహహస్తం అందించి వచ్చారు. త్వరలో ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డిల ఇళ్లకు కూడా వెళ్లి నాయకులు స్నేహంగా వుంటే వచ్చే ఉపయోగాలపై హితబోధ చేయనున్నారు. మొత్తంమీద జిల్లాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే జిల్లా తెలుగుదేశంలో ఎవరినీ ప్రత్యర్ధులుగా చేసుకోకుండా అందరినీ సమన్వయపరచుకుని ముందుకుసాగాలనే ఆలోచనలో సోమిరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.

somiచిత్తూరుజిల్లాలో బొజ్జలను పీకారని తెలుగుతమ్ముళ్ళు వీరంగం... కడప జిల్లాలో వైసిపి నుండి వచ్చిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారని ప్రత్యర్థి వర్గీయుల అలక... కాంగ్రెస్‌ నుండి వచ్చిన నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారని కృష్ణాజిల్లా నేతల నిప్పులు, తమకు మంత్రి పదవులు రాలేదని గుంటూరు తమ్ముళ్ల ఆగ్రహం... అనంతపురం నుండి శ్రీకాకుళం దాకా చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రంలోని 13జిల్లాలకుగాను 12జిల్లాలలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. అనర్హులకు మంత్రిపదవులిచ్చారని, అర్హులను దూరంగా పెట్టారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి... ఒక్క నెల్లూరుజిల్లాలో మాత్రమే అలాంటి వాతావరణం లేదు, సరికదా మంత్రివర్గ విస్తరణ ద్వారా జిల్లాలో తెలుగుదేశంపార్టీకి ఒక సమర్ధవంతమైన నాయకత్వం లభించిందనే సంతోషకర వాతావరణం నెలకొంది. ఆ సంతోషకర వాతావరణానికి ప్రతిరూపమే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ప్రత్యర్థులను, రాజకీయ కుయుక్తులను చిత్తుచేస్తూ తన సమర్ధతే గీటురాయిగా రాజకీయ చాతుర్యమే అస్త్రంగా చంద్రబాబు కొలువులో మంత్రిగా ఆశీనుడైన జనం లీడర్‌... ఈ ఫైటర్‌.

ఎంతోకాలంగా ఊరించి ఊరించి ఎట్టకే లకు ఈ నెల రెండో తారీఖున ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఇప్పుడున్న మం త్రుల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డి, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, కిమిడి మృణాళినిలను తొల గించారు. కొత్తగా 11మందికి చోటు కల్పించారు. చంద్రబాబు తనయుడు, భావి రాజకీయ వారసుడు లోకేష్‌ను మంత్రివర్గం లోకి తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి వచ్చింది. దానివల్లనే లోకేష్‌తో పాటు ఇంకో పది మందికి కూడా మంత్రి పదవులు దక్కాయి. లోకేష్‌ సబ్జెక్టే లేకుంటే చంద్రబాబు ఈ టర్మ్‌లో ఇక మంత్రివర్గ విస్తరణ జరిపి వుండేవాడు కాదు. వీళ్ళకు పదవులూ దక్కేవికావు. నెల్లూరుజిల్లా నుండి తెలుగు దేశం కార్యకర్తలు కోరుకున్నట్లుగానే ఎక్కువ మంది నాయకులు, అందులోనూ సొంత సామాజికవర్గం నాయకులు వ్యతిరేకిం చినా కూడా చంద్రబాబు ఏ మాత్రం ఖాతరు చేయకుండా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, జిల్లాలో పార్టీ ప్రయో జనాలను పరిగణనలోకి తీసుకుని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు తీసుకున్న మంచి నిర్ణయం ఏదన్నా ఉందంటే పార్టీ సీనియర్ల యిన కిమిడి కళావెంకట్రావ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకోవడమే! మిగతా మంత్రుల విష యంలో ప్రతి జిల్లాలోనూ అసమ్మతి జ్వాలలు రేగడం తెలిసిందే!

కీలకశాఖ కేటాయింపు!

ఓ పక్క మంత్రి నారాయణ మోకా లడ్డం పెట్టినా దాటుకుని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సోమిరెడ్డికి అంతగా ప్రాధాన్యత లేని సమాచారశాఖో, పౌర సరఫరాల శాఖో ఇస్తారని భావించారు. కాని క్యాబినెట్‌లోనే అత్యంత కీలకమైన, కోట్లాది మంది అన్నదాతల భవిష్యత్‌తో, బ్రతుకులతో ముడిపడిన వ్యవసాయశాఖను ఆయనకు అప్పగించారు. ఇది ఆషామాషీ శాఖ కాదు. సోమిరెడ్డి సమర్ధతపై చంద్ర బాబు పెట్టుకున్న నమ్మకానికి ఇది నిద ర్శనం. ఈ రాష్ట్రంలో అతిపెద్ద ఓటు బ్యాంకు రైతులే! 2004లో, 2009లో వై.యస్‌.ను అధికారంలోకి తెచ్చింది రైతులే! 2014లో చంద్రబాబుకు అధి కారం కట్టబెట్టింది కూడా రైతులకిచ్చిన ఋణమాఫీ వాగ్దానమే!

రైతుల్లో వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వ మేదీ ఇంతవరకు ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఋణమాఫీ విషయంలో వైఫల్యం చెంది కొంతవరకు రైతులను వ్యతిరేకం చేసుకుంది. రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను రైతుల దృష్టికి తీసుకెళ్ళడంలో ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందనే చెప్పవచ్చు. ఇక ఎన్నికల సీజన్‌ మొదలు కానుంది. రైతుల్లో ప్రభుత్వంపై సాను కూలత పెంచుకోవాలి. రైతుల కోసం చేస్తున్న పనులను చెప్పుకోగలగాలి. రైతాంగం కోసం ఇంకొన్ని కొత్త కార్యక్ర మాలు చేపట్టాలి. కాబట్టి సరైన సమ యంలో సోమిరెడ్డికి వ్యవసాయశాఖను అప్పగించడం ద్వారా చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పవచ్చు.

ఇక మంత్రిగా వ్యవసాయ శాఖను చేపట్టడమంటే అది సోమిరెడ్డికి అదృష్టం. ఒక మంచి అవకాశం కూడా! ఈ జిల్లా నుండి స్వర్గీయ ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిలు వ్యవసాయశాఖ మంత్రులుగా పనిచేసారు. ఈ జిల్లా నుండి వ్యవసాయశాఖ మంత్రి అయిన నాలుగో నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

తండ్రి స్వర్గీయ సోమిరెడ్డి రాజగోపాల రెడ్డి జన్మనిస్తే, రాజకీయ ఓనమాలు నేర్పిన నాయకుడు మేనమామ స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి. తండ్రిలోని విశాల దృక్ప థాన్ని, మేనమామలోని ప్రజా సంబంధాల తత్వాన్ని పుణికి పుచ్చుకున్న సోమిరెడ్డి జిల్లా రాజకీయ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆయనలో మెచ్చుకో దగిన రాజకీయగుణం గెలిచినప్పుడు, పదవులు చిక్కినప్పుడు పొంగిపోయే రకం కాదు... పార్టీ కష్టాల్లో వున్నప్పుడు పక్క దారులు వెదుక్కోలేదు. తన దారి తాను చూసుకోలేదు. పార్టీ కోసం నిలబడ్డాడు, పార్టీకి అండగా నిలిచాడు. జిల్లాలో పార్టీని ముందుకు నడిపించాడు. పార్టీ ఎక్కడకు పొమ్మంటే అక్కడకు పోయాడు. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేసాడు. ఓటములు ఎదురైనా ఓర్పును కోల్పోలేదు. కష్టాలను, ఆర్ధిక నష్టాలను భరించాడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ కేడర్‌ నైరాశ్యంలో వున్నప్పుడు కార్యకర్తలకు గుండె ధైర్యంగా నిలిచి ముందుకు నడి చాడు. కాబట్టి చంద్రమోహన్‌రెడ్డి ఈ జిల్లాలో మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడు, సమర్ధుడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంలో న్యాయం వుంది కాబట్టే మంత్రివర్గ విస్తరణ తర్వాత అన్ని జిల్లాల తెలుగుదేశంపార్టీలో అసంతృప్తి వెల్లు వెత్తినా నెల్లూరుజిల్లా తెలుగుదేశం కేడర్‌లో మాత్రం ఆనందం తాండవిస్తోంది.

Page 1 of 9

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter