balu birtగానగంధర్వుని పుట్టిన రోజంటే..పాటకు పండుగ రోజే. భారతీయ సినిమా గర్వించదగ్గ గాయకుడు, విశ్వవిఖ్యాత గాయకుడు, నెల్లూరు ముద్దుబిడ్డ..మన గానాలపట్టి.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్ర హ్మణ్యం (యస్‌పి బాలూ) జన్మదినోత్సవ వేడుకలు ఈనెల 4న నెల్లూరు పురమరదిర ప్రాంగణంలోని ఆరుబయటవేదికపై అద్వితీయంగా జరిగాయి. పాటల కోయిలమ్మ జానకమ్మ ఈ వేడుకకు విచ్చేసి బాలూని ఆశీర్వదించడం, తన ఉజ్వలభవితకు తొలి ఆశీస్సులందించిన జానకమ్మకు బాలూ సాష్టాంగ ప్రణామం చేసి తన కృతజ్ఞతాపూర్వక నమస్కారాన్ని అందజేయడం, తన మాతృమూర్తి శకుంతలమ్మ నుంచి బాలూ ఆశీస్సులందుకోవడం.. వేదికంతా ఆత్మీయతలు వెల్లివిరిసినట్లయింది. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు విచ్చేసి బాలూతో, జాన కమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం విశేషం. ఇదే సందర్భంలో జానకమ్మ జీవితచరిత్రను లఘుచిత్రంగా ప్రదర్శించడం ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది. అంతేకాక, రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ, నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే ప్రదర్శితమైన ప్ర'యోగా'త్మక నృత్యరూపక ప్రదర్శన.. ఈ వేడుకల్లో ఒక హైలైట్‌గా ఉండి... అందరి కరతాళధ్వను లందుకుంది.

తొలుత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వేదిక వద్దకు రాగానే ప్రేక్షకుల్లో సంతోషం వెల్లివిరిసింది. బాలూ పుట్టినరోజు వేడుకలో తామూ పాల్గొంటున్నామన్న ఆనందం అందరిలోనూ కనిపించింది. శ్రీ విజేత ఆర్ట్స్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలు ఆద్యంతం ఎంతో ఆహ్లాదంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలూ మాట్లాడుతూ, తన పదహారేళ్శ వయసులో 1960-63 ప్రాంతాల్లో గూడూరు కాళిదాస కళానికేతన్‌ వారు నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొన్నప్పుడు, ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన ప్రఖ్యాత గాయని ఎస్‌.జానకి తనను మంచి గాయకుడివవుతావని దీవించారని అన్నారు. మాతృసమానురాలైన ఆ చల్లనితల్లి దీవెనలే తనకు ఇంతటి ఉన్నతస్థానాన్ని తెచ్చాయని బాలూ విన మ్రంగా తెలిపారు. సినీరంగంలో జానకమ్మ పాటలు అద్వితీయమైనవని అంటూ, ఎవరూ పాడలేని ఎంతో కష్టమైన పాటలను కూడా ఆమె అలవోకగా పాడగల దమ్మున్న గాయని అని ఆయన కొనియాడారు. జానకమ్మ ఆశీస్సులు తననెంతగానో ఉన్నతస్థాయికి తీసుకువచ్చాయని, అందుకు కృతజ్ఞతగా సన్మానం చేయాలనుకున్నా ఆమె అంగీకరించకపోవడంతో నమస్కారాన్నే ఆమెకు సత్కారంగా అందజేస్తున్నా నన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎలాంటి అవార్డులు స్వీకరించడం లేదు కనుక, తనపేరిట ఆమెకు ఇవ్వ దలుచుకున్న అవార్డు మొత్తం లక్షరూపాయల నగ దును హైదరాబాద్‌లోని స్పర్శ ఆసుపత్రిలో ఆడియో థియేటర్‌ ఏర్పాటుకు అందజేసినట్లు బాలూ ప్రకటించారు. సంగీతం, సంస్కారం తన సహచరుల వద్ద నుంచి నేర్చుకున్నానని, వారందరి ఆశీస్సులతోనే తను ఇంతవాణ్ణయ్యానని ఆయన అన్నారు. తన గురువు కోదండపాణి పెట్టిన గానభిక్ష వల్లే తాను సినీపరిశ్రమల్లో 53 ఏళ్ళుగా ప్రయాణం సాగిస్తు న్నానన్నారు. మన పరిసరాలను కాపాడుకోవాలని, 'స్వచ్ఛభారత్‌'ను అందరూ అనుసరించాలని బాలూ ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలూ కుటుంబసభ్యులతో పాటు, మురళీకృష్ణ70 ఎం.డి వీరిశెట్టి హజరత్‌బాబు, విజేతా ఆర్ట్స్‌ గౌరవ ఉపాధ్యక్షుడు ఎంవిఎస్‌ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి వై.శేషగిరీశం, కార్యవర్గసభ్యులు ఎస్‌.సుబ్బారావు, వై.విశ్వనాధ్‌, వి.చంద్రశేఖర్‌, డా.ఎం.సుబ్రహ్మణ్యం, జి.ఆదిశేషు, కె.అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.

బాలూకు 'తథాస్తు దేవతల' దీవెనలూ ఉన్నాయి - ఎస్‌.జానకి

గానకోకిల ఎస్‌ జానకి మాట్లాడుతూ, తాను ఎలాంటి పురస్కారాలు స్వీకరించడానికి ఇక్కడికి రాలేదని, బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు కనుక బాలూను ఆశీర్వదించడానికే వచ్చానని అన్నారు. తాను ఆశీర్వదించినందువల్ల మాత్రమే బాలసుబ్రహ్మణ్యంకు ఇంతటి ప్రఖ్యాతి రాలేదని, ఆయన అసాధారణ ప్రతిభే ఆయనో గొప్పగాయకుడిగా రాణించడానికి దోహదం చేసిందన్నారు. బాలూకు ఉన్న తెలివితేటలు, అదృష్టం అన్నీ కలసివచ్చి ఇంతటి స్థాయి లభించిందన్నారు. పట్టుదల, కృషి, మంచి జ్ఞాపకశక్తి ఇవన్నీ బాలూ ప్రతిభకు నిదర్శనాలన్నారు. అయితే తాను ఆశీర్వదించినప్పుడు, బహుశా తథాస్తు దేవతలు కూడా తధాస్తు అనడం వల్ల బాలూ గొప్ప గాయకుడై ఉంటారని ఆమె నవ్వుతూ అన్నారు. గాయకునిగానే కాక, సంగీత దర్శకునిగా, డబ్బింగ్‌ కళాకారునిగా, నటునిగా ఆయన విభిన్న వైశిష్ట్యాలతో ప్రేక్షకులందరినీ మెప్పించారని ఆమె ప్రశంసించారు. సంగీతదర్శకులు చెప్పిన స్వరాలను, వారు ఊహించినదానికంటే గొప్పగా పాడే ప్రతిభాపాటవాలు బాలూకు ఉన్నాయన్నారు. ఆయనకున్న స్వరజ్ఞానం, సంగీతపరిజ్ఞానం అపారమన్నారు. బాలూ సంగీతదర్శకంలోనూ తానెన్నో పాటలు పాడానని, ఆ పాటలు అద్భుతంగా ఉండి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గానప్రస్థానాన్ని వివరించారు. సినీరంగంలో తొలుత తనకు విషాదభరితమైన పాటలు పాడే అవకాశమే లభించిందని, అయితే పుట్టిన బిడ్డ బాగా ఏడ్చిన తర్వాతే జీవితంలో నవ్వుతూ రాణిస్తుంది కనుక, తాను కూడా అదేవిధంగా భావించి ఆ పాటలు పాడి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నానన్నారు.

అబ్బురపరచిన ప్ర'యోగా'త్మక నృత్యరూపకం

తొలుత రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ, నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే ప్రదర్శితమైన ప్ర'యోగా'త్మక నృత్యరూపక ప్రదర్శన ఆద్యంతం ఎంతో అద్భుతంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. ఈ అద్వితీయమైన..అపురూపమైన యోగవిన్యాసాలు జరుగుతున్నంతసేపు ప్రేక్షకులు మైమరచిపోయారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, పవిత్రమైన గంగానదిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాపాడుకోవాలని, స్వచ్ఛభారత్‌ను పాటించాలనే అంశాలను సూచిస్తూ అత్యద్భుతంగా చేసిన యోగా విన్యాసాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. దాదాపు అర్ధగంటకు పైగానే ఈ సాహసవిన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అనంతరం అందరూ ఆ యోగ విన్యాసకులను అభినందిస్తూ చేసిన కరతాళధ్వనులతో పురమందిర ప్రాంగణం మార్మోగింది.

ఇదంతా సాంబమూర్తిగారి పుణ్యమే - విఏకె రంగారావు

బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన భారతీయ సినిమా గాయకునిగా ఎదగడానికి కారణం ఆయన తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తిగారి పుణ్యమేనని, నెల్లూరుతోనూ, బాలూ, జానకమ్మలతో తనకున్న అనుబంధాన్ని ప్రముఖ సంగీత సాహిత్య నృత్య విశ్లేషకులు విఏకె రంగారావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

సంగీతం భగవంతుని భాష - భువనచంద్ర

సంగీతం అనేది భగవంతుని భాష అని, నెల్లూరు నుంచి ఆ సంగీత ప్రవాహం గంగోత్రి ప్రవాహంలా సాగి అందరినీ అలరిస్తోందని బాలూ-జానకమ్మల పాటల ప్రస్థానాన్ని ప్రముఖ సినీకవి భువనచంద్ర ఈ సందర్భంగా వివరించారు.

పాటకు పుట్టినరోజు - వెన్నెలకంటి

ఎస్పీ బాలు పుట్టినరోజు అంటే పాటకు పుట్టిన రోజని, ఇది తెలుగుపాట పుట్టిన రోజని, భారతీయ పాట పుట్టిన రోజని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సినీకవి వెన్నెలకంటి అన్నారు. తనకు సినీపరిశ్రమలో చోటు కల్పించి తనకు అన్నివేళలా చేయూతనిచ్చింది బాలూగారేనని అంటూ, తనకు తల్లితండ్రి గురువు దైవం బాలూ గారేనన్నారు.

ఇదెంతో అపూర్వం... అదృష్టం - జిల్లా ఎస్పీ రామకృష్ణ

సంగీతరంగంలో ఎంతో సుప్రసిద్ధులైన ఎస్‌.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం తన అదృష్టమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. వారి పాటలు ఎంతో సుప్రసిద్ధమైనవన్నారు.

వారి స్వరం... మనకు వరం - తుంగా శివప్రభాత్‌రెడ్డి

బాలూ గంధర్వగానం, జానకమ్మ సమధుర స్వరం ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తుందని, వారి స్వరమే వారికో వరమని 'లాయర్‌' వారపత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి అన్నారు. నిన్నటి తరం, నేటి తరం, భావితరం.. బాలూ, జానకమ్మల పాటలతో తరిస్తున్నారని అన్నారు. గానకోకిల జానకమ్మకు నెల్లూరు మెట్టిన ఊరని, ఫన్‌ డాక్టర్‌ చంద్రశేఖరం గారి కోడలుగా ఆమె నెల్లూరుతో తన అనుబంధాన్ని ముడివేసుకుందన్నారు. భారతీయసినిమా గాయకునిగా బాలూ తన ప్రఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటుకుంటున్నారని, సింహపురికి ఇదెంతో గర్వకారణమని అన్నారు.

బాలూ... అందరికీ ఆదర్శం - విద్యాసాగర్‌

వర్ధమాన సంగీతకారులందరికీ బాలూ ఆదర్శమని, ఆయనకున్న సంగీత పరిజ్ఞానం అమోఘమని ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ అన్నారు. పెద్దలను, చిన్నారులను సైతం గౌరవించే తత్వం బాలూ గారి నుంచి నేర్చుకోవాలన్నారు.

janaki baluనెల్లూరు గానాలపట్టి, భారతీయ సినిమా గర్వించదగ్గ గాయకుడు యస్‌.పి.బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సంబరం జూన్‌ 4న నెల్లూరు టౌన్‌హాల్‌ ఓపెన్‌ ఎయిర్‌ ఆడి టోరియం నందు జరుగనుంది.

తన జన్మదినం సందర్భంగా ఆయన ప్రతియేటా ఇస్తున్న ''యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం'' మరియు లక్ష రూపాయల నగదు బహుమానం ఈ ఏడాది పాటల కోకిలమ్మ యస్‌.జానకికి ఇవ్వాలని నిర్ణయించి ఆమెను సంప్రదించినప్పుడు ఆమె అత్యంత సున్నితంగా తిరస్కరించారు. సన్మానాలు, సత్కా రాలు, పురస్కారాలకు తాను చాలా దూరంగా వుంటున్నానని, బాలు గారిపైనున్న అవ్యాజమైన ప్రేమాభిమానాలకు గుర్తుగా నెల్లూరుకు వచ్చి ఆ వేదికపై నుండి ఆత్మీయ ఆశీర్వచనం అందిస్తానని చెప్పారు. తనకివ్వదలచిన పురస్కారాన్ని ఏదైనా సమాజసేవా కార్యక్రమానికి వినియోగించమని ఆమె బాలు గారిని ఆదేశించారు. ఈ సందర్భంగా యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆమెను గౌరవించుకుంటారు, ఆమె ఆశీస్సులు అందుకుంటారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యస్‌.పి.బాలు మాట్లాడుతూ 1960-63ప్రాంతాల్లో తాను గూడూరు కాళిదాస కళానికేతన్‌ నిర్వహించిన పోటీల్లో పాటలు పాడానని, ఆ పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా విచ్చేసిన ప్రముఖ సినీగాయని ఎస్‌.జానకి మాట్లాడుతూ, తనను దగ్గరకు పిలిచి బాగా ప్రయ త్నిస్తే మంచి గాయకుడివవుతావని ఆశీర్వదించిందని తెలియ జేశారు. మాతృ సమానురాలైన జానకమ్మ ఆశీర్వచనఫలంతో తాను విఖ్యాత గాయకునిగా ఇంత ఉన్నతస్థాయికి ఎదిగానన్నారు. ఇదంతా ఆ చల్లనితల్లి దీవెన లేనని అన్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా సినీపరిశ్రమలో పాటలు పాడుతూ మంచి పేరుప్రతిష్టలు సంపాదించుకున్నానని చెప్పారు. జానకమ్మ ఆత్మీయ ఆశీర్వచనాన్ని స్వీకరించేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. 'నా పాటను అభిమానించి నన్ను గాయకునిగా అత్యున్నతస్థాయికి చేర్చడమే గొప్ప ఆశీస్సు'.. అని బాలూ ఈ సందర్భంగా జానకమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ కళా విమర్శకులు విఏకె రంగారావు, సినీసంగీత దర్శకుడు విద్యాసాగర్‌, సినీకవి భువనచంద్ర, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌, లాయర్‌ వారపత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి, మురళీకృష్ణ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ ఎం.డి వీరిశెట్టి హజరత్‌బాబు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌.జానకి జీవిత చరిత్రపై లఘుచిత్రం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సాంస్కృ తిక కార్యక్రమాల్లో భాగంగా రాజీవ్‌గాంధీ యూనివర్శిటి ఆఫ్‌ నాలెడ్జ్‌ & టెక్నాలజీ ఆధ్వర్యంలో నడిచే నూజివీడు త్రిబుల్‌ ఐ.టిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే సంగీతంతో కలిపిన యోగా నృత్యరూప కాలను ప్రదర్శిస్తారన్నారు.

sp baluగాన గంధర్వుడు.. ప్రఖ్యాత సినీ నేపథ్యగాయకుడు..తన అత్యద్భుతమైన గానంతో తెలుగునేలనే కాక, యావద్భారత దేశాన్ని పులకింపజేస్తున్న పాటల రేడు..సింహపురిసీమ ముద్దుబిడ్డ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) జాతీయస్థాయిలో మరో అరుదైన, ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందుకోనున్నారు.

2016 సంవత్సరానికిగాను కేంద్రప్రభుత్వం ప్రదానం చేసే ఎంతో విశిష్టమైన భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారర (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2016) బాలూకి లభించింది. గోవాలో జరుగనున్న భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) ఉత్సవాల్లో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ పురస్కారంతో పాటు బాలూకి 10లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందజేస్తారు. భారతీయ చలనచిత్ర రంగంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు వున్న అయిదు దశాబ్దాల బంధానికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మంగళవారం ఢిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో వివరిం చారు. అందరూ ఆప్యాయంగా బాలూ అని పిలుచుకునే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి తెలియని భారతీయుడు వుండరని, తెలుగు భాషలోనే కాక తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఆయన సుమారు 40వేలకు పైగానే పాటలు పాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించారని వెంకయ్య నాయుడు అన్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారం, 2011లో పద్మభూషణ్‌ పురస్కారం కూడా ఆయన అందుకున్నారని, ఇంకా పలు జాతీయ అవార్డులు, లెక్కలేనన్ని రాష్ట్రస్థాయి అవార్డులు బాలూకి లభించాయని ప్రశంసించారు. తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో ప్రఖ్యాత నటి వహిదారెహమాన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాలు అందుకున్నారని, ఇప్పుడు ఈ అవార్డు అందుకుంటున్నవారిలో బాలూ నాల్గవ వారని ఆయన అన్నారు. గోవాలో ఈ నెల 20 నుంచి 28వ తేది వరకు జరిగే భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో బాలూ ఈ ప్రఖ్యాతమైన, ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకో నున్నారని ఆయన తెలిపారు.

కాగా, బాలూకి జాతీయస్థాయిలో ఎంతో విశిష్టమైన ఈ అవార్డు లభించడంతో ప్రత్యేకించి సింహపురిసీమవాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఎందరో కళాకారులు, సంగీతాభిమానులు, ఆత్మీయులు బాలూకు ఈ ఘనమైన పురస్కారం లభించడం తెలుగుపాటకు, ప్రత్యేకించి నెల్లూరు పాటకు అత్యద్భుతమైన గౌరవం లభించినట్లేనని ఎంతగానో సంబరపడిపోతున్నారు.

ఆశ్చర్యం..ఆనందం! - ఎస్పీ బాలూ

జాతీయస్థాయిలో ప్రఖ్యాతమైన ఈ పురస్కారం లభించడం నాకెంతో ఆనం దంగా వుంది. పురస్కారం ప్రకటించారని తెలియగానే ఎంతో ఆశ్చర్యపోయాను.. ఆనం దించాను. ఎందరో ప్రముఖులైన నిష్ణాతులు వుండగా, ఆ విశిష్టమైన అవార్డు లభించడం నా అదృష్టం. అయితే, ఈ అవార్డు నా ఒక్క డిదే కాదు. సినిమా రంగంలో, ముఖ్యంగా సంగీత ప్రపంచంలోని అందరికీ ఈ అవార్డు చెందుతుంది. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల భాగస్వామ్యం లేనిదే చలనచిత్రరంగంలో 50 ఏళ్ళకు పైగా కొనసాగడం ఎంతో కష్టసాధ్యం. అన్నిటికీ మించి ఇప్పటికీ నా పాట వింటూ నన్ను ఆశీర్వదిస్తూ ఇంతలా ఎదిగేలా చేసినవారికి నేను ఎల్లవేళలా రుణపడి వుంటానని..ఎస్పీ బాలూ ఎంతో వినమ్రంగా అంటున్నారు. అంతేకాదు, నా ముందు తరం వారు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రోజుల్లో సినీరంగంలోకి వచ్చి ఎందరో ప్రముఖులతో పనిచేస్తూ నేనెన్నో నేర్చుకున్నా. నాలుగు తరాలకు వంతెనగా కొనసాగుతూ నేటికీ పాడటం సంతోషకరం.. అని ఆయన అన్నారు.

ఏదేమైనా, ప్రపంచమంతా చుట్టి తెలుగు భాషకు, పాటకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టిన ఎస్పీ బాలూకి ఈ మహోన్నతమైన అవార్డు లభించడంతో పాటల ప్రపంచంలోని వారే కాక, సామాన్య ప్రజలు సైతం ఎంతో హర్షం ప్రకటిస్తున్నారు. బాలూ పాటకు సెంటినరీ అవార్డు లభిస్తుండడం సింహపురిసీమకే కాదు, తెలుగుజాతికే గర్వకారణం. ఈ శుభ సందర్భంలో బాలూకు 'లాయర్‌' మనసారా శుభాకాంక్షలు. అభివందన..అభినందన శుభచందనాలు.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter