seetaiమోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా!

అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు ఎంతగా విలవిల లాడుతారో ప్రస్తుతం నెల్లూరుజిల్లాలో చూస్తున్నాం. కలెక్టర్‌, ఎస్పీ, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, డిఆర్‌డిఏ పి.డి, తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌, డి.ఇ.ఓ... ఇంకా మరికొందరు... ప్రస్తుతం జిల్లాలో మంచి ఆఫీసర్లే పడ్డారు. కలెక్టర్‌ ముత్యాలరాజు పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముక్కుసూటిగా పనిచేస్తూ అధికారపార్టీ నాయకులతో పెద్దగా పేచీలు రాకుండానే పని చేసుకుంటున్నారు. తన పనితనంతో ముఖ్యమంత్రి మెప్పు కూడా పొందారు.

జిల్లాలో అధికారపార్టీ నాయకులకు మింగుడుపడని అధికారులు జిల్లా ఎస్పీ రామకృష్ణ, నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఢిల్లీరావులు. ఎస్పీ రామకృష్ణ జిల్లాలో బెట్టింగ్‌, ఎర్రచందనం, ఇసుక, సిలికా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. వీటిలో ఎక్కువుగా ఉండేది అధికార పార్టీ నాయకుల అనుచరులే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా నాలుగు రూపాయలు సంపాదించేది ఇక్కడే కదా! ఎస్పీ చర్యలతో అక్రమ రవాణాకు గండి పడి తెలుగుతమ్ముళ్ళు విలవిలలాడుతున్నారు. ఎస్పీ ఇక్కడితో వదిలితేనా? పాత కేసులు కూడా తోడిమరీ బెండు తీస్తున్నాడు. ఎస్పీ దెబ్బకు నియోజకవర్గాలు, మండల స్థాయిలలో డిఎస్పీలు, సి.ఐలు, ఎస్‌.ఐలు కూడా అధికార పార్టీ నాయకుల మాట వినడం లేదు. వారి సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇక్కడే కార్యకర్తల ముందు నాయకులు పలుచనైపోతున్నారు. మండల స్థాయిలో నాయకుల హవా పనిచేసేది పోలీసుస్టేషన్‌ల వద్దే! ఒక ఎస్‌.ఐ స్థాయిలోనే నాయకుడు పనిచేయించుకోలేకపోయాడంటే ఆ నాయకుడి పరపతి ఆ గ్రామాలలో పడిపోయినట్లే! ఈ ఎస్పీ మూలంగా అధికార పార్టీలో వుండి కూడా పోలీసు స్టేషన్‌లలో పనులు చేసుకోలేకపోతున్నా మంటూ టీడీపీ నాయకులు ఆక్రోశిస్తున్నారు. అందుకే కొందరు అధికార నేతలు ఎస్పీపై బహిరంగంగానే తమ అక్కసు వెళ్ళగక్కుతున్నారు.

నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఢిల్లీరావు అంటే కూడా ఇక్కడ అధికారపార్టీలో కొందరు నాయకులకు మింగుడుపడడం లేదు. నగరంలో ఢిల్లీరావు ఎవరి ఒత్తిళ్ళు లెక్కచేయకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఢిల్లీరావుకు మున్సిపల్‌ మంత్రి నారాయణ పూర్తి సహకారం వుంది. ఆక్రమణల తొలగింపు విషయంలో ఎవరి అభ్యంత రాలను పట్టించుకోవద్దని మంత్రి ఆయనకు పూర్తి పవర్‌ ఇచ్చాడు. ఢిల్లీరావు కూడా ఎవరి సిఫార్సులను ఖాతరు చేయడం లేదు. ఆక్రమణల తొలగింపు విషయంలోనే మేయర్‌ అజీజ్‌కు ఆయనకు మధ్య వివాద మొచ్చింది. మేయర్‌, కమిషనర్‌లకు చాలారోజుల నుండే పొసగడం లేదు. తాజాగా నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శీనయ్య కూడా కమిషనర్‌ మీద కత్తి యుద్ధం మొదలుపెట్టారు. అధికారపార్టీ కార్పొరేటర్లలోనే కమిషనర్‌ వ్యతిరేక, అనుకూల గ్రూపులు ఏర్పడ్డాయి. ఇక నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని చూస్తే ఊరుకోబోమంటూ ప్రతిపక్ష వైకాపాతో పాటు టీడీపీ మిత్రపక్షమైన బీజేపీలు వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నాయి. ఇలా ఉన్న ఫళంగా అధికారులను బదిలీచేస్తే నిజాయితీ అధికారులను బదిలీ చేయించారనే చెడ్డపేరొ స్తుందని ఓ పక్క... అలాగని ఉంచుకుంటే తమకే తలనొప్పులు వస్తు న్నాయనే బాధ ఇంకో పక్క..!

మొత్తానికి జిల్లాలోని అధికారపార్టీ నాయకులు నిజాయితీతో ముక్కుసూటిగా పనిచేసే అధికారులతో నలిగిపోతున్నారు.

spజిల్లాలో బెట్టింగ్‌రాయుళ్లను పట్టుకుని ఉతికి ఆరేసిన జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ తాజాగా ఎర్రచందనం స్మగ్లర్లపై కూడా దృష్టిపెట్టారు. చిత్తూరు - కడప జిల్లాల తర్వాత నెల్లూరుజిల్లానే ఎర్ర చందనం స్మగ్లర్లకు పెద్ద అడ్డా! జిల్లాలోని రాజకీయ నాయకులతోనూ స్మగ్లర్లకు సంబంధాలున్నట్లు గతంలోనే బహిర్గతమైంది. 2015లో జిల్లా ఎస్పీగా పనిచేసిన సెంథిల్‌కుమార్‌ ఎర్రచందనం స్మగ్లర్ల పీచమణిచాడు. స్మగ్లర్‌లతో సంబంధాలున్న రాజకీయ నాయకుల బండారాన్ని బయటపెడతాడనుకున్న తరుణంలో ఆయన బదిలీ జరిగింది. ఇప్పుడు రామకృష్ణ కూడా గట్టి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రావడంతోటే సమర్ధవంతంగా పనిచేస్తున్నాడు. మొదట బెట్టింగ్‌ మాఫియాను ఓ కొలిక్కి తెచ్చిన ఆయన ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పడ్డాడు.

గత నెల 27వ తేదీన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కలువాయి, అనంతసాగరం, రాపూరు మండలాల్లో భారీఎత్తున దాడులు జరిపాయి. అంతర్జాతీయ స్మగ్లర్లయిన సంగటి సుబ్బయ్య, దాడినేని సుబ్బయ్యలతో పాటు మరో 19మంది స్థానిక స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. వారి నుండి కోటి రూపాయల విలువచేసే 64ఎర్రచందనం దుంగలను, 11వాహనాలు, 13 సెల్‌ఫోన్‌లు, 2 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరి మీద కొత్తగా అమలులోకి వచ్చిన అటవీశాఖ యాక్ట్‌ క్రింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

28వ తేదీ నెల్లూరు పోలీస్‌గ్రౌండ్‌లోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 2వ తేదీన ఓఎస్‌డి విఠలేశ్వరరావు ఆధ్వర్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీనిని ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 17 ఎర్రచందనం కేసులు నమోదు చేసి 84మందిని అరెస్ట్‌ చేయడం జరిగిందని, సుమారు 10 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 27 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. ఈ కేసుల్లో అంతర్జాతీయ స్మగ్లర్లయిన చైనాకు చెందిన ఓయుహుష్‌, నేపాల్‌కు చెందిన సోనం టోప్‌జ్యాల్‌, రీతూపాండే, టిబెట్‌కు చెందిన టెంపాల్‌ను అలాగే రాష్ట్ర స్మగ్లర్లయిన చెన్నైకు చెందిన సాధిక్‌, మన్సూర్‌, వసీంరాజా, ఫరూక్‌, రసూల్‌లను కూడా అరెస్ట్‌ చేశామన్నారు. అటవీ ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచి ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి విఠలేశ్వరరావు, ఎస్‌బి డిఎస్పీ కోటారెడ్డి, ఎస్‌బి సిఐ మాణిక్యరావులు పాల్గొన్నారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ramkrishకొత్తకోట శ్రీనివాసరెడ్డి... 1999-2000 ప్రాంతంలో నెల్లూరుజిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేసిన అధికారి. నెల్లూరుజిల్లా ప్రజలు ఇప్పటికీ ఆయనను మరచిపోలేదు. ఎందుకంటే అతనిని మరపించే విధంగా తర్వాత జిల్లాకు వచ్చిన ఏ ఎస్పీ కూడా పని చేయలేదు. కొందరు సమర్ధులైన ఎస్పీలొచ్చినా శ్రీనివాసరెడ్డి లెవల్లో తమ పనితనం చూపలేకపోయారు. బహుశా రాజకీయ ఒత్తిళ్లు కూడా అందుకు కారణమైఉండొచ్చు.

అప్పట్లో కమ్యూనిష్టు పార్టీలో వుండి నగరంలో పలు దందాలకు కారకుడైన మార్కెట్‌ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోవడంతో పాటు రౌడీషీటర్లు ఎర్రబాబు, నాటకరాణి మురళిల ఎన్‌కౌంటర్లు, రౌడీమేళాలు, నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ను దారికి తేవడం, ముఖ్యంగా కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో వుండి బాధితులకు నరకం చూపిస్తున్న సివిల్‌ వివాదాలను పరిష్కరించడం వంటి ముఖ్యఘటనలు ఎస్పీగా శ్రీనివాసరెడ్డిని నెల్లూరీయుల గుండెల్లో నిలిచేలా చేసాయి. శ్రీనివాసరెడ్డి వెళ్లిన తర్వాత జిల్లా పోలీస్‌శాఖలో ఆ జోష్‌ తగ్గిపోయింది. నిర్లిప్తత ఆవరించింది. క్రమక్రమంగా పోలీసుశాఖను అన్ని రకాల జాడ్యాలు ఆవహించాయి. మధ్యలో సెంథిల్‌కుమార్‌ వంటి ఎస్పీలు వచ్చి పోలీస్‌ పని చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల తొక్కపట్టి నారతీయ సాగారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులను లోతుగా లాగితే అధికారపార్టీ నాయకుల జాతకాలు బయటపడే పరిస్థితులు రావడంతో, స్థానిక అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో సెంథిల్‌కుమార్‌ బదిలీ జరిగిపోయింది.

అయితే చాలా కాలానికి నెల్లూరుజిల్లాకు కరెక్ట్‌ ఎస్పీ దిగాడు. అడ్డదార్లు మరిగిన తన శాఖలోని అధికారులు, సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాడు. నెల్లూరు ప్రజలకి శ్రీనివాసరెడ్డిని మరిపించేలా పని చేస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. ఆయన ఎస్పీగా వచ్చీ రాగానే అవినీతి, అక్రమాల మకిలి అంటిన తన శాఖను సంస్కరించుకోవడంతో పాటు ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా, బెట్టింగ్స్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాడు. ముందుగా బెట్టింగ్‌ బంగార్రాజుల భరతం పట్టడం మొదలుపెట్టాడు. బెట్టింగ్స్‌ పాపానికి ఇటీవల నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం తమిళనాడులో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే! జిల్లా నలుమూలలా వేళ్లూనుకుని వున్న బెట్టింగ్‌ వటవృక్షాన్ని కూలదోయడానికి ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ కంకణం కట్టుకున్నారు. జిల్లాలోనే బెట్టింగ్‌ కింగ్‌గా పేరుగాంచి, ప్రతిరోజూ కోట్ల రూపా యలలో జూదం ఆడిస్తున్న కృష్ణసింగ్‌ను పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. కృష్ణసింగ్‌ నోరు విప్పడంతో బెట్టింగ్‌ అన్నది చిన్న జూదం కాదని, హైదరాబాద్‌ డ్రగ్స్‌ మాఫియా లాగే దీని వెనుకా చాంతాడంత జాబితా వుందన్నది అర్ధమైపోయింది. జిల్లాలో బెట్టింగ్స్‌ మాఫియాకు, పోలీసు శాఖతో ఉన్న సంబంధాలు బట్టబయలయ్యాయి. కృష్ణసింగ్‌ నోట వచ్చిన వివరాల దెబ్బకు ఎస్పీయే షాక్‌ అయ్యారు. ఎందుకంటే కొందరు పోలీసు అధికారులు డబ్బుల కోసం ఖాకీ బట్టలకున్న గౌరవాన్ని ఎంతగా తాకట్టుపెట్టా రన్న విషయం కృష్ణసింగ్‌ విచారణలో బయటకొచ్చింది. జిల్లాలో ఎవరెవరు బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నారు? బెట్టింగ్స్‌ను సాఫీగా నిర్వ హించడానికి పోలీసు శాఖలో ఎవరెవరికి ఎంతెంత మామూలు పోతుంది? బెట్టింగ్స్‌కు ఫండ్‌రైజర్స్‌ ఎవరెవరు? అనే విషయాలన్నీ కూడా విచారణలో వెలుగు చూసాయి. ఈ బెట్టింగ్స్‌ ముఠాకు అండగా వుంటున్న అధికారపార్టీ నాయకుడెవరు? అన్న విషయం కూడా బయటపడింది. పోలీసుల విచారణలో కృష్ణసింగ్‌ పలువురు బుకీల పేర్లను వెల్లడించారు. దీంతో వారిలో కొందరిని పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించారు. బుకీలందరూ ఒకే మాట చెప్పారు. సార్‌, గతంలోగాని, ఇప్పుడుగాని బెట్టింగ్స్‌ నిర్వహించిన మాట వాస్తవమే! ఇక నుండి బెట్టింగ్స్‌కు దూరంగా ఉండి బుద్ధిగా బ్రతుకుతాము. మీరు దయతలచి నెల్లూరులో

ఉండమంటే ఉంటాం, లేదంటే ఊరొదిలి పోతాం అని విన్నవించు కున్నట్లు తెలుస్తోంది.

పోలీసు పరువు తీసారు...

బెట్టింగ్స్‌ను అరికట్టాల్సిన పోలీసులే బెట్టింగ్‌రాయుళ్లకు అండగా నిలిచారు. వారిచ్చిన మామూళ్లు అందుకున్నారు. వారికి పూర్తి సహాయసహకారాలు అందించారు. డిఎస్పీ స్థాయి అధికారికే 80లక్షలు ఇచ్చినట్లు బెట్టింగ్‌ కింగ్‌ చెప్పినట్లు సమాచారం. ఇక సిఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందికి... ఎవరి వాటాలు వాళ్లకు అంది వుంటాయనడంలో సందేహం లేదు. బెట్టింగ్‌ ముఠాకు గత ఎస్పీ కూడా పూర్తిస్థాయిలో సహకరించాడని తెలుస్తోంది. బెట్టింగ్‌రాయుళ్ల విచారణలో తమ శాఖ అధికారుల పాత్రే ఎక్కు వుగా బయటపడడంతో ఆగ్రహించిన ఎస్పీ రామకృష్ణ కానిస్టేబుల్‌ నుండి డిఎస్పీల వరకు బెట్టింగ్స్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ మెమోలు జారీ చేశారు.

నేతలే పాత్రధారులు...

నెల్లూరులో బెట్టింగ్‌ రాయుళ్లకు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మంత్రి నారాయణ ప్రధాన అనుచరుడు సహకారం దండిగానే వున్నట్లు తెలిసింది. జిల్లాలోని బుకీలందరూ కలిసి కోటి రూపాయలకు పైనే ఈయనకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బెట్టింగ్స్‌ నిర్వహణకు ఎవరూ అడ్డుపడకుండా పైస్థాయిలో అంతా నేను చూసుకుంటానని ఆయన గ్యారంటీ ఇవ్వడంతో ఈ కాసుల మూట ఇచ్చారు. ఇతనే గతంలో ముత్తుకూరు రోడ్డులో పేకాటక్లబ్‌ను కూడా పెట్టాడని, అప్పుడు ఎస్పీగా వున్న సెంథిల్‌కుమార్‌ తోలుపెరుకుతానని హెచ్చరించి ఈ పేకాట క్లబ్‌ను మూయించాడని తెలిసింది. మంత్రి నారాయణకు బెట్టింగ్స్‌, పేకాట అలవాటు లేకపోవచ్చు, కాని ఇలాంటి వారిని ప్రోత్స హించి చంకనెక్కించుకుంటే జిల్లాను గబ్బు పట్టించడమే కాకుండా మంత్రిగా తానూ గబ్బుపడుతున్నాడు. వీలైనంత త్వరగా ఆయన ఏదో ఒక ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ సబ్బు వాడైనా ఇలాంటి వారి గబ్బును వదిలించుకోకపోతే వ్యక్తిగత ప్రతిష్ట పరంగా చాలా నష్టపోతాడు. ఇతనే కాకుండా ఫండ్‌రైజర్లుగా ఆయా పార్టీలలోని మరికొందరు నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బెట్టింగ్‌ భాగోతంలో ఎస్పీకి తాడు కొస ఓ వైపు దొరికింది. దానిని పట్టుకుని పరిశోధించుకుంటూ పోతున్నారు. ఈ పరిశోధనలోనే విభిన్న వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఎస్పీ తాడు లాగాడు, బెట్టింగ్‌ డొంక కదిలింది. ఎన్ని కొత్త ముఖాలు తెరపైకి వస్తాయో చూడాలి.

బెట్టింగ్స్‌కు పాతరే లక్ష్యం...

జిల్లా నుండి బెట్టింగ్‌ భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలనే లక్ష్యంతో ఎస్పీ రామకృష్ణ పని చేస్తున్నారు. అందుకే విచారణ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ పోతున్నారు. బెట్టింగ్స్‌ మూలంగా జిల్లాలో చాలామంది బ్రతుకులు నాశనమయ్యాయి. కొందరు ఆస్తులు అమ్ముకుని రోడ్డునపడ్డారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యాపారాలు చేసుకుని పద్ధతిగా బ్రతికేవాళ్లు బెట్టింగ్‌ మాయలో పడి సర్వం కోల్పోయి దొంగలుగా మారారు. ఎందరి బ్రతుకులనో గుల్లగుల్ల చేస్తున్న ఈ బెట్టింగ్‌ భూతాన్ని తరిమి కొట్టడంలో ఎస్పీ రామకృష్ణ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ప్రజల ఆకాంక్ష!

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter