tdpనెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఏమంత బాగాలేదు. గతంకంటే మెరుగు పడిందీ లేదు. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి వచ్చింది 3 సీట్లే! ఇవి కూడా కొద్దిపాటి మెజార్టీతో గెలుచుకున్నవే! వీటిలో వైసిపి సంస్థాగత లోపాల కారణంగా 2 సీట్లు పోయాయి. ఇక నెల్లూరు లోక్‌సభతో పాటూ నెల్లూరుజిల్లాలోని నాలుగు అసెంబ్లీలు కలిసి వున్న తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కూడా వైసిపి గెలుచుకోవడం జరిగింది.

ఈ సీన్‌ను బట్టి జిల్లాలో తెలుగుదేశం ఎంత బలహీనంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళయ్యింది. ఈ నాలుగేళ్ళ కాలంలో తెలుగుదేశం ఏమన్నా బలం పుంజుకుందా? ఈ నాలుగేళ్ళలో ఆనం సోదరులతో పాటు మెట్టు కూరు ధనుంజయరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి వంటి నాయకులు టీడీపీలో చేరారు. వైసిపిలో గెలిచిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కూడా టీడీపీలో చేరాడు. ఏమన్నా ఒరిగిందా? పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందా? గతంలోకన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవ కాశాలు ఏర్పడ్డాయా? తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందా? జిల్లాలో అలాంటి వాతావరణమేదీ కనిపించడం లేదు సరికదా, 2014 కన్నా జిల్లాలో పార్టీ బలహీనపడ్డ వాతావరణం కనిపిస్తోంది.

చంద్రబాబు చిన్నచూపు

మొదట అధికారంలోకి వచ్చాక ఈ జిల్లా అభి వృద్ధిపై చంద్రబాబు చిన్నచూపు చూసాడు. ఈ జిల్లా అంటే గిట్టనట్లు వ్యవహరించాడు. ఐదేళ్ళ వై.యస్‌. పాలనతో పోల్చి చూసినప్పుడు ఈ జిల్లాకు ఆయన చేసిందేమీ కనిపించలేదు. దాంతో స్వతహాగానే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇక నియోజక వర్గాల వారీగా కూడా పార్టీ బలహీనంగానే ఉంది. టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలుంటే(జంపింగ్‌ ఎమ్మెల్యేతో కలిపి) ఆ నాలుగు నియోజకవర్గాలలోనూ వారి పట్ల వ్యతిరేకత వుంది. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజక వర్గాలలో తెలుగుదేశాన్ని చంద్రబాబే పడుకోబెట్టాడు. ఏ జిల్లా కేంద్రంలోనూ తెలుగుదేశం నెల్లూరులో వున్నంత బలహీనంగా వుండదేమో! సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా గట్టిగా పోరాడుతున్నాడు. ఇది రైతాంగం ఎక్కువ వుండే నియోజకవర్గం. ప్రభుత్వంపైన అన్నిచోట్లా వుండే వ్యతిరేకత ఇక్కడా వుంది. కాకపోతే సోమిరెడ్డి సొంతంగా గట్టిగా నిలబడుతున్నాడు. కావలిలో బీద సోదరుల నాయకత్వం వల్ల అక్కడ పార్టీ కనిపిస్తోంది. జిల్లాలో టీడీపీ వీక్‌ అనే సంకేతాలు అధిష్టానాన్ని తాకాయి. చంద్రబాబు నెల్లూరు జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

నిలబెట్టుకోవడంలో విఫలం

ముఖ్యంగా మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వదిలిపోతున్నాడన్న విషయం టీడీపీలో ఆందోళన కలిగిస్తోంది. పార్టీలోకి వచ్చిన వాళ్ళను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యామనే భావన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆనం సోదరులకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వివేకా చివరి రోజుల్లో వున్నప్పుడైనా ఆయనకు గౌరవప్రదమైన స్థానం కల్పించి వుంటే వాళ్ళు పార్టీని వదిలిపోకుండా వుండేందుకు ఆస్కార ముండేది. ఆనంను పార్టీలో నిలబెట్టుకోలేక పోవడ మన్నది పూర్తిగా చంద్రబాబు వైఫల్యమే! ఆనం పార్టీని వదిలి వైసిపిలోకి పోతే ఆ ఎఫెక్ట్‌ ఆత్మకూరు నియోజక వర్గంతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల మీద కూడా పడుతుంది.

తిరుగుబాటులో పెళ్ళకూరు

ఆనం అలా వుండగా కోవూరుకు చెందిన మరో నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి కూడా తిరుగుబాటు బాటలో వున్నాడు. ఆయన ఎదురు తిరిగినా కూడా కోవూరులో పార్టీకి నష్టం తప్పదు. వీరితో పాటు మరికొందరు నాయకులు కూడా టీడీపీని వీడే ఆలోచనలో వున్నట్లు సమాచారం.

నిలబెట్టుకొనే ప్రయత్నాలు

చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిన దశలో తెలుగుదేశం అధిష్టానం అలర్ట్‌ అయ్యింది. ఆనం రామనారాయణరెడ్డి చేజారినట్లేనని ఖరారు చేసు కున్నారు. కాకపోతే వారి కుటుంబంలో వున్న మరో ఇద్దరిని నిలబెట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డిని బుజ్జగించే పనిలో కొందరున్నారు. ఎన్నికలనాటికి పార్టీ మారుతాడనే ప్రచారం వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిని జాగ్రత్తగా పట్టుకురావాలని నిర్ణయించి ఆయనకు అదనపు బాధ్యతలంటూ కొత్త పదవులు అప్పగిస్తున్నారు.

ఉదయగిరిలో కంభం విజయరామిరెడ్డి చేజారిపో కుండా ఆయనకు రాష్ట్ర స్థాయి పార్టీ పదవిని గాలంగా విసురుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డీసీసీబీ ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.

ఇటీవలే నవనిర్మాణ దీక్షల ముగింపు సభను నెల్లూరుజిల్లాలోనే నిర్వహించిన చంద్రబాబు, ఈ నెల 30న దళిత తేజం ముగింపు సభకు కూడా నెల్లూరునే వేదికగా ఎంచుకున్నారు. దీనికి కారణం నెల్లూరు జిల్లాలో పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలకు పూనుకోవడమే!

tdp leadersఏ జిల్లా కూడా ఈ పార్టీకి కంచుకోట అని చెప్పలేనటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో వున్నాయి. తెలుగుదేశం క్లీన్‌స్వీప్‌ చేసిన గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి ఇప్పుడంత గ్యారంటీ లేదు. వైసిపి విజయఢంకా మోగించిన కడప, కర్నూలు జిల్లాల్లో ఆ పార్టీ ఇప్పుడు అంతే బలంగా వుందని చెప్పే పరిస్థితి లేదు. అన్ని జిల్లాల్లోనూ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.

ఒక్క నెల్లూరుజిల్లాలో మాత్రం 2014 ఎన్నికల నాటి వాతావరణం మారలేదు. ఈ జిల్లాలో వైసిపి బలహీనపడ్డ దాఖలాలు గాని, టీడీపీ బలం పుంజుకున్న ఆనవాళ్ళు గాని లేవు. జిల్లాలో నెల్లూరు, తిరుపతి లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలుంటే ఏ ఒక్క స్థానంలో కూడా తెలుగుదేశం గెలుస్తుందనే గ్యారంటీ లేదు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి కేవలం 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రేపు ఎన్నికల్లో కూడా తిరిగి ఆయనే పార్లమెంటు అభ్యర్థి అయినా గెలుస్తాడన్న ధీమా లేదు. 2014 ఎన్నికల్లో ఆయనకు క్రాస్‌ ఓటింగ్‌ బాగా జరిగింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఓటింగ్‌ జరగొచ్చు. కాబట్టి క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశం వుండదు. ఇదే ఆదాల వైసిపి లోక్‌సభ అభ్యర్థి అయితే సునాయాసంగా గెలుస్తాడని రాజకీయ విజ్ఞులు భావిస్తున్నారు. నెల్లూరురూరల్‌ టీడీపీ అభ్యర్థిగా కూడా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే ఇక్కడ నుండి కూడా ఆయన గెలుస్తాడని చెప్పే అవకాశం లేదు. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రజల్లోకి దూసుకుపోయాడు. ప్రజల మధ్యే ఉంటున్నాడు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుపోతున్నాడు. ఇక్కడ శ్రీధర్‌రెడ్డిని వెనక్కు నెట్టి గెలవడానికి తపస్సు చేయాల్సిందే! అదే ఆదాల వైసిపి అభ్యర్థిగా లోక్‌సభకైనా, అసెంబ్లీకైనా ఎక్కడైనా గెలవగలడనే ప్రచారం వుంది. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అతనిపై వ్యతిరేకత లేదు. ప్రజల మధ్యే ఉంటున్నాడు. ప్రభుత్వంతో పోరాడుతున్నాడు. అందరినీ కలుపుకుపోతున్నాడు. ఇతనిపై కూడా ఎవరిని పోటీ పెట్టాలి అనే అంతర్మధనం జిల్లా తెలుగుదేశంపార్టీలో సాగుతోంది. ఒక దశలో మంత్రి నారాయణ పేరు కూడా తెరమీదకొచ్చింది. నారాయణ పోటీ చేస్తే గట్టి ఫైటే ఉండొచ్చు. కాని, గెలుపుకు గ్యారంటీ లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నారాయణకు అవసరం లేదు. ఆయన కావాలనుకుంటే తెలుగుదేశంలో ఏ పదవైనా వస్తుంది. అదీగాక నారాయణ రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్‌ పర్యవేక్షించాలి. ఆర్ధిక వ్యవహారాలు పరిశీలించాలి. నారాయణ లాంటి సమన్వయకర్తను ఒక నియోజకవర్గంలో ఇరికించలేరు. అలా ఇరికిస్తే పార్టీకే నష్టం. కాబట్టి అనిల్‌కు ధీటైన అభ్యర్థి ఎవరన్నదానిపై పార్టీలో సందిగ్ధత నెలకొంది. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మించిన అభ్యర్థి లేడు. ఆయనకు కూడా గెలుపు కోసం యుద్ధం తప్పదు. ఆత్మకూరు వరకు ఆనం రామనారాయణరెడ్డి అభ్యర్థి అయితే ఇక్కడ ఉత్కంఠ పోరే నడుస్తుంది. అలాగని ఆనం రామనారాయణరెడ్డి గెలుపు నల్లేరుపై నడక అని చెప్పలేం. ఆయనకు గట్టిపోటీ తప్పదు. అదే ఆనం రామనారాయణరెడ్డి ఇక్కడ వైసిపి అభ్యర్థి అయితే వార్‌ వన్‌సైడే అన్నట్లుగా ఉంటుంది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు సరైన అభ్యర్థి తెలుగుదేశం వాళ్ళకు ఇంకా దొరకలేదు. ఆ దిశగా అన్వేషణ సాగుతున్నట్లు తెలుస్తోంది. వైసిపి నుండి తెలుగుదేశంలో చేరిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌కే సీటిస్తే గెలుపు గ్యారంటీ లేదు. కాని, సీటు ఇవ్వక తప్పని పరిస్థితి. కోవూరులోనూ పార్టీ అయోమయస్థితిలో వుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి వ్యతిరేకంగా పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి వర్గం పని చేస్తోంది. ఈసారి సీటు విషయమై వచ్చే గొడవలే ఇక్కడ పార్టీని దెబ్బతీసేటట్లున్నాయి. కావలిలో ఈసారి బీద మస్తాన్‌రావు లేదా బీద రవిచంద్ర పోటీ చేస్తే సరేసరి... మంచిపోటీ వుంటుంది. వాళ్ళు కాకుండా కొత్త అభ్యర్థి తెరమీదకు వస్తే వైకాపాకు పండుగే! వెంకటగిరిలోనూ దేశం అయోమయంలో వుంది. సిటింగ్‌ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై తీవ్ర వ్యతిరేకత వుంది. కాకపోతే ఆయనను తప్పిస్తే ఎవరిని పెట్టాలో అర్ధం కావడంలేదు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై వ్యతిరేకత వున్నా, ఆయనకంటే మెరుగైన అభ్యర్థి కనిపించడం లేదు నియోజకవర్గంలో.

ఇలా జిల్లా అంతటా తెలుగుదేశంకు ఉత్సాహవంతమైన వాతావరణం లేదు. సగం నియోకవర్గాల్లో సరైన అభ్యర్థులే లేరు. 2014 ఎన్నికల్లో మంచి ఫలితాలు రానందుకే జిల్లా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు చేత ఇప్పటికి కూడా తిట్లు తింటున్నారు. జిల్లాలో మునుపటి పరిస్థితికి నేటికి పెద్దగా మార్పులేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో ఎవరుంటారో, ఎవరు వెళతారో చెప్పలేని పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు కడప, కర్నూలులలో తన హవాను సాగించినా, నెల్లూరుజిల్లా మాత్రం ఆయనకు కొరుకుడుపడని కొయ్యగానే వుంది.

pasupuజిల్లాలో 'పసుపు' అమ్మకాల వ్యవహారంలో పసుపు నేతలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి ఒకటి తలిస్తే ఇక్కడ ఇంకోటి జరిగింది. పసుపు పచ్చ నేతలు, దళారులు, మండల స్థాయి అధికారులు కుమ్మక్కై రైతుల ముసుగులో పసుపు వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించారు. పసుపు పండించిన రైతుకు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర రాక యధాఫలంగా ఎప్పుడూ జరిగే అన్యాయమే జరిగింది.

ఇటీవల ఉదయగిరి పర్యటనకు వెళ్లిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని స్థానిక పసుపురైతులు కలిసి తాము పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర లేదని, మద్దతుధర ప్రకటించి తమను ఆదుకోవాలని కోరారు. అప్పటికి క్వింటాల్‌ పసుపు కొమ్ముల ధర బయట మార్కెట్‌లో నాలుగువేల దాకా వుంది. రైతుల పరిస్థితిని అర్ధం చేసుకున్న మంత్రి సోమిరెడ్డి ఉదయగిరిలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఏ-గ్రేడ్‌ పసుపుకు 6,500 రూపాయలు, బి-గ్రేడ్‌ పసుపుకు 6,000 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించారు. మే 5వ తేదీన ఉదయగిరి మార్కెట్‌ కమిటీ ఆవరణలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పసుపు రైతుల నుండి 38,670 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లకు అనుమతి పొందారు. అయితే ఇక్కడ కడప, ప్రకాశం జిల్లాల రైతులు ఈ కేంద్రానికి పసుపు అమ్మింది చాలా తక్కువ. కడప జిల్లాలో 136మంది, ప్రకాశం జిల్లా నుండి 48మంది రైతులు మాత్రమే ఇక్కడ పసుపు అమ్మకాలు జరిపారు. నెల్లూరుజిల్లాలో మాత్రం 1,104మంది రైతులు 32వేల క్వింటాళ్లకుపైగా పసుపును అమ్మారు. నెల్లూరు జిల్లాలోనూ పసుపు పంట తక్కువ.

ఉదయగిరి ప్రాంతంలో తప్పితే ఇంకెక్కడా వేయరు. మరి ఒకటేసారి ఇన్ని క్వింటాళ్ల పసుపు ఎక్కడ నుండి వచ్చింది? మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాస్‌బుక్‌లు, విఆర్‌ఓలు ఇచ్చిన రైతు పత్రాలు చూసి కొనుగోలు చేశారు. వాళ్లు రికార్డుల ప్రకారమే కొన్నారు. కాకపోతే జిల్లాలో పండిన పంట గోరంత అయితే కొనుగోలు కేంద్రానికి కొండంతగా వచ్చింది. పసుపు కొనుగోలు కేంద్రం ద్వారా కోట్ల రూపాయలు అవినీతి చేయొచ్చని పసుపు చొక్కాల నేతలు ఇక్కడే నిరూ పించారు. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన కొందరు తెలుగుదేశం నాయకులే పసుపు వ్యాపారంలో దిగారు. గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలకు వెళ్లి చౌకగా 3 నుండి 4వేల మధ్య పసుపును కొన్నారు.

ఉదయగిరి మండలంలో కొందరు రైతుల పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులు, బ్యాంకు అకౌంట్‌ నెంబర్లు తీసుకున్నారు. అలాగే విఆర్‌ఓలు, ఉద్యాన శాఖాధికారులతో కుమ్మక్కై సదరు రైతులు పసుపు పంట సాగు చేసినట్లు ధృవీకరణ పత్రాలు తీసుకున్నారు. ఈ పత్రాలన్నింటిని కొనుగోలు కేంద్రంలో సమర్పించి బయట ప్రాంతాల నుండి లారీలలో తెచ్చిన పసుపును మద్దతు ధరకు అమ్ముకున్నారు. ఇలా ఒక్కో నాయకుడు ఒక్కో లారీకే మూడులక్షల దాకా సంపాదించాడు.

అయితే పసుపు అమ్మినా డబ్బులు నాయకులకు రావు. అవి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో పడతాయి. కొందరు రైతులకు తమ అకౌంట్లలో డబ్బులు పడినట్లు కూడా తెలియదు. ఇంకొందరైతే రైతులకు ముందుగానే చెప్పి వారి అకౌంట్‌ నెంబర్లు తీసుకున్నారు.

పసుపు కొనుగోల్‌మాల్‌పై మీడియాలో పెద్దఎత్తున వార్తలు రావడంతో ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా ఆయా రైతుల అకౌంట్లను ముందుగా సీజ్‌చేయాలి. ముందు పసుపు పండించిన రైతులెవరో? నకిలీ రైతులెవరో తేల్చాలి. నకిలీ రైతుల అకౌంట్లకు వచ్చిన డబ్బును సీజ్‌ చేయాలి. అలాగే తప్పుడు ధృవీకరణ పత్రాలు అందజేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. అసలు పసుపు పండించిన రైతులను గుర్తించి వారికి పూర్తి న్యాయం చేయాలి.

Page 1 of 6

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter