pasupuజిల్లాలో 'పసుపు' అమ్మకాల వ్యవహారంలో పసుపు నేతలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి ఒకటి తలిస్తే ఇక్కడ ఇంకోటి జరిగింది. పసుపు పచ్చ నేతలు, దళారులు, మండల స్థాయి అధికారులు కుమ్మక్కై రైతుల ముసుగులో పసుపు వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించారు. పసుపు పండించిన రైతుకు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర రాక యధాఫలంగా ఎప్పుడూ జరిగే అన్యాయమే జరిగింది.

ఇటీవల ఉదయగిరి పర్యటనకు వెళ్లిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని స్థానిక పసుపురైతులు కలిసి తాము పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర లేదని, మద్దతుధర ప్రకటించి తమను ఆదుకోవాలని కోరారు. అప్పటికి క్వింటాల్‌ పసుపు కొమ్ముల ధర బయట మార్కెట్‌లో నాలుగువేల దాకా వుంది. రైతుల పరిస్థితిని అర్ధం చేసుకున్న మంత్రి సోమిరెడ్డి ఉదయగిరిలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఏ-గ్రేడ్‌ పసుపుకు 6,500 రూపాయలు, బి-గ్రేడ్‌ పసుపుకు 6,000 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించారు. మే 5వ తేదీన ఉదయగిరి మార్కెట్‌ కమిటీ ఆవరణలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పసుపు రైతుల నుండి 38,670 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లకు అనుమతి పొందారు. అయితే ఇక్కడ కడప, ప్రకాశం జిల్లాల రైతులు ఈ కేంద్రానికి పసుపు అమ్మింది చాలా తక్కువ. కడప జిల్లాలో 136మంది, ప్రకాశం జిల్లా నుండి 48మంది రైతులు మాత్రమే ఇక్కడ పసుపు అమ్మకాలు జరిపారు. నెల్లూరుజిల్లాలో మాత్రం 1,104మంది రైతులు 32వేల క్వింటాళ్లకుపైగా పసుపును అమ్మారు. నెల్లూరు జిల్లాలోనూ పసుపు పంట తక్కువ.

ఉదయగిరి ప్రాంతంలో తప్పితే ఇంకెక్కడా వేయరు. మరి ఒకటేసారి ఇన్ని క్వింటాళ్ల పసుపు ఎక్కడ నుండి వచ్చింది? మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాస్‌బుక్‌లు, విఆర్‌ఓలు ఇచ్చిన రైతు పత్రాలు చూసి కొనుగోలు చేశారు. వాళ్లు రికార్డుల ప్రకారమే కొన్నారు. కాకపోతే జిల్లాలో పండిన పంట గోరంత అయితే కొనుగోలు కేంద్రానికి కొండంతగా వచ్చింది. పసుపు కొనుగోలు కేంద్రం ద్వారా కోట్ల రూపాయలు అవినీతి చేయొచ్చని పసుపు చొక్కాల నేతలు ఇక్కడే నిరూ పించారు. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన కొందరు తెలుగుదేశం నాయకులే పసుపు వ్యాపారంలో దిగారు. గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలకు వెళ్లి చౌకగా 3 నుండి 4వేల మధ్య పసుపును కొన్నారు.

ఉదయగిరి మండలంలో కొందరు రైతుల పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులు, బ్యాంకు అకౌంట్‌ నెంబర్లు తీసుకున్నారు. అలాగే విఆర్‌ఓలు, ఉద్యాన శాఖాధికారులతో కుమ్మక్కై సదరు రైతులు పసుపు పంట సాగు చేసినట్లు ధృవీకరణ పత్రాలు తీసుకున్నారు. ఈ పత్రాలన్నింటిని కొనుగోలు కేంద్రంలో సమర్పించి బయట ప్రాంతాల నుండి లారీలలో తెచ్చిన పసుపును మద్దతు ధరకు అమ్ముకున్నారు. ఇలా ఒక్కో నాయకుడు ఒక్కో లారీకే మూడులక్షల దాకా సంపాదించాడు.

అయితే పసుపు అమ్మినా డబ్బులు నాయకులకు రావు. అవి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో పడతాయి. కొందరు రైతులకు తమ అకౌంట్లలో డబ్బులు పడినట్లు కూడా తెలియదు. ఇంకొందరైతే రైతులకు ముందుగానే చెప్పి వారి అకౌంట్‌ నెంబర్లు తీసుకున్నారు.

పసుపు కొనుగోల్‌మాల్‌పై మీడియాలో పెద్దఎత్తున వార్తలు రావడంతో ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా ఆయా రైతుల అకౌంట్లను ముందుగా సీజ్‌చేయాలి. ముందు పసుపు పండించిన రైతులెవరో? నకిలీ రైతులెవరో తేల్చాలి. నకిలీ రైతుల అకౌంట్లకు వచ్చిన డబ్బును సీజ్‌ చేయాలి. అలాగే తప్పుడు ధృవీకరణ పత్రాలు అందజేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. అసలు పసుపు పండించిన రైతులను గుర్తించి వారికి పూర్తి న్యాయం చేయాలి.

tdp netaluనిన్నగాక మొన్న ఎలక్షన్‌ జరిగినట్లు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లుగా వుంది. తిరిగి చూస్తే మూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఏది ఆగినా కూడా కాలం ఆగదు కదా! తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కూడా చాలామంది నాయకుల ఆశలు తీరలేదు. ఇప్పటికీ ఆశల పల్లకిలో వూరేగుతూనే వున్నారు. మహా అంటే ఇంకో ఆరేడు నెలల దాకా నామినేటెడ్‌ పదవులిస్తారు. ఆ తర్వాత ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలవుతుంది. నామినేటెడ్‌ పదవుల గురించి ఆలోచన చేసే టైం కూడా వుండదు.

నామినేటెడ్‌ పదవుల విషయంలో జిల్లాలోని తెలుగుదేశం నాయకులు ఇంకా అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనే బాధ కొందరిలో వుంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక జిల్లా పరంగా చూస్తే కిలారి వెంకటస్వామినాయుడుకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ పదవిని, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి నుడా ఛైర్మెన్‌ పదవిని ఇచ్చారు. ఈ రెండూ జిల్లా పదవులే! వాళ్లకు కాకున్నా ఎవరోఒకరికి ఇవ్వాలి. పార్టీని కనిపెట్టుకుని వున్నారు కాబట్టి వారికివ్వడంలో తప్పులేదు. అలాగే ఆసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మెన్‌ పదవిని మంత్రి నారాయణ కోటాలో కాంగ్రెస్‌లో నుండి వచ్చిన చాట్ల నరసింహరావుకు ఇచ్చారు. ఇటీవల ఆఫ్కాప్‌ ఛైర్మెన్‌గా కొండూరు పాల్‌శెట్టిని నియమించడం జరిగింది.

కాని పార్టీని నమ్ముకుని, పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీ కోసం పని చేసిన ఇంకొందరు నాయకులకు ఇంతవరకు ఎటువంటి పదవులు లభించలేదు. మాజీమంత్రి టి.రమేష్‌రెడ్డి, మాజీమున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అనూరాధ దంపతులను పదవుల విషయంలో పూర్తిగా పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. 1983 నుండి పార్టీని కనిపెట్టుకున్నోళ్లు వీళ్లు. 'నుడా' ఛైర్మెన్‌ పదవి ఇస్తారని ఆశించారు. అది రాలేదు. అనూరాధను మహిళా కమిషన్‌ సభ్యురాలిగానో, టిటిడి బోర్డు సభ్యురాలిగానో నియమిస్తారనే ప్రచారం వుంది. అయినా ఇంతవరకు ఆచరణ రూపం దాల్చలేదు.

2014లో నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి తెలుగు దేశం తరఫున మేయర్‌ అభ్యర్థిగా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అన్నీ తానై ముందుకొచ్చిన వ్యక్తి డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌. ఆ ఎన్నికల్లో పార్టీ కోసమే రంగంలోకి దిగాడు. నెల్లూరుజిల్లాలో వై.యస్‌. గాలి బాగా తోలడంతో గట్టిగా ఢీకొట్టి కూడా దెబ్బతిన్నాడు. పార్టీ ప్రతిపక్షంలో వున్న పదేళ్లు పార్టీ ఉనికిని చాటేలా టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షులుగా జిల్లా వ్యాప్తంగా ఎన్నో వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలో ఏ పని అప్పగించినా సమర్ధవంతంగా పూర్తి చేస్తున్నాడు. పార్టీ కోసం అన్ని విధాలా నష్టపోయిన జడ్‌.యస్‌.కు పార్టీ నుండి ఇంకా న్యాయం జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండుసార్లు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలుగుదేశం ఎమ్మెల్సీగా పోటీచేసి ఆర్ధికంగా దెబ్బతిన్న వ్యక్తి, న్యాయవాది దేశాయిశెట్టి హనుమంతరావు. పార్టీ బలహీనంగా వున్న రోజుల్లో కూడా అతను పార్టీ కోసం నిలబడ్డాడు. పార్టీ పరంగా అతనికీ ఇంతవరకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్‌ వేనాటి రామచంద్రారెడ్డి. ఆయన పెద్ద పెద్ద నామినేటెడ్‌ పదవులను ఆశించడం లేదు గాని టిటిడి బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కితే చాలనుకుంటున్నాడు. మరి చంద్రబాబు ఆయనకు ఆ అవకాశమిస్తాడో లేదో చూడాలి. 2014 ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నుండి పోటీ చేసి పరాజయం పాలైన డా|| బి.జ్యోత్స్నలతకు కూడా నామినేటెడ్‌ పదవి ఆశ చూపించివున్నారు. వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యే పాశం సునీల్‌ తెలుగుదేశంలో చేరడంతో ఆమెకు అప్పటివరకు వున్న గూడూరు ఇన్‌ఛార్జి హోదా కూడా పోయింది. ఇక నామినేటెడ్‌ పదవి రాకుంటే ఆమెకూ అన్యాయం చేసినట్లే!

కాలం వేగంగా కదులుతోంది. వీళ్లకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ నామినేటెడ్‌ పదవులు రావు. ఇంకో ఆరేడు నెలల తర్వాత ఇచ్చినా కూడా ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలైతే వాటివల్ల ఉపయోగం వుండదు.

nudaతెలుగుదేశం పార్టీలో ఇంతవరకు జరిగిన పదవుల పందేరం ఓ లెక్క... ఇకముందు జరగబోయే పదవుల పందేరం ఓ లెక్క! ఇప్పటివరకు కులసమీకరణల లోనో, లేక సీనియార్టీ మీదనో, లేక పిలవ గానే అవతల పార్టీల నుండి పరుగెత్తు కుంటూ వచ్చారనో పదవులిస్తూ వచ్చారు. కాని ఇక నుండి ఇవ్వబోయే పదవులు మాత్రం రానున్న ఎలక్షన్‌ కోణంలోనే వుంటాయి. ఆ పదవుల పంపిణీ వెనుక ఓట్ల లెక్కలుంటాయి. ఒకరికి ఈ పదవి ఇచ్చిన దానివల్ల కనీసం ఎన్ని ఓట్లు పార్టీకి అదనంగా వస్తాయనే ఆలోచనలు ఉం టాయి. రేపు 'నుడా' ఛైర్మెన్‌ పదవిని కూడా అదే కోవలో ఇవ్వబోతున్నారు.

'నుడా' పదవికి ప్రస్తుతం అనూరాధ, డాక్టర్‌ జడ్‌.శివప్రసాద్‌, కోటంరెడ్డి శ్రీని వాసులురెడ్డి, దేశాయిశెట్టి హనుమంత రావుల పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ జిల్లా రాజకీయాలలో కుల సమీకరణలు బట్టి కూడా పదవులను ఇవ్వాల్సి ఉంటుంది. రాజకీయంగా రెడ్లు, బి.సిలకు అధిక ప్రాధాన్యతనివ్వాల్సి వుంటుంది. ఈ జిల్లా నుండి చూస్తే కాపుల తరపున ఒక మంత్రి ఉన్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బి.సి వర్గాలకు చెందిన నాయకుడున్నారు. ఇక పార్టీని రెడ్లకు చేరువ చేయాలనే దృష్టితో ఇటీవలే ఆ వర్గానికి చెందిన సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం కల్పిం చడం జరిగింది. రెడ్లను పార్టీవైపు లాక్కునే కనీస ప్రయత్నం ఇది.

ఇప్పుడు జిల్లా టీడీపీ రాజకీయాలలో ఒకటే లాజిక్‌! రెడ్లు దగ్గరైతే పార్టీ బల పడుతుంది. బీసీలు దూరమైతే పార్టీ బలహీనపడుతుంది. 'రెడ్ల'కు నుడా ఇచ్చి నంత మాత్రాన ఆ వర్గాలకు చెందిన ఓట్లు వస్తాయన్న గ్యారంటీ ఇక లేదు. కాని, ఇప్పటికే కాపు రిజర్వేషన్లను కలబెట్టి

ఉండడంతో బి.సిలలో అసంతృప్తి మొద లైంది. రేపు నామినేటెడ్‌ పదవుల విష యంలో కూడా బి.సిలకు తగిన ప్రాధా న్యతనివ్వకపోతే కొత్త ఓట్లు రావడం మాట దేముడెరుగు పార్టీకి ఉన్న ఓట్లు పోయే అవకాశముంది. కాబట్టి పార్టీకి ఓట్లు సమకూర్చే దిశగా 'నుడా' ఛైర్మెన్‌ ఎంపిక ఉండబోతోంది.

Page 1 of 6

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మళ్ళీ చెడింది
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
    ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter