tdpతెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చంఢశాసనుడు. ఆయన మాటకు ఎదురుండదు. అక్కడ ఆయన చెప్పిందే వేదం... చేసిందే చట్టం. ఆయన నిర్ణయానికి ఎదురుచెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. నిజమే చంద్రబాబు గతంలో 9ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పలుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు. అప్పుడు పదవులు కోల్పోయిన వాళ్ళుగాని, ఆశించి పదవులు దక్కనివాళ్ళు గాని నోరెత్తలేదు. ఇది తెలుగుదేశంలో సాంప్ర దాయం. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందని, తాను జరిపే మంత్రివర్గ విస్తరణపై ఎవరూ నోరు మెదపరని చంద్రబాబు బలంగా భావించారు. అయితే ఆయన అంచనాలు తలక్రిందులయ్యాయి.

చంద్రబాబు ఎవరికి పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా, పార్టీ నాయకులు మౌనం వహించా రంటే కారణం అప్పుడున్నది ఒరిజినల్‌ తెలుగుదేశం పార్టీ, ఒరిజినల్‌ తెలుగుదేశం నాయకులు. కాని ఇప్పుడున్నది ఒరిజినల్‌ తెలుగుదేశం కాదు, 50శాతం తెలుగుదేశం, పాతిక శాతం కాంగ్రెస్‌, ఇంకో పాతిక శాతం వైయస్సార్‌ కాంగ్రెస్‌. కాబట్టి చంద్రబాబు ఏకపక్ష ధోరణులను ఆ పార్టీ నాయకులు ఈసారి ధైర్యంగా ప్రశ్నించగలిగారు. నేనేం తప్పు చేసానని నన్ను మంత్రి పదవి నుండి పీకేసారంటూ చిత్తూరు జిల్లాలో బొజ్జల ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. బొజ్జలకు అనుకూలంగా అక్కడ కార్యకర్తలు కూడా రోడ్డెక్కారు. అనంతపురం జిల్లాలో మంత్రి పదవి ఇవ్వనందుకు పయ్యావుల కేశవ్‌ రుసరుసలాడారు. కడపజిల్లాలో వైసిపి నుండి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినందుకు రామసుబ్బారెడ్డి ఆగ్రహించారు. వరుసగా గెలుస్తున్నా తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు గుంటూరుజిల్లాలో ధూళిపాల నరేంద్ర అలిగాడు. కృష్ణా జిల్లాలో బోండా ఉమామహేశ్వరరావు అయితే మంత్రిపదవి రానందుకు తీవ్రంగా మనస్థాపం చెందాడు. ఇది కాపులకు జరిగిన అన్యాయమంటూ వాపోయాడు. మూడేళ్ల నుండి అసెంబ్లీలోనూ, బయట ప్రతిపక్ష నేత జగన్‌పై అందరికంటే ఎక్కువుగా ఆయన నోరు పారేసుకున్నది మంత్రి పదవి కోసమే! తీరా అది రాకపోయేసరికి నీరుగారి పోయాడు. ఇక బోండా ఉమా నోరు ఈ రెండేళ్లు విశ్రాంతి తీసుకుంటుందేమో చూడాలి. ఇసుకరీచ్‌లో మహిళా తహశీల్దార్‌ను ఈడ్చి కొట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును సాధించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కూడా మంత్రి పదవి రానందుకు ఆగ్రహించాడు. ఈ మూడేళ్లలో తన పనితీరును చంద్రబాబు గుర్తించలేకపోయాడని వాపోతున్నాడు.

ఇక తెలుగుదేశం వ్యవస్థాపకులలో ఒకడైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి అయితే నేరుగా చంద్రబాబు మీదకే విమర్శలు ఎక్కుపెట్టాడు. పక్క పార్టీల నుండి వచ్చినవారికి మంత్రి పదవులివ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీని వెన్నెముక లేని పార్టీగా చేస్తున్నారంటూ చంద్రబాబుపై నిప్పులు కక్కారు. అయితే ఈరోజు తనకు మంత్రి పదవి రాలేదని బుచ్చయ్యచౌదరి వైసిపి ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకోవడం అనైతికమంటున్నాడు. అసలు వారిని పార్టీలోకి తీసుకుంటున్నప్పుడే బుచ్చయ్య, చంద్రబాబును నిలదీసి వుంటే ఈ పరిస్థితి వచ్చేదా?

ఇక విజయనగరంలో సుజయ్‌కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇచ్చినందుకు అశోక గజపతిరాజు వర్గీయులు అలిగారు. విశాఖలో గౌతు శివాజీకి పదవి ఇవ్వనందుకు ఆయన వర్గీయులు నిరసన తెలిపారు.

తెలుగుదేశం చరిత్రలోనే మంత్రివర్గ విస్తరణ తర్వాత అత్యంత తీవ్రంగా నిరసన గళాలు వినిపించింది ఇప్పుడే! ఎప్పుడైతే తెలుగుదేశంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు కాకుండా కాంగ్రెస్‌, వైసిపిల నుండి వచ్చిన వాళ్ళకు చంద్రబాబు పెద్దపీట వేశాడో అప్పుడే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంతమైంది.

vala pakఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము అన్నట్లుగా వుంది వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నుండి తెలుగుదేశంలో దూరిన ఎమ్మెల్యేల పరిస్థితి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారని, నియోజకవర్గాలలో వారి హవా నడుస్తుందని, అక్కడకు పోతే మనం కూడా దర్జాగా ఉండొచ్చని భావించి 21మంది దాకా వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. వీరిలో కొందరు చంద్రబాబు తాయిలాలకు ఆకర్షితులు కాగా, బలమైన నాయకులకు మాత్రం మంత్రి పదవులను ఎరగా వేశారు. వీళ్లంతా కూడా పార్టీ నుండి వచ్చేటప్పుడు జగన్‌కు మంచి మర్యాద తెలియదని, సీనియర్లంటే గౌరవం లేదని, తెలుగు దేశంలోకి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా వుందని రకరకాల ప్రకటనలు చేశారు. తెలుగుదేశంలో చేరాక తామే కింగ్‌లమనుకున్నారు.

కాని, ఇప్పుడు అక్కడ పరిస్థితి చూసి కొందరు ఎమ్మెల్యేలు మేం పెనం మీద నుండి పొయ్యిలో పడ్డామని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలైతే మనసు చంపుకుని తెలుగుదేశంలో చేరారు. కాని ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులు వీరికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. తమ నియోజకవర్గాలలో అంతకుముందే వున్న తెలుగుదేశం నాయకులు వీరిని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. వీరిలో కొందరికి చంద్రబాబు మంత్రిపదవుల హామీ ఇచ్చి వున్నాడు. ఆ పదవులన్నా వస్తే తమ పరపతి పెరుగుతుందని, అనుచరులను కాపాడుకోగలమని వీరి బాధ. చంద్రబాబు మాత్రం మంత్రివర్గ విస్తరణ జోలికి పోవడం లేదు. పార్టీలో ఆయన సమస్యలు ఆయనకున్నాయి. కాని ఇప్పటికే మూడేళ్లు కావస్తుంది. ఇక మంత్రి పదవి వచ్చినా గట్టిగా వెలగబెట్టేది ఒకటి, ఒకటిన్నర సంవత్సరమే! ఇప్పుడు కూడా మంత్రి పదవులు ఇవ్వకపోతే తర్వాత ఇచ్చినా దండగే అన్న నిర్లిప్తధోరణి జంపింగ్‌ ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది. 'దూరపు కొండలు నునుపు' అన్న సామెతను పెద్దలు వూరకే చెప్పారా?

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter