bjp tdpబీజేపీతో పొత్తు వల్ల 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లాభ పడింది. 2014 ఎన్నికలలోనూ మోడీ ఇమేజ్‌తో లబ్దిపొందింది. మరి 2019 ఎన్నికల్లో కూడా ఇదే మాదిరిగా ప్రయోజనం ఉంటుందా? రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న ఇది.

రాష్ట్రంలో వైసిపి-బీజేపీల మధ్య పొత్తు కుదురుతుందని ఈ మధ్యంతా రాజకీయ ఊహాగానాలు చెలరేగాయి. అయితే బీజేపీతో పొత్తుకు వైసిపి సుముఖంగా లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు వల్ల వైసిపి సాంప్రదాయ ఓటుబ్యాంకు చీలిపోయే అవకాశముంది. ఈ స్థితిలో బీజేపీ ముందున్న మార్గం పాత మిత్రుడు తెలుగుదేశంతోనే కొనసాగడమా లేక ఒంటరిగా పోటీ చేయడమా? ఇందులో దేనికైనా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సంసిద్ధంగానే ఉంది. మరి టీడీపీ పరిస్థితి ఏమిటి? బీజేపీతో కలిసి కొనసాగడమా? లేక విడిగా పోటీ చేయడమా? ఇది టీడీపీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితే!

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీల ఓట్లు పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుంది. అదీగాక ప్రధాని మోడీ గ్రాఫ్‌ క్రమంగా పడిపోతోంది. నోట్ల రద్దు, జిఎస్టీలతో బీజేపీపై వ్యతిరేకత వుంది. ప్రత్యేకంగా ఏ.పి ప్రజలకు ప్రత్యేకహోదా ఇవ్వనందుకు బీజేపీపై ప్రత్యేకమైన కసి వుంది. రేపటి ఎన్నికలపై ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అదీగాక ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కీలకం అవుతుంది. గట్టి అభ్యర్థులను పెట్టాల్సి వుంటుంది. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి 24సీట్లిస్తే చచ్చి చెడి గెలిచింది నాలుగు సీట్లు. వైసిపికి సులభంగా 20సీట్లు ఇచ్చి నట్లయ్యింది. 2019 ఎన్నికల్లో బీజేపీ 30సీట్లకు తక్కువ డిమాండ్‌ చేయదు. గత ఎన్నికల్లో ఇచ్చినన్ని సీట్లే ఇచ్చినా సీన్‌ రిపీట్‌ కావడం తప్ప మరొకటి ఉండదు. ఎందుకంటే అప్పుడు మోడీ ఇమేజ్‌ అంతగా పనిచేసినప్పుడే 24సీట్లలో నాలుగు గెలిచిన పార్టీ, ఇప్పుడు అంతకంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది.

పోనీ దూరంగా పెట్టి పోటీ చేస్తే దాని మూలంగా వచ్చే నష్టాలూ లేకపోలేదు. బీజేపీని దూరంగా పెట్టినంత మాత్రాన ఇప్పటికప్పుడు మైనార్టీలు వచ్చి చంద్రబాబును అతుక్కునేదేమీ లేదు. ఇక బీజేపీకి ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతలేదన్నా వెయ్యి నుండి 10వేల ఓట్లుంటాయి. ఆ పార్టీ విడిగా పోటీ చేస్తే ఈ ఓట్లు లోటులో పడ్డట్లే! టీడీపీ-వైసిపిల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ జరిగే స్థానాలలో బీజేపీ ఓట్ల చీలిక ప్రభావం చూపిస్తుంది. ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే... 2019 ఎన్నికల్లోనూ మోడీనే తిరిగి ప్రధాని అయ్యాడనుకుందాం, అప్పుడు చంద్రబాబుకు ఒకేటికెట్‌ మీద మూడు సినిమాలు చూపిస్తాడు. చంద్రబాబుతో వాళ్ళకు ఎటువంటి మొహమాటం వుండదు. 'స్టే'లలో వున్న కేసులన్నింటిని తిరగదోడినా ఆశ్చర్యం లేదు.

ఇలా బీజేపీతో పొత్తు టీడీపీకి ఒక కోణంలో కష్టంగా వుంటే మరో కోణంలో నష్టాన్ని సూచిస్తుంది. ఆ పార్టీకి బీజేపీతో పొత్తు పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయినా ఒకటే అన్న సామెతగా మారింది.

lokeshగతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా, కాంగ్రెస్‌ ప్రభుత్వం లోనైనా మంత్రులకు కూడా ముఖ్యమంత్రి స్థాయి గుర్తింపు ఉం డేది. ఒక్కోశాఖపై ఒక్కొక్కరి ముద్ర వుండేది. ఫలానా శాఖ మంత్రి ఎవరంటే వారి పేర్లు ప్రజల నాలుక మీదే వుండేది. హోంమంత్రు లుగా మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, జానారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రిగా నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆర్ధికశాఖ మంత్రిగా రోశయ్య, రెవెన్యూ మంత్రిగా నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అశోక్‌గజపతిరాజు, పంచశాఖల మంత్రిగా సోమిరెడ్డి... ఇలా మంత్రులు తమ తమ శాఖలలో తమ పనితీరు ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే

వాళ్ళు. ఆ శాఖలపై తమదైన ముద్రను వేసుకునే వాళ్ళు.

మరిప్పుడు కూడా కేబినెట్‌ వుంది. ఈ కేబినెట్‌లో అలాంటి మంత్రులు ఎంతమంది వున్నారు? ఎంతమంది తమ శాఖలోని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు? ప్రస్తుతం ఏ.పి కేబినెట్‌లో చాలామంది మంత్రులు డమ్మీలే! ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు యాక్టివ్‌గా వున్నాడు. సీఎం చంద్రబాబు కూడా ఇరిగేషన్‌ వ్యవహారాలను స్వయంగా పర్య వేక్షిస్తున్నాడు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్ట్‌తో పాటు పట్టిసీమ, పురు షోత్తమపట్నం, ఇంకా పలు ఇరిగేషన్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతు న్నాయి. ఇరిగేషన్‌ వ్యవహారాలలో చంద్ర బాబు, దేవినేనిల మధ్య కో-ఆర్డినేషన్‌ బాగానే వుంది. సీఎం కనుసన్నలలో దేవి నేని ఇరిగేషన్‌ వ్యవహారాలు చక్కబెడుతు న్నాడు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ ద్వారా పదవులు పొందిన అమర్‌నాథ్‌రెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డిలకు వాళ్ళ శాఖల విషయంలో కొంత స్వతంత్రత ఇచ్చారు. ఎందుకంటే వైసిపి నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ శాఖల్లో వేలు పెట్టే సాహసం చేయడం లేదు. మొన్న విస్త రణలో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్య తలు చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే నడుచుకుంటూ వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశంకు ఓట్ల రూపంలో లబ్ది చేకూర్చేం దుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. సోమిరెడ్డికి సమర్ధుడని పేరుండడం, చురు కుగా పని చేస్తుండడంతో ఆయన వ్యవహా రాలలోనూ జోక్యం ఉండడం లేదు.

మిగిలిన చాలా మంత్రివర్గ శాఖల్లో చినబాబు లోకేష్‌ ప్రమేయం ఎక్కువగా వున్నట్లు తెలుస్తోంది. హోంశాఖ అయితే మంత్రి నిమ్మకాయల రాజప్ప కంటే చంద్ర బాబు, లోకేష్‌ల పర్యవేక్షణలోనే ఎక్కువుగా వుంటోంది. ఉన్నతాధికారుల బదిలీలు ఎక్కువుగా లోకేష్‌ ఆదేశాలతోనే జరుగు తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్‌.ఐ., సి.ఐల బదిలీలకు కూడా లోకేష్‌ వద్దకు వెళ్తున్నారు. హోంమంత్రి సొంతంగా కాకుండా లోకేష్‌ ఆదేశాలకు అనుగుణంగా బదిలీలు చేస్తు న్నాడని సమాచారం. ఇక రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని అయితే ఎప్పుడో డమ్మీని చేసిపెట్టారు. అమరావతి రాజ ధానిలో భూముల సేకరణ అంతా ఆయన పర్యవేక్షణలో జరగాలి. ఆయనతో పని లేకుండా భూముల సేకరణ కానిచ్చారు. ఆఖరకు రెవెన్యూలో ఉన్నతాధికారుల బదిలీపై కూడా ఆయనకు అధికారం లేకుండా చేసారు. హోం, రెవెన్యూలతో పాటు వివిధ శాఖల్లో ఉన్నతాధికారుల బదిలీలు గాని, పనులు కేటాయింపు వంటి వ్యవహారాలుగాని నేరుగా చిన్నబాబు పర్య వేక్షణలోనే జరుగుతున్నట్లు సమాచారం.

telugu biddaకొన్ని నెలల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని పెట్టించింది ఒక మీడియాధిపతే! ఈ భేటీ సారాంశం ఏంటంటే... రెండు రాష్ట్రాల రాజకీయాలలోనూ 'రెడ్ల'ను తొక్కడం. తెలంగాణలో మీకు ప్రధాన ప్రత్యర్థులు రెడ్లే! అంటే అక్కడ కాంగ్రెస్‌పార్టీలో రెడ్ల ఆధిపత్యం వుంది. ఆంధ్రప్రదేశ్‌లో మాకు ప్రధాన అడ్డం రెడ్లే... అంటే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అన్నమాట. తెలంగాణలో మీ అధికారానికి మేం అడ్డురాం... ఏపిలో ఎలాగూ మాకు మీతో వచ్చే ఇబ్బందేమీ లేదు. ఇరు రాష్ట్రాలలోనూ పరస్పరం సహక రించుకుందాం, మనలో మనం తన్నుకోవడం చాలిద్దాం... మన ఉమ్మడి టార్గెట్‌ అయిన 'రెడ్ల'ను రాజకీయంగా దెబ్బ కొడదాం... ఈ సారాంశం కేసీఆర్‌కు కూడా నచ్చింది. ఆయనకు కావాల్సింది అధికారాన్ని నిలబెట్టుకోవడం. ప్రత్యర్థిగా వున్న తెలుగు దేశమోళ్ళు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతామంటే ఆయనకు అంతకంటే కావాల్సిందేముంది. ఈ కుల సమీకరణల ఒప్పం దాలు కుదిరాకే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటలు, వ్యవహారశైలి మారిపోయింది.

ఓటు-నోటు కేసప్పుడు చంద్రబాబుపై ఒంటి కాలిమీద లేచిన కేసీఆర్‌ ఆ తర్వాత సైలెంటయ్యాడు. ఓటు-నోటు కేసును సూట్‌కేసులో పెట్టి తాళం వేసాడు. తెలంగాణలో తెలుగు దేశం నాయకులకు కాంట్రాక్టులొచ్చాయి. పబ్‌లకు పర్మిషన్‌లు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు నిధులొచ్చాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో తెలుగుదేశం పొత్తు దాదాపు ఖరారయ్యింది. కేసీఆర్‌ కూడా తెలుగుదేశం పార్టీ పాత కాపే కావడంతో ఆ పార్టీ నాయకులందరితో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. వారికి ఆర్ధిక ప్రయోజనాలు సమకూర్చాడు.

కాని, ఈ మొత్తం ఎపిసోడ్‌లో బకరా అయిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. చంద్రబాబును అతిగా నమ్మితే ఏమవు తుందో ఇప్పటికిగాని తెలుసుకోలేకపో యాడు. చంద్రబాబు తన వెనుక కొండంత అండగా వుంటాడని నమ్మి కేసీఆర్‌పై కత్తులు దూసాడు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది మొదలుకొని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులకంటే కూడా రేవంత్‌రెడ్డే ప్రతిపక్ష నేత పాత్రను పోషిం చాడు. తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలతో చాలామంది అగ్రనేతలు కేసీఆర్‌తో అంతర్లీనంగా కుమ్మక్కయినా రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌పై పోరాటం బాటనే ఎంచుకున్నాడు. తెలుగుదేశం కోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్ళి డబ్బులతో ఆయన ఓటును కొనాలని చూసి 'ఓటు- నోటు' కేసులో చంద్రబాబుతో పాటు ఇరుక్కున్నాడు. ఇదంతా కూడా అతను తెలుగుదేశం కోసమే చేసాడు. కాని, తెలుగుదేశం వాళ్ళు ఆయన ఏ కేసీఆర్‌తో అయితే పోరాటం చేస్తున్నాడో అదే కేసీ ఆర్‌తో కుమ్మక్కయ్యారు. దీనిని ఆలస్యంగా తెలుసుకున్న రేవంత్‌రెడ్డి తన పార్టీపైనే తిరుగుబాటు చేసాడు. కేసీఆర్‌తో పోరా టానికంటే అతనితో పొత్తుకే మొగ్గుచూపు తున్న తెలుగుదేశం నాయకులు రేవంత్‌ రెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా వున్నారు. రేవంత్‌ కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధపడిపోయాడు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు రేవంత్‌రెడ్డి కూడా 'ఓటు-నోటు' కేసులో నిందితుడు. రేపు రేవంత్‌ కాంగ్రెస్‌ లోకి వెళితే ఈ కేసు ఏమవుతుందో చూడాలి. రేవంత్‌ను తొక్కాలంటే చంద్ర బాబుకు కూడా ఉచ్చు బిగుసుకుంటుంది. చంద్రబాబును కాపాడాలనుకుంటే రేవంత్‌ను వదలక తప్పదు. ఈ పరి ణామం కేసీఆర్‌కు మింగుడుపడకపోవచ్చు. ఏదిఏమైనా తెలంగాణ తెలుగుదేశంలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌ చంద్రబాబుకు షాకే! రేవంత్‌ బయటకు వెళితే అక్కడ టీడీపీని టీఆర్‌ఎస్‌కు అమ్మకానికి పెట్టినట్లే!

Page 1 of 32

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter