vakatiరాష్ట్రపతితో బ్రేక్‌ఫాస్ట్‌, ఉపరాష్ట్రపతితో లంచ్‌, ప్రధానమంత్రితో టీ, రాష్ట్ర ముఖ్యమంత్రితో డిన్నర్‌. ఒకేరోజులో ఇవన్నీ మాటల్లో సాధ్యం చేయగల మేధావి, మాటల మాంత్రికుడు, జిల్లా రాజకీయ చిత్రపటంలో ఓ విచిత్రమైన నాయకుడు వాకాటి నారాయణరెడ్డి. జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడిగా ఓ పర్యాయం పనిచేసి ఆ తరువాత యంయల్‌సిగా కాంగ్రెస్‌పార్టీ నుండి ఎంపికై గోడదూకి తెలుగుదేశం నుండి రెండవసారి బరిలో దిగి గెలిచిన వ్యక్తి ఆయన. ఇంతవరకూ బాగానే వుంది, మరి ఇప్పుడు ఆయనెక్కడున్నాడు...?

సూళ్ళూరుపేట నియోజకవర్గంలో కీలకపాత్ర పోషిస్తూ బలమైన నాయకుడిగా ఎదగాలనే తాపత్రయంతో ఎప్పుడూ వార్తల్లో వుంటూ, సాధ్యమైనంత వరకూ ఎవరో ఒకరితో విభేదిస్తూ తనదైన శైలిలో రాణిస్తుండిన వాకాటి నారాయణరెడ్డి వృత్తి కాంట్రాక్టులైతే ప్రవృత్తి రాజకీయాలు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.యస్‌.రాజశేఖరరెడ్డి వంటి నాయకులతో నేరుగా సంబంధాలు కలిగివుండేవాడు. కాంగ్రెస్‌లో వున్నప్పుడు ఇప్పుడే సోనియాగాంధీతో లంచ్‌ చేసి వచ్చాననో, వై.యస్‌.తో ఫ్లైట్‌లో ప్రక్కసీటులో కూర్చుని ప్రయాణం చేసివచ్చాననో చెప్పడంతో కాలం గడిపేవాడు. రాజకీయ నేతగా, కాంట్రాక్టర్‌గా కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం ఆయన హవా బాగానే నడిచింది. గల్లీ నుండి ఢిల్లీ స్థాయిలో ఏర్పడిన మంచి సంబంధాలు, వ్యాపార వ్యవహార లావాదేవీలు చురుకుగా కొనసాగాయి. ఢిల్లీలో ఓ గెస్ట్‌హౌస్‌, అద్దెకు ప్రత్యేక విమానం, హెలికాఫ్టర్‌లు ఇలా ఆయన స్టైల్‌కి తగ్గట్లుగా అన్నీ ఘనంగానే వుండేవి. వీటితో పాటు బ్యాంకు అప్పులు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. డాంబికానికి పోయి బ్యాంకుల్లో చేసిన అప్పుల్తో వ్యాపారాలకు బదులుగా వ్యవహారాలు చేయడంతో ఆ అప్పులు కాస్తా మెడకు చుట్టుకున్నాయి. విషయం సిబిఐ దాకా పాకి వాకాటి కోరుకునే విధంగానే ఆయన పేరు జాతీయ స్థాయిలో వినిపించింది.

దాదాపు నాలుగు నెలల క్రితం ఆయనను అరెస్టు చేసిన సిబిఐ ఆయనను ఎక్కడ విచారిస్తుందో కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనతో స్నేహబాంధవ్యాలు నడిపిన నేతలు ఎవ్వరూ ఆయన గురించే పట్టించుకోవడం లేదు. అసలు వాకాటి నారాయణరెడ్డి అనే ఓ నాయకుడుండేవాడన్న సంగతి కూడా అందరూ మర్చిపోయారు. వీళ్ళెవ్వరైనా ఓసారి ఆయన గురించి ఆలోచించి కనీసం ఆయన ఎక్కడున్నాడో ఎవరెవరితో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌లు చేస్తున్నాడో జిల్లా ప్రజలకు తెలిపితే బాగుంటుందేమో...! అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు మనం ఎంత సంపాదిస్తే అంత వొదగాలనీ... నలుగురితో మంచిగా మెలగాలని.

vakatiఆయన పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌ రాహుల్‌గాంధీతోనూ, లంచ్‌ అహ్మద్‌పటేల్‌తోనూ, డిన్నర్‌ గులాంనబీ ఆజాద్‌తోనూ చేస్తుంటాడు. ఆయన నోటికి జాతీయ స్థాయి నాయకులు తప్పితే రాష్ట్రస్థాయి నాయకులు అసలు ఆనరు. ఆయనను కలిసి మాట్లాడుతుంటే... ఇప్పుడే సోనియాగాంధీ ఫోన్‌ చేసింది, అర్జంట్‌గా ఢిల్లీకి రమ్మంది... ఈమధ్య నేను ఢిల్లీలో కనిపించడం లేదని దిగ్విజయ్‌ సింగ్‌ అలిగివున్నాడు... నెల్లూరు జిల్లాలో ఈ తరహా కోతల రాయుడు... సారీ కోతల నాయకుడు ఎవరయ్యా అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి. ఆయన చేతలేమోగాని మాటలు మాత్రం ఎప్పుడూ కోటలు దాటు తుంటాయి.

నిన్నమొన్నటి దాకా కూడా ఆయన చిన్నగా వెలగలేదు. లగ్జరీ కార్లు, సెవన్‌స్టార్‌ హోటళ్ళలో బస... ఇక అక్కడ ఏమేం చేసే వారన్నది వేరే సంగతి. విమానాల్నే లీజుకు తీసుకుని తిరగడం... ఇవన్నీ సొంత డబ్బులతో చేసుకుని వుంటే ఎవరికీ వచ్చిన నష్టం ఏమీ లేదు. కాని, వీళ్ళు సొంత డబ్బులతో జల్సాలు చేయలేదు. వందల కోట్లు తమ తాతల ఆస్తులు అన్నట్లుగా బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నారు. ఆ డబ్బులతో జల్సాలు చేశారు. పార్టీ టిక్కెట్లు, పదవులు కొన్నారు. ఇప్పుడు బ్యాంకుల బకాయిలు తీర్చకుండా ఎగవేస్తున్నారు.

బ్యాంకులను మోసం చేసి వందలు, వేల కోట్లు ఎగనామం పెట్టిన నాయకులను తెలుగుదేశం పార్టీ కాపాడుతుందనే ప్రచారం విస్తృతంగా వుంది. బ్యాంకుకు బకాయిలు ఉన్నోళ్ళు తెలుగుదేశంలో చేరితే చాలు... బకాయిలు కట్టాల్సిన అవసరం లేదన్నంత భరోసా వుంది. ఈ భరోసాతోనే కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీగా వుండిన వాకాటి నారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరడం జరిగింది.

విఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాతో పాటు పలు కంపెనీలకు అధిపతి అయిన వాకాటి నారాయణరెడ్డి పలు బ్యాంకుల నుండి 443.27 కోట్లు అప్పులు తీసుకుని వున్నాడు. తన ఆస్తుల విలువను ఎక్కువుగా చూపించి బ్యాంకులకు తనఖాపెట్టాడు. ఎకరా భూమి మార్కెట్‌లో పది లక్షలుంటే ఆయన దానిని కోటిగా చూపించేవాడు. ఇలా ఆయన బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులకు తాకట్టు పెట్టిన ఆస్తులకు పొంతన లేకుండా పోయింది. బ్యాంకులనే ఆ స్థాయిలో బురిడీ కొట్టించాడు వాకాటి. ఆయన సకాలంలో బ్యాంకులకు తిరిగి ఋణాలు చెల్లించకపోవ డంతో ఆయనను డిఫాల్టర్‌గా ప్రక టించి ఆస్తుల జప్తుకు బ్యాంకులు గతంలోనే నోటీసులు జారీ చేసాయి. కాగా, ఇదే క్రమంలో వాకాటి నారాయణరెడ్డి తమ నుండి 190 కోట్లు ఋణం తీసుకుని మోసం చేసాడని తప్పుడు డాక్యుమెంట్లు కారణంగా తమ సంస్థకు 205కోట్లు నష్టం వాటిల్లిం దని ఐఎఫ్‌సిఐ(భారతీయ పారిశ్రామిక ఆర్ధిక సంస్థ) సిబిఐకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఈ కేసులో వాకాటితో పాటు ఐఎఫ్‌సిఐ డిజిఎం వి.సి రామ్మోహన్‌ను మరో నలుగురిని నిందితులుగా చేర్చి వీరిపై 120బి, 420 ఐపిసి సెక్షన్‌ల క్రింద కేసులు నమోదు చేసింది. విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయడంతో వాకాటి నారా యణరెడ్డి 21వ తేదీ బెంగుళూరు వెళ్ళాడు. అక్కడ ఆయనను విచారించిన అధికారులు ఈ కేసులో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. వాకాటి వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశంపార్టీలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ నుండి వచ్చిన వాకాటిని గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు. అప్పటికే ఆయన మీద తీవ్ర ఆర్ధిక నేరారోపణలుండినాయి. జిల్లా పార్టీలోనే పలువురు నాయకులు ఆయనకు సీటివ్వడాన్ని వ్యతిరేకించారు. అయినా లోకేష్‌బాబును ప్రసన్నం చేసుకుని ఉండడంతో వాకాటికి సీటొచ్చింది. ఆ వెంటనే వాకాటికి సంబంధించి ఆస్తుల జప్తుకు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. మీడియాలో ఈ వార్త ప్రధానంగా చర్చకు రావడంతో చంద్రబాబు ఆయనను పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పేరుకు వాకాటిని పార్టీ నుండి సస్పెండ్‌ చేసారనేగాని పార్టీ కార్యక్రమాలకు ఆయనేం దూరం కాలేదు. ఈమధ్య చంద్రబాబు జన్మభూమి సభలో కూడా పాల్గొన్నాడు. ఆయనపై వున్న సస్పెండ్‌ను త్వరలోనే ఎత్తేస్తారనుకున్న నేపథ్యంలో ఆయన మెడకు సిబిఐ ఉచ్చు బిగుసుకుంది. మరి చంద్రబాబు ఆయనను కాపాడుతాడో లేక పార్టీ నుండి దూరంగా గెంటేస్తాడో చూడాలి.

vaka azizఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర పార్టీల నుండి అరువు తెచ్చుకున్న నాయకుల వల్లే ఇప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోతోంది.

మొన్న చూస్తే ఎమ్మెల్సీ వాకాటి నారా యణరెడ్డి... బ్యాంకులకు దాదాపు 700 కోట్లు బకాయిలు... మొదటి నుండి కాం గ్రెస్‌ మనిషి... 2015లో కాంగ్రెస్‌లో ఇక లాభంలేదని తెలుగుదేశంలో దూరాడు. అప్పటికే బ్యాంకు బకాయిలు పక్వానికి చేరివున్నాయి. అయినా కూడా చంద్రబాబు గత ఏడాది మళ్ళీ స్థానిక ఎమ్మెల్సీ నుండి నిలబెట్టి గెలిపించాడు. ఆయనను ఎమ్మె ల్సీగా గెలిపించాక బ్యాంకు బకాయిలు, కేసులు వంటివి బయటకు రావడంతో పార్టీ నుండి సస్పెండ్‌ చేశారు. పార్టీ నుండి వాకాటిని సస్పెండ్‌ చేసారన్న పేరే గాని, ఇటీవల చంద్రబాబు జన్మభూమి సభలో ఆయన ప్రత్యక్షం కావడం చూసాం.

వాకాటి అంశం అలా వుంచితే, ఇప్పుడు మేయర్‌ అజీజ్‌ వ్యవహారం పార్టీలో భగ్గుమంటోంది. తాము స్టార్‌ ఆగ్రో కంపెనీకి పంపించిన 42కోట్ల రూపాయలను అజీజ్‌ దారి మళ్ళించా రంటూ చెన్నైకు చెందిన ప్రసాద్‌ జెంపెక్స్‌ కంపెనీ చెన్నై క్రైమ్‌బ్రాంచ్‌లో కేసు పెట్టడం తెలిసిందే! తెలుగుదేశంపార్టీలోనే ఇది కలకలం రేపుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌ లోనే మేయర్‌ అజీజ్‌కు వ్యతిరేకంగా కార్పొరేటర్ల సిండికేట్‌ ఏర్పడివుంది. మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డిలతో పాటు ఆదాల, ముంగమూరులతో కూడా అజీజ్‌కు పడదు. వీళ్ళ అనుచర కార్పొ రేటర్లందరు కూడా అజీజ్‌కు వ్యతిరేకంగా వున్నారు. అజీజ్‌ వ్యక్తిగత కేసుల కోసం పార్టీని ఎందుకు భ్రష్టు పట్టించాలనేది వీరి వాదన. ఇప్పటికి వ్యక్తిగత ఆర్ధిక లావా దేవీల కేసులే బయటకు వచ్చాయి. వాకాటి వంటి ఆర్ధిక కేసులు బయటపడితే అజీజ్‌పై వ్యతిరేక ముఠా దాడి ముమ్మరం చేసే అవకాశముంది. అయితే ఆయనను మేయర్‌ పదవి నుండి దించాలనే డిమాండ్‌ తెరపైకి రావచ్చు. అయితే మైనార్టీ అనే రక్షణ కవచం అజీజ్‌కు వుంది. ఆ బ్రాండ్‌ తోనే ఆయన మేయర్‌ అయ్యాడు. రేపు కూడా ఈ గండం నుండి ఆ బ్రాండే కాపాడొచ్చు. ఈ విషయంలో ప్రతిపక్ష వైకాపా పార్టీ ఇంకా తల దూర్చలేదు. అజీజ్‌ వైకాపా బ్రాండ్‌ మీద వచ్చిన నాయకుడే! ఆ పార్టీకే జలక్‌ ఇచ్చి టీడీపీలో చేరాడు. వీళ్ళు కూడా మైనార్టీ అని చెప్పే వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు.

అజీజ్‌ వ్యవహారంలో పార్టీ ఇబ్బంది పడకుండా పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర చాకచక్యంగా వ్యవహరించారు. అజీజ్‌ అమాయకుడని, ఆయన ఎవరినీ మోసం చేయలేదని, పార్టీ ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జరిగిన లావాదేవీలలో అజీజ్‌కు ఏ సంబంధం లేదని తేలితే సరే సరి! అజీజ్‌ తప్పుందని తేలితే... ఆరోజు కూడా ఇదే విధంగా అండగా నిలుస్తారా? లేక వాకాటిని సస్పెండ్‌ చేసినట్లే చేస్తారా? కాలమే నిర్ణయిస్తుంది!

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter